త్వరలోనే మన దేశం కూడా మహిళా ఫైటర్ పైలట్స్‌ను సమకూర్చుకోనుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఎఎఫ్)లో తొలిసారి వీరు కాలుమోపనున్నారని ఐఎఎఫ్ చీఫ్ అరుప్ రహా గురువారం చెప్పారు. గత 1990 నుంచి భారతీయ వైమానికదళానికి మహిళలు సేవలు అందిస్తున్నప్పటకీ, వీరిని యుధ్ధరంగంలోకి అనుమతించడం జరగలేదు.
ఎయిర్‌ఫోర్స్ విభాగంలో ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్‌లు మాత్రమే ఇప్పటిదాకా వీరు నడుపుతున్నారు. అంతే తప్ప ఫైటర్ పైలట్స్ కావడం జరగలేదు. అయితే కేవలం ఎయిర్‌ఫోర్స్‌లో అని మాత్రమే కాదు నేవీలో వీరు వార్‌షిప్స్ పై సేవలు అందించడం లేదు. ఆర్మీలో సైతం యుద్ధ సంబంధ బాధ్యతలకు దూరంగానే ఉన్నారు.
భారతీయ నవయువతుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని వారిని యుద్ధ విమానాల్లోకి ప్రవేశపెట్టాలని మేం యోచిస్తున్నాం అని రహా అన్నారు. ఐఎఎఫ్ 83వ పుట్టినరోజు ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన ఈ ప్రకటన చేశారు. ఒక్క సింగిల్ ఫైటర్‌ను తయారు చేయడానికి ఐఎఎఫ్ కురూ.13కోట్లకు పైగా వ్యయం అవుతుంది. అంత వెచ్చించినా, మహిళా పైలట్లు పెళ్లి, పిల్లలు వగైరా కారణాలతో దీర్ఘకాలం పాటు నిర్విరామ విధులు కొనసాగించలేరనే సందేహంతో… ఇప్పటిదాకా వీరిని యుద్ధ విమానాలకు దూరంగానే ఉంచారు.
అయితే మారిన పరిస్థితుల్లో ఐఎఎఫ్ సైతం తన పంధాను మార్చుకుంటోంది. మరోవైపు ఆర్మ్‌డ్ ఫోర్స్‌లో తమ విధులను పర్మెనెంట్ చేయాలని మహిళల వినతికి కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే కొందరు మహిళా పైలట్లు రవాణా విమానాలను, హెలికాప్టర్‌లను హై రిస్క్ ఏరియాల్లో సైతం చాకచక్యంగా నడిపించి తమని తాము నిరూపించుకున్నారు. వీటన్నింటి నేపధ్యంలో ఐఎఎఫ్ ఛీఫ్ చేసిన ఈ ప్రకటన దరిమిలా… త్వరలోనే యుద్ధ విమానాలను ముందుకురికించే మహిళలను భారతదేశం సగర్వంగా తిలకించవచ్చు.