ఎమ్బీయస్‌ : పేర్లు దొరకటం లేదా?

తెలుగు రాష్ట్రాలలో పేర్ల సందడి నడుస్తోంది. కాంగ్రెసు పాలనలో వున్నంతకాలం వెతికే పనే వుండేది కాదు, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ లేదా ఉట్టి నెహ్రూ, మధ్యమధ్యలో కమలా నెహ్రూ, ఇందిరా గాంధీ లేదా…

తెలుగు రాష్ట్రాలలో పేర్ల సందడి నడుస్తోంది. కాంగ్రెసు పాలనలో వున్నంతకాలం వెతికే పనే వుండేది కాదు, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ లేదా ఉట్టి నెహ్రూ, మధ్యమధ్యలో కమలా నెహ్రూ, ఇందిరా గాంధీ లేదా ఉట్టి ఇందిర, రాజీవ్‌ గాంధీ లేదా ఉట్టి రాజీవ్‌… అవే పేర్లు. పెళ్లికయినా, చావుకైనా సైన్స్‌ సంస్థకైనా, అడుక్కుతినేవాళ్ల కోసం పెట్టిన పథకానికైనా అవే పేర్లు తిప్పితిప్పి కొట్టారు. ఓ వందా రెండు వందల ఏళ్లు పోయాక భారతచరిత్ర రాయబోయేవాళ్లు వీళ్లు తప్ప వేరే నాయకులెవరూ లేరా? అని ఆశ్చర్యపడేటంత లెవెలుకు వెళ్లిపోయింది. వాళ్లు కాక తక్కిన పేర్లు ఏమైనా వాడారా అంటే సుభాష్‌ బోసు, కాస్త సర్దార్‌ పటేల్‌.. బస్‌! కోఠీలో గోఖలే పార్కు వుంది. ఆ పేరుతో చెప్తే ఎవరికీ తెలియదు. ప్రచారం లేదు పాపం. గోఖలే, టిళక్‌, లాలా లజపతి రాయ్‌, పండిత మదనమోహన్‌ మాలవ్యా.. యిలాటి మహానుభావుల పేర్లు ప్రచారంలోకి రాకూడదా? ఆఖరాయన పేరు విననివాళ్లు చాలామంది వుండవచ్చు కాబట్టి ఓ పిట్టకథ. మా అమ్మ పెదనాన్నగారు బనారస్‌ హిందూ యూనివర్శిటీలో సీటు గురించి వెళితే సీట్లు అయిపోయాయి వెళ్లిపొమ్మన్నారట. అప్పుడాయన యూనివర్శిటీ వ్యవస్థాపకుడు, వైస్‌ ఛాన్సలర్‌ మాలవ్యాగారి వద్దకు వెళ్లి మాట్లాడితే యీయన సంస్కృత పరిజ్ఞానం చూసి ముచ్చటపడి ఆయన అదనంగా సీటు సృష్టించి యిచ్చాడట. అందువలన కృతజ్ఞతగా తన కొడుక్కి మాలవ్యాగారి పేరు పెట్టుకున్నాడు. అయితే తెలుగునాట బోసు, చటర్జీ పేరు వినబడినంతగా మాలవ్యా పేరు వినబడదు కాబట్టి మా మామయ్య పేరును స్కూలులో, ఆఫీసులో పలకలేక అవస్థ పడేవారు. చివరకు ఆయన ఆ సర్కిల్స్‌లో తన యింటిపేరునే వాడుతున్నాడు. 

చెప్పవచ్చేదేమిటంటే నెహ్రూ కుటుంబం పేరు తప్ప మరే పేరూ వాడకుండా చేసి తక్కినవారికి అన్యాయం చేశారు. హైదరాబాదులో పెట్టిన కళాక్షేత్రానికి 'రవీంద్ర భారతి' అని ఎందుకు పెట్టాలి? మనకు కవులు లేరా? ఇందులో ఓ కుట్ర వుందంటాడు మా ఒడియా మిత్రుడు. ప్రతీ రాష్ట్రం యిలాటి సెంటర్‌కు కేంద్రం నుంచి నిధులు అడుగుతుందని, అక్కడున్న బెంగాలీ అధికారులు రవీంద్రుడి పేరు పెట్టాలని పట్టుబట్టి వుంటారని అంటాడు. కలకత్తాలో ఎలాగూ 'రవీంద్ర సదన్‌' వుంది. భువనేశ్వర్‌లో  'రవీంద్ర భవన్‌', బెంగుళూరులో 'రవీంద్ర కళాక్షేత్ర', ఢిల్లీలో 'రవీంద్ర రంగశాల', ముంబయిలో 'రవీంద్ర నాట్యమందిర్‌..' యిలా కొన్ని నమూనాలు చూపించాడు. రవీంద్రుడు తప్ప ఆ యా రాష్ట్రాలలో కవీంద్రులే లేరా? అని అడిగాడు. పాయింటే కదా! కాంగ్రెసు వాళ్లకైతే గాంధీ, నెహ్రూ తిప్పలు తప్పవు. తక్కినవాళ్లకు..? ఎన్టీయార్‌ పదవిలోకి వచ్చాక మహానుభావుడు బూర్గుల రామకృష్ణారావుగారి పేరు ఓ పెద్ద భవంతికి పెట్టి ఆయనెవరో అందరికీ తెలిసేట్లు చేశారు. ఆ తర్వాత శాతవాహన, శాలివాహన, తెలుగు, వారుణివాహిని.. అంటూ తెలుగు లేదా భారతీయ సంస్కృతికి సంబంధించిన పేర్లు పెట్టి ప్రజల్లో అవగాహన పెంచారు. ఎన్టీయార్‌ను కూలదోసి వచ్చిన చంద్రబాబుకు మళ్లీ పేర్ల సమస్య వచ్చింది. ఎన్టీయార్‌ పేరును ప్రజల మెదళ్లలోంచి తుడిపేయాలనే యావతో తన హయాంలో కట్టిన వాటికి కాంగ్రెసు నాయకుల పేర్లే పెట్టారు. ప్రతిపక్షంలోకి వచ్చాక, ఎన్టీయార్‌ నామస్మరణ తప్ప అన్యథా శరణం నాస్తి అనిపించాక ఎన్టీయార్‌ను పట్టించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పాత పథకాల పేర్లు మార్చే అగత్యం పడింది. ఆ పేరుతో పిలిస్తే పాత నాయకులు గుర్తుకు వస్తారన్న భయంతో పేర్లు మారుస్తున్నారు. మార్చడానికి ఎన్టీయార్‌ను వాడుకుంటున్నారు. అది అతి అయిపోతోంది.

రాజధానికి ఎన్టీయార్‌ పేరుట, పైనుంచి చూస్తే ఎన్‌ టి ఆర్‌ అనే అక్షరాలు కనబడేట్లు రాజధాని కడతారట, తాగునీటికి ఎన్టీయార్‌ సుజల స్రవంతి, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ యిప్పుడు ఎన్టీయార్‌ ఆరోగ్యసేవ ఏది ముట్టుకున్నా దానికి ఎన్టీయార్‌ పేరే. పెన్షన్‌ స్కీముకి ఎన్టీయార్‌ భరోసా అని పెడతారట, రేపు ఇన్సూరెన్సు స్కీము పెడితే ఎన్టీయార్‌ బీమాధీమా అంటారేమో! ఎన్టీయార్‌ను వెక్కిరించడానికి యిలా రాయటం లేదు. ఆ పేరును యిష్టం వచ్చినట్లు వాడుకోవడాన్ని ఆక్షేపిస్తున్నాను. ఎన్టీయార్‌ సినిమాలకు 'రాముడు' పేరు అతిగా వాడేశారు. బండరాముడు, అడవిరాముడు, సర్కస్‌ రాముడు, రాముని మించిన రాముడు… యిలా అయోమయం అయిపోతూ వుండగా ఆయన సినిమాల్లో మానేసి రక్షించాడు. ఇప్పుడు బాబు ఎన్టీయార్‌ పేర్లు ఎడాపెడా పెట్టినదాకా వుండి రేపు జూనియర్‌ పాలిటిక్స్‌లోకి దిగి టిడిపిని ఎదిరిస్తే బాబు యీ పేరు వుంచుతారో లేదో! ఇప్పటికే గూగుల్‌ యిమేజిలో ఎన్టీయార్‌ అని కొడితే జూనియర్‌ ఫోటోలే వస్తున్నాయి. పెద్దాయన ఫోటోలు ఎక్కడో చివర్లో కనబడతాయి. ''ఈ పేర్లన్నీ జూనియర్‌కు ఎన్నికల ప్రచారంలో వుపయోగపడుతున్నాయి'' అని యింటెలిజెన్సు వర్గాలు చెపితే చాలు, తత్తరపడి ఎన్టీయార్‌ పేరు ముందో వెనకో ఏదో చేరుస్తారు. మనం తమిళనాడు నుండి చాలా ఎరువు తెచ్చుకున్నాం. అక్కడ కరుణానిధి అధికారంలో వుండగా ఓ పెద్ద పేటను కట్టి దానికి 'కలైజ్ఞర్‌ కరుణానిధి నగర్‌' అని బిరుదుతో సహా తన పేరే పెట్టేసుకున్నాడు. తర్వాత అధికారంలోకి వచ్చిన ఎమ్జీయార్‌ పేరు మార్చకుండా కెకె నగర్‌ అని పొడి అక్షరాలే వాడమన్నాడు – పూర్తి పేరు వాడితే కరుణానిధి, తద్వారా డిఎంకె గుర్తు వస్తాయని భయం. టిడిపి తర్వాత మరో పార్టీ అధికారంలోకి వస్తే యిలాటి ట్రిక్కులేవో వేస్తుంది. ఈ గోలేమీ లేకుండా అందరికీ ఆమోదయోగ్యులైన తెలుగు ప్రముఖుల పేర్లు పెడితే యిబ్బంది వుండదు కదా.

బాబు యీ మధ్య పింగళి వెంకయ్యగారి పేరు యిలాగే వుపయోగించారు. అంతవరకు బాగుంది, కానీ ఆ పేరు విజయవాడలోని ఆకాశవాణి భవన్‌కు పెట్టారు. వెంకయ్యగారికి, ఆకాశవాణికి సంబంధం ఏమిటి? ఆకాశవాణికి ఏ సంగీతకర్త పేరో, సాహితీమూర్తి పేరో పెడితే సొగసుగా వుండేది. వెంకయ్యగారి పేరు మరో సందర్భంలో వాడుకోవచ్చు. ఇలాటి ఔచిత్యాలు కూడా పట్టించుకోవడం మానేశారు. అంతకుముందే కెసియార్‌ కాళోజీ పేరు హెల్త్‌ యూనివర్శిటీకి పెట్టారు. కాళోజీకి, వైద్యానికి గల బాదరాయణ సంబంధం ఏమిటి? ఏ సాహితీసంస్థకో కాళోజీ పేరు పెట్టి, (వరంగల్‌ జిల్లాకు లేదా తెలంగాణకు చెందిన) ఏ వైద్యుడి పేరో, శాస్త్రజ్ఞుడి పేరో మెడికల్‌ యూనివర్శిటీకి పెడితే ఎంత బాగుండేది? జయశంకర్‌ పేరు అగ్రికల్చర్‌ యూనివర్శిటీకి పెట్టారు. ఏదైనా ఎకనమిక్స్‌లో డీల్‌ చేసే సంస్థకు పెట్టవచ్చుగా! దాశరథి పేర ఎవార్డు పెట్టి ఏ క్రీడాకారుడికో యిస్తే ఎబ్బెట్టుగా వుండదూ!? సప్తగిరి ఛానెల్‌ ఆంధ్రకు వెళ్లిపోతే, తెలంగాణ ఛానెల్‌కు యాదగిరి అని పెట్టారు. తూకంగా వుంది. కొమురం భీమ్‌ పేరు గిరిజన యూనివర్శిటీకి పెట్టారు. బాగుంది. పేరు పెడితే అలా వుండాలి. దసరాకు తెరవబోయే కల్లు కాంపౌండ్లకు ఏం పేరు పెడతారో చూడాలి. అదే పేరుతో వ్యవహరిస్తే అదోలా వుంటుంది. మద్యపానానికి ప్రసిద్ధి కెక్కిన పురాణపురుషుడి పేరేదైనా పెడితే అతికినట్లు సరిపోతుంది. పాశ్చాత్య దేశాల్లో అయితే 'బేకస్‌' (రోమన్లకు, గ్రీకులకు మద్యపానానికి దేవుడు) అంటారు. మన దేశానికి వచ్చేసరికి కాలకేయులను సంహరించడానికై సముద్రజలం మొత్తం తాగిపారేసిన అగస్త్యుడు గుర్తుకు వస్తాడు. ఏం తిన్నా 'వాతాపి జీర్ణం' అంటూ హరాయించుకోగలిగిన వాడాయన. ఆ కాంపౌండ్లకు అగస్త్య అని పేరు పెడతారేమో! అయినా మనకీ శ్రమంతా అనవసరం. కెసియార్‌గారు ఏదో ఒకటి ఆలోచించే వుంటారు లెండి. ముఖ్యమంత్రి కాకముందు ఆయనకు ఫౌమ్‌హౌస్‌లో వ్యవసాయపనుల్లో తీరిక దొరికేది కాదు కానీ అయ్యాక ఆయనకు సింగపూర్‌ తొలిప్రధాని పుస్తకాన్ని అనువదించడం, చెఱువులపై పాట రాయడం.. వంటి సాహితీ వ్యవసాయానికి తీరిక చిక్కుతోంది. ఈ పేరు పెట్టడానికి ఆయనకు పావుగంట పట్టదు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2014)

[email protected]