బ్రూస్ లీ సినిమా విడుదల వాయిదా వేయాలంటూ నిర్మాత రామనారాయణ మెగాస్టార్ చిరంజీవికి లేఖ రాసారు. సంతకు చీటి..లచ్చికి గాజులు..అన్నట్లు వుంది వ్యవహారం. ఆ సినిమాలో చిరంజీవి ఓ గెస్ట్ రోల్ ధరించారు. అంతే. ఆయన కొడుకు హీరో అయితే కావచ్చు.
రామ్ నారాయణ లేఖ రాస్తే గీస్తే నిర్మాత దానయ్యకు రాయాలి లేదా, హీరో రామ్ చరణ్ కు రాయాలి. పైగా అక్కడ రాజమౌళి, ఆయన యూనిట్ స్వయంగా అపీల్ చేసారు..ధన్యవాదాలు చెప్పారు మహేష్ బాబుకు. ఇక్కడ రుద్రమదేవి నిర్మాత గుణశేఖర్ ఏం చేసినట్లు? ఆయన ఎన్నో తేదీలు దాటి తొమ్మిదికి వచ్చారు? అప్పుడు తెలియదా..అంతకు ముందే ఫిక్స్ అయిన బ్రూస్ లీ తేదీ? వారంలో పెద్ద మాస్ సినిమా వచ్చి రుద్రమదేవి మీద పడుతుంది అని తెలియదా? రుద్రమదేవికి బాహుబలిలా సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చేసింది అనుకుందాం..అప్పుడు ఇలాగే అడిగేవారా?
ఇదిలా వుంటే రామ్ నారాయణ లేఖ వెనుక దర్శకుడు ఆర్జీవీ సలహా వుందని టాలీవుడ్ టాక్. రామ్ నారాయణ ఇటీవల లైమ్ లైట్ లోకి రావడం వెనుక ఆర్జీవీ వున్నారు. మెగా క్యాంప్ పై ఇటీవల చాలా కాలంగా ఆర్జీవీ రకరకాల ట్వీట్ లు చేస్తూ, నానా యాగీ చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ మంచి మనసు అని చెబుతూ, మీరూ వాయిదా వేయాలి అని కోరడం అంటే ఏమనుకోవాలి..అలా వాయిదా వేయకుంటే..మహేష్ మాదిరి కాదు మెగా ఫ్యామిలీ అని చాటి చెప్పాలా పరోక్షంగా?
నిజంగా రుద్రమదేవి మీద ప్రేమ వుంటే, బాహుబలి, శ్రీమంతుడు, మహేష్ బాబు ప్రస్తావన లేకుండా లేఖ సాగి వుండేది. కానీ ఇప్పుడు లేఖ వైనం చూస్తుంటే అందులో మెగాస్టార్ ను ఇరుకున పెట్టడమే అన్నట్లుగా కనిపిస్తోంది. అందుకేనేమో? ఆర్జీవీ దీని వెనుక వున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.