జూటూరు చిన దివాకర్ రెడ్డి. రాష్ట్ర రాజకీయంలో మొన్నటి వరకూ ఏదో ఒకలా చర్చలో ఉన్న పేరు. గత ఎన్నికల్లో పోటీకి దూరం కావడంతోనే దివాకర్ రెడ్డి దాదాపు రిటైర్మెంట్ ను ప్రకటించినట్టుగా అయ్యింది. సుదీర్ఘంగా ఏ రంగంలో పని చేసిన వారైనా.. ఇక తాము తప్పుకుంటున్నామని ఒక రోజున ప్రత్యేకంగా చెప్పి వెళ్తుంటారు. అయితే దివాకర్ రెడ్డి ఎందుకో అలాంటి ప్రకటన ఏదీ చేయడం లేదు. ఆయన వయసు ప్రస్తుతం 79 యేళ్లు! వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబునాయుడుల కన్నా వయసులో పెద్ద దివాకర్ రెడ్డి.
అయితే వారి కన్నా… లేటుగా రాజకీయాల్లోకి వచ్చారు. తొలి సారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ద్వారా అవకాశంతో 1985లో దివాకర్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తాడిపత్రి దివాకర్ రెడ్డికి కంచుకోటగా మారింది. ఆరు పర్యాయాలు అక్కడ నుంచి ఆయన నెగ్గారు. ఇందులో అత్యంత తక్కువ మెజారిటీ వచ్చింది బహుశా 1999లో. అప్పుడు స్వల్ప మెజారిటీతో దివాకర్ రెడ్డి బయటపడ్డారు. ఆ తర్వాత 2004లో కూడా దివాకర్ రెడ్డికి వచ్చిన మెజారిటీ ఆరేడు వేలు మాత్రమే!
ఇలా కంచుకోటే అయినప్పటికీ.. ఏదో స్వల్ప మెజారిటీతో నెగ్గుకు వచ్చారు దివాకర్ రెడ్డి. ఓ రకంగా తన రాజకీయ జీవితాన్ని ఓటమితో కాకుండా, మాజీ అనే హోదాతో ముగించుకున్నారాయన. ఎంట్రీలో ఇండిపెండెంట్ గాపోటీ చేసి ఓడిపోయినా, 2014లో అనంతపురం ఎంపీగా నెగ్గి, ఆ తర్వాతి ఎన్నికల్లో తనయుడికి ఆ టికెట్ ను అప్పగించారు. అయితే అతడేమో ఓడిపోయారు.
మరి వచ్చే ఏడాదికి దివాకర్ రెడ్డి వయసు 80 యేళ్లవుతాయి. మరి ఆ వయసులో ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు జరిగే పని కాకపోవచ్చు. అయితే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నుంచి స్పష్టమైన సంకేతాలే వెళ్లాయట, పోటీ చేస్తే తండ్రులే చేయాలి కానీ, కొడుకులు కాదంటూ చంద్రబాబు వారికి చెప్పారనే ప్రచారం సాగుతూ ఉంది. మరి 80 యేళ్ల వయసులో దివాకర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసి.. ప్రచారం చేసి.. నెగ్గేంత సీన్ ఉంటుందని ఎవ్వరూ అనుకోరు. ఇప్పటికే దివాకర్ రెడ్డి చీనీ చెట్లలో రెస్టు తీసుకుంటున్నట్టుగా ఉన్నాడు. మరి ఇప్పుడు వనాన్ని వదిలి మళ్లీ రాజకీయంలోకి ఎంటరవ్వడం శారీరకంగా ఆయనకు అంత సౌకర్యం కాకపోవచ్చు.
మరి దివాకర్ రెడ్డి సంగతలా ఉంటే.. ప్రభాకర్ రెడ్డి వయసేమీ మరీ తక్కువ కాదు. అన్న కన్నా తమ్ముడు మూడు నాలుగు సంవత్సరాలు చిన్నవాడు అనుకున్నా.. ప్రభాకర్ రెడ్డి సరిగా నడవలేకపోతున్నట్టున్నారు. పక్కన మనిషి ఉంటే.. ఊతంగా పట్టుకుని నడుస్తూ ఆయన ఇంకా రాజకీయ తెరపై కనిపిస్తున్నారు. అలా నడక కాదు, మాటలు మాత్రం మరింత దారుణంగా ఉంటున్నాయి.
కేతిరెడ్డి పెద్దారెడ్డితో పోటీ పడుతున్న ప్రభాకర్ రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీద అనుచిత కామెంట్ల కు వెనుకాడటం లేదు. అసందర్భమైన, అనుచితమైన కామెంట్లు చేస్తూ.. ప్రభాకర్ రెడ్డి తన నోటి తీట తీర్చుకుంటున్నారు. మరి ఈ వయసులో రాజకీయంలో ఉన్నంది అందుకేనా!