క్రికెట్ ఆడుతూ దురదృష్టవశాత్తూ బంతి తగలడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్కి ట్విట్టర్లో పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్, పాతికేళ్ళ వయసులో తాను ఉపయోగించిన బ్యాట్‌పై క్రికెట్ క్యాప్‌ని వుంచి.. ఆ ఫొటోని ‘రెస్ట్ ఇన్ పీస్ ఫిల్’ అంటూ ట్వీట్ చేశాడు.
సచిన్ టెండూల్కర్‌తోపాటు, భారత క్రికెటర్లు సురేష్ రైనా, ఆజింక్య రహానే సహా పలువురు క్రికెటర్లు ఇదే పద్ధతిలో ఫొటోల్ని ట్వీట్ చేస్తూ, ఫిలిప్ హ్యూస్కి ఘన నివాళి అర్పించారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అడమ్ గిల్ క్రిస్ట్.. ‘గిల్లీ కిడ్స్ నుంచి నివాళి’ అంటూ నాలుగు బ్యాట్లను (అందులో చిన్నవి కూడా వున్నాయి) ఓ గేట్‌కి చేర్చి ఆ ఫొటోని ట్వీట్ చేశాడు.
క్రికెట్ లోకం అంత తొందరగా మర్చిపోయే దుర్ఘటన కాదు ఫిలిప్ హ్యూస్ మరణం. ఈ ఘటన నుంచి క్రికెట్ లోకం ఎప్పటికి తేరుకుంటుందోగానీ, ఫిలిప్ హ్యూస్ మరణానికి కారణమైన బౌలర్ అబోట్ పరిస్థితి మరీ దయనీయంగా వుంది. అబోట్ తప్పేమీ లేదని సహచరులు చెబుతున్నా, తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తున్నాడు అబోట్.