ఆయన అంతే… చెబితే చేయడు

అమ్మ పుట్టింటి సంగతి మేనమామకు తెలియదా అని సామెత. అలాగే ఒక వ్యక్తి సంగతి స్వయానా ఆయన వియ్యంకుడికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియకపోవచ్చు. దశాబ్దాలుగా ఉన్న బావాబామ్మర్దుల బంధం, కొన్నేళ్లుగా వియ్యపుబంధం ఉన్న వ్యక్తికి…

అమ్మ పుట్టింటి సంగతి మేనమామకు తెలియదా అని సామెత. అలాగే ఒక వ్యక్తి సంగతి స్వయానా ఆయన వియ్యంకుడికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియకపోవచ్చు. దశాబ్దాలుగా ఉన్న బావాబామ్మర్దుల బంధం, కొన్నేళ్లుగా వియ్యపుబంధం ఉన్న వ్యక్తికి ఇంకా బాగా తెలుస్తుంది. అందుకే చంద్రబాబు గురించి.. ఎవరెన్ని విశ్లేషణలు చెప్పినా.. స్వయానా ఆయన బామ్మర్ది నందమూరి బాలకృష్ణ చెప్పిన పొగడ్తల్ని పరిగణనలోకి తీసుకోవాలి. ‘చంద్రబాబు చాలా మంచి ఆర్థిక నిపుణుడు’ అని సెలవిచ్చారు బాలయ్య. ఆయన పరిపాలన సంపదల్తో తులతూగుతుంది అని చెప్పడానికి ఈ మాట వాడారు గానీ… అది నిజం. ఆర్థిక నిపుణుడు అంటే ఏమిటంటే.. లాభనష్టాల బేరీజు చక్కగా వేయగలిగినవాడు. చంద్రబాబు నిజంగానే అందులో దిట్ట. రాష్ట్రంలో పదికోట్ల జనాభా ఉన్నదంటే గనుక.. ‘ప్రజలు’గా వారిని డెబిట్ ఖాతాలోనూ, ‘ఓటర్లు’గా వారిని క్రెడిట్ ఖాతాలోనూ రాయగల సమర్థుడు చంద్రబాబు. రాజకీయ పదవుల్ని క్రెడిట్ ఖాతాలోనూ, ప్రజల తరఫున పోరాటాల్ని డెబిట్ ఖాతాలోనూ రాయగల ఆర్థిక దురంధరుడు ఆయన. 

అందుకే ముఖ్యమంత్రి అనే పదకంటె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాను సీఈవో అని పిలిపించుకోవడాన్ని అమితంగా ఇష్టపడే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పరిపాలనను కూడా ఒక వ్యాపారంలా చూస్తారనేది ప్రజల భయం. ఆయన  సర్కారే గనుక ఏలుబడిలోకి వస్తే పన్నులన్నీ లాభాలుగా పథకాలన్నీ నష్టాలుగా భావించి తమ నోట్లో మట్టి కొడతారేమోనని ప్రజల భయం. బాలకృష్ణ చెప్పినట్లుగా చంద్రబాబు యొక్క ఆర్థిక నిపుణుడు కావొచ్చు, ఆయన ఆర్థిక నైపుణ్యం మీద, వ్యాపార సామర్థ్యం మీద అపార నమ్మకం ఉన్నవారు గనుకనే ప్రజలు కనీసం ఆయన హామీలను నమ్మడానికి కూడా భయపడుతున్నారు.  చెబితే చేయడని, ఇంకా ప్రస్తుతం కనుల ముందున్న అనేక పరిణామాలను గమనిస్తున్నప్పుడు.. చంద్రబాబు జమానా వస్తే గనుక.. పరిపాలన అనేక రకాలుగా గతి తప్పిపోవచ్చునని ప్రజలు అనుమానిస్తున్నారు.

బాబు సీఎం అయితే పాలించేది ఎవరు?

పెట్టే వాడికే మొట్టే హక్కు కూడా ఉంటుందని సామెత. అందరు కుటుంబసభ్యుల పోషణ చూసే వ్యకిే్తక.. కుటుంబ పెద్దగా ఆ ఇంటిని పాలించే హక్కు మన వ్యవస్థలో ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రబాబునాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే గనుక.. ప్రజల్ని పరిపాలించేది ఎవరు? తెలుగుదేశం పార్టీ నే కదా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఇన్నాళ్ల పాటూ పోషించినది ఎవరు? ఈ ప్రశ్నకు సామాన్యప్రజల్లో కూడా చాలామందికి సమాధానం తెలుసు. తెలుగుదేశం పార్టీకి కొందరు రాజపోషకులు ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రతి సమయంలోనూ వారు ఆదుకుంటూ వచ్చారు. ఆదుకోవడం అంటే పార్టీ శ్రేణులను కూడగట్టడం, పార్టీ ఇమేజీ పెరిగేలా పోరాటాలు  చేయడం ఇలాంటి వ్యవహారాలు కాదు. వారు పార్టీకోసం చేయగలిగినదెల్లా పార్టీకోసం ఆర్థిక వనరులను సమకూర్చడం. అవసరమైన ప్రతిసందర్భంలోనూ తెలుగుదేశానికి అంతో ఇంతో సొమ్ములు విదిల్చిన రాజపోషకులు కొందరున్నారు. ఉదాహరణకు సీఎం రమేష్, సుజనాచౌదరి, నామా నాగేశ్వరరావు వంటి అతిరథులు. 

ఒక్క ముక్కలో చెప్పాలంటే.. చంద్రబాబునాయుడు వారి చేతిలో కీలుబొమ్మ. కీళ్లను ఆడించడానికి ముగ్గురు వ్యక్తులు ఉంటారు. పరిపాలన ఆ పార్టీ చేతికి దక్కినా సరే.. ఆ ముగ్గురూ బాబును ఎలా ఆడిస్తారో అనే భయం పార్టీ కార్యకర్తల్లోనే ఉంది. ఎందుకంటే.. పార్టీ టికెట్ల పంపిణీ వ్యవహారంలోనే ఈ ముగ్గురి విశ్వరూపం ఏమిటో ప్రజలు పార్టీ శ్రేణులు చాలా స్పష్టంగా గమనించారు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నదంటూ వీరిపై పార్టీ వారే విచ్చలవిడిగా ఆరోపణలు గుప్పించారు. సీఎం రమేష్ పరిస్థితి మరీ బజార్న పడ్డట్లుగా తయారైంది. ఇంత వ్యవహారం నడిచింది. రేపు తెర వెనుక పాలకులు కూడా వీరే అయితే ఇక మన సంగతి ఏమిటి? అనేది ప్రజల్లో కదలాడుతున్న తొలి భయం. 

పార్టీ టిక్కెట్లను అమ్ముకున్నట్లే.. ఇక ప్రజాసంక్షేమ పథకాల్ని కూడా ఈ వ్యాపారాత్మక తెదే తెరవెనుక సూత్రధారులు అమ్ము కోవడం ప్రారంభించారంటే ప్రజాజీవితం కంటకప్రాయం అవుతుందనేది వారి భయం. 

ఫ్యాక్షన్ భూతం జడలు విప్పుతుందా?

ఎన్నికలు సీజను ముమ్మరంగా మొదలై ఇప్పటికి సుమారు ఒకటిన్నర నెల గడుస్తున్నదని అనుకోవచ్చు. ఇప్పటికి కోట్లాది రూపాయల డబ్బు పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. దేశవ్యాప్తంగా దొరికిన సొమ్ములో 60 శాతం.. ఆంధ్రప్రదేశ్‌లోనే దొరికినదంటే.. ఇక ధనప్రవాహం ఎలా ఉన్నదో అర్థం  చేసుకోవచ్చు. అయితే ఇన్ని తనిఖీల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు తలెత్తగలవని అనుమానం వచ్చే సంఘటనలు మాత్రం పెద్దగా బయటపడలేదు. ఇప్పటివరకు అలాంటి ఒకే ఒక్క సంఘటన పరిటాల వర్గీయులు అనంతపురం జిల్లాలో మారణాయుధాలు తరలిస్తూ పోలీసులకు దొరికిపోవడం. 

చంద్రబాబునాయుడు జమానా కొనసాగిన రోజుల్లో పరిటాల రవి వర్గీయులు ఎంతగా చెలరేగిపోయారో అందరికీ తెలుసు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ వాడిని అని చెప్పుకోవాలంటేనే ప్రజలు ప్రాణభయంతో అలల్లాడే పరిస్థితిని కల్పించినట్లుగా పుకార్లు వినిపిస్తుంటాయి. అలాంటి పరిటాల రవి మరణించిన తర్వాత.. ఆయన కుమారుడు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. చాలా కాలం కిందటే ఒక హత్యేకసులో ఆయన నిందితుడు. తాజాగా మారణాయుధాలు తరలిస్తున్న సందర్భంలోనూ పరిటాల శ్రీరాం ఆ వాహనంలోనే ఉన్నాడని, చాకచక్యంగా తప్పించుకున్నాడని కూడా పుకార్లు ఉన్నాయి. 

ఈ దృష్టాంతాలను గమనించినప్పుడు చంద్రబాబు పాలన వచ్చిందంటే గనుక.. గత పదేళ్లుగా పడుకుని ఉన్నట్లుగా కనిపిస్తున్న ఫ్యాక్షన్‌భూతం మళ్లీ జడలు విప్పుకుంటుందని కూడా కొందరు అనుమానిస్తున్నారు. 

నమ్మినోళ్లను ముంచిన వాడికి ప్రజలో లెక్కా?

ఈ ఎన్నికల వేళ పార్టీ టికెట్ల కేటాయింపు వ్యవహారంలో చంద్రబాబు తీరును గమనించిన వారికి ఒక్కసారిగా గుండెలు చిక్కబడి ఉంటాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. ఎన్నాళ్లుగానో తెలుగుదేశం పార్టీని నమ్ముకుని, పార్టీ అధికారంలో లేని పదేళ్ల కాలం పాటూ కూడా… నానా కష్టాలు పడుతూ పార్టీ జెండా కనుమరుగై పోకుండా వారు కాపాడుకుంటూ వచ్చారు. అచ్చంగా జెండామోసిన, పార్టీ పతనం కాకుండా కాపాడే బాధ్యతను భుజాన మోసిన  అలాంటి నికార్సయిన నాయకులందరికీ చంద్రబాబునాయుడు మొండిచేయి చూపించారు. ఆయన ఇన్నాళ్లూ పార్టీకి శ్రేణులు చేసిన సేవలను చాలా తేలిగ్గా తృణీకరించారు. 

చంద్రబాబు వలసలేక ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పదేళ్ల పాటూ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు పడ్డ శ్రమను ఆయన బూడిదపాల్జేశారు. సరిగ్గా ఎన్నికల ముందు.. తమ పార్టీ సర్వభ్ర ష్టత్వం చెందే పరిస్థితిలో ఉన్నది గనుక.. కాంగ్రెస్‌నుంచి గెంతడం ప్రారంభించిన వలసనేతలకు ఆయన రెడ్‌కార్పెట్ పరిచారు. ఇన్నాళ్ల పార్టీ సేవకులను వలసనేతల ఊడిగానికి నియమించారు. ఇది పార్టీ కార్యకర్తలను నొప్పించిన మాట వాస్తవం. అయితే దానికంటె ముందు.. ఈ పరిణామం ప్రజల్ని భయపెడుతోంది. పదేళ్లుగా నానా అష్టకష్టాలు పడుతూ పార్టీని నమ్ముకుని సేవ చేసిన వారికే ఇంతగా హ్యాండ్ ఇచ్చాడంటే.. చంద్రబాబునాయుడు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మాత్రం ఎందుకు గుర్తుంచుకుంటాడనేది వారి భయం. 

సకలం ధనమయమే అవుతుందని…

ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం యావత్తు భారతదేశంలో ఎన్నికల కోసం సగటున అత్యధికంగా ఖర్చు చేస్తున్నది తెలుగుదేశం పార్టీనే అని అంటున్నారు. విపరీతమైన ధనమదం ఉన్న వారికి చంద్రబాబు ఈ ఎన్నికల టికెట్ల పందేరంలో పెద్ద పీట వేశారు. చివరి నిమిషంలో పార్టీలో చేరిన వారికి కూడా.. కేవలం ధనబలం ప్రాతిపదిక మీద.. తెల్లారే సరికి టికెట్లు ఇచ్చేశారు. తెదేపా తరఫున బరిలో ఉన్న వారిలో చాలా మంది ఎంపీ అభ్యర్థులు ఒక్కో ఎంపీ నియోజకవర్గంలో వందకోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడానికి తెగించి ఉన్నవారు. ఎమ్మెల్యే అభ్యర్థులు 20 కోట్ల రూపాయల వరకు సై అంటూ తొడగొట్టగలిగిన వారు… అని సమాచారం. 

వలసలు వచ్చిన నాయకులను ప్రధానంగా ధనబలం ప్రాతిపదికగానే చంద్రబాబునాయుడు తిరిగి టిక్కెట్లకు ఎంపిక చేసినట్లుగా కూడా ఆరోపణలున్నాయి. అయితే ప్రజల్లో మెదలుతున్న సందేహం ఏంటంటే.. ఇంతింత పెద్దమొత్తాల్ని ఎన్నికల కోసం ఖర్చుచేస్తున్న నాయకులు అధికారంలోకి వస్తే గనుక.. ఇక ప్రతి చిన్న పనినీ డబ్బుతో, ఆర్జనతో ముడిపెట్టేస్తారేమో అని వారు భయపడుతున్నారు. ప్రభుత్వం అనేది రూపాయల మింటింగ్ పరిశ్రమలా మారిపోతుందని ప్రజలు అనుకుంటున్నారు. అసలు పదేళ్లు అధికారంలో లేకుండా, కునారిల్లిన పార్టీ ఇప్పుడు ఇంత భారీ మొత్తాలను ఎన్నికలకు ఖర్చు చేస్తున్నదంటేనే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. 

మేనిఫెస్టో కాదది … ‘మాన్‌స్టర్‌ఫెస్టో

అన్నిటినీ మించి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో.. తాము గద్దె ఎక్కితే చేయగలమని చెబుతున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న హామీలు ప్రజల్ని మరింతగా భయపెడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పీఠం ఒక్కటే పరమావధిగా తెలుగుదేశం పార్టీ అధినేత నానా హామీలను గుప్పించేస్తూ వచ్చారు. ఇంటికొక ఉద్యోగం అనే మాట ఇప్పుడు హాస్యాస్పదంగా మారిపోయింది. రాష్ట్రంలో అసలు ఎన్నికోట్ల ఇళ్లున్నాయో తెలుసా? ఎన్నికోట్ల ఉద్యోగాలు ఉన్నాయో తెలుసా? ఇంటికో ఉద్యోగం అంటే ఇంకా ఎన్ని ఉద్యోగాలు అవసరం అవుతాయో తెలుసా..? అంటూ ఒకవైపు జగన్, చంద్రబాబును చెడుగుడు ఆడేసుకుంటున్నారు. అయినాసరే దేశాధీశుడు మాత్రం ఏకొంచెమూ వెనక్కుతగ్గడం లేదు. గొంతెమ్మ కోరికలు అన్నట్లుగా ‘గొంతెమ్మ హామీలు’ అనే పదం ఒకటి కనిపెడితే అది చంద్రబాబు మేనిఫెస్టోకు అతికినట్లు సరిపోతుంది. జనం వాటిని చూసి బూచిని చూచినట్లుగా భయపడుతున్నారు. 

అలాగే రైతురుణాల వ్యవహారం కూడా ఉంది. ప్రభుత్వంలోకి రాగానే రైతు రుణాలు రద్దు చేస్తానని అంటున్న చంద్రబాబునాయుడు.. అందులో ఎలాంటి మెలిక పెట్టకుండా ఉండడనే విషయం మీద కోట్లాది రూపాయల్లో జనం బెట్టింగులు కాసుకుంటున్నారంటే అది అతిశయోక్తి కాదు.

అభినవ గోబెల్స్‌ల దన్ను!

చంద్రబాబు గద్దె ఎక్కితే గనుక.. ఇప్పుడు ఆయనను అధికార పీఠంపై అధిష్ఠింపజేయడానికి నానా గడ్డి కరుస్తున్న ఆయన జేబుసంస్థల వంటి మీడియా సంస్థలు గోబెల్స్ ప్రచారాన్ని ప్రారంభిస్తాయని.. రాష్ట్ర ప్రజలు ఎలా నాశనం అయిపోతున్నప్పటికీ..  చంద్రబాబు ఇక్కడ  మహాద్భుతాలు సృష్టించేస్తున్నాడంటూ ప్రపంచమంతా టముకు వేస్తూ ఉంటారని అంతా అనుకుంటున్నారు. చంద్రబాబు స్వయంగానే గోబెల్స్‌ను, హిట్లర్‌ను మించిన వాడనేది వారిలో ఉన్న అంచనా. గతంలో ఏలుతున్నప్పుడే.. ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప నాయకుడు మరి ఎక్కడా లేనట్లుగా జరిగిన ప్రచారం ఇప్పటికీ సామాన్యులకు కూడా గుర్తుంది. అప్పటి వాస్తవాలు అన్నీ వారికి తెలిసినవే. అలాగే ఈసారి కూడా మళ్లీ చంద్రబాబులోని గోబెల్స్ నిద్ర మేలుకున్నాడంటే.. ఆయన రాష్ట్రాన్ని ఎంత నాశనం చేసేస్తున్నా… వచ్చినా సరే ఆయన మహాద్భుతం అని టముకు వేస్తుంటారని వారి భయం. 

ఆయన కీర్తి ముంచుతుంది…

మొత్తానికి చంద్రబాబునాయుడుకు సామాన్యుల దృష్టిలో అపారమైన కీర్తి ఉంది. పాజిటివ్ కీర్తి కాదది. ఒకసారి గద్దె ఎక్కాడంటే చెప్పినవేవీ గుర్తుంచుకోడని వారి భయం. హామీల్లో దేని గురించి ప్రస్తావించినో.. మరో రూపంలో ప్రజల మీదనే భారం మోపేలా చక్రం తిప్పుతాడని  ప్రజల్లో ఆందోళన. వెరపు. మరి ప్రజలలో ఉన్న అనుమానాల్ని, భయాల్ని, భావనల్ని చంద్రబాబు ఎలా నిర్మూలించగలుగుతారో.. ఎలా తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తారో చూడాలి. 

-కపిలముని 

[email protected]