Advertisement

Advertisement


Home > Articles - Special Articles

కొమ్మినేని: మాట మార్చడంలో రికార్డు సృష్టిస్తున్నారా!

కొమ్మినేని: మాట మార్చడంలో రికార్డు సృష్టిస్తున్నారా!

రాజకీయ నేతలు మాటలు మార్చడం మామూలేనన్న అభిప్రాయం సహజంగానే ఉంటుంది. కాని మరీ ఇంతలా మార్చడం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో మచిలీపట్నం ఓడరేవు నిర్మాణానికి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అందుకు కొంత భూమి ఇవ్వడానికి ఎప్పటి నుంచో ఆ ప్రాంత ప్రజలు, రైతులు సిద్దంగానే ఉన్నారు. కాని వారికి పిడుగు వంటి వార్త వస్తుందని గతంలో ఊహించలేదు. ఏకంగా లక్షా ఐదువేల ఎకరాలు సేకరించాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించడం పెద్ద వివాదంగా మారింది. ఏమిటి ఈ భూముల దందా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

పైగా ప్రభుత్వం తెలివిగా ఇక్కడ కూడా రాజధాని ప్యాకేజీ ఇస్తామని రైతులను ఊరించే యత్నం చేస్తోంది. రాజధానిలోనే ఎకరం భూమికి 1400 గజాల స్థలం తీసుకున్న తర్వాత ఎప్పటికి రేట్లు పెరుగుతాయో తెలియని పరిస్థితి ఉంటే బందరు సముద్రతీరాన కూడా అదే మాదిరి రేట్లు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. బందరు పోర్టుతోనే అభివద్ధి అని, అక్కడ పరిశ్రమలు ఉంటేనే ఉపయోగమని టీడీపీ నేతలు కొత్త పల్లవి పుచ్చుకున్నారు. పోర్టు రావాలి. పరిశ్రమలు రావాలి. తప్పులేదు. కాని అందుకోసం ఇంత పెద్ద ఎత్తున భూములు అవసరమా అన్నదే చర్చ. 

అదే నిజం అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆ పార్టీ నేతలు కాని ఎందుకు ఇందుకు భిన్నంగా మాట్లాడారో చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో బందరు పోర్టు నిర్మాణానికి భూమిని సేకరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసిన సందర్భంగా ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అప్పట్లో రైతులకు అండగా నిలబడ్డారు. బందరు కోనేరు సెంటర్‌లో నిలబడి పోర్టుకు వేల ఎకరాలు దేనికి అని ప్రశ్నించారట. పోర్టుకు కేవలం 1200 ఎకరాలు సరిపోతుందని ఆయన గర్జించారు. ఇది విన్న అక్కడి రైతాంగం సంతోషించారు. 

ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే మొత్తం ఆలోచన మారిపోయింది. లక్ష ఎకరాల భూమి సేకరించాలని చంద్రబాబు నిర్ణయించడం బందరు వాసులనే కాదు. ఆంధ్రపదేశ్ వాసులను కూడా  ఆశ్చర్యపరచింది. చంద్రబాబు ఎంత తేలికగా మాట మార్చేశారు అన్న అభిప్రాయం కలిగింది. బందరు ప్రజలు కోనేరు సెంటర్‌లో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు కాని, తెలుగుదేశం నేతలు కాని ఆ ప్రసంగాలను మర్చిపోయినట్లు నటిస్తున్నారు. ఆ మాటకు వస్తే ఇదొక్కటే కాదు. 

వైఎస్ హయాంలో ఓడరేవుతో పాటు పెద్ద పారిశ్రామికవాడ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో చీరాల, నిజాంపట్నం ప్రాంతంలో ఇరవైఆరు వేల ఎకరాల భూమి సేకరించాలని తలపెట్టారు. అందులో అత్యధికంగా పనికిరాని బీడు భూములే ఉన్నాయి. రైతులకు ఆశించినదానికన్నా ఎక్కువ పరిహారమే ఇచ్చారు. చాలావరకు ఇబ్బంది లేకుండానే సాగింది. కాని విపక్షంలో ఉన్న చంద్రబాబుకు అది నచ్చలేదు. అంత భూమి ఎందుకు తీసుకుంటారు అంటూ ఆయన అప్పట్లో ధర్నాకు దిగారు. నిజాంపట్నంకు ర్యాలీగా వెళితే ఆయనకు నిరసనగా షాపులు కూడా తెరవలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. 

కొంతమంది నిజంగానే ఈయన భూములు ఇచ్చినవారి మేలు కోసం చేశారేమోలే అని అనుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అక్కడ ఓడరేవు, ఇతర ప్రతిపాధనలను ఆయన ప్రభుత్వమే ప్రతిపాధిస్తోంది. అంతేకాదు.. కాకినాడ సెజ్ కోసం గతంలో భూములు తీసుకుంటే, చంద్రబాబు ఘీంకరించారు. రైతుల భూములు రైతులకు ఇవ్వాల్సిందేనని, తాము అధికారంలోకి వస్తే వెంటనే ఆ పనిచేస్తామని ఆయన అన్నారు. అధికారంలోకి రావడం జరిగింది. కాని రైతులకు భూములు ఇవ్వలేదు... సరికదా ఒక పెద్ద పెట్టుబడిధారుకు ఆ భూములు ఇచ్చేశారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. 

తాజాగా బందరు పోర్టు, అక్కడ పారిశ్రామిక వాడ అంటూ లక్షా ఐదు వేల ఎకరాల భూమి తీసుకుంటామని ఏపీ క్యాబినెట్ తీర్మానించింది. ఆ విషయాన్ని మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు చెప్పేశారు. దానిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని గమనించిన రాష్ర్ట ప్రభుత్వం అబ్బే 22 వేల ఎకరాలేనని ప్రకటించింది. మరి క్యాబినెట్ తీర్మానం చేశారా? లేదా? అన్నది చెప్పలేదు. మంత్రి పల్లె లక్ష ఎకరాలని అబద్దం చెప్పారా? లేక నిజం ఎందుకు చెప్పారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను కోప్పడ్డారా? మాట మార్చడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్న విమర్శ గతంలోనే ఉండేది. 

బీజేపీని మసీదులు కూల్చే పార్టీ, దానితో పొత్తా అని విమర్శించిన రోజులు ఉన్నాయి. బీజేపీ తమకు సహజ మిత్రుడు అని చెప్పిన రోజులూ ఉన్నాయి. మోడీని  హైదరాబాద్‌కే రావడానికి వీలు లేదని చెప్పిన ఘటనలు ఉన్నాయి. మోడీతో స్నేహం కోసం ఢిల్లీ వరకు వెళ్లి ఆరాటపడ్డ పరిస్థితి ఉంది. సబ్సిడీ బియ్యం రేట్లు, మద్య నిషేధం వంటి విషయాలలో ఎన్నికల ముందు, ఆ తర్వాత ఎలా మాట మార్చింది 1996లోనే చూశారు. 2014 ఎన్నికల మేనిపెస్టోలో 600 వాగ్ధానాలు చేసిన తీరు. వాటిపై వ్యవహరిస్తున్న వైనం.. ఇలా ఉదాహరణలు చెబుతూ పోతే చాలా ఉండవచ్చు. 

ఏది ఏమైనా రాజకీయ నేతలు మాట మార్చినప్పుడు దానికి కారణాలు చెప్పడం, ప్రజలను క్షమాపణ అడగడం వంటివి చేయకపోతే అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు నడిచే రోజులుగా మారిపోతాయి. ప్రజలు అసత్యాలను నమ్మినంతకాలం ఇలా అధికారంలో ఉన్న నేతలు మాటలు మార్చుతూనే ఉంటారు. ప్రజలను ఏమార్చుతూనే ఉంటారనుకోవాలి. ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి. చంద్రబాబు కన్ను ఆర్పకుండా అబద్దాలు చెప్పడంలో దిట్ట అని గతంలో  దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ అంటుండేవారు. ఇప్పుడు చంద్రబాబు తనలా ఎవరూ మాట మార్చలేరని మళ్లీ, మళ్లీ రుజువు చేసుకుంటున్నారా!

కొమ్మినేని శ్రీనివాస్ రావు , సీనియర్ జర్నలిస్ట్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?