Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: గోడ్సేని ఎలా చూడాలి? - 13

గోడ్సే వాదన - గాంధీ ముస్లిములను తృప్తిపరచాలనే వుద్దేశంతో హిందీకి బదులు హిందూస్తానీని ప్రచారం చేశాడు. హిందీ భాష శుద్ధతను ముస్లింల తృప్తి కొరకు భ్రష్టం చేయబూనాడు. దేశంలో 80% మంది ప్రజల భాష హిందీ అయి వుండగా హిందూస్తానీ వేషంలో ఉర్దూ వంటి విదేశీభాషను జాతీయభాషగా చేయడానికి చూడడం గాంధీ యొక్క అత్యంత దుష్టమైన మతతత్వం. 

(పై వాదనలో రెండు తప్పులున్నాయి. అవిభక్త హిందూస్తాన్‌లోనే కాదు, యిప్పటికీ హిందీ 80% జనాభా భాష కాదు. గాంధీ 'హిందీ' ప్రచారసభలు పెట్టించి, హిందీని ఖద్దరుని దేశభక్తికి ముడిపెట్టి హిందీని ప్రచారం చేయగాచేయగా, స్వాతంత్య్రం వచ్చాక అధికారభాష చేసి అందరిపై రుద్దగారుద్దగా యిప్పటికి హిందీని దేశంలో చాలామంది ఓ మేరకు అర్థం చేసుకుంటున్నారు, అవసరమైన పది, పదిహేను పదాలు మాట్లాడగలుగుతున్నారు. ఒక్క హిందీ పదం కూడా రానివాళ్లు, తెలియనివాళ్లు కోట్లాది మంది వున్నారు. 2011 జనాభా లెక్కలు యింకా రాలేదు కాబట్టి 2001 లెక్కలు చూడాలి. దాని ప్రకారం జనాభాలో శుద్ధ హిందీని తమ మాతృభాషగా పేర్కొన్నవారు 26 కోట్లమంది కాగా, దానిని పోలిన 49 భాషలు మాట్లాడే వారు 16 కోట్లు మొత్తం అందర్నీ కలిపి 42 కోట్లు అన్నాడు. అంటే జనాభాలో 41.03% మాత్రమే. హిందీ తప్ప వేరే యితర భాష విషయంలోనూ 'పోలిన భాషలు' కలపడం జరగలేదు. అందుకే తర్వాతి స్థానాల్లో బెంగాలీ 8.11%, తెలుగు 7.19% మరాఠీ 6.99%, తమిళం 5.91%, ఉర్దూ 5.01% వున్నాయి. హిందీ విషయంలో చాలా రాజకీయాలు నడుస్తాయి. అందరూ హిందీయే మాట్లాడుతున్నారనే భ్రమ కల్పించడానికి తక్కిన భాషల వాళ్లని కూడా హిందీ కేటగిరిలో పడేస్తూ వుంటారు. అలా చేసి 1971లో 36.99% వున్న హిందీని 2001లో 41.03%కి తెచ్చారు. అదే పీరియడ్‌లో తెలుగు 8.16% నుండి 7.19%కి తగ్గింది, బెంగాలీ 8.17% నుండి 8.11%కి తగ్గింది. తమిళం కూడా 6.88% నుండి 5.91%కి తగ్గింది. 40 ఏళ్లల్లో జనాభా పెరిగినపుడు మాట్లాడేవారు ఎలా తగ్గుతారు? అంటే యీ రాష్ట్రాలలో యితర ఉపభాషలను విడిగా గుర్తించి వీటి శాతాన్ని తగ్గిస్తున్నారు. హిందీ విషయంలో అన్నీ కలిపేసి పెంచుతున్నారు. గణాంకాలు యిలా వుండగా అప్పట్లోనే 80% మంది భాష హిందీ అనడం సత్యదూరం. 

రెండోది - ఉర్దూ విదేశీభాష కాదు. మొఘల్‌ కాలంలో దేశాని కంతటికీ కామన్‌గా ఒక భాష వుండాలనే సంకల్పంతో సంస్కృతం, ఖడీ బోలీ, వ్రజ్‌ భాష వంటి పలు భారతీయభాషలలోని పదాలతో క్రమేపీ రూపుదిద్దుకుంది. అక్బర్‌, తన మంత్రి  రాజా మాన్‌సింగ్‌ సాయంతో తన ఏలుబడిలో వున్న ప్రాంతమంతటిలో లాండ్‌ రెవెన్యూను స్థిరపరచడంతో, కోర్టు వ్యవహాలను క్రమబద్ధీకరించడంలో ఆ నాటి ఆస్థానభాష పర్షియన్‌ భాష నుంచి లిపి ద్వారా దీన్ని వాడకంలోకి తెచ్చినట్లు తోస్తుంది. అందుకే పన్నులకు, కోర్టులకు సంబంధించిన పారిభాషికపదాలన్నీ ఉర్దూవే అయ్యాయి. అక్బరు తర్వాతి కాలంలో మొఘల్‌ సామ్రాజ్యం మరింతగా విస్తరించి యిదే విధానం దాదాపు దేశమంతా అమలులోకి వచ్చింది. ఉర్దూ పదాలు స్థానిక భాషల్లోకి చొచ్చుకుపోయాయి. వాటిని అజంతాలుగా చేసుకుని తెలుగులో వాడేసుకుంటాం కాబట్టి ఉర్దూ పదాలని మనం విడిగా గుర్తుపట్టలేము. రైతు, దస్తావేజు, ఖరారునామా, దస్కత్తు, వకీలు, మతలబు, తనఖా, బాకీ, జామీను, ఖైదు, జమీందారు, ఇనాం, అమీనా, తాసిల్దారు, జిల్లా, తాలూకా, ఖరీదు.. యిలా ఎన్నో పదాలు ఉర్దూ నుంచి వచ్చాయని మనకు తోచదు. నా చిన్నప్పుడు భూమిని కౌలుకి (ఇదీ ఉర్దూ పదమే) యిచ్చినపుడు 'ఏకు సాలు కదపా' అనే అని రాయించేవాళ్లం. ఈ ఏకు ఏమిటో నాకు తెలిసేది కాదు, పెద్దయ్యాక తోచింది - అది ఏక్‌ (ఒక) సాల్‌ (ఏడాది) కదపా (లీజ్‌) అయి వుంటుంది అని. ఇవే కాదు, మన మాట్లాడే అనేక పదాలు - చమ్కీ, సరంజామా, జరీ, రస్తా, కబురు - యివన్నీ ఉర్దూలోంచి వచ్చి చేరినవే. తెలుగుకు యింత పదసంపద వుండడానికి కారణం సంస్కృతం నుంచే కాదు, ఉర్దూ నుంచే కాదు, అనేక యితర భాషల నుంచి ఎడాపెడా మాటలను దిగుమతి చేసుకుని విస్తరించడం! అచ్చ తెలుగును కాపాడుకోవాలనే తాపత్రయంతో వీటన్నిటినీ వాడకంలోంచి తొలగించివేస్తే నష్టపోతాం. సరైన మాట తట్టనప్పుడు ఇంగ్లీషు పదం వాడేసే అలవాటు తప్పించుకుని మరుగున పడిన మాటలను, సామెతలను ఎక్కువగా ప్రయోగించడమే తెలుగు భాషకు చేసే సేవ. 

ఇక హిందీ భాష ఉర్దూ కంటె వయసులో చిన్నది. 1850ల తర్వాత ఖడీబోలీ భాషలోనే సంస్కృతపదాలు ఎక్కువగా రంగరించి, సంస్కృతం వాడే దేవనాగరీ లిపిలో రాస్తూ ఉర్దూకంటె భిన్నంగా భాష తయారుచేయాలన్న ఉద్యమం ప్రారంభమై హిందీ రూపుదిద్దుకుంది. 1881లో బిహార్‌ హిందీని తన అధికారభాషగా అంగీకరించి దానికి ప్రాచుర్యం కల్పించింది. హిందూస్తానీ అనేది ఉర్దూ మిశ్రితమై, జనసామాన్యం మాట్లాడే భాషగా వుండగా హిందీ అనేది సంస్కృతభూయిష్టమై పండితులు కవిత్వం రాసే భాషగా రూపొందింది. గాంధీ హిందీని ప్రచారం చేస్తూనే, హిందూస్తానీని ఇంగ్లీషు స్థానంలో కామన్‌ లాంగ్వేజ్‌గా గుర్తింపచేయడానికి ప్రయత్నించాడు.  స్వాతంత్య్రం వచ్చాక అధికారభాషగా హిందీనా? హిందూస్తానీనా దేన్ని గుర్తించాలి అని కమిటీలో చర్చలు జరిగాయి. చివరకు ఒక్క ఓటు తేడాతో హిందీ నెగ్గింది. దీని అర్థం గాంధీ ఒక్కడే కాదు, అనేక మంది ప్రజానాయకులు హిందూస్తానీ హిందీ కంటె ఎక్కువగా ప్రజలకు సన్నిహితం అవుతుందని భావించడం! సేఠ్‌ గోవింద దాస్‌ వంటి వీర హిందీవాదుల కారణంగానే యితర భాషీయుల్లో హిందీ పేర జరిగే రాజకీయాల పట్ల విముఖత పెరిగింది. అయితే హిందీ యింతమాత్రమైనా పాప్యులర్‌ అయిందంటే కారణం హిందీ సినిమాలు, వాటిల్లో వాడే హిందూస్తానీ భాష! హిందీ సినిమాల సెన్సారు సర్టిఫికెట్లలో యిదివరలో భాష - 'హిందూస్తానీ' అని రాసేవారు. ''మొఘలే ఆజం'' వంటి కొన్ని సినిమాలలో మాత్రం 'ఉర్దూ' అని రాసేవారు. ఇప్పుడు అన్నిటికీ 'హిందీ' అని రాస్తున్నారు. అయినా వాడేది హిందూస్తానీ పదాలే. అచ్చమైన హిందీ అంటే పౌరాణిక టీవీ సీరియల్స్‌లో వాడే భాష! 

ఏది ఏమైనా ప్రాచీనత విషయంలో తెలుగు వంటి ప్రాంతీయ భాషలకు వున్న ఉర్దూ, హిందీ సాటి రావు. 200 ఏళ్ల క్రితం రాసిన హిందీ పుస్తకం చూపించమంటే వారు నోరు వెళ్లబెడతారు. అవధి, మైథిలీ, భోజ్‌పురి వంటి భాషల్లో కవిత్వం వుంది కానీ వాటికి విడిగా అస్తిత్వం వుంది. ''రామ్‌ చరిత మానస్‌'' హిందీ అనుకుంటాం, కాదు, అవధి! దాన్ని హిందీ మాండలికం అని బుకాయిస్తారు. హిందీ వచ్చినంత మాత్రాన హనుమాన్‌ చాలీసాలో మాటలు ఎన్ని అర్థమవుతాయి? మాండలికం అంటే అసలు భాష వచ్చినవారికి ఓ 5-10% పదాల అర్థం విషయంలో గందరగోళం వుంటుంది. హిందీ మాండలికాలని చెప్పుకునేవాటిలో 75% పదాలు హిందీ వచ్చినా అర్థమే కావు. వాటిని స్వతంత్ర భాషల్లాగానే చూడాలి. వాటికి చాలా శతాబ్దాలుగా అస్తిత్వం వుంది. మైథిలీకి అతి దగ్గరగా వున్న భాషలో విద్యాపతి (1352 - 1448) వంటి గొప్ప కవులు వున్నారు. మరి హిందీయో? 1954లో హిందీ వ్యాకరణాన్ని స్టాండర్‌డైజ్‌ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కల్చర్‌ పూనుకుని కమిటీ వేసింది. వాళ్లు 1958లో ''ఎ బేసిక్‌ గ్రామర్‌ ఆఫ్‌ మోడర్న్‌ హిందీ'' అని వేశారు. వాటిని దీనికి తోకలంటే ఎలా?

గోడ్సేకు హిందీపై వ్యామోహం వుంటే వుండవచ్చు. కానీ ఉర్దూ సంపర్కం వలన హిందూస్తానీని ద్వేషించడం, దానికి ముస్లిం లింకు పెట్టడం తప్పు. భాషకూ, మతానికి ముడిపెట్టడం అర్థరహితం. అలా అయితే ప్రపంచంలోని క్రైస్తవులను ఏ భాషకు ముడిపెట్టాలి? చైనాలోని, జపాన్‌లోని బౌద్ధులను ఏ భాష నేర్చుకోమనాలి? సంస్కృతం రాకపోతే హిందువులు కారని తీర్మానించగలమా? - వ్యా.) (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

Click Here For Part-6

Click Here For Part-7

Click Here For Part-8

Click Here For Part-9

Click Here For Part-10

Click Here For Part-11

Click Here For Part-12

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?