రాందేవ్‌ బాబా సంస్కారం పలచబడిందా?

ముందుగా ఓ చిన్న కథ ప్రస్తావించాలి.  Advertisement వేమన సర్వసంగ పరిత్యాగి అనే సంగతి మనకు తెలుసు. ఆయన కనీసం మొలతాడు గానీ.. గోచీగుడ్డ గానీ లేని సన్యాసిగా మారిపోయాడని మనకు తెలుసు. అయితే..…

ముందుగా ఓ చిన్న కథ ప్రస్తావించాలి. 

వేమన సర్వసంగ పరిత్యాగి అనే సంగతి మనకు తెలుసు. ఆయన కనీసం మొలతాడు గానీ.. గోచీగుడ్డ గానీ లేని సన్యాసిగా మారిపోయాడని మనకు తెలుసు. అయితే.. ఆ ప్రక్రియలో భాగంగా మధ్యలో వేమన అన్నీ త్యజించి.. మొలతాడుకు ఓ గోచీ మాత్రం పెట్టుకుని తిరుగుతుండేవాడుట. అలాంటి రోజుల్లో ఓసారి ఆయన ఓ చెట్టు కింద పడుకుని ఉండగా.. ఇద్దరు అశ్వనీదేవతలు అటువైపుగా ఆకాశంలో వెళుతూ.. వేమనను చూసి.. ఆయన సర్వం పరిత్యజించిన వ్యక్తి అనుకున్నామే.. ఇంకా ఆయనకు ఒకటి అలాగే ఉంది.. అని వ్యాఖ్యానించారుట.

సాధువు అయిన వేమనకు వారి మాటలు వినిపించాయి. తాను ఇంకా గోచీని వదలకుండా పెట్టుకున్నందుకు.. వారు అలా వ్యాఖ్యానించారని తెలుసుకుని.. చాలా సిగ్గు పడిపోయాడుట. ఆ వెంటనే మొలతాడు తెంచేసి.. ఆ గోచీగుడ్డను తీసి పారేశాడుట. వెంటనే అశ్వనీదేవతలు తమలో తామ.. ‘అరె వీడికి ఒకటే ఉందనుకున్నాము.. కానీ రెండు ఉన్నాయి ’ అని కామెట్‌ చేశారుట. వేమనకు ఆశ్చర్యం కలిగింది. ఆయన వెంటనే దేవతల్ని వేడుకుని ‘‘అమ్మా.. ఒకటి అంటే గోచీ తీసేశాను. రెండు ఉన్నాయంటున్నారే. నాకు ఏమున్నాయి చెప్పండి’’ అని విన్నవించాట్ట. ఒకటి నీకు సిగ్గు ఉండిపోయింది అనుకున్నాం.. గోచీపెట్టుకున్నావు కాబట్టి! కానీ  మేం ఆ మాట చెప్పగానే తీసి పారేశావు.. నీకు ఇంకా రోషం కూడా మిగిలే ఉంది’’ అని ఆ దేవతలు చెప్పి చక్కాపోయారుట. 

అసలు సన్యాసి సాధువు అంటే.. సర్వం త్యజించిన వాడై ఉండాలని ఈ ఉదాహరణ చెబుతారు. ఇవి సన్యాసికి ఉండాల్సిన అత్యుత్తమ ప్రమాణాలు అనుకోవాలి. అలాంటిది… బాబా రాందేవ్‌ ఇప్పుడు తనకు సన్యాసి లక్షణాలు లేవని నిరూపించుకుంటున్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలను గమనిస్తే.. ఆయన లోని సంస్కారం పలచబడినట్లుగా కనిపిస్తోంది. యోగా గురువుగా అత్యంత పేరు ప్రఖ్యాతులున్న ఈ అర్ధనగ్న బాబా… రాజకీయ విమర్శలు సైతం చేస్తుండడంలో ప్రముఖుడు. దాన్ని మనం తప్పు బట్టడం లేదు. కానీ రాహుల్‌గాంధీ.. హనీమూన్‌లాగా దళితుల ఇళ్లకు వెళుతుంటాడంటూ.. సందర్భశుద్ధి లేని అపభ్రంశపు కామెంట్‌ చేశాడు. దీని మీద దేశవ్యాప్తంగా సహజంగానే దేశవ్యాప్తంగా రగడ చెలరేగింది. దీనికి ఆయన శనివారం నాడు సారీ చెప్పారు. ఆ సారీ చెప్పడంలో సదరు సన్యాసి గారిలో ఉన్న అహంకారం మరింత శృతిమించి కనిపిస్తున్నది. ఆయనలోని సంస్కార హీనత కూడా పుష్కలంగా కనిపిస్తున్నది. 

తన వ్యాఖ్యల వలన దళితుల మనసులు గాయపడి ఉంటే క్షమాపణ చెబుతున్నట్లుగా ఆయన ప్రకటించారు. ‘గాయపడి ఉంటే’ అనడం ఏమిటి? ‘తాను మాట్లాడిన మాటలు తప్పు’ ‘నేను తప్పుచేశాను` మన్నించండి’ అని చెప్పవలసిన, సంస్కారంతో ఒప్పుకోవాల్సిన వ్యవహారం ఇది. అలా చేయకుండా.. నా మాటల వల్ల మీరు నొచ్చుకుని ఉంటే సారీ…! అని చెప్పడం అంటే రాజకీయ నాయకులు చెప్పే సారీలాగా ఉన్నది.  అందుకే మామూలుగా ధర్మప్రచారం, సదుపదేశాల విషయంలో బాబా రాందేవ్‌ భావజాలాన్ని అభిమానించే వారు కూడా ఈ విషయంలో ఆయన సంస్కార హీనతను ఈసడించుకుంటున్నారు.