మోదీగారి ఉపన్యాసం తెలుగుజాతిపై జాలిపడడమే మెయిన్ థీమ్‌గా సాగింది. తెలుగుజాతికి అవమానం జరిగిపోయింది, వారి ఆత్మగౌరవాన్ని నాశనం చేసినది కాంగ్రెసు పార్టీ కాబట్టి, వారిని తుదముట్టించి, కాంగ్రెసేతర పార్టీలను నెత్తిమీద పెట్టుకోవాలి అనే పాట గతంలో ఎన్టీయార్ పాడినదే. ఇప్పుడు మళ్లీ అంది వస్తుందనుకుని మోదీ అదే పల్లవి ఎత్తుకున్నారు. ఆత్మగౌరవం దెబ్బతినడం గురించి యిద్దరూ చెప్పిన అంశాలను కలిపి చూస్తే – ముఖ్యమంత్రులను మార్చడం, అంజయ్య పట్ల రాజీవ్ దురుసు ప్రవర్తన, మరణించాక పివి పట్ల అపచారం..! వీటిని వరుసగా పరామర్శిద్దాం.
ముఖ్యమంత్రిని మారిస్తే జాతిని అవమానపరచినట్లా?
మొదట ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అతని పార్టీ హై కమాండ్ మారిస్తే అది ఆ జాతి పట్ల అపచారం చేయడమా? రేపు ఆంధ్ర, తెలంగాణలలో ఒకే పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోండి. ఆ పార్టీ హై కమాండ్ ఒక రాష్ట్రంలో సిఎంను ఐదేళ్లు కొనసాగించి, మరో రాష్ట్రంలో ప్రతీ ఏడాదికీ మార్చిందనుకోండి. అప్పుడు తెలుగుజాతి పట్ల అవమానం చేసినట్లా? చేయనట్లా? బిజెపి ఉత్తరాఖండ్‌లో 2007 నుండి 2012 లోపున మూడుసార్లు ముఖ్యమంత్రిని మార్చింది. గుజరాత్‌లో 1995 మార్చి నుండి 18 నెలల్లో యిద్దర్ని మార్చింది. మరి మార్చిన ప్రతీసారీ ఆ యా జాతులు అవమానించ బడినట్లేనా? జాతీయ పార్టీలు సరే, ప్రాంతీయపార్టీలు జిల్లా అధ్యకక్షులను చిత్తం వచ్చినట్లు మార్చటం లేదా? థాబ్దాలుగా జండా మోసినవాళ్లను పక్కన పడేసి, పార్టీ ఫిరాయింపుదారులకు టిక్కెట్లు యివ్వడం లేదా? అంటే ఆ జిల్లా వాళ్లందరినీ రాష్ట్రనాయకత్వం అవమానించినట్లేనా? రేపు చంద్రబాబో, జగనో తెలంగాణ యూనిట్ అధ్యకక్షుణ్ని మారిస్తే తెలంగాణ వారందరినీ అవమానించినట్లా? ఎన్టీయార్ ఒక్క కలం పోటుతో తన కాబినెట్‌లో మంత్రులందరినీ యింటికి పంపించినప్పుడు వాళ్లందరూ తెలుగువాళ్లే అయినా, పంపినవాడు తెలుగువాడు కాబట్టి తెలుగువారి ఆత్మగౌరవానికి దెబ్బ తగల్లేదా? ఇందిరా గాంధీ కూడా తన పార్టీ నాయకులతో అలాగే వ్యవహరించింది. అయితే ఎన్టీయార్ తన వాక్చాతుర్యంతో దాన్ని తెలుగువారిని అవమానించడం అనే కలర్ యిచ్చి ఓట్లు దండుకున్నారు.
ఇందిరా గాంధీ ముఖ్యమంత్రులను తరచుగా ఎందుకు మార్చేది అన్న విషయం కాస్త ఆలోచించి చూడండి. నెహ్రూ కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా హేమాహేమీలు వుండేవారు. వారిలో కొందరు నెహ్రూను ధిక్కరించ గలిగే శక్తి కలిగి వుండేవారు. 1965 తర్వాత కేంద్రప్రభుత్వం బలహీనపడసాగింది. రాష్ట్రాలు ఎక్కువ అధికారాలు అడగసాగాయి. ఇందిర 1966 లో ప్రధాని అయ్యాక అదే పరిస్థితి కొంతకాలం కొనసాగింది. ఆ తర్వాత ఆమె దేశంలో తను తప్ప వేరే ఏ నాయకుడూ బలంగా వుండకూడదన్న పథకం వేసి అమలు చేయసాగింది. బలమైన రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వున్న వర్గాన్ని ప్రోత్సహించి, ముఖ్యమంత్రులను బలహీనపరిచేది. ప్రతి రాష్ట్రంలో ఒక్కో కులం రాజకీయంగా బలంగా వుండడం చూసి, వారి ప్రాబల్యం తగ్గించడానికి వేరే కులాల వారిని పట్టుకుని వచ్చి ముఖ్యమంత్రులను చేసేది. దానితో బాటే అతని అసమ్మతి వర్గాన్ని దువ్వుతూ వుండేది. స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో బ్రాహ్మణ నాయకులు పాల్గొన్నా, అప్పటి ప్రభుత్వాలకు నాయకత్వం వహించినా, స్వాతంత్య్రం వచ్చాక చాలా రాష్ట్రాలలో బ్రాహ్మణులు రాజకీయంగా బలహీనులుగా మారారు. ఇందిర తన హయాంలో వారిని ముఖ్యమంత్రులుగా చేసింది. బెంగాల్‌లో సిద్దార్థ శంకర్ రాయ్, (1972-77), ఉత్తరప్రదేశ్‌లో 1971-77 మధ్య కమలాపతి త్రిపాఠీ, ఎన్ డి బహుగుణ, ఎన్ డి తివారీ, – మధ్యప్రదేశ్‌లో 1969-77 మధ్య పిసి సేఠీ, ఎస్ సి శుక్లా, ఒడిశాలో 1972-77 మధ్య నందినీ శతపథీ, బినాయక్ ఆచార్య, గుజరాత్‌లో 1973 వరకు హితేంద్ర దేశాయ్, ఘన్‌శ్యామ్ ఓఝా, రాజస్థాన్‌లో 1973-77 మధ్య హర్‌దేవ్ జోషి..ఇలా బ్రాహ్మణ అభ్యర్థి దొరక్కపోతే కులబలం లేనివారిని పెట్టింది. బిహార్‌లో 1972-77 మధ్య కేదార్ పాండే, జగన్నాథ్ మిశ్రాలతో బాటు అబ్దుల్ గఫూర్ అనే ముస్లిమ్‌ని, కర్ణాటకలో 1972-77లో దేవరాజ్ అర్స్ అనే బిసిని, 1980లో గుండూరావు అనే బ్రాహ్మణున్ని పెట్టింది. వారి మీద ప్రేమ కారిపోతోందని అనుకోవడానికి లేదు. కులపరంగా రాజకీయరంగంలో బలహీనులై వుండడమే వారి క్వాలిఫికేషన్.
ఇందిర హయాంలో రాష్ట్రముఖ్యమంత్రులు
మన రాష్ట్రానికి వస్తే రాజకీయాల్లో రెడ్ల ప్రాబల్యం హెచ్చు. విశాలాంధ్ర ఉద్యమం నడిచే రోజుల్లోనే శ్రీశ్రీ రాశాడు – 'తెలుగు రాజ్యమేర్పడితేను, తొలి వజీరు రెడ్డి – తాగడానికి కుళ్లునీళ్లు, తినడానికి గడ్డి' అని. నిజానికి తెలుగు రాజ్యం ఏర్పడగానే ముఖ్యమంత్రి అయినది ప్రకాశం పంతులు. కానీ రెడ్డి రాజవుతాడని శ్రీశ్రీ ఎలా వూహించాడంటే – రాజకీయాల్లో వుండదలచినవాడికి సాహసంతో బాటు జూదరి మనస్తత్వం వుండాలి. నెగ్గినా ఓడినా ఫర్వాలేదన్నట్లు వుండాలి. నెగ్గినపుడు పదిమందిని చేరదీయాలి. ఓడినపుడు సైతం అనుచరులను పోషించాలి. వేరే వృత్తి చేసుకుంటూ మధ్యలో యిటువైపు చూద్దామంటే లాభం లేదు. ఇదే పూర్తి వ్యాపకంగా వుండాలి. తనపై తనకు పూర్తి నమ్మకం వుండి, కార్యకర్తల్లో హుషారు నింపుతూ వుండాలి. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు యిది రెడ్లలో పుష్కలం. అందుకే ఏ పార్టీ అభ్యర్థులను చూసినా వాళ్లే బహుళంగా కనబడుతున్నారు.
'జనాభా లెక్కల ప్రకారం 3% వున్నాం. అయినా ఎమ్మేల్యేల సంఖ్యలో మా శాతం 0.3 కూడా లేదు' అని కులసంఘాల సమావేశాలు పెట్టి వాపోతారు కొందరు కులస్తులు. తమలో రిస్కు తీసుకునే లక్షణాలు ఏ మేఱకు వున్నాయో ఆత్మావలోకనం చేసుకుంటే యీ ఏడుపు వుండదు. ఇందిరా గాంధీ ప్రధాని అయిన కొత్తల్లో మన రాష్ట్రానికి వచ్చినపుడు బ్రహ్మానందరెడ్డి తన కాబినెట్ సహచరులను పరిచయం చేస్తూ వుంటే '…రెడ్డి' పదం పదేపదే వినబడి అప్పుడే తీర్మానించుకుందట – వీళ్లను కట్టడి చేయాల్రా అని. అందుకని తెలంగాణ ఉద్యమం కారణంగా బ్రహ్మానందరెడ్డిని దింపే అవకాశం రాగానే బ్రాహ్మణుడైన పివిని గద్దె నెక్కించింది. ఆయన వుండగా ఆంధ్రోద్యమం వచ్చింది. నిభాయించుకోలేక పోయాడు. దింపేయాల్సి వచ్చింది. రాష్ట్రపతి పాలన తర్వాత మళ్లీ రెడ్డిని ఎక్కించకుండా వెలమ కులస్తుడైన వెంగళరావుకి అవకాశం యిచ్చింది. ఆయన సమర్థవంతంగా పాలించాడు కాబట్టి ఐదేళ్లపాటు కదల్చకుండా వుంచింది. 'అంటే అప్పుడు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిందన్నమాట!?!'
1978లో నుండి 1983లోపున నలుగుర్ని మార్చింది – చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రామ్, విజయభాస్కరరెడ్డి. వీళ్లందరూ రెడ్లే. (అంజయ్య బిసి అని అనుకునే వారు కానీ, ఆయన గద్దె నెక్కగానే చెప్పుకున్నాడు – తను రెడ్డే అని. వెంకట్రామ్ 'రెడ్డి' అని తగిలించుకోలేదు) మళ్లీ రెడ్లు ఎందుకు వచ్చారంటే 1977లో ఇందిర కేంద్రంలో ఓడిపోయాక ప్రముఖ నాయకులందరూ ఆమెను విడిచిపెట్టేశారు. 1978లో ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసేటప్పుడు చెన్నారెడ్డి ఒక్కరే ఆమె పార్టీలో – కాంగ్రెస్ (ఐ) – లో చేరారు. ఆయనను దింపేసిన తర్వాత అంజయ్య, భవనం యిద్దరూ పొలిటికల్ లైట్‌వెయిట్స్. విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఆయన కంటూ పెద్ద వర్గం లేదు. మంత్రిగా చేసినా, కర్నూలు జిల్లాలో మాత్రమే ఆయన పలుకుబడి వుండేది. ఇదంతా ఎందుకు చెప్పానంటే – తన మాట వినే బలహీనులకోసం వెతుకుతారు తప్ప పనికట్టుకుని జాతిని అవమానించడానికి ముఖ్యమంత్రులను మార్చరు. అయినా మార్చడానికి కారణభూతులెవరు? ఆ పార్టీలో, ఆ కాబినెట్‌లో వున్న సహచరులే కదా ఢిల్లీకి వెళ్లి ముఖ్యమంత్రిపై చాడీలు చెప్పి మార్పించేది! అప్పుడు తెలుగుతనం గుర్తుకు రాదా? మొన్నటికి మొన్న చూశాం – రోశయ్యను ఎలా మార్చారో! కిరణ్ ఢిల్లీలో ఎవర్నో పట్టుకుని పని చేయించుకున్నారు. రోశయ్యగారికి ఆఖరి నిమిషం దాకా తెలియను కూడా తెలియలేదు. మరి కిరణ్ దిగిపోగానే ఎంతమంది ఢిల్లీకి ప్రయాణం పెట్టుకుని పైరవీలు చేసుకోలేదా? ఆప్పుడేమైంది యీ ఆత్మగౌరవం కబుర్లు!
ఎయిర్‌పోర్టులో అంజయ్యగారికి అక్షింతలు
ఇక అంజయ్యగారి ఉదంతానికి వద్దాం. రాజీవ్ గాంధీ ఏదో పని గట్టుకుని అంజయ్యగారిని, తద్వారా తెలుగువారిని అవమానించినట్టుగా కలరింగు యిస్తున్నారు. ముందుగా ఒక విషయం మనం గ్రహించాలి. ఈ నాయకుల్లో చాలామంది తమ కంటె పెద్ద నాయకుడు కనబడగానే పాదాభివందనాలు మొదలెట్టేస్తారు. అలవాటు లేనివాడికి కూడా అలవాటు చేసేస్తారు. కొన్ని పార్టీల్లో యిది మరీ దారుణంగా కనబడుతుంది. ద్రవిడ పార్టీల్లో ఏకంగా సాష్టాంగాలే! కాంగ్రెసు పార్టీలో ఇందిర శకం నుండి వంగివంగి దణ్ణాలు పెట్టడం ఎక్కువైంది. ఎమర్జన్సీ టైములో సంజయ్ గాంధీని ఇందిర వారసుడిగా ప్రొజెక్టు చేసే రోజుల్లో అతని చెప్పులు మోయడానికి కూడా సీనియర్ కాంగ్రెసు నాయకులు వెనకాడలేదు. యుపి ముఖ్యమంత్రిగా వున్న ఎన్ డి తివారీ సంజయ్ చెప్పులు మర్చిపోతే పట్టుకుని వచ్చారు. తెలుగు నాయకుల్లో సీనియర్ కేంద్రమంత్రిగా వున్న కొత్త రఘురామయ్యగారు గారు అదే పని చేశారు. 1978 ఎన్నికల్లో 'సంజయ్ గాంధీ చెప్పులు మోసిన రఘురామయ్య' అని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తే 'తప్పేముంది, అతను నాకు కొడుకు లాటివాడు' అని సమర్థించు కోబోయేడాయన.
తర్వాతి రోజుల్లో యీ చెప్పులు మోయడం మరీ ఎక్కువైంది. టీవీ కెమెరాలు రికార్డు చేస్తున్నాయని తెలిసినా నాయకులు మానడం లేదు. నన్నడిగితే మోయించుకున్నవాడి కంటె మోసేవాళ్లది తప్పంటాను. మన రాష్ట్రంలో ఒక దళితమంత్రికి అగ్రవర్ణ ఐయేయస్ అధికారులతో చెప్పులు తెప్పించుకోవడం సరదా అని విన్నాను. అది చూసి అగ్రవర్ణాలపై దళితులు హజం చూపుతున్నారు అనగలమా? అతడు మంత్రి కాకపోతే యీ అధికారి చెప్పులు మోసేవాడా? అలాగే టిక్కెట్ల కోసమో, నామినేటెడ్ పదవి కోసమో అనుచరులు తన కాళ్లు పట్టుకోవడానికి సిద్ధపడితే అది పార్టీ అధినేత తప్పా? అవి దక్కకపోతే బయటకు వెళ్లి తనను అమ్మనాబూతులు తిడతాడని కూడా అధినేతకు తెలుసు. ఇక్కడ ఆత్మగౌరవం కాపాడుకోవలసిన బాధ్యత ఛోటా నాయకుడిది!
అంజయ్య ఎపిసోడ్ జరిగేనాటికి రాజీవ్ ప్రధాని కాదు. ప్రధానిగారి కొడుకు. కాంగ్రెసు పార్టీలో జనరల్ సెక్రటరీయో ఏదో. అతను హైదరాబాదు వస్తే బేగంపేట విమానాశ్రయానికి ముఖ్యమంత్రిగా వున్న అంజయ్య అనుచరగణాన్ని వేసుకుని వెళ్లారు. విమానం ఆగుతూండగానే, ఆలస్యం చేస్తే రాజీవ్ కళ్లల్లో ఎక్కడ పడమేమోనని, భారీ కాయంతో, భారీ దండల్తో రన్‌వే పైకి, పరుగులు పెట్టుకుంటూ వెళ్లారు. వెనక్కాల బోల్డుమంది జనం. స్వతహాగా పైలట్ అయిన రాజీవ్‌కు విమానాశ్రయంలో యీ భద్రతారాహిత్యం ఒళ్లు మండించింది. ఆ పూలదండల రేకులు ప్రొపెల్లర్లలో పడితే ఏమవుతుందోనన్న ఆందోళనతో అంజయ్యను మందలించాడు. చెప్పడం ఘాటుగానే చెప్పాడు. అంజయ్యగారు మంచివాడే కానీ ఆయన రూపంకానీ, భాష కానీ ఏ మాత్రం సోఫిస్టికేటెడ్‌గా వుండదు. ఇందిరకు విధేయుడన్న కారణంగానే పదవి దక్కిందని, ఆయనమీద అనేక జోకులు వున్నాయనీ రాజీవ్‌కు తెలుసు. అందుకుని దురుసుగానే మందలించాడు. దానికి అంజయ్య మొహం మాడ్చుకున్నారు తప్ప నిరసన తెలపలేదు. తను చేసినది ఎయిర్‌పోర్టు రూల్సుకు వ్యతిరేకమని ఆయనకు తెలుసు. ఈ వార్త పత్రికలకు ఎక్కాక ఎవ్వరూ అంజయ్యగారిని సమర్థించలేదు. రాజీవ్ కాస్త మెత్తగా చెప్పి వుండాల్సిందనే అనుకున్నారంతే. అయినా అతను రాజకీయాలకు, ఆర్భాటాలకు కొత్త. రాజీవ్ హత్యపై కార్తికేయన్ రాసిన పుస్తకంలో బెంగుళూరు పర్యటనలో రాజీవ్ తన బట్టలు తనే ఎలా వుతుక్కున్నారో వుంది. రాజకీయాలకు వచ్చి కొన్నాళ్లయ్యాక వందిమాగధులు పొగడ్తలతో అహంకారాన్ని పెంచి అగడ్తల్లో తోశారు. అంజయ్య ఉదంతం టైముకి రాజీవ్ యింకా ముదిరిపోలేదు. కాంగ్రెసు తెలుగువారిని ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసింది అని ఆనాడు ఎన్టీయార్, యిప్పుడు మోదీ ప్రచారం చేసుకోవడానికి మాత్రమే పనికి వచ్చింది.
విభజన విషయంలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదా?
ఎప్పుడో జరిగిన అంజయ్యగారి సంగతి వదిలేయండి. ఇప్పుడేం జరుగుతోంది? విభజన తీరుపై మనల్ని సంప్రదించకుండానే రాష్ట్రాన్ని విడగొట్టారు. సీమాంధ్రులను సంగతి సరే, విభజన కోరిన తెలంగాణ ఉద్యమనాయకులను కూడా ఎలా చేద్దాం అని అడగలేదు. అసలు వాళ్ల ప్రమేయమే లేదని జైరాం రమేశ్ చెప్తున్నారు. ఢిల్లీలోనే కూర్చుని అన్నీ తేల్చేశారు. వివాదాస్పద విషయాలైన ఉద్యోగుల ఆప్షన్లు, కొత్త రాజధాని ఎంపిక, పోలవరం ముంపు గ్రామాల ఆర్డినెన్సు, ఆస్తుల అప్పుల పంపకాలు… యిలాటివి రెండు రాష్ట్రాలూ కూర్చుని తేల్చుకోవాలిట. అంటే బ్రిటిషువారు స్వాతంత్య్రం యిస్తూనే సంస్థానాధీశులతో మన పిలకలు ముడివేసినట్లు ఢిల్లీవాళ్లూ యిప్పుడు చేశారన్నమాట. సర్దార్ పటేల్ వున్నాడు కాబట్టి రాజుల పిలకలు కోసేసి భారతదేశంలో కలిపాడు. లేకపోతే యింకా తన్నుకుంటూనే వుండేవాళ్లం. కెసియార్ చెప్తున్నట్లు ఆంధ్ర-తెలంగాణ పంచాయితీ యిప్పట్లో తేలేది కాదు. ఇంత అధ్వాన్నంగా విభజన జరిగేలా చేసినందుకు మన ఆత్మగౌరవం దెబ్బ తినలేదా? మన నాయకులు ఏం చేశారు? మాలో మేం కూర్చుని మాట్లాడుకున్నాం, ఇలా చేస్తే సమన్యాయం, ఎవరికీ నొప్పి వుండదు అని చెప్పారా? మాలో మేం కలిసి కూర్చునే ముచ్చటే లేదు. మీరు తండ్రిలా, తాతలా, శకునిమా
మలా మధ్యస్తం చేయండి అని బతిమాలాడామా లేదా? ఒక్క పార్టీ అయినా సమన్యాయం యిది అని తేల్చిచెప్పిందా? రెండు ప్రాంతాల నాయకులను పంపడం, చెరో మాటా చెప్పించడం.. యిదే నాటకం కదా. ఇప్పుడు వాళ్లు అన్యాయం చేశారని వాపోవడం దేనికి? వాళ్లు తెలుగువాళ్ల చేత తెలుగువాళ్లను పార్లమెంటులో అడ్డు కొట్టించారు, కొట్టించారు. కాంగ్రెసు, టిడిపిలకు యీ విషయంలో వ్యత్యాసం లేదు. బిజెపి వాళ్లయితే కాంగ్రెసుతో కలిసి ద్రోహం చేశారు. ఇదంతా జరగనిచ్చినందుకు మనం సిగ్గుతో తలవంచుకోవలసిన పని లేదా? మన నాయకులందరికీ మాట్లాడితే ఢిల్లీ వెళ్లిరావడమే సరిపోయింది. అసలు వీళ్ల ట్రిప్పులతోనే మన ఉమ్మడి రాష్ట్రం అప్పులు పెరిగిపోయాయి. ఈ రోజు మన ఆత్మగౌరవం హరించబడిందని అనడానికి బిజెపి-టిడిపిలకు నోరెలా వస్తోంది?
పివిగారు తక్కువ తిన్నారా?
ఇక పివి గారి గురించి చెప్పాలంటే – ఆయన ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత, మరణానంతరం సోనియా ప్రవర్తన గురించి మాట్లాడుతున్నారు. పివి సోనియాకు ఏం చేశారో చెప్తున్నారా? ఆవిడ మొదట్లో రాజకీయాలకు దూరంగా వుందామనుకుంది. ఆ తర్వాత చెంచాలు రెచ్చగొట్టడంతో దిగుదామనుకుంది. అప్పుడు పివి ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టించి, ఆవిడను రంగంలోకి దిగకుండా చూశారు. ఇందిరా గాంధీ కుటుంబం రాజకీయాల్లోకి వస్తే వారసత్వపు రాజకీయాలు మళ్లీ వస్తాయని ఆయనకు తెలుసు. ఆయన తెలుగువాడు, పండితుడు అయితే కావచ్చు కానీ డర్టీ పాలిటిక్స్ ఆడడంలో ఎవరికీ తీసిపోడు. తెలుగువాడు కదాని ఎన్టీయార్ ఆయనకు పోటీ పెట్టకుండా వూరుకుంటే, ఆ కృతజ్ఞత లేకుండా తనకు అవసరమైనప్పుడు టిడిపి ఎంపీలను తనవైపు ఫిరాయింపచేసుకున్నాడు. విజయభాస్కరరెడ్డి తనపై కువ్యాఖ్యలు చేశారని విని, తన సమక్షంలో సభలో చెప్పులు వేయించినది పివియేనని యిప్పుడు అందరికీ విదితమే. 1996 ఎన్నికలలో కాంగ్రెసు గెలిచి, ఆయన మళ్లీ ప్రధాని అయి వుంటే సోనియాను రాజకీయంగా సమాధి చేసి వుండేవాడేమో! సరే, పివికి అవమానం జరిగింది. పివి ఉపకారం పొందిన తెలుగు కాంగ్రెసు నాయకులు తిరగబడ్డారా? ఎయిర్‌పోర్టుకి రాజీవ్ పేరు పెడితే ఉద్యమాలు చేశారా? జై తెలంగాణ అంటూ వాహనాల నెంబరు ప్లేట్లపై ఎపి కొట్టేసి టిజి రాసినవాళ్లయినా, శంషాబాద్ ఎయిర్‌పోర్టు పేరు ఆర్‌జిఇఎ అవి వున్నచోట ఆర్‌జి తీసేసి పివి పెట్టలేకపోయారా?
ఇది కుటిల రాజకీయం. ఈరోజు సోనియాది పైచేయి. అందుకే కాంగ్రెసు పాలిత రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ఇందిర, రాజీవ్ పేర్లు. బిజెపి ప్రభుత్వాలైతే వేరే పేర్లు పెడతారు. రేపు పివి వారసులు ప్రధానులైతే రాజీవ్ పేర్లు మార్చేస్తారు. పివి మాట ఒక్కటే ఎత్తడం దేనికి? ఎన్టీయార్‌కి ఏం జరిగింది? బాబు వస్తూనే ఎన్టీయార్ స్మృతులు చెరిపేయాలని చూశారు. కావాలనుకుంటే ప్రధాని అయివుండేవాణ్ని అని ఆయనే చెప్పుకుంటారు కదా, తెలంగాణ రాకుండా ఆపారు కదా, ఎన్టీయార్‌కు భారతరత్న యిప్పించారా? పార్లమెంటులో విగ్రహం పెట్టించారా? తన పథకాలకు జన్మభూమి, వెలుగు, దీపం, రోశ్నీ, చేయూత, నీరు-మీరు, క్లీన్-గ్రీన్, … లాటి పేర్లు పెట్టారు తప్ప ఎన్టీయార్ పేరు, కనీసం 'అన్న' ఐనా, కలిసి వచ్చేట్లు పెట్టారా? ఎన్నికలలో దెబ్బ తిన్నాక మాత్రమే ఎన్టీయార్ పేరును ప్రాచుర్యంలోకి తెచ్చారు. పివి వలన ఉపకారం పొందిన కాంగ్రెసు వాళ్లు తక్కువే. ఎన్టీయార్ పేరు చెప్పుకునే టిడిపి నాయకులందరూ బతికారు. వారిలో ఒక్కరైనా బాబు ప్రవర్తనను ఖండించారా? లేదే! రేపు ఏ కారణం చేతనైనా ఎన్టీయార్ కుటుంబీకులు పార్టీని చేజిక్కించుకుంటే అప్పుడు ఖండిస్తారు. బాబు జ్ఞాపకాలను చెరిపేయడానికి చూస్తారు.
వ్యక్తి దగ్గర ఆపండి – జాతిని తీసుకురాకండి
ఈ రాజకీయాల్లో ఎక్కడుంది ఆత్మగౌరవం? అసలు జాతిగౌరవం నిలబెట్టడం అనేది కొందరు రాజకీయ నాయకుల చేతల్లో లేదు. ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం వుండాలి. దాన్ని అతను కాపాడుకోవాలి. అతన్ని పొగిడినా, తెగడినా దాన్ని అతని జాతికి ఆపాదించనవసరం లేదు. మోదీ నరహంతకుడు అని ఎవరైనా అంటే యావన్మంది గుజరాతీలను అవమానించినట్లు కాదు. గాడ్సే మహాత్మా గాంధీని చంపాడంటే మరాఠీ బ్రాహ్మలకు గుజరాతీ బనియాలంటే కోపం అని కాదు. అంజయ్య, పివిలకు జరిగిన అవమానం రాజకీయాల కారణంగా జరిగిందే తప్ప తెలుగు జాతికి సంబంధించినది కాదు. ఈ రోజు విభజనలో పాలుపంచుకున్న, వారిని సమర్థించిన, వారికి వ్యతిరేకంగా పోరాడకుండా వున్న – ఏ పార్టీకి ఆత్మగౌరవం గురించి మాట్లాడే హక్కు లేదు. సాటి తెలుగువాడితో కూర్చుని సంప్రదించుకోకుండా, ఢిల్లీలో లాబీయింగుతో పనులు కానిచ్చుకుందా మనుకునేవాళ్లకు గౌరవం ఎక్కణ్నుంచి, ఎలా వస్తుంది?
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2014)