రివ్యూ: ప్రతినిధి
రేటింగ్: 2.75/5
బ్యానర్: సుధా సినిమాస్
తారాగణం: నారా రోహిత్, శుభ్ర అయ్యప్ప, శ్రీవిష్ణు, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి తదితరులు
రచన: ఆనంద్ రవి
సంగీతం: సాయి కార్తీక్
కూర్పు: నందమూరి హరి
ఛాయాగ్రహణం: చిట్టిబాబు
నిర్మాత: సాంబశివరావు
దర్శకత్వం: ప్రశాంత్ మండవ
విడుదల తేదీ: ఏప్రిల్ 25, 2014
విడుదల కోసం కొన్ని ఇబ్బందులు పడి ఫైనల్‌గా ఈ శుక్రవారం విడుదలైన ప్రతినిధికి రిలీజ్ టైమింగ్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయింది. టీవీల్లో వచ్చే ముప్పయ్ సెకన్ల యాడ్స్ కూడా రాజకీయాల మీదే ఉండేలా కాన్సెప్టులు పెట్టుకుంటున్నారు… ఆ ప్రోడక్ట్ ఏదైనా కానీ. అంటే ట్రెండుని ఫాలో అవుతున్నారని. అలా చూసుకుంటే ఇప్పటి ట్రెండుకి తగ్గ సినిమా ఈ ప్రతినిధి.
కథేంటి?
‘మంచోడు’ శ్రీను (నారా రోహిత్) ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసి తన అదుపులో ఉంచుకుంటాడు. తన డిమాండ్లు తీర్చకపోతే ముఖ్యమంత్రిని చంపేసి తాను కూడా చనిపోతానని బెదిరిస్తాడు. అతని డిమాండ్లు తీర్చడం ఎవరి తరం కాదు. కానీ అతను అడిగే దానికీ, అతని లక్ష్యానికి పొంతన ఉండదు. మంచోడు శ్రీను ఎవరు? ఎందుకోసం ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసేంత సాహసానికి ఒడికట్టాడు. అతని నేపథ్యమేంటి? చివరిగా తాను చేసిన దానికి అతను ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొంటాడు?
కళాకారుల పనితీరు!
నారా రోహిత్‌కి వాయిస్ అడ్వాంటేజ్. పవర్‌ఫుల్ సంభాషణలు అతని వాయిస్‌లో మరింత పవర్‌ఫుల్‌గా అనిపిస్తాయి. సూటిగా, స్పష్టంగా ప్రశ్నించాల్సిన ‘ప్రతినిధి’ పాత్రకి రోహిత్ వాయిస్ యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. అయితే తనని మించిన రేంజ్ ఉన్న నటుడైతే ఈ ప్రతినిధి మరింత మందికి రీచ్ అయ్యే వాడు. ఇక క్యాజువల్ నటనలో రోహిత్ ఇప్పటికీ వీక్‌గానే కనిపిస్తున్నాడు. తన ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో మహేష్‌బాబుని ఇమిటేట్ చేసే పేలవమైన ప్రయత్నం చేసాడు. కానీ కుర్చీలో కదలకుండా కూర్చుని మైకులో మాట్లాడుతున్నంత సేపు మాత్రం అదరగొట్టాడు.
శుభ్ర అయ్యప్పకి హీరోయిన్ ఫీచర్స్ లేవు. నటన అసలు రాదు. ఆమెని కొన్ని సీన్లకే పరిమితం చేయడం ప్రతినిధికి ఊహించని బోనస్. శ్రీవిష్ణు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసాడు. తనని యాక్టర్‌గా ఇగ్నోర్ చేయకుండా ఉండేట్టు వచ్చిన అవకాశాన్ని వాడుకున్నాడు. కోట శ్రీనివాసరావు గురించి చెప్పేదేముంది. ఈమధ్య ఆయన్ని కూడా సినిమాలో పెట్టుకోవాలి అన్నట్టు కొందరు తీసుకుంటున్నారు. కానీ ఈ సినిమాకి ఆయన కీలకం. బాగా చేసారు. పోసాని కృష్ణమురళిలో ఉన్న సీరియస్ కామెడీకి తగ్గ క్యారెక్టర్ ఇందులో లభించింది. కేక్ వాక్ చేసుకుపోయాడు.
సాంకేతిక వర్గం పనితీరు:
సాయి కార్తీక్‌కి పాటల పరంగా ఇందులో పెద్దగా పని లేదు. ఉన్న ఆ రెండు, మూడు పాటలు వినే పని మనం పెట్టుకోనక్కర్లేదు. నేపథ్య సంగీతం ఇలాంటి చిత్రాలకి చాలా కీలకం. సాయి కార్తీక్ ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యాడు. మంచి నేపథ్య సంగీతంతో కొన్ని సన్నివేశాలు మరింత ఎలివేట్ అయి ఉండేవి. సినిమాటోగ్రఫీ ఆకట్టుకోదు. సినిమాకి మరీ లో బడ్జెట్ లుక్ ఉంది. ఫ్రేమ్స్‌లో ఆ రిచ్‌నెస్ లేదు. సంభాషణలు, కథ, కథనం అన్నీ ఆనంద్ రవి అందించాడు. అతని ఆలోచనలు బాగున్నాయి. అతను అడిగిన ప్రశ్నలు ఆలోచింపచేస్తాయి. సంభాషణల పరంగా ఈ చిత్రం బాగా స్కోర్ చేసింది. ఎడిటింగ్ కూడా బాలేదనే చెప్పాలి. ప్రథమార్థంలో గందరగోళం ఎక్కువైంది. ద్వితీయార్థంలో ఎడిటర్ వర్క్ షార్ప్‌గా ఉంది.
దర్శకుడు ప్రశాంత్ మండవ కొన్ని సన్నివేశాలని బాగా హ్యాండిల్ చేసాడు. అయితే కొన్నిటిని మరీ పేలవంగా తెరకెక్కించాడు. రోహిత్, శుభ్ర, శ్రీవిష్ణు ట్రాక్‌ని అస్సలు బాగా తీయలేదు. ఈ ట్రాక్‌ని సరిగ్గా తీసినట్టయితే ఈ సినిమాకి ఇది సర్‌ప్రైజ్ ప్యాకేజ్ అయి ఉండేది. ముఖ్యమంత్రిని ఒక సామాన్యుడు ఒక నాటు తుపాకీతో కిడ్నాప్ చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ తంతుని దర్శకుడు స్కిప్ కొట్టేసాడు. దర్శకులు ఇలాంటి సన్నివేశాల్ని ఛాలెంజ్‌గా తీసుకుని వాటిని తెరకెక్కించడంలోనే తమ నేర్పు చూపించాలి. తన కన్వీనియన్స్ కోసం పోలీస్ వ్యవస్థని, ఎన్‌ఎస్‌జి కమాండోలని కూడా జీరోలుగా చూపించాడు. కాస్త తల పండిన దర్శకుడైతే ఈ ప్రతినిధి ఇంకోలా ఉండేవాడు. ప్రశాంత్ కేవలం పాస్ మార్కుల కోసమే ట్రై చేసాడు.
హైలైట్స్:
- సంభాషణలు
- ప్రతినిధి సంధించే ప్రశ్నలు
డ్రాబ్యాక్స్:
- నేపథ్య సంగీతం
- దర్శకత్వం
విశ్లేషణ:
ఓటుని కొనడం గురించి, కొనుక్కోవడం గురించి ప్రతినిధి ఓ సందర్భంలో ప్రశంసనీయంగా మాట్లాడతాడు. అయిదు రోజులో తెలంగాణలో ఎన్నికలు, పన్నెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇంత కంటే మంచి ముహూర్తం ఈ సినిమాకి కుదరదు. ఇది రాజకీయ చిత్రం కాదు కానీ రాజకీయ నేపథ్యం ఉంది. నాయకుల్ని ప్రశ్నిస్తూ, ప్రజల్ని జాగృతం చేసే సినిమా ఇది. ఈ సినిమా తీసిన వారి ఉద్దేశాన్ని తప్పక ప్రశంసించాలి. తమ వ్యాపార లబ్ధి కోసం తప్ప జనానికి ఉపయోగపడే సినిమాలు తీసే ఆలోచన ఇప్పుడు దాదాపుగా కనుమరుగైంది. ఈ ప్రయత్నం చేసినందుకు మాత్రం ప్రతినిధి బృందానికి ప్రశంసలు దక్కుతాయి.
అయితే ఇదే కథని ఆద్యంతం ఆకట్టుకునేలా, చప్పట్లతో ఆడిటోరియం మారు మోగిపోయేలా తీసే అవకాశముంది. ఈ కథలో, లేవనెత్తిన అంశాల్లో అంత బలముంది. కానీ ఆ బలానికి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని రూపొందించలేకపోయారు. బలమైన కథాంశానికి బలహీనమైన చిత్రీకరణ, సాధారణ దర్శకత్వం జత కలవడంతో ప్రతినిధి బలం కోల్పోయాడు. చాలా కామన్ విషయాలని, మనం నిత్యం పడే ఇబ్బందులని ప్రతినిధి సినిమాలో తెలివిగా వాడుకున్నారు. దొంగ నోటు ఏటీఎంలో వస్తే ఆ ఫైన్ మనకేసి.. నోటు చింపేసి పంపుతారు. అలాగే ప్రతి వస్తువు మీదా చిల్లరని మనకివ్వరు. వీటిని ప్రతినిధిలో ప్రశంసనీయంగా డిస్కస్ చేశారు.
అలాగే సందర్భానుసారంగా సందేశాలు కూడా ఇచ్చారు. మంచి ప్రశ్నలతో ఆలోచన కూడా రేకెత్తించారు. కానీ అక్కడక్కడా ఎడారిలో ఒయాసిస్సులా ఈ సన్నివేశాలు వచ్చిపోతుంటాయి తప్ప ఆద్యంతం ప్రతినిధి ఆకట్టుకోదు. ఒక మంచి ట్విస్టుతో కథని పకడ్బందీగా రాసుకున్నా కానీ దానిని అంతే సమర్ధవంతంగా తెరమీదకి తేలేదు. చెంప మీద కొట్టినట్టుగా గుర్తుండిపోవాల్సిన ఈ చిత్రం థియేటర్ నుంచి బయటకి రాగానే మర్చిపోయేలా తయారైందంటే దర్శకుడు ఈ చిత్రాన్ని లక్ష్యం చేర్చడంలో విఫలమయ్యాడని అర్థమవుతుంది. చేసిన ప్రయత్నానికి వెన్ను తట్టి ప్రోత్సాహమివ్వాలని మనంతట మనం అనుకోవాలే తప్ప దానికి అర్హత ఈ సినిమాకుందని అనిపించుకోదు. కాకపోతే రైట్ టైమ్‌లో రావడం వల్ల ప్రతినిధి ఎంత లాభ పడతాడనేది చూడాలి. ఒక మరపురాని సినిమా కావాల్సిన దానిని జస్ట్ ఫర్వాలేదనే స్థాయికి తీసుకొచ్చి వదిలేయడం వల్ల ఈ సినిమా పర్పస్ ఎంతవరకు సాల్వ్ అవుతుందనేది కూడా ప్రశ్నార్ధకంగా మారింది.
బోటమ్ లైన్: ఆలోచింపజేసే ప్రతినిధి.
-జి.కె.