పాక్‌ నెత్తిన మూడు తలల విషసర్పం.!

పాకిస్తాన్‌.. ఈ పేరెత్తగానే తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న దేశం.. అని ప్రపంచం అంగీకరిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏ తీవ్రవాద ఘటన జరిగినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దానికి పాకిస్తాన్‌తో సంబంధం వుంటుంది. పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌..…

పాకిస్తాన్‌.. ఈ పేరెత్తగానే తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న దేశం.. అని ప్రపంచం అంగీకరిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏ తీవ్రవాద ఘటన జరిగినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దానికి పాకిస్తాన్‌తో సంబంధం వుంటుంది. పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌.. ఈ రెండు దేశాల సరిహద్దులతోపాటు, ఈ రెండు దేశాలూ తీవ్రవాదులకు ఆవాసాలుగా మారిపోయాయి.

ప్రధానంగా భారతదేశం పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదంతో పడరాని కష్టాలూ పడ్తోంది. దేశంలో తీవ్రవాదానికి చోటు లేకుండా చేయాలనీ, సరిహద్దుల్లో తీవ్రవాద స్థావరాలపై ఉక్కుపాదం మోపాలని ప్రపంచ దేశాలు వివిధ వేదికలద్వారా పాకిస్తాన్‌కి అల్టిమేటం జారీ చేస్తున్నా.. పాకిస్తాన్‌ ఆ మాటల్ని పెడచెవిన పెడ్తోంది. అమెరికా నెత్తిన విమానాలతో బాంబులు కురిపించిన అల్‌ఖైదా తీవ్రవాదులకు ప్రధాన స్థావరం పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దులే. అందుకే అమెరికా వీలుచిక్కినప్పుడల్లా పాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లో తమ విమానాలతో బాంబుల వర్షం కురిపిస్తూనే వుంది. అల్‌ఖైదా అగ్రనేత లాడన్‌ని అమెరికా మట్టుబెట్టినా, అల్‌ఖైదా ఇతర రూపాల్లో ప్రపంచానికి సవాళ్ళు విసరడం మానలేదు.

కొత్తగా ఐసిస్‌ తీవ్రవాదం.. ప్రపంచానికి పెనుసవాల్‌గా మారింది. పాకిస్తాన్‌లోని తీవ్రవాదులకూ ఐసిస్‌తో సత్సంబంధాలున్నాయి.. పైగా ఐసిస్‌లో తామూ భాగమేనంటూ పాక్‌లోని తీవ్రవాదులు ఇప్పటికే ప్రకటించుకున్నాయి నిస్సిగ్గుగా. పాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లో తీవ్రవాదం పెరగడానికి, ఆయా దేశాలపై ఆయా దేశాల్లోని పాలకులకన్నా, తీవ్రవాదులకే ఎక్కువ పట్టు వుండటానికీ కారణాలేంటి.? ఆని ఆలోచిస్తే విస్మయం గొలిపే వాస్తవాలు అనేకం వెలుగుచూస్తాయి.

ఆఫ్ఘనిస్తాన్‌ పేదదేశం.. పేదరికమే ఆ దేశానికి శాపం. ఆఫ్ఘనిస్తాన్‌తో పోల్చితే పాకిస్తాన్‌ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే వుంటుంది. ప్రజాస్వామ్యం విషయంలోనూ కొంత మెరుగు పాకిస్తాన్‌. కానీ, పాకిస్తాన్‌లో ఆప్ఘనిస్తాన్‌తో సమానంగా రాజకీయంపై తీవ్రవాద పెత్తనం వుంటుంది. ఆ మాటకొస్తే, పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం వున్నా.. ప్రజాస్వామ్యం నెత్తిన రాజకీయం, తీవ్రవాదం, సైన్యం.. అనే మూడు తలలున్న విషసర్పం తాండవం చేస్తుంటుంది.

రాజకీయ కల్లోలం, సైన్యం పెత్తనం.. వీటన్నిటికీతోడు ప్రభుత్వాలు పెంచిపోషించిన తీవ్రవాదం పాక్‌ ప్రజల నెత్తిన ఎప్పటికప్పుడు పిడుగులు కురిపిస్తూనే వుంటుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పరిపాలిస్తోంటే, సైన్యానికి నచ్చదు.. సైనిక తిరుగుబాట్లు తెరపైకొస్తుంటాయి. అంతలోనే మళ్ళీ రాజకీయం పైచేయి సాధిస్తుంటుంది.. టైమ్‌ చూసి తీవ్రవాదం మారణహోమం సృష్టిస్తూ, ప్రభుత్వాలకు సవాళ్ళు విసరడం పాకిస్తాన్‌లో సర్వసాధారణం.

ఇక, ముంబైలో పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదులు సృష్టించిన మారణహోమాన్ని అంత తేలిగ్గా ప్రపంచం మర్చిపోదు. ఈ దాడిలో పాకిస్తాన్‌నే ప్రపంచ దేశాలన్నీ దోషిగా చూశాయి. దాంతో తప్పించుకోడానికి పాకిస్తాన్‌కి అవకాశమే లేకపోయింది. తొలుత బుకాయించినా, ఆ తర్వాత మౌనం దాల్చిల్సి వచ్చింది పాకిస్తాన్‌. పాక్‌ సైన్యం మద్దతుతో తీవ్రవాదులు భారతదేశంలో సముద్రమార్గాన చొరబడి మారణహోమం సృష్టించారు. ఆ ఘటనలో రెండొందల మందికి పైగా సామాన్యులు మృత్యువాతపడ్డారు.

ఇప్పుడు అచ్చం అలాంటి తీవ్రవాద దుశ్చర్యను పాక్‌ ఎదుర్కొంది. తమ సైనిక స్కూల్లో తాము పెంచి పోషించిన తీవ్రాదులు చొరబడేసరికి, పాక్‌ ప్రభుత్వం, సామాన్యుల రియాక్షన్‌ కన్నా తీవ్రంగా మండిపడ్తోంది సైన్యం. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్‌లో మరోమారు సైనిక తిరుగుబాటు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదు. అందరినోటా ఒకటే మాట.. తాము పెంచి పోషించిన తీవ్రవాదం తమనే కాటేసిందని.

పాకిస్తాన్‌ ప్రభుత్వాల్లోనో, సైన్యంలోనో, తీవ్రవాదంలోనో మార్పు వస్తుందని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. తీవ్రవాదంపై పాకిస్తాన్‌ లాంటి దేశాల్లో ప్రజలే తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచ దేశాలతో కలిసి తీవ్రవాదంపై పోరుకి పాక్‌ సన్నద్ధమయ్యేలా వ్యవస్థపై ప్రజలే ఒత్తిడి తీసుకొస్తే.. కొంతైనా పాకిస్తాన్‌లో తీవ్రవాదం తగ్గుముఖం పడ్తుందేమో చూడాలి.