అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్ కందా
చైతన్యానికి మారు పేరు మా అమ్మ
ఇంట్లో పనైనా, ఆఫీసు వ్యవహారమైనా, వృత్తిపరమైన ప్రాజెక్ట్స్ అమలు చేయడమైనా – అన్నీ 'కాంప్లిమెంటరీ టాస్క్‌స్'. అందరూ కలిసి పనిచేయవలసినదే. ఒకళ్లు ఒక పని చేస్తే మరొకరు దానికి అనుసంధానమైన పని చేస్తారు. ఒక ఆఫీసు నుండి ఒక ఉత్తరం బయటకు వెళ్లింది అంటే – ఒకరు రాస్తారు, మరొకరు సంతకం పెడతారు, ఇంకోరు టైపు చేస్తారు, మరొకరు దాన్ని మడతపెట్టి కవర్లో పెట్టి డిస్పాచ్ రిజిస్టరులో రాస్తే, యింకొకరు వెళ్లి పోస్టు చేస్తారు. ప్రాజెక్టులో టీమ్‌వర్క్ గురించి వేరే చెప్పనక్కరలేదు. మరి ఇంటి వ్యవహారాలలో టీమ్ వర్క్..?
పెళ్లయిన కొత్తల్లో భార్యాభర్తల బంధం కాంప్లిమెంటరీగా, యిద్దరి శక్తియుక్తులు కలబోసి ఏదైనా సాధించడంతో ప్రారంభమవుతుంది. ఒకరు చేసే పని మరొకరు చేయనక్కర లేకపోవడంతో సమయం ఆదా అవుతుంది. వైవాహిక బంధం గట్టిపడే కొద్దీ అది ఒక భ్రమలా తేలుతుంది. కలిసి చేయడమనేది ఒక పారడాక్స్‌గా, ఒక విరోధాభాసలా తేలుతుంది. అప్పుడు కూడా ఒకళ్లు చేసినది మరొకరు చేయరు. కానీ అవి రెండూ కలిపి ఒక పని.. టాస్క్ కాదు. ఎందుకంటే భర్త బజారు కెళ్దామంటే, భార్య సినిమాకి వెళతామంటుంది. బోనస్ డబ్బుతో ఫలానాది కొందామని ఒకరంటే, కాదు, మరొకటి చేద్దామని రెండోవారంటారు. రేపు ఆఫీసుకి తొందరగా వెళ్లాలి, తొమ్మిది గంటలకే పడుక్కుందామని భర్త అంటే, అలా ఎలా టీవీలో సీరియల్ చూడాలి అని భార్య అంటుంది. ఇలా కాంప్లిమెంటరీ ఎప్రోచ్‌గా ప్రారంభమైన మొగుడూపెళ్లాల బంధం కొంతకాలానికి మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్‌గా దిగజారుతుంది.
సమాంతర రేఖలు పక్కపక్కనే వుంటూ కలవకుండా అలా సాగిపోతూన్నట్టే భార్యాభర్తలూ కలిసి వుంటూనే ఎవరి జీవనం వారు సాగిస్తారు అని ఉపమానం చెపితే చాలా నెగటివ్‌గా తోస్తుంది. అసలు సమాంతర రేఖలు అంటే ఏమిటి? రెండుగీతలు కలుసుకోకుండా అలా సాగిపోతూ వుంటే వాటిని ప్యారలల్ లైన్స్ అంటాం. కానీ అది సాంకేతికంగా తప్పు. వాటి అసలు నిర్వచనం ఏమిటంటే – 'ఏదో ఒక బిందువు వద్ద కలిసేందుకు ఉద్దేశించిన గీతలే సమాంతర రేఖలు! జామెట్రీలో యిటువంటి పేరడాక్స్‌లు చాలా వస్తాయి వాటికి ఓవర్ కమింగ్ సొల్యూషన్సు కూడా చెప్పారు. చివరకు ఏం తేల్చారంటే 'సమాంతర రేఖలు తప్పకుండా కలుస్తాయి. ఎక్కడ?' 'ఇన్ఫినిటీ వద్ద.' ఎక్కడో అనంతంలో భార్యాభర్తల ఆలోచనలు, ఆచరణలు కలుస్తాయి. అప్పటిదాకా కలవనట్టే వుంటారు.
అది క్రమేపీ, థలవారీగా వస్తుంది. పెళ్లయిన కొత్తల్లో భార్యాభర్తా చేదోడువాదోడుగా వుంటాం అంటూ యిద్దరూ కలిసి పని చేస్తూ వుంటారు. కొంతకాలం పోయేసరికి 'నీకు యిది కావాలి కదా, నాకు అక్కరలేకపోయినా నీకు చేసి సాయపడతాను. నీ పని జరిగేట్టు చూస్తాను' అంటారు. అంటే ఉమ్మడి పని నుండి ఒక్కరి పనిగా మారిపోయిందన్నమాట. భాగస్వామ్యం లేదు, సహాయం మాత్రమే. మూడో థకు వచ్చేసరికి అవతలివాళ్లు ఏం చేస్తున్నారో పట్టించుకోకపోవడం. 'ఆయనదో/ఆవిడదో చాదస్తం. ఏదో చేసుకుంటూ వుంటారు. మనం వేలు పెడితే నచ్చదు. తనకు నచ్చినట్టే చేసుకోనివ్వండి.' అని నిర్లిప్తంగా వూరుకునే థ. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ వుంటారు. ఏం చేస్తున్నారు? ఎప్పటికి పూర్తవుతుంది? లాటి ప్రశ్నలు ఒకరిని మరొకరు అడగరు. నాలుగో థ అజ్ఞానపు థ. అవతలివాళ్లు ఏం చేస్తున్నారో తెలిసి ఊరుకోవడం కాదు అసలు తెలియాల్సిన అవసరంకూడా లేని స్టేజి అన్నమాట. తర్వాతి థ ప్రతిఘటించే థ. ఒకళ్లు చేద్దామనుకున్నది మరొకళ్లు వ్యతిరేకించడం. పనివాణ్ని ఏదో పనికి పిలిస్తే, వాణ్ని అవతలివాళ్లు అదే టైముకి యింకో పని చెప్పి బయటకు పంపించడం. ఏదో చేద్దామనుకుంటే – 'ఇది ఇప్పుడు నువ్వు చెయ్యాలా? ఇదే చెయ్యాలా? ఇప్పుడే చెయ్యాలా? అసలు చెయ్యడం మానేయకూడదా? పోనీ తర్వాత చేస్తే నష్టం ఏమిటి?' వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటే తప్ప పని జరగని పరిస్థితి వస్తుంది.
తమాషా ఏమిటంటే యీ మార్పు నెమ్మదినెమ్మదిగా వస్తుంది. ఒక యిరవై ఏళ్ల ముందు నాటి సంఘటన, యిరవై ఏళ్ల తర్వాతి సంఘటన పక్కపక్కనే పెట్టి మధ్యవన్నీ మర్చిపోయి చూసుకుంటే తప్ప యింత మార్పు వచ్చినట్టు మనకి తెలియదు. ఎందుకంటే యీ మార్పు ఒక్కసారిగా, హింసాయుత విప్లవంలా రాదు. చాపకింద నీరులా వస్తుంది. ఇద్దరు వ్యక్తులు శాంతియుతంగా ప్రతిఘటించుకుంటూనే గడిపేస్తారు. ఒకరితో కలిసి మరొకరు హాయిగా బతకలేరు, అలా అని విడిపోయీ హాయిగా వుండలేరు. అందుకే మనందరం సంసారాలు సాగించేస్తున్నాం.
ఇదంతా సరదాగానే చెప్పినా, వీటిలో కొన్నయినా వాస్తవాలున్నాయని మా తరం వారిలో చాలామంది అంగీకరిస్తారు. మన ముందు తరం వాళ్ల వైవాహిక జీవితం ఎలా వుండేది? మా అమ్మానాన్నల సంగతే చూదాం.
xxxxxx
మా అమ్మ చాలా విశేషమైన వ్యక్తి అని చెప్పుకోవడానికి నేనే మాత్రం సంకోచించను. ప్రతీ వ్యక్తికీ వాళ్ల అమ్మ గురించి యిలాటి అభిప్రాయమే వుండవచ్చు. అయినా మా అమ్మకు వచ్చిన అవకాశాలు, వాటిని ఆవిడ వినియోగించుకున్న విధానమూ ప్రత్యేకమైనవే.
ఆవిడ తండ్రి కాకినాడలో ఆ రోజుల్లోనే నెలకి ముప్ఫయి, నలభై వేలు సంపాదించేవారని చెప్తుంటారు. కాంగ్రెసువాది. మున్సిపల్ ఛైర్మన్‌గా, తర్వాత ఎమ్.ఎల్.సిగా చేశారు. ఆవిడ బాల్యమంతా అల్లారుముద్దుగా, చాలా దర్జాగా గడిచింది. అలా పెరిగిన అమ్మాయిని పదకొండో ఏట 1917లో పెళ్లి చేసి యింకో మూడు నాలుగేళ్లకి కాపురానికి పంపారు. పెళ్లి సమయానికి మా నాన్నగారికి పదిహేడేళ్లు. ఆయన తిక్కమనిషి. కాపురానికి వచ్చేపాటికి బి.ఎల్. చదవడానికి ముందరి చదువైన ఎఫ్.ఎల్. చదివేవారుట. చాపమీద కూర్చుని చదువుకుంటూ వుంటే అమ్మ వచ్చి పక్కన కాఫీ పెట్టి 'ఏమండి కాఫీ!' అంటే 'నా చదువుకు అడ్డువచ్చావ్' అంటూ చర్రుమని లేచేవారట. అలా అంటున్నారని చెప్పకుండా వూరుకుంటే కాస్సేపు పోయాక చూసి ''చల్లారిపోయింది. ఎందుకూ, నాకీ ఈ వెధవ కాఫీ..' అని తీసి విసిరేసేవారట. అయినా ఆయన నైజం, అవసరాలు గమనించుకుంటూ అమ్మ ఎలా సర్దుకు పోగలిగిందో, సర్దుకు పోయింది. మా నాన్నగారిని గొప్పగా పెంచింది ఎవరు అంటే మా అమ్మే అని చెప్పుకోవాలి. ఆయన్ను పూర్తిగా తీర్చిదిద్ది, ఆయన వ్యక్తిత్వాన్నీ, ఆయనలో దాగి వున్న శక్తిని వెలికి తెచ్చిందని చెప్పినా అతిశయోక్తి కాదు. ఎందుకంటే చైతన్యానికి మారు పేరు మా అమ్మ. సాక్షాత్తూ శక్తి స్వరూపిణి. దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారికి తను కుడిభుజం. ఆంధ్ర మహిళా సభ ఆవిర్భావంలో మా అమ్మ గణనీయమైన పాత్ర వహించింది. మా అమ్మ లేనిదే దుర్గాబాయి పిన్ని ఏ వేదిక మీద జ్యోతిప్రజ్వలన చేయలేదని చెప్పుకుంటారు.
దుర్గాబాయి గారిదీ కాకినాడే. మా అమ్మ కంటె రెండేళ్లు చిన్నది. ఇద్దరి పెళ్లిళ్లు యించుమించు ఒకేసారి జరిగాయి. గాంధీగారు హిందీ భాషా వ్యాప్తి చేయమన్నారని వీళ్లిద్దరూ కలిసి 1920లో నలుగురు విద్యార్థినులతో బాలికా హిందీ పాఠశాల పెట్టారు. తెలుగు, హిందీ పాఠాలతో బాటు పాటలు, పద్యాలు, నాటికలు, కోలాటాలు, ముగ్గులు, దేశభక్తి గేయాలు అన్నీ నేర్పించేవారు. క్రమంగా అది విస్తరించింది. 1923లో కాకినాడలో అఖిల భారత కాంగ్రెసు మహాసభలు జరిగినపుడు ఉత్తర హిందూదేశం నుండి వచ్చిన నాయకులకు హిందీ తెలిసిన 600 మంది స్త్రీ వాలంటీర్లను తయారుచేసిందీ పాఠశాల. దుర్గాబాయిగారి భర్త 1929లో అనారోగ్యం పాలవడంతో ఆయన వైద్యం కోసం మద్రాసు వచ్చి కాపురం పెట్టింది. నాన్నగారు అప్పటికే అక్కడ వకీలుగా ప్రాక్టీసు చేస్తుండడంతో అమ్మతో కలిసి కార్యకలాపాలు చేపట్టడం మళ్లీ జరిగింది. భర్త చికిత్స కోసం వచ్చినా దుర్గాబాయమ్మ మద్రాసులో ఉప్పు సత్యాగ్రహంలో చురుగ్గా పాల్గొన్నారు, జైలుకి వెళ్లారు, విద్యాభ్యాసం కొనసాగించారు. 1938 నాటికి మద్రాసులో ఆంధ్ర మహిళాసభకు అంకురార్పణ జరిగింది. దాని స్థాపనలో, వ్యాప్తిలో అమ్మ కూడా ముఖ్యభూమిక వహించింది. అది ఎందరో మహిళలకు ఆలంబన కల్పించింది. 1942లో సొంత భవన నిర్మాణం ప్రారంభమైంది. 1945లో గాంధీజీ దక్షిణభారత హిందీ ప్రచారసభవారి స్నాతకోత్సవానికి రావడం జరిగింది. అప్పుడు ఆంధ్ర మహిళా సభ భవనం శిలాఫలకాలను ఆయన చేత ఆవిష్కరింప చేశారు. అప్పుడే చంటిపిల్లవాడిగా వున్న నన్ను గాంధీ ఆశీర్వదించడం, నాకు మోహన్‌దాస్ అని పేరు పెట్టడం జరిగాయి.
ఈనాడు ఆంధ్ర మహిళా సభ మద్రాసులోనే కాదు, హైదరాబాదులో కూడా ఎంత బాగా విస్తరించిందో వేరే చెప్పనక్కరలేదు. మా అమ్మ వంటి అనేకమంది కృషి ఫలితం అది. ఈనాడు నా భార్య ఉష కూడా హైదరాబాదు ఆంధ్ర మహిళా సభలో వైస్ ప్రెసిడెంట్ కాగా మా వియ్యపురాలు శ్రీమతి ఈయున్ని లక్ష్మి గారు ప్రెసిడెంట్! సమాజసేవలో భాగంగా అనేకమంది కాంగ్రెసు వారితో అమ్మకు పరిచయాలు, స్నేహాలు ఏర్పడ్డాయి. ఎన్నో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది. సంస్థాపరంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా ఎవరైనా వచ్చి సహాయం అర్థిస్తే వెంటనే బయలుదేరి సాయం చేసేది. ఆవిడతో పరిచయం వున్నవాళ్లందరూ ఆవిడ 'డైనమిజం'ను యిప్పటికీ గుర్తు పెట్టుకుంటారు.
దుర్గాబాయి పిన్ని లాగే మా అమ్మకు ధైర్యం, చొరవ ఎక్కువ. మా మేనల్లుడు సీతారాం యేచూరి చదువుకునే రోజుల్లో కమ్యూనిస్టు సంస్థల్లో చురుకుగా తిరుగుతున్నపుడు పుచ్చలపల్లి సుందరయ్యగారి వద్దకు వెళ్లి ''ఏమండీ, మీకు మా మనుమడు తప్ప వేరెవరూ దొరకలేదా?'' అని అడిగింది. ఆయన చాలా గడుసుగా ''మీ మనుమడి లాటి చాకులాటి కుర్రాణ్ని ఎవరినైనా అప్పగించి, మీ వాణ్ని తీసుకుపోండమ్మా'' అని జవాబిచ్చారు. మనుమణ్ని మెచ్చుకున్నందుకు సంతోషించాలో, తన మాట విననందుకు బాధపడాలో తెలియలేదావిడకు. తర్వాత పివి నరసింహారావు గారి వద్దకు వెళ్లి ''మా మనుమడు రాజకీయాల్లో, అదీ కమ్యూనిస్టు రాజకీయాల్లో పడి తిరుగుతున్నాడండి. మీరైనా కాస్త చెప్పండి.'' అంది. ''కమ్యూనిస్టయినా, కాంగ్రెసయినా మీ వాడి లాటి చదువుకున్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలమ్మా. మీరేమీ బాధపడకండి.'' అంటూ ఆయన ఓదార్చారు.
xxxxxx
ఇలా రాజకీయాల్లో, సంఘసేవలో పడి తిరిగేది కాబట్టి యిల్లు సంగతి పట్టించుకో లేదనుకోనక్కరలేదు. పాతకాలం వంటకాల నుండి కొత్త తరహా వంటల దాకా అన్నీ చేసేది. మాకు ఎన్ని రకాల రుచులు మప్పిందో చెప్పలేను. పొన్నగంటికూర పప్పు, అరటిదూట పెరుగు పచ్చడి.. యిలాటి తెలుగింటి ఆధరవుల సంగతి సరే, శాండ్‌విచిస్, మాల్ట్, జామ్స్ అన్నీ చేసేది. మార్కెట్లో లభించే లేటెస్ట్ బిస్కెట్స్, చాక్‌లెట్లు అన్నీ యింట్లో వుండేవి. నాకు పదహారేళ్ల వయసొచ్చేటప్పటికి నేను రుచి చూడని కూరగాని, తినుబండారంగానీ లేదని చెప్తే అతిశయోక్తి కాదు. ఇంట్లో రకరకాల పిండివంటలు, కూరగాయలు, పచ్చళ్లు ఎప్పుడూ వుండేవి. ఆరోగ్యానికి మంచివని ఉసిరి, వెల్లుల్లి, నీరుల్లి బాగా వాడేది. వాటివల్ల చాలా మంచి జరిగిందని నాకు యిప్పటికీ గట్టి నమ్మకం.
రుచులతో బాటు అభిరుచులు కూడా మప్పిందని చెప్పాను కదా. మా అక్కకు డాన్సు, నాకు నటన. ప్రోత్సహించేది, ఒక వయసు రాగానే యిక చాలు, చదువుకో అనేది. ఇక ఆవిడ సాహిత్యాభిరుచి, తెలివితేటలు అమోఘం. పూర్తిగా మూడోక్లాసు కూడా పాసైందోలేదో, నోరు తిప్పుకోకుండా రుక్మిణి కళ్యాణమంతా చెప్పేసేది – ఎక్కడా తడబడకుండా. లలితసహస్రనామం లాటివన్నీ చదివేసేది, వాటికి అర్థాలు చెప్పేది. సమయస్ఫూర్తితో ఎన్నో రకాల సామెతలు వాడేది. సాధారణంగా అందరూ వాడేవి కావు. ఇక పోలికలు భలేగా చెప్పేది. మన చేత ఏదైనా చెడు అలవాటు మాన్పాలంటే 'ఆ చొక్కా బొత్తాలు ఎగుడూదిగుడూ పెట్టుకోవడమేమిటి, ఫలానా సుబ్బారావు లాగ..' అని వెక్కిరించేది. అతను గుర్తుకొచ్చి, సిగ్గుపడి మళ్లీ జన్మలో అలాటిది చేయమన్నమాట.
మరి మా అమ్మ వంట ప్రావీణ్యాన్ని మా నాన్నగారు ఎలా ఎంజాయ్ చేసేవారా అన్న కుతూహలం మీకు కలగవచ్చు. అదీ చెప్తాను. ఆయనదంతా ఒక కంప్యూటరైజ్‌డ్ ప్రోగ్రాంలా పద్ధతి ప్రకారం జరిగిపోవాలి. పొద్దున్నే సరిగ్గా తొమ్మిదిన్నరకి భోజనం అంటే తొమ్మిదిన్నరకే! ప్రాక్టీసు చేసే రోజుల్లో నైనా, రిటైరయినా, ఏదైనా శుభకార్యం కోసం వేరే వాళ్ల యింటికి వెళ్లినా, వేరే వూరు వెళ్లినా ఆ సమయానికి ఆ కార్యక్రమం జరిగిపోవాలి. ఆ అధ్యాయం పూర్తయ్యాకనే తక్కిన పనులన్నమాట. ఆ కార్యక్రమం సవ్యంగా జరిగేట్టు చూడవలసిన బాధ్యత మా అమ్మది.
ఒక రోజు ఆయనకు వేళకు భోజనం పెడుతోంది. డైనింగ్ టేబుల్ వద్ద నాన్నగారు కూర్చుని వుండగా కంచంలో ఆయనకి శాకపాకాలన్నీ వడ్డించింది. అన్నం తీసుకురావడానికి లోపలకి వెళ్లింది. ముందే తెచ్చేస్తే చల్లారిపోతే తినరు కదా, అందుకని ఆఖర్న తీసుకువస్తోందన్నమాట. అంతలో ఫోన్ వచ్చింది. మా నాన్నగారు అంతకుముందు అడిగిన సమాచారం చెప్పడానికి ఓ డాక్టరుగారు ఫోన్ చేశారు. అమ్మ ఫోన్‌లో మాట్లాడడానికి సరిగ్గా మూడు నిమిషాలు పట్టింది. ఫోన్ పెట్టేసి అన్నం పట్టుకుని డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చేసరికి ఏముంది? కంచంలో వున్న పప్పు, కూర, పచ్చడి, ఆవకాయ అన్నీ తినేశారు. ''అదేమిటండీ, అన్నం లేకుండా ఎలా తిన్నారండీ?'' అని అడిగింది అమ్మ నిర్ఘాంతపోతూ. ''ఏమో యివే చేశావనుకున్నా..'' అన్నారాయన!
మా అమ్మ ఎంత ధైర్యవంతురాలో ఆయనకు అంత కంగారు. ఆయన బెదిరిపోతారని ఆయనకు తెలియకుండానే పనులు చక్కబెట్టేసేది. మా అక్కకు పద్దెనిమిదో ఏట అపెండిసైటిస్ అపరేషన్ జరిగింది. అన్నీ అమ్మే చూసుకుంది. మా నాన్నగారు కోర్టు నుంచి వెనక్కి వస్తూ అనుకోకుండా హాస్పటల్‌కి వెళ్లారు. అసలు ఆయన్నెప్పుడూ ఎవరూ హాస్పిటల్ దగ్గరికి వెళ్లనిచ్చేవారు కాదు. అవేళ ఎందుకో అలా జరిగింది. మా అక్కయ్యకి ఆపరేషన్ పూర్తయి క్లోరోఫామ్ మత్తులోంచి బయటకి వస్తోంది. మామూలువాళ్లకే ఆ పరిస్థితుల్లో పేషంట్‌ను చూస్తే బాధ వేస్తుంది. ఇక మా నాన్నగారైతే మరీనూ. తనను చూసి నెత్తి బాదుకుని 'ఖర్మ! ఖర్మ! ఖర్మ! మనకే అవ్వాలా ఇటువంటివన్నీ' అని మహా బాధపడిపోయారు. అనవసరంగా ఈయన్నెందుకు రానిచ్చారిక్కడికి అని తక్కినవాళ్లూ నుదురు బాదుకున్నారు.
ఇలాటాయనతో ఏ యిల్లాలికైనా వేగడం కష్టమే కదా! మా మావయ్యలు మా అమ్మను ఏడిపిస్తూండేవారు. మద్రాసులో మా నాన్నగారు మా అమ్మని కాకినాడ ట్రెయిన్ ఎక్కిస్తున్నారు ఒకసారి. మా గాంధీ మామయ్య ఊరికే సరదాగా మా అమ్మతో ''ఒసేయ్! ఇలాటి అడవి మనిషిని ఎన్నాళ్లు భరిస్తావ్? కాకినాడ వెళ్లి మళ్లీ వెనక్కి రాకు. హాయిగా కాకినాడలో వుండిపోదువుకాని.'' అన్నాడట. అది ఛలోక్తి అని తెలిసినా మా నాన్నగారికి ఆ రైల్వేస్టేషన్‌లోనే కళ్లలో నీళ్లు తిరిగాయి. అమ్మ వెనక్కి రాదన్న ఆలోచనే ఆయనకు భయంకరంగా తోచింది. అంత అటాచ్‌మెంట్ వుండేది వాళ్లిద్దరికి.
మళ్లీ అలా అని హాస్యాలాడకుండా వూరుకునేవారా? మా అమ్మ పుట్టింటివారైన చావలివారిపై చచ్చేటన్ని జోకులు వేసేవారు. కందావారికీ, చావలివారికీ ఎప్పణ్నుంచో యిచ్చిపుచ్చుకోవడాలున్నాయి. బావాబావమరదుల మధ్య పరాచికాలు ప్రతి కుటుంబంలోనూ వుండేవి. ఇక్కడ చనువుతో, హుషారుతో, అప్పుడప్పుడు శ్రుతి మించుతూ వుండేవి. మా సీతారాం ఒడుగులో మా అబ్బాయి మావయ్య ఒక చోట కూర్చుని కాస్సేపటికి లేచి వెళిపోతూ 'అబ్బబ్బ చచ్చిపోతున్నానురా ఇటువెళితే ఆ సమిధల పొగ, అటువెళితే కందా అప్పారావు (మా బాబయ్య)! ఎటు వెళ్లాలో తెలియక ఛస్తున్నా' అని జోకు పేల్చాడు.
మా పితామహుడు విశ్వనాథంగారు కూడా చావలివారి మీద చాలా జోకులు వేసేవారు. తన వియ్యంకుడు అంటే మా తాతగారు చావలి రామచంద్రంగారు పోయినపుడు ధర్మోదకాల కోసం కాకినాడకు వచ్చారు. ఉప్పుటేరులో మునిగి లేచి 'అబ్బ, కొంచెం ఉప్పు ఎక్కువేసారురా' అన్నారు – వియ్యాలవారి తప్పు ఎంచినట్లు! సందర్భం ఎలాటిదైనా హాస్యానికి అనర్హం కాదని ఆయన నమ్మకం.
వెంటనే మా అబ్బాయి మామయ్య తగులుకున్నాడు. 'కొంతకాలం క్రితం వీళ్ల సందు మొదట్లో ఊళ్లో పెద్దవాళ్లందరు చందాలు వేసుకుని వంతులుగా వంతులుగా వాలంటీర్లను రాత్రింబవళ్లు ఏర్పాటు చేసి పెట్టేవారు. వాళ్ల పని ఏమిటంటే – ఎవరైనా పెద్దమనుషులు వస్తూంటే 'అయ్యా అటు వెళితే కందావారి ఇల్లుంది తర్వాత మీ యిష్టం. మీకు చెప్పాల్సిన కర్తవ్యం మాకు వుంది' అని చెప్పడం!' అని యింకోరికి చెప్పి మా తాతగారికేసి తిరిగి 'ఏమండీ, పెద్దవారు, మీరు గుండె మీద చెయ్యేసుకుని ఒట్టేసి యీ విషయం నిజమో కాదో చెప్పండి' అన్నాడు. అలా వుండేది వాళ్ల పరాచికాలు.
మా అమ్మానాన్నలది నిజంగా వింతైన జంట. వాళ్ల వైవాహిక జీవితం 61 సంవత్సరాలు సాగింది. 1977లో వాళ్ల డైమండ్ వెడ్డింగ్ యానివర్శరీ చేశాం. రిటైరయ్యాక నాన్నగారు, అమ్మ హైదరాబాదులోనే వుండేవారం. నేనూ, మా అన్నయ్య, మా అక్కా వేర్వేరు వూళ్లల్లో వుండేవాళ్లం. నా క్లాసుమేటు, ఆప్తమిత్రుడు భుజంగరావు వాళ్లకు మూడో కొడుకు అయిపోయాడు. వాడు కూడా నాన్నగారు, అమ్మా అంటూ వాళ్ల బాగోగులు చూసుకునేవాడు. సినిమాలకు తీసుకెళ్లేవాడు. మా నాన్నగారు వాడిమీద ఎన్ని జోకులు వేసినా నవ్వుతూ కంపెనీ యిచ్చేవాడు. చరమథలో మేం దగ్గర లేని లోటు తీర్చిన వాడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పగలం చెప్పండి. మా అమ్మానాన్నలకు యిద్దరికీ సినిమాలంటే సరదా వుండేది. మా అమ్మకి సినిమాలో హీరోహీరోయిన్లు చందమామను చూస్తూ పాడే పాటలంటే మహా యిష్టం. హిందీ సినిమాలు పెద్దగా అర్థం కాకపోయినా అప్పుడు కాలేజీలో చదువుతూండే మా మేనల్లుడు సీతారాంను వెంటబెట్టుకుని వెళ్లి కథ చెప్పించుకునేది. జీవితంలోని అన్ని పార్శ్వాలనూ పరిపూర్ణంగా అనుభవించి, ఆనందించిన సఫలజీవితం ఆవిడది.
మా అక్క కూడా మా అమ్మలాగే సంఘసేవకురాలు. మహిళా ఉద్యమంలో పాలు పంచుకుంది. ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమైన పదవుల్లో పనిచేసింది. తను పోస్టు గ్రాజువేట్. 80 ఏళ్లు దాటినా యిప్పటికీ చురుగ్గా సాంఘిక కార్యకలాపాల్లో చురుగ్గా వుంటుంది. తనకు యిద్దరు కొడుకులు – శంకర్, సీతారాం. శంకర్ భార్య అరుణ. సీతారాం భార్య సీమ చిష్తీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎడిటోరియల్ బోర్డులో పని చేస్తుంది. మేమంతా కలిసి మా అక్క 80 వ పుట్టినరోజు యీ మధ్యే జరుపుకున్నాం.
కొస”మెరుపుగా – మా అమ్మ చెప్తూండే కొన్ని సామెతలు చెప్తాను. అవి పాతవే కానీ కొత్తతరం వాళ్లకు కొత్తగా వుండవచ్చు.
రైటర్ గారి కుక్క ఇస్కో అంటే ఉస్కో అన్నట్టు….
దాలి గుంటలో కుక్కలా..
పుల్లయ్య వేమవరం వెళ్లినట్లు…
చావుకబురు చల్లగా చెప్పినట్లు…
జోగిజోగి రాసుకంటే బూడిద రాలిందని..
సన్నాసాడి పెళ్లికి జుట్టు దగ్గర్నుంచి అరువే…
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version