విశాఖ తేరుకునేదెప్పటికి.?

విశాఖలో తెల్లారింది.. ప్రళయం నుంచి తేరుకోవడానికి ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు పడుతుందోగానీ.. ప్రస్తుతానికి విశాఖలో ఎటు చూసినా విధ్వంసమే కన్పిస్తోంది. నిన్న హుద్‌హుద్‌ తుపాను సృష్టించిన బీభత్సం కారణంగా మొత్తంగా విశాఖ నగరంలో ఎక్కడ చూసినా…

విశాఖలో తెల్లారింది.. ప్రళయం నుంచి తేరుకోవడానికి ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు పడుతుందోగానీ.. ప్రస్తుతానికి విశాఖలో ఎటు చూసినా విధ్వంసమే కన్పిస్తోంది. నిన్న హుద్‌హుద్‌ తుపాను సృష్టించిన బీభత్సం కారణంగా మొత్తంగా విశాఖ నగరంలో ఎక్కడ చూసినా కూలిన చెట్లు దర్శనమిస్తున్నాయి. విరిగిపడ్డ విద్యుత్‌ స్తంభాలు, జలమయమైన రోడ్లు.. ఇలా ఎటు చూసినా పెను విధ్వంసమే.

వరుసగా రెండ్రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన విశాఖలో ఇప్పటిదాకా కరెంటు సరఫరా పునరుద్ధరణ కాలేదు. అదెప్పటికి జరిగేనో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి. తాగడానికి మంచి నీళ్ళు లేవు.. గాయపడ్డవారికి వైద్యం అందించే పరిస్థితులు కూడా కన్పించడంలేదంటే విశాఖలో పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. 

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభమైనా.. హుటాహుటిన ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేని ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత రోడ్లు క్లియర్‌ చేస్తే తప్ప సహాయక చర్యలు ముందుకు వెళ్ళేందుకు ఆస్కారం లేదు. అందుకే ఆ దిశగా ఎన్డీఆర్‌ఎఫ్‌, సైన్యం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

నిన్నటినుంచి మీడియా సైతం వెళ్ళలేని చోట్లకి ఇప్పుడిప్పుడే మీడియా ప్రతినిథులు వెళ్తుండడంతో నష్టం.. నిన్నసాయంత్రానికి అనుకున్నదానికన్నా పదింతలు.. ఇంకా ఎక్కువే సంభవించిందనే విషయం స్పష్టమవుతోంది. సముద్ర తీరమంతా హృదయ విదారక దృశ్యాలతో నిండిపోయింది. సుందర విశాఖ నగరం కాస్తా.. తీవ్ర విధ్వంసానికి గురయ్యింది. మత్య్సకారుల జీవనాధారమైన పడవలు ధ్వంసమయ్యాయి. చిన్న చిన్న పడవలనుంచి పెద్ద పెద్ద బోట్లు కూడా తుక్కుతుక్కుగా మారిపోయాయి.

ఇక, నగరంలోని పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. కార్ల షోరూంలోంచి కార్లు రోడ్లమీదకు వచ్చిపడ్డాయి. పెట్రోల్‌ బంక్‌లు ధ్వంసమయ్యాయి. ఎటు చూసినా విధ్వంసం తప్ప ఇంకేమీ కన్పించడంలేదు. జనం ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు. నిన్నటిదాకా సుందరంగా కన్పించిన తమ నగరం ఒక్కసారిగా విధ్వంసానికి గురవడాన్ని నగరవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తంగా చూస్తే సుమారు 80 శాతం చెట్లు నేలకొరిగాయంటే విశాఖలో ఏ స్థాయి విధ్వంసం చోటుచేసుకుందో అర్థం చేసుకోవచ్చు.

రెండు మూడు రోజుల్లో నగరం కొంతమేర తేరుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, పూర్తిగా విశాఖ తేరుకునేటప్పటికి కొద్ది నెలల సమయం పడ్తుందనీ, మునుపటిలా నగరం కన్పించాలంటే మాత్రం ఏళ్ళు పట్టేయొచ్చని వాపోతున్నారు విశాఖ నగరవాసులు.