మ్యాచ్‌ని తేలిగ్గానే గెలిచేస్తాం.. సిరీస్ కూడా దక్కించేసుకుంటాం.. అంటూ బారత క్రికెట్ అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి మూడో టెస్ట్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులకే కుప్పకూలాక. కానీ, తొలి టెస్ట్ అనుభవాల నేపథ్యంలో అభిమానుల్లో టెన్షన్ స్పష్టంగా కన్పించింది. అయితే భారత బౌలర్లు ఛాన్స్ తీసుకోలేదు.. పక్కా వ్యూహంతో బౌలింగ్ చేశారు. ఫలితం.. మూడో టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం.. అంతే కాదు, 22 ఏళ్ళ తర్వాత లంక గడ్డపై భారత్‌కి సిరీస్ విజయం దక్కింది.. ఆ జట్టుపై.
67 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో ఈ రోజు ఉదయం బ్యాటింగ్ దిగిన లంక, త్వరగానే వికెట్లు కోల్పోయింది. 74 పరుగులకు నాలుగో వికెట్, 107 పరుగులకు ఐదో వికెట్ కోల్పోయిన లంకను, కెప్టెన్ మాథ్యూస్ ఆదుకున్నాడు. కుశాల్ పెరీరాతో కలిసి మాథ్యూస్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి 135 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఓ దశలో వీరిద్దరూ మ్యాచ్‌ని డ్రా చేస్తారేమోనని అంతా అనుకున్నారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని అశ్విన్ విడదీశాడు. ఆ తర్వాత ఇషాంత్, మాథ్యూస్‌ని ఔట్ చేయడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ వైపుకు తిరిగింది. మిగతా వికెట్లు టపటపా పడిపోవడంతో లంక పరాజయం, టీమిండియా విజయం ఖాయమైపోయాయి.
చటేశ్వర్ పుజారాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కగా, అశ్విన్‌కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కాయి. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇదే తొలి సిరీస్ విజయం.