ఎమ్బీయస్‌ : బాపుకు బాష్పాంజలి – 8

బాపు 1960ల్లో గిరీశం బొమ్మను ఒరిజినల్‌గా ఒకలా వేసి, తర్వాతి రోజుల్లో వాడికి జుట్టు తగ్గించేసి, కాళ్లు వంకర చేసేసి వేస్తే నాకు నచ్చలేదు. గురజాడ సృష్టించిన గిరీశం అందమైన యువకుడు. కబుర్లు చెప్పి…

బాపు 1960ల్లో గిరీశం బొమ్మను ఒరిజినల్‌గా ఒకలా వేసి, తర్వాతి రోజుల్లో వాడికి జుట్టు తగ్గించేసి, కాళ్లు వంకర చేసేసి వేస్తే నాకు నచ్చలేదు. గురజాడ సృష్టించిన గిరీశం అందమైన యువకుడు. కబుర్లు చెప్పి అందర్నీ మోసగించే చలాకీతనం వున్నవాడు. అతన్ని కురూపి ఎందుకు చేయాలి? అలాగే బుడుగు కూడా మారిపోయాడు.  కాళ్లు లావై పోయాయి, పళ్లు పారపళ్లలా అయిపోయాయి. పాత, కొత్త బొమ్మలు పక్కనే యిస్తున్నాను చూడండి. వాళ్ల బామ్మ కూడా పళ్లు పోగొట్టుకుని వికృతం అయిపోయినట్లుగా అనిపించింది. బుడుగు కొత్త ఎడిషన్‌ వచ్చినప్పుడల్లా బాపు కొన్ని బొమ్మలు మారుస్తూ వచ్చారు. కొన్ని పాతవి వుండేవి, కొన్ని కొత్తవి వుండేవి. రమణగారు దీనికి పూర్తి విరుద్ధం. ''అప్పుడు తెలిసో తెలియకో ఏం రాశామో అలాగే వుంచాలి. ఈ రోజు కొత్త తెలివితేటలు వచ్చాయి కదాని, దానికి మెరుగులు దిద్ది మళ్లీ రాయకూడదు.'' అనేవారు. 

''బొమ్మా-బొరుసూ'' సంకలనంలో రమణగారి రచనలు నేను సేకరించినవే అయినా, బాపుగారి బొమ్మల బాధ్యత శ్రీరమణగారిది. 2000 సం||రంలో సాహితీసర్వస్వం తీసుకొస్తున్నపుడు మొదటగా కథారమణీయంతో మొదలుపెట్టాను. అప్పటిదాకా విశాలాంధ్ర వాళ్లు వేసిన కథాసంకలనాల్లో దేనిలోనూ బొమ్మలుండేవి కావు. జస్ట్‌ కథ వుండేదంతే. రమణ కథలకు బాపు బొమ్మలు లేనిదే సంపూర్ణం అయినట్టు కాదు. పెడతాను అన్నాను. విశాలాంధ్ర రాజేశ్వరరావుగారు సరే, మీ యిష్టం అన్నారు. వాటిల్లో కొన్ని కథలకు బాపుగారు కొత్త బొమ్మలు వేసివున్నారు. మరి కొన్నిటికి వేయలేదు. కొత్త బొమ్మలున్న చోటల్లా కొత్తవే వేయండి అన్నారు. అలాగే అని వేస్తూ, అవి లేనిచోట పాతబొమ్మలే వాడాను. అవన్నీ విజయమోహన్‌ రెడ్డి సేకరించి యిచ్చినవి. ఇక మూడో పుస్తకంగా రావలసిన ''బుడుగు'' కథారమణీయం-2 కంటె ముందే వెలువడింది. ఆ పుస్తకంలో ఒక ప్రయోగం చేద్దామనుకున్నాను. బుడుగు మొదట సీరియల్‌గా వచ్చిన రోజుల్లో వాడిన బొమ్మల నుండి లేటెస్టు ఎడిషన్లలో వాడిన బొమ్మల దాకా యివల్యూషన్‌ చూపిద్దామనుకున్నాను. ఆంధ్రపత్రికలో వచ్చిన రోజుల్లో కొన్ని పేజీలు కలర్‌లో వుండేవి. అవన్నీ విజయమోహన్‌ రెడ్డి యిస్తే, వాటిని కట్‌ చేసి విశాలాంధ్ర వారికి యిచ్చాను.
విశాలాంధ్ర స్టాఫ్‌కి అప్పట్లో అంత సాంకేతిక పరిజ్ఞానం వుండేది కాదు. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో పుస్తకం ప్రింట్‌ చేస్తున్నాం కాబట్టి, కలరు పేజీలను స్కాన్‌ చేసినపుడు గ్రే స్కేల్‌లో లేదా బ్లాక్‌ అండ్‌ వైట్‌లోకి మార్చాలి అని వారికి తెలియదు. మార్పించాలన్న సంగతీ నాకు తెలియదు. దాంతో ఆ బొమ్మలన్నీ అచ్చులో పాలిపోయి కనబడ్డాయి. బాపుగారికి అవి చూస్తే ఒళ్లు మండిపోయింది. పైగా ఆయన డిస్కార్డ్‌ చేసి పడేసిన పాత బొమ్మలను వెరైటీ అంటూ నేను వాడాను. దాంతో ఆయన అగ్గిరాముడై పోయారు. ఉషాకిరణ్‌ గెస్ట్‌హౌస్‌లో కనబడినప్పుడు నాపై ఎగిరిపడ్డారు – 'పాత బొమ్మలు ఎందుకు వాడారు? అవన్నీ నాకు బొమ్మలు వేయడం రానప్పుడు వేసినవి' అంటూ. అవి కూడా మీ బొమ్మలే కదా, మేమంతా దానితో ఐడెంటిఫై అయ్యాం కదా అని నేను వాదించాను. 

బాపుగారితో స్నేహం వున్నవారెవరూ ఆయనతో వాదించరు. ఆయనకు చికాకు, అసహనం ఎక్కువ. అవతలివాళ్లు చేసినది ఆయనకు ఒక పట్టాన నచ్చదు. పుస్తకం డిజైన్‌ కానీ, సినిమా డైరక్షన్‌ కానీ అంతా ఆయనే చేసుకుంటారు, కొందరు డైరక్టర్లయితే కొన్ని సీన్లు అసిస్టెంట్ల చేత తీయించేస్తూంటారు. ఈయన అలా డెలిగేట్‌ చేయరు, చేయలేరు. స్క్రిప్టంతా బొమ్మలతో సహా స్వహస్తాలతో రాసి పెట్టుకుని, దాన్ని అనుసరిస్తారు. ఆదుర్తి సుబ్బారావుతో సహా అనేకమంది సహాయదర్శకుడిగా పనిచేసి బాపుగారి వద్ద చాలాకాలం సహాయదర్శకుడిగా వున్న కెవి రావుగారు ఓ సారి చెప్పారు – ''బాపుగారి దగ్గర అసిస్టెంటుగా పనిచేసేమంటే వేరే ఎవరూ పని యివ్వరండి. అంతా ఆయనే చేసుకుంటారు, నువ్వేం చేసి వుంటావ్‌? అంటారు.'' వరా ముళ్లపూడి కూడా మొదట బాపుగారి దగ్గర అసిస్టెంటుగా పనిచేసి స్వయంప్రతిభ చూపించుకోవాలంటే విడిగా వచ్చేయాల్సిందే అనుకునివుంటారు. అందుకే హైదరాబాదు వచ్చేసి రాఘవేంద్రరావుగారి యూనిట్‌లో చేరారు. 

ఏదైనా సరే బాపుగారు గొప్పగా చేస్తారు, అందులో సందేహం లేదు. అయినా ఆయనే టీము లీడరు. ఎవరూ ఆయనకు ఎదురాడరు, తిరిగి సమాధానం చెప్పరు. బాపు సన్నిహితులందరికీ ఆ విషయం తెలుసు. నాకు బాపుగారితో అప్పట్లో సాన్నిహిత్యం లేదు కాబట్టి ఎదురుతిరిగి మాట్లాడాను. ''మీ పాత లైను ద్వారానే అఖిలాంధ్రుల అభిమానాన్ని చూరగొన్నారు.  వాటిని మీరు డిజోన్‌ చేయడమేమిటి? కొత్త కారెక్టర్లను కొత్తగా వేస్తే ఓకే, కానీ పాతవాటిని మార్చడమేమిటి? ఆర్‌ కె లక్ష్మణ్‌ కామన్‌మ్యాన్‌ ఎన్నేళ్లయినా అలాగే వున్నాడు కదా'' అంటూ నా అభిప్రాయాలు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాను. ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. బాపు సంస్మరణ అని మొదలుపెట్టి ఆత్మస్తుతి చేసుకుంటున్నానని ఓ పాఠకుడు అన్నారు. మనిషి పోయినపుడు వారితో మనకు జరిగిన సంఘటనలను నెమరు వేసుకోవడం పరిపాటి. బాపు నన్ను మెచ్చుకున్న సందర్భాలతో బాటు యిలా తిట్టిన సందర్భమూ వుంది. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. బాపుగారిని ఎదిరించేవాడా వీడు అని పదిమంది అనుకునే ప్రమాదం వుంది. మామూలుగా అయితే యిది బయటపెట్టేవాణ్ని కాను. కానీ ఆ రోజు మా యిద్దరి వాగ్వివాదానికి  ఏకైక ప్రత్యక్షసాక్షి అయిన బ్నిం ఓ ఏడాది బాపు పుట్టినరోజుకి 'బాపు సత్యాగ్రహాలు' పేర ఆంధ్రప్రభ ఆదివారం సంచికకు వ్యాసం రాస్తూ యీ ఉదంతాన్ని కూడా ఉదహరించాడు. బాపుగారు అది చదివి ఏమీ అనుకోలేదు సరి కదా బ్నింతో 'ఇంకా కొన్ని వదిలేశారేం?' అన్నారు. అదీ ఆయన ఔన్నత్యం. ఆ రోజు బ్నిం బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. బయటకు వచ్చాక ''మీకు ఆయన సంగతి తెలియదు కాబట్టి అలా వాదించారు. మేమెవరం అలా మాట్లాడం.'' అన్నారు. ''ఇగ్నోరెన్స్‌ యీజ్‌ బ్లిస్‌ కదా'' అన్నాను నేను. 

ఇంతకీ అవేళ చివరిగా బాపు ''భావితరాలు తనను ఎలా గుర్తుపెట్టుకోవాలో ఎంచుకునే హక్కు ఒక కళాకారుడికి వుంటుంది. మీరంతా మెచ్చుకునే నా పాతబొమ్మలు బాగా లేవని అనుకునే హక్కు కూడా నాదే. నా కొత్త బొమ్మల ద్వారానే నేను ప్రజలకు గుర్తుండాలని అనుకుంటున్నాను. మీరు అలా చేయాల్సిందే'' అని కరాఖండీగా చెప్పారు. ''సరేనండి, జరిగినదానికి చింతిస్తున్నాను. సెకండ్‌ ఎడిషన్‌లో అన్నీ కొత్తబొమ్మలే వేయిస్తానని మాట యిస్తున్నాను.'' అని బయటకు వచ్చేశాను. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

Click Here For Part-6

Click Here For Part-7