Advertisement

Advertisement


Home > Articles - Special Articles

తమిళనాడులో కొత్త వివాదం...!

తమిళనాడులో కొత్త వివాదం...!

జయలలిత కన్నుమూశాక తమిళనాడులో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియడంలేదు. పన్నీరుశెల్వం ప్రభుత్వం నామ్‌కేవాస్తే ఉన్నట్లుగా కనబడుతోంది. జయలలిత మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆమె ఏ జబ్బుతో చనిపోయారో తెలియకపోవడం ఒక కోణమైతే, ఆమెది సహజ మరణమా? ఉద్దేశపూర్వకంగా చంపారా? అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్‌ సోదరుడు వి.దివాకరన్‌ సరికొత్త వివాదం లేవదీశాడు. ఈ వివాదం జయలలితకు సంబంధించిందే. దివాకరన్‌ చెప్పిన సంచలన విషయం ఏమిటి? 'జయలలితను హతమార్చడానికి 2011లో కుట్ర జరిగింది. దాన్ని మేం భగ్నం చేసి ఆమెను కాపాడాం'...ఇదీ ఇప్పుడు తాజా వివాదం. శశికళ ముఖ్యమంత్రి కావాలని, కాకూడదని రెండు రకాల వాదనలు జరుగుతున్న సమయంలో అన్నాడీఎంకే రక్షకులం (శశికళ, ఆమె కుటుంబ సభ్యులు) తామేనని చెప్పడానికి చేసిన ప్రయత్నంలో దివాకరన్‌ జయలలిత హత్యకు కుట్ర జరిగిందని చెప్పాడు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. 

కుట్ర జరిగిందని మాత్రమే చెప్పి వివరాలు చెప్పలేదు. అయితే 2011లో జయలలితకు విషమిచ్చి చంపడానికి ప్రయత్నాలు జరిగాయని 'తెహల్కా' పత్రిక తెలియచేసినట్లు సమాచారం. జయలలిత కూడా ఎప్పుడూ ఈ విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. ఆమె హత్యకు 2011లో ఎప్పుడు కుట్ర జరిగిందో తెలియదుగాని అదే ఏడాది డిసెంబరులో శశికళను, ఆమె కుటుంబ సభ్యులను జయలలిత తన పోయస్‌గార్డెన్‌ ఇంటి నుంచి తరిమేశారు. అంతేకాకుండా పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో జయ వారిని గెంటేశారని ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న సంగతి.

శశికళ తదితరులు పోయస్‌గార్డెన్‌లో తిష్ట వేసి అనేక అక్రమాలు, అవినీతి పనులు చేసినట్లు, జయ సంపదను కాజేసినట్లు 'అమ్మ' దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె ఆగ్రహించారు. ఆ తరువాత శశికళ క్షమాపణలు కోరుతూ జయకు లేఖ రాయడంతో మళ్లీ వారిద్దరి స్నేహం కొనసాగింది. ఆ లేఖలోనే తన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడినట్లు తనకు తెలియదని, ఇకనుంచి తాను వారిని దూరంగా పెడతానని ఆ లేఖలో శశికళ జయకు హామీ ఇచ్చింది. 

తన హత్యకు కుట్ర జరిగిందని తెలుసుకున్న జయలలిత తన స్నేహితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను దూరంగా పెట్టారా? ఒకవేళ అదే నిజమైతే మళ్లీ ఎందుకు దగ్గరకు తీశారు? 2011లో తమను (శశికళ అండ్‌ కో) అంతం చేయడానికి కూడా కుట్ర జరిగిందని దివాకరన్‌ చెప్పాడు. ప్రస్తుతం శశికళకు, ఆమె కుటుంబానికి అన్నాడీఎంకేలోని ద్వితీయ శ్రేణి నాయకుల వల్ల ముప్పు ఉందన్నాడు. అయితే తాము అన్ని కుట్రలను ఛేదించి అమ్మ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నామని చెప్పాడు. తాము రాజకీయాలకు కొత్త కాదని, ఎన్నో ఏళ్లుగా అన్నాడీఎంకేలో కీలకపాత్ర పోషిస్తున్నామన్నాడు. శశికళ భర్త నటరాజన్‌ పార్టీని కాపాడినట్లు దివాకరన్‌ చెప్పడం విశేషం. జయలలిత జీవించి ఉన్నంతకాలం నటరాజన్‌ను దూరంగా పెట్టారు. కాని దివాకరన్‌ ఆయన్ని ప్రశంసిస్తూ పార్టీ ఎన్నికల చిహ్నమైన 'రెండాకులు' గుర్తును ఎన్నికల స్తంభిపచేయగా నటరాజన్‌ కృషి కారణంగా అది మళ్లీ దక్కిందన్నారు. 

కాని ఆయన సేవలను అందరూ మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జయలలిత హత్యకు కుట్ర జరిగిందని దివాకరన్‌ ప్రయివేటుగా చెప్పలేదు. సంక్రాంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించాడు. దివాకరన్‌ ప్రసంగం అన్నాడీఎంకేలో సంచలనం సృష్టించింది. శశికళ మద్దతుదారులు సహజంగానే అతన్ని సమర్థించారు. శశికళను, ఆమె కుటుంబ సభ్యులను 'అమ్మ' ఎప్పుడూ ఇష్టపడలేదని, పార్టీపై ఆధిపత్యం కోసమే ఇలా మాట్లాడుతున్నారని శశికళ వ్యతిరేకులు అంటున్నారు. అన్నాడీఎంకే రక్షకురాలు శశికళేనని చెప్పడం దివాకరన్‌ ఉద్దేశం. జయలలిత ఆస్పత్రిలో చేరడానికి, దీర్ఘకాలం చిక్సిత పొంది చనిపోవడానికి శశికళే కారణమని నమ్మేవారు చాలామంది ఉన్నారు. ఆ అపనిందను రూపుమాపడానికే జయలలిత హత్యకు జరిగిన కుట్రను తాము భగ్నం చేశామని దివాకరన్‌ చెప్పుకున్నారని అనుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?