జనసేన – టార్గెట్ హైదరాబాద్?

రాబోయే హైదరాబాద్ ఎన్నికలకు పవన్ కళ్యాణ్ జనసేన సిద్ధమవుతోంది. సమైక్యాంధను కాపాడలేకపోయినా, కనీసం హైదరాబాద్ లో సీమాంధ్ర పట్టు కోల్పోకూడదన్న వ్యూహం ప్రాతిపదికగా, జనసేన, తెలుగుదేశం, భాజపా కలిసి, అక్కడ పాగా వేయాలని డిసైడ్…

రాబోయే హైదరాబాద్ ఎన్నికలకు పవన్ కళ్యాణ్ జనసేన సిద్ధమవుతోంది. సమైక్యాంధను కాపాడలేకపోయినా, కనీసం హైదరాబాద్ లో సీమాంధ్ర పట్టు కోల్పోకూడదన్న వ్యూహం ప్రాతిపదికగా, జనసేన, తెలుగుదేశం, భాజపా కలిసి, అక్కడ పాగా వేయాలని డిసైడ్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీకీ తెరాసకు పొసగదు. భాజపాకు మజ్లిస్ కు సరిపడదు. అందువల్ల ఆ రెండు పార్టీలను ఈ రెండు పార్టీలు ఓడించాలని చూస్తున్నాయి. దీనికి పవన్ సాయం తీసుకోవాలన్నది మాస్టర్ ప్లాన్. పైగా ఈ సారి మోడీ అండ వుండనే వుంది. జంటనగరాల్లో భారీ సంఖ్యలో వున్న ఉత్తర భారతదేశ జనాలు, అందునా గుజరాతీలు, మార్వాడీల ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. సీమాంద్ర ఓట్లు తెలుగుదేశం పార్టీ వీలయినంతవరకు సాదిస్తుంది. ఇక మరో పెద్ద ఓట్ బ్యాంక్ అయిన ఐటి ఉద్యోగులను ఆకట్టుకునే పని పవన్ చూసుకుంటాడని ఈ కూటమి ఆశ. అలాగే మిగిలినవి కూడా పక్కకి పోకుండా పవన్ సాయం పడతారు. ఇదీ స్కీము.

అందుకే వీలయినంత త్వరగా జనసేన పార్టీకి రిజిస్ట్రేషన్ ఇప్పించి, కార్పోరేషన్ ఎన్నికలకు దింపాలన్నది వ్యూహం. హైదరాబాద్, విశాఖ కార్పొరేషన్లపై జనసేన ముందుగా రెడీ అవుతుంది. విశాఖ ఎన్నికలు కోర్టు కేసు కారణంగా జరగలేదు. హైదరాబాద్ ఎన్నికలకు కాస్త గడువు వుంది,

అయితే ఈ సంగతి గుర్తెరిగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తాను పదవి చేపట్టిన నాటి నుంచి హైదరాబాద్ పై దృష్టి సారించారు. హైదరాబాద్ కార్పొరేషన్ లో పట్టు సాధించడం అంత సులువు కాదని ఆయనకు తెలుసు. దీనికి కీలక కారణం సీమాంద్రుల ఓట్లు. అందుకే ఆయన మైనారిటీ ఓట్లపై కన్నేసారు. మజ్లిస్ ను అక్కున చేర్చుకున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మైనార్టీల రిజర్వేషన్లను, ఇతర వ్యవహారాలను ప్రస్తావించారు. అలాగే సానియా మీర్జాను తెలంగాణ అంబాసిడర్ అన్నారు. అవి చాలక హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో వుండే ఆటో వాలాలకు లాభం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. అక్కడితో ఆగకుండా హైదరాబాద్ పైనే దృష్టి సారించి తెగ మీటింగ్ లు పెడుతున్నారు. 

పవన్ తన గోపాల గోపాల సినిమా షూటింగ్ ఎక్కువ రోజులు వుండదు. బహుశా ఎన్నికలు నవంబర్ ప్రాంతంలో వుంటాయేమో. ఆ నాటికి పవన్ ఫ్రీ అయిపోతారు. ఆ ఎన్నికలతో ఆయన పూర్తిగా రాజకీయ ఆరంగ్రేటం చేస్తారు. హైదరాబాద్ ఎన్నికల్లో విజయం తెలుగుదేశం-జనసేన కూటమి విజయం సాధించడం అంటే, ఇక్కడ సీమాంధ్రుల పట్టు నిరూపించుకున్నట్లే. పైగా కేసిఆర్ కు కానీ, తెరాసకు కానీ కార్పొరేషన్ లో వున్న పట్టు అంతంత మాత్రం. ఇటీవల శాసన సభ ఎన్నికల్లో ఆయన పార్టీ సాధించేదేమీ పెద్దగాలేదు. పైగా ఇటీవల సీమాంద్రుల పట్ల తెరాస నిర్ణయాలు కూడా వ్యతిరేక ప్రభావం కనబర్చే అవకాశం స్పష్టంగా వుంది. స్థానికత, అక్రమ కట్టడాలు వంటివి సీమాంధ్రులను బాగా కుదిపేస్తున్నాయి. అందువల్ల ఇంత వ్యతిరేకత వున్న చోట రంగంలోకి దిగడం ప్లస్ అవుతుందని జనసేన భావిస్తోంది. పైగా అది అవసరం అని తెలుగుదేశం భావిస్తోంది. తెలంగాణలో కీలమైన హైదరాబాద్ కార్పొరేషన్ చేజారితే తెరాసకు ఘోరావమానంగా వుంటుంది. పైగా తెలంగాణ ఆదాయంలో హైదరాబాద్ ది కీలక పాత్ర. కార్పొరేషన్ ను కాదని ప్రభుత్వం కూడా ఒంటెద్దు పోకడ పోలేదు. అందువల్ల కెసిఆర్ దూకుడుకు బ్రేక్ వేయడానికి ఈ ఎన్నికలే అదనుగా తెలుగుదేశం అండ్ కో భావిస్తున్నాయి. 

అయితే ఇక్కడో చిక్కుంది. భాజపా ఈ ఎన్నికల్లో ఏ మేరకు కలిసి వస్తుందన్నది అనుమానం. అయితే విడిగా పోటీ చేసినా, తరువాత కూటమి ప్రకారం తెలుగుదేశం, జనసేన వైపే మొగ్గే అవకాశం ఎక్కువ. 

మొత్తం మీద జన సేన ఎన్నికల రంగంలోకి మరో అయిదారు నెలల్లో దిగిపోతోంది అన్నది ఖాయంగా తెలుస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు చాపకింద నీరులా జరిగిపోతున్నాయి. అందుకే పవన్ ప్రశ్నించడం లేదు..బయటకు రావడం లేదు అన్న విమర్శలు వచ్చినా ఆయనేమీ పట్టించుకోవడం లేదు. రిజిస్ట్రేషన్ వచ్చిన వెంటనే ఆయన మరోసారి బహిరంగంగా మాట్లాడతారని తెలుస్తోంది. ఆ సభ లేదా సమావేశంలోనే హైదరాబాద్ ఎన్నికల విషయాన్ని ప్రస్తావించే అవకాశం వుంది. నిజానికి పవన్ గతంలోనే ఓసారి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేసారు. అందువల్ల ఆ రూట్ లోనే ఆయన ముందుకు సాగిపోతున్నారు.

చాణక్య

[email protected]