కావేరీ ప్రాజెక్టు గంగపాలు

బాగా ఆలస్యమవుతున్న డిఫెన్స్‌ రిసెర్చి ప్రాజెక్టులను రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించడంతో కావేరీ జెట్‌ యింజన్‌ ప్రాజెక్టు కొనసాగింపు డోలాయమాన స్థితిలో పడింది. ప్రపంచంలో జెట్‌ యింజన్‌ టెక్నాలజీ తెలిసిన దేశాలను వేళ్లపై…

బాగా ఆలస్యమవుతున్న డిఫెన్స్‌ రిసెర్చి ప్రాజెక్టులను రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించడంతో కావేరీ జెట్‌ యింజన్‌ ప్రాజెక్టు కొనసాగింపు డోలాయమాన స్థితిలో పడింది. ప్రపంచంలో జెట్‌ యింజన్‌ టెక్నాలజీ తెలిసిన దేశాలను వేళ్లపై లెక్కించవచ్చు. డిమాండ్‌ యిబ్బడిముబ్బడిగా వున్నా జిఇ, ప్రాట్‌ అండ్‌ విట్నీ (అమెరికా), ఎన్‌పిఓ శాటర్న్‌ (రష్యా), రోల్స్‌ రాయిస్‌ (యుకె), స్నెక్‌మా (ఫ్రాన్స్‌), యూరోజెట్‌ (జర్మనీ) కంపెనీలది మాత్రమే గుత్తాధిపత్యం నడుస్తోంది. వీళ్లను కాదంటే వేరే దిక్కు లేదు. గతంలో ఒకసారి రోల్స్‌ రాయిస్‌ వాళ్లు 'మీ హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ (ఎచ్‌ఏఎల్‌) చేత మా ఇంజన్లు కొనిపించడానికి మేం మధ్యవర్తులకు కమిషన్లు యిచ్చాం' అని చెప్పినా మన రక్షణ శాఖ వాళ్లపై కఠినచర్య తీసుకోలేకపోయింది – రోల్స్‌ రాయిస్‌ సప్లయి చెయ్యను పొమ్మంటే ఎచ్‌ఏఎల్‌ వారి జాగ్వార్‌ ఫైటర్‌ బాంబర్ల ఉత్పాదన నిలిచిపోతుందన్న భయం చేత! ఈ కొరతను అధిగమించడానికి ఇండియా, చైనా వంటి దేశాలు జెట్‌ ఇంజన్ల నిర్మాణాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో సాధించాలని సంకల్పించాయి. మన రక్షణమంత్రిత్వ శాఖ డిఆర్‌డిఓ (డిఫెన్స్‌ రిసెర్చి అండ్‌ డెవలమ్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌) ఆధ్వర్యంలో నడిచే బెంగుళూరులోని గ్యాస్‌ టర్బయిన్‌ రిసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (జిటిఆర్‌ఇ) ద్వారా కావేరీ ప్రాజెక్టు ప్రారంభించింది. నాలుగు సంవత్సరాల క్రితం వాళ్లు ఒక థదాకా పరిశోధన ముగించి అది ఎలా పనిచేస్తోందో పరీక్షించడానికి మాస్కో వెళ్లారు. అక్కడకు చైనా సైంటిస్టులు కూడా అలాటి ఉత్పాదనతోనే వచ్చారు – అదే పరీక్షకు. ఇల్యూషిన్‌-76 అనే ఎయిర్‌క్రాఫ్ట్‌లో జరిపిన సబ్‌సానిక్‌ టెస్ట్‌లో ఇండియన్‌ మోడల్‌ విజయవంతం కాగా, చైనీయుల మోడల్‌ ఫెయిలయింది. 

పరాజయంతో పట్టుదల పెరిగిన చైనా ప్రభుత్వం ఎయిరో స్పేస్‌ ప్రాజెక్టుకు 60 బిలియన్‌ డాలర్ల నిధులు గుప్పించి, దానిలో చాలా భాగం జెట్‌ యింజన్‌ల అభివృద్ధికై కేటాయించి, విపరీతంగా శ్రమించి జె-10 ఫైటర్స్‌లో వారి డబ్ల్యుఎస్‌-10 టర్బోఫ్యాన్‌లు బిగించి ఒక మేరకు సాధించారు. ఇక్కడ ఇండియాలో దానికి వ్యతిరేకంగా జరిగింది. రష్యా నుంచి తిరిగివచ్చాక ప్రాజెక్టుకు నిధులు తగ్గించేశారు. ఐదు ప్రోటోటైప్‌ యింజన్లు తయారయ్యాయి కానీ వాటిని పరీక్షిద్దామంటే ఒక్క పాత మిగ్‌-29 విమానం కూడా లభించడం లేదు. ఇంజన్లకు యింధనం సమకూర్చుకోవడానికి కూడా నిధులు లేవట.  ఈ విషయాన్ని ఎయిరోస్పేస్‌ సైంటిస్టు రొడ్డం నరసింహ తన శ్వేతపత్రంలో పేర్కొనగా మన్‌మోహన్‌ ప్రభుత్వం కాస్త కదిలింది. జిటిఆర్‌ఇ వారు బెదురుతూ బెదురుతూ 5 లక్షల డాలర్ల నిధుల కోసం అడిగితే 'అంత తక్కువ అడుగుతారేం?' అన్నారట డిఫెన్స్‌ అధికారులు. దాంతో వీళ్లకు ఉత్సాహం వచ్చింది. 'మీ దన్ను వుండాలే కానీ చైనీయులతో పోటీపడగలం. వాళ్లు స్క్వాడ్రన్‌ సర్వీస్‌కు ఇంజన్‌ తయారుచేయలేకపోయారు. సూపర్‌సోనిక్‌ యింజన్‌ తయారుచేయడంలో ఎదురయ్యే సమస్యలను మేం యిప్పటికే పరిష్కరించాం కాబట్టి త్వరలోనే వాళ్లను అందుకోగలం' అన్నారు. ఇంతలో మోదీ ప్రభుత్వపు ఆదేశం వచ్చింది. 

ఈ అంశంపై పార్లమెంటులో జవాబిస్తూ డిఫెన్సు మంత్రి ''కావేరీ ప్రాజెక్టును 1989 మార్చిలో రూ.38.80 కోట్లతో ప్రారంభించారు. 1996 డిసెంబరుకు పూర్తి చేయాలన్నారు. 2005లో దీనిపై సమీక్ష జరిపి 2009 నాటికల్లా పూర్తి చేయమన్నారు. కాలేదు, యిప్పటికి రూ. 2105 కోట్లు ఖర్చయింది. అందుకని యీ ప్రాజెక్టు కట్టిపెట్టే ఆలోచన చేస్తున్నాం.'' అన్నారు. అనేక ప్రాజెక్టులు ఒకేసారి ప్రారంభించడం, దేనికీ పూర్తి నిధులు విడుదల చేయకుండా, కాస్త కాస్త విదిలించడం అన్ని ప్రభుత్వాలూ చేస్తున్న తప్పు. దానికి సైంటిస్టులను బాధ్యులను చేస్తున్నారు. ప్రారంభించిన ఆరేళ్లకు మొదటి కోర్‌ యింజన్‌, కబిని తయారై పరీక్షింపబడింది. 1998లో గ్రౌండ్‌ టెస్టింగ్‌ పూర్తయింది. 2004లో రష్యాలో జరిగిన హై ఆల్టిట్యూడ్‌ ఫ్లయిట్‌ టెస్టులో ఫెయిలైంది. 2010లో హై ఆల్టిట్యూడ్‌ సబ్‌సోనిక్‌ ఫ్లయిట్‌ టెస్ట్‌ రష్యాలో పాసయింది. 2011 నాటికి 9 కావేరీ ప్రోటోటైపులు సిద్ధమయ్యాయి. ''ఇదే పరిశోధన విదేశాల్లో జరిగితే దీనికి నాలుగు రెట్లు ఖర్చయేది. ఇప్పుడు దీన్ని అటకెక్కిస్తే ఈ 2105 కోట్లూ, రెండు థాబ్దాల అనుభవం అంతా గంగపాలే.'' అంటున్నారు జిటిఆర్‌ఇ సైంటిస్టులు. డిఫెన్సు మంత్రిత్వశాఖ అంచనాల ప్రకారం భారతదేశం రాబోయే 10-15 సంవత్సరాలలో ఎయిర్‌క్రాఫ్టులపై రూ. 3.50 లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేయబోతోంది. దీనిలో రూ.74,500 కోట్లు యింజన్‌లపైనే ఖర్చు కాబోతోంది. వీటిలో అధికశాతం విదేశాల్లో తయారయ్యేవే. దీనిలో 30-40% నిధులు కావేరీ ప్రాజెక్టుకి యిస్తే ఎంతో ఆదా అవుతుంది, విదేశీ మారకద్రవ్యం మిగులుతుంది. కానీ ఎన్‌డిఏ ప్రభుత్వపు ఆలోచన మరోలా వుంది. దీనిపై తుది నిర్ణయం కాబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ (సిసిఎస్‌) త్వరలో తీసుకోబోతోంది. 

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]