మోహన : పంటకు సెలవు – వివాదాలకు నెలవు

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా  Advertisement పంటకు సెలవు – వివాదాలకు నెలవు 2011లో కోనసీమ రైతులు క్రాప్‌ హాలీడే ప్రకటించి, ఖరీఫ్‌ సీజనులో వేయవలసిన వరి పంట వేయడం మానేశారు.…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా 

పంటకు సెలవు – వివాదాలకు నెలవు

2011లో కోనసీమ రైతులు క్రాప్‌ హాలీడే ప్రకటించి, ఖరీఫ్‌ సీజనులో వేయవలసిన వరి పంట వేయడం మానేశారు. పెట్టుబడికి తగినంత రాబడి రానపుడు, కంపెనీ యజమానులు, 'లాకౌట్‌' ప్రకటించి తమ కంపెనీని కొద్దికాలం మూసేసి నష్టాలు తగ్గించుకోవడానికి చూసినట్లు, కోనసీమలోని రైతులు ఆ సీజనులో పంటకు సెలవు ప్రకటించారు. దాని వలన వరి ఉత్పత్తి ఆ మేరకు తగ్గిపోయి కొరత ఏర్పడుతుంది. వారి సమస్యలకు పరిష్కారం కనుగొనకపోతే వారు తరువాతి సీజనులో కూడా పంట వేయకపోవచ్చు. వారిని చూసి యితర ప్రాంతాల్లో కూడా వ్యవసాయం మానివేయవచ్చు. ఆహారధాన్యాల కొరత ఏర్పడి, మన రాష్ట్రప్రజానీకమే కాక, దేశప్రజలు కూడా అల్లాడవచ్చు. అందువలన రాష్ట్రప్రభుత్వం 2011 ఆగస్టులో ఐదుగురు నిపుణులతో ఒక కమిటీ వేసింది. ఎన్‌డిఎమ్‌ఏ పదవి పూర్తి చేసుకుని హైదరాబాదులో స్థిరపడిన నన్ను ఆ కమిటీకి చైర్మన్‌గా వుండమన్నారు. ఎన్‌జి రంగా అగ్రికల్చర్‌ యూనివర్శిటీకి వైస్‌ ఛాన్సలర్‌గా చేసిన డా|| ఎమ్‌.వి.రావుగారిని వైస్‌ చైర్మన్‌. శ్రీ సి. మురళీధర్‌, డా. కె. ప్రతాపరెడ్డి, డా. ఆర్‌. సుధాకర రావు, శ్రీమతి వి.ఉషారాణి తక్కిన సభ్యులు. ఆ కమిటీని 'కందా కమిటీ'గా వ్యవహరించసాగారు. 

మాకు అప్పగించిన బాధ్యత ఏమిటంటే – ఇలా సెలవు ప్రకటించడానికి దారితీసిన పరిస్థితులేమిటి, మళ్లీ యిటువంటి సంఘటన జరగకుండా వుండాలంటే ఏం చేయాలి అనే అంశాలు అధ్యయనం చేసి కోనసీమ ప్రాంతంలో వాతావరణం, మార్కెట్‌ వంటి రిస్కులకు తట్టుకునేట్లుగా క్రాప్‌ షెడ్యూల్‌ ఎలా మార్చుకోవాలో సూచించాలి. గోదావరి డెల్టాలో కాలువల ద్వారా, ఇరిగేషన్‌ ద్వారా లభించే నీటిని సమర్థవంతంగా ఎలా వాడుకోవాలో సూచించాలి. అంతేకాదు, వరిసాగు లాభదాయకంగా ఎలా మార్చుకోవాలో సలహా యివ్వాలి. 

కమిటీ ఏర్పాటు చేయడంతోనే వారం తిరక్కుండా మా ఐదుగురం సభ్యులం కోనసీమకి చేరి, ప్రభావితమైన ప్రాంతాలలో 20 రోజులు తిరిగి, రైతులతో, రైతు సంఘాలతో, అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో, బ్యాంకులతో స్వయంగా మాట్లాడి, వాస్తవ పరిస్థితులు నిర్ధారించుకున్నాం. రిపోర్టు అతి త్వరగా తయారుచేసి సెప్టెంబరు కల్లా యిచ్చేశాం. 

మా రిపోర్టులోని వాస్తవికతను గుర్తించిన స్వామినాథన్‌గారు ఒక వ్యాసంలో వాటిని ఉటంకించారు కూడా. మా రిపోర్టులో కోనసీమలో వ్యవసాయం ఎందుకు గిట్టుబాటు కావటం లేదో చెప్పాం, మార్కెటింగ్‌ అవకాశాలు ఎలా పెంచుకోవాలో చెప్పాం, దీర్ఘకాలిక ప్రణాళికల గురించి, వెంటనే చేపట్టవలసిన పనుల గురించి చెప్పాం. 

మేం ఏం చేసినా కోనసీమ నాయకులు వాళ్ల పని వాళ్లు చేశారు. మేం ఏం సిఫార్సులు చేసినా వాటిని తీసిపారేసి ప్రతిఘటించడానికి ముందుగానే నిశ్చయించుకున్నారు. అదే చేశారు. ఏ మాట కా మాటే చెప్పుకోవాలి. మేం ఎంత చురుగ్గా పని చేసినా, వాళ్లే మాకంటే స్పీడు. అవునుమరి, ఎవరైనా అయితే రిపోర్టు వచ్చాక నచ్చకపోతే నిరసనగా బందులు, ధర్నాలు చేస్తారు. వీళ్లు మేం రిపోర్టు రేపిస్తామనగా యివాళే కోనసీమంతా బంద్‌ చేయించారు.  షేర్‌మార్కెట్‌లో ఫ్యూచర్స్‌ లాగ బంద్‌ కూడా ముందే నిర్ణయమై పోయిందేమో.  చిన్నప్పుడు కథ విన్నాను – ఇంటికి అతిథులు వస్తే ఆకుల్లో వడ్డించే కోడలు వడ్డించిందిట. ఆకులు తీసేసే కోడలు తీసేసిందట. ఆకులోని అన్నం తిన్నారా లేదా అని చూడలేదట. ఎవరి డ్యూటీ వారు చేసేశారన్నమాట.

xxxxxx

మేం నివేదికలో ఏం రాశామో విపులంగా చెపితే మీకు బోరు కొడుతుంది. ఆ నాడు ఏ యే అంశాల గురించి విమర్శలు చెలరేగాయో వాటి గురించి మాత్రం చెపుతాను. వ్యవసాయరంగంలో మెరుగుపరచవలసిన పరిస్థితుల గురించి మీకు ఒక అవగాహన వస్తుంది. పేపర్లలో మీకు తరచుగా వినబడే మద్దతు ధర, బోనస్‌ వంటి పదాలను మీడియా, కొందరు రైతునాయకులు, రాజకీయనాయకులు ఎంత గందరగోళంగా వాడతారో కూడా అర్థమవుతుంది. 

మా నివేదికలో మద్దతు ధర యింత యిమ్మనమని, బోనస్‌ యింత యిమ్మనమని రాయలేదని విమర్శలు చేశారు. ధాన్యం ఉత్పత్తి తక్కువైనపుడు రైతులు తమకు అమ్మడానికి కేంద్రం ప్రభుత్వం ప్రకటించే ప్రోత్సాహకాన్ని బోనస్‌ అంటారు. క్రాప్‌ హాలీడే ద్వారా రైతులే ఉత్పత్తిని తగ్గించినపుడు 'బోనస్‌' అనే పదాన్ని ఎలా వాడగలం? అందుకే దాన్ని యింకోలా చెప్పాం. ఉత్పత్తివ్యయానికి, మద్దతుధరకు గల వ్యత్యాసాన్ని అధిగమించేందుకు చర్యలు చేపట్టండి అన్నాం. అది మీడియాకు అర్థం కాలేదు. ఇక మద్దతు ధర అంటూ ఓ పెద్ద అంకె చెపితే యిక్కడ మాకు జేజేలు పలకవచ్చు. మమ్మల్ని రైతుబాంధవులు అనవచ్చు. కానీ ఆచరణయోగ్యం కానిది చెప్పడం నా ఫిలాసఫీ కాదు. స్వామినాథన్‌ గారి సిఫార్సులకే కేంద్రం తడబడుతోంది. కోనసీమలో ఉత్పత్తి వ్యయం యింత అవుతోంది అని లెక్కలు వేసి యిచ్చాం. పంట ఉత్పత్తి ఖర్చుల కంటె మద్దతుధర ఎక్కువగానే వుండాలనీ, రైతుకి వ్యవసాయం పట్ల నమ్మకం పోకూడదనీ స్పష్టంగా చెప్పాం. ప్రస్తుతానికి కొంత అదనంగా యిమ్మనమని శషభిషలు లేకుండా చెప్పాం.

కానీ అది ఎంత వుండాలో నిర్ణయించవలసినది కేంద్రప్రభుత్వం. అది లెక్కకట్టడానికి వాళ్లకో పద్ధతి వుంది. రాష్ట్రంలో, కేంద్రంలో వ్యవసాయ శాఖలో పని చేసిన నేను బాధ్యతారహితంగా సిఫార్సులు చేయలేను కదా. మేం ఏదైనా చెప్పినా అది అమలు కావాలి కదా. మేం రికమెండు చేసిన మద్దతు ధరకు ధాన్యాన్ని మార్కెట్లో కొనే మిల్లర్లను చూపించమంటే చూపించగలమా? అందుకే సాధ్యమైనంత ఎక్కువ యివ్వాలని, ఆ ఏడాది తాత్కాలిక సహాయంగా మరికొంత కలిపి యివ్వాలని సిఫార్సు చేశాం. ఇది ఆధారం చేసుకుని రాష్ట్రప్రభుత్వం  కేంద్రాన్ని అధిక మద్దతుధర కోసం కోరడం కూడా జరిగింది. వాళ్లు పెంచారు కూడా. ఎవరు చేసే పని వారే చేయాలి అనే నా సిద్ధాంతం ప్రకారమే రిపోర్టు తయారైంది.  అయినా మద్దతు ధర పెంచుతూ పొమ్మని అడిగే బదులు ఖర్చులు తగ్గించుకోవడం మంచిదని సలహాలు యిచ్చాం. అది వాళ్లకు రుచించలేదు. మనీయార్డరు పంపమని హాస్టలు కుర్రాడు తండ్రికి రాస్తే, ఆయన కాస్త పంపించి, ఖర్చులు తగ్గించుకోమని ఉత్తరం జోడిస్తే వాడు రుసరుసలాడడూ? 

ఖర్చుల గురించి చెప్పాలంటే – మిగతా ప్రాంతాల కంటె కోనసీమలో సాగుచేసే ఖర్చు ఎక్కువ. వ్యవసాయ కూలీలుగా స్థానిక ప్రజలు సాధారణంగా రారు. జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద 100 రోజులు పని యిస్తామని ప్రభుత్వం అంటే చేస్తామని అక్కడి కూలీలు ముందుకొచ్చినది 32 రోజులకే! అంటే ప్రభుత్వం యిచ్చే కూలీ కంటె వాళ్లకు బయట ఎక్కువ కూలీ కిడుతోందన్నమాట… అబ్బే, అక్కడ పనిచేయకూడదు, తక్కువ ఆదాయం వచ్చే 'నరేగా' పనులే చేయాలి అంటే వాళ్లు ఒప్పుతారా? అందుచేత యితర జిల్లాల నుండి ఉపాధి దొరకని కూలీలు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి పని చేసేవారు. అయితే జాతీయ ఉపాధి హామీ పథకం ధర్మమాని వాళ్లకు అక్కడే పనులు దొరుకుతున్నాయో ఏమో వాళ్లు ఆ ఏడాది రావడం మానేశారు. స్థానికంగా దొరికిన కూలీలు చాలా డిమాండు చేశారు. దీనికి పరిష్కారం ఏమిటి? జాతీయ ఉపాధి హామీ పథకం మార్చడమా? అది దేశమంతా అమలు చేస్తున్న మంచి పథకం, వెనుకబడిన ప్రాంతాలలో పేదప్రజలకు ఉపయోగపడే పథకం. దీనికోసం ఆ చట్టాన్ని మార్చమంటే ఎలా మారుస్తారు? 

ఖర్చులు తగ్గించడానికి అనేక ఉపాయాలు వున్నాయి. కాలవల్లో పూడిక తీయిస్తే నీటి ప్రవాహానికి అడ్డు తొలగిపోయి, ప్రవాహం పెరిగి, దానికయ్యే కరంటు ఖర్చులు తగ్గి ఆదా అవుతుంది. పైగా నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుంది. సమయానికి కాలువలు తెరవగలుగుతారు. అందుకే రెవెన్యూ డ్రెయిన్లలో ఆక్రమణలు తీసేయమనీ, చేపల వలలు తీసేయమనీ మా నివేదికలో రాశాం. కాలువలు కట్టేసిన టైములో యిలాటి పనులు చేపట్టి, రైతులూ ఓ చేయి వేయడమో, కనీసం ఆ పనులను పర్యవేక్షించడమో చేస్తే మంచిది.

రాజస్థాన్‌లో, మన రాష్ట్రంలో అనంతపురం వంటి జిల్లాలలో మామూలు రైతు, అంటే ఐదెకరాలలోపు భూమి వున్నవాడు, సాధారణంగా వర్షాలు వచ్చే టైముదాకా ఎదురు చూస్తాడు. వానలు రాలేదనుకోండి, యీ ఏడాది పంటవేసి లాభం లేదురా అనుకుని వదిలేసి వేరే చోటకు కూలీపనికి వెళ్లిపోతాడు. ఎటొచ్చీ పంట విరామం అని పేరు పెట్టడు. ఈ ఏడాది కిట్టుబాటు కాదు అని అనుకుని వూరుకుంటాడు. అయితే కోనసీమలో రాజకీయచైతన్యం ఎక్కువ కాబట్టి యీ పరిస్థితిని ఒక ఉద్యమంగా  మలచారు. ఖరీఫ్‌ సీజనుకు కాలువ నీళ్లు ఆలస్యంగా వదులుతారు. నాట్లు వేసి పంట చేతికి వచ్చేసమయానికి తుఫానులు వస్తాయి. రిస్కు ఎక్కువ. రబీకి అలాటి యిబ్బందులేమీ లేవు. అందువలన యీ సమస్యలన్నీ ఎప్పటినుండో వున్నా, వాళ్లు ఖరీఫ్‌ సీజనుకే పంట విరామం యిచ్చారు. 

మేం ఎన్నో ఆచరణాత్మకమైన సూచనలు చేశాం. ఏప్రిల్‌ 15 కల్లా కాలువలు మూసివేసి, యిన్‌ఫ్లో బట్టి మే 15 నుండి 25 లోగా తగినంత నీరు ఎప్పుడుంటే అప్పుడు ఖరీఫ్‌ పంటకై విడుదల చేయమని చెప్పాం. కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుల మందులు సమస్య వుందని ఒప్పుకుంటూనే చట్టాలను కఠినంగా అమలుపరచమని సిఫార్సు చేశాం. విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్‌ వంటి ఇన్‌పుట్స్‌ ఖర్చును దృష్టిలో పెట్టుకుని సీజనుకు ముందుగానే కేంద్రం కనీస మద్దతు ధర  ప్రకటించేస్తే మంచిదన్నాం. అలా చేస్తే స్థానిక పరిస్థితులు చూసుకుని రైతు యీ ఏడాది సాగు చేయాలో, వద్దో, చేస్తే కిట్టుబాటుగా వుంటుందో లేదో తేల్చుకుంటాడు. వరి వేయాలో, మరొకటి వేయాలో, లేకపోతే అనంతపురం రైతులాగ ఏమీ లేకుండా వదిలేయాలో … అతనిదే నిర్ణయం. 'మద్దతు ధర ప్రకటించేసమయానికి పరిస్థితి మామూలుగానే వుండి, తర్వాత ఏదైనా ఉపద్రవం వస్తే…ధర కిట్టుబాటు కాదు కదా' అని మాకు మేమే ప్రశ్న వేసుకుని ఆ మద్దతు ధర కూడా ఫ్లెక్సిబుల్‌గా (పరిస్థితులకు అనుగుణంగా మారేట్లు) వుండాలని చెప్పాం. ఒకసారి మద్దతు ధర ప్రకటించాక దాన్ని ఫుడ్‌కార్పోరేషన్‌వారు తప్పకుండా అమలు చేయాలని, రైతులను దళారుల దాక్షిణ్యానికి వదలకూడదని రాశాం. 

దేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వమే లెవీ ధాన్యం సేకరిస్తుంది. మన రాష్ట్రంలోనే మిల్లర్లను బియ్యం కొనమంటున్నారు. మిల్లర్లు యితర రాష్ట్రాల ధాన్యాన్ని కొనేముందు, స్థానిక రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా చెప్పాం. అంతేకాదు, కొనుగోలు సొమ్మును చెక్కుల ద్వారా చెల్లించాలని కూడా స్పష్టంగా చెప్పాం. మా నివేదిక తర్వాత రాష్ట్రప్రభుత్వం 'కందా కమిటీ సిఫార్సులకు మేరకు ధాన్యం సేకరణ పెంచుతున్నాం' అని ప్రకటించింది. అంతకు ముందేడాది 24.5  లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరిస్తే ఆ ఏడాది రెట్టింపు అంటే 50 లక్షలు సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనే 200 అదనపు సెంటర్లు పెట్టి 6 లక్షలు సేకరించారు. 

మమ్మల్ని విమర్శించినవారిలో చాలామంది మద్దతు ధర పెంచాలి, బోనస్‌ యివ్వాల్సింది అంటూ తక్షణావసరాలు చూశారు. మా కమిటీవారం దీర్ఘకాలిక అవసరాలు చూశాం. అధిక ఉత్పత్తి ఎలా చేయాలా అన్న విషయం ఒక్కటే కాదు, మనం చూడాల్సింది, ఉత్పత్తి చేసినదాన్ని ఎలా మార్కెట్‌ చేసి వ్యవసాయాన్ని కిట్టుబాటు వ్యాపారంగా చేయాలా అన్నది ముఖ్యం. వ్యాపారం ఎప్పుడు కిట్టుబాటు అవుతుంది? ఖర్చులు తగ్గించుకోవాలి, ఉత్పత్తి చేసినదాన్ని సరైన ధర వచ్చేంతవరకు కొంతకాలం దాచుకోగలగాలి, దూరప్రాంతానికి తీసుకెళ్లి అక్కడి ధరకు అమ్ముకుని కాస్త వెనకేసుకోవాలి. రైతులు, వారి తరఫు వాళ్లు అడిగే మద్దతు ధర యింటర్నేషనల్‌ మార్కెటులో ఎలాగూ వుంది. రైతు యివన్నీ చేయలేకపోతే వారి సంక్షేమం కోరే నాయకులు అలా జరిగేట్లు చూడాలి, మార్గదర్శనం చేయాలి. దేనికైనా మార్కెటింగ్‌ ముఖ్యం. పంజాబ్‌, హర్యాణా యింత ఎదిగాయంటే వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌ చేయడం వాళ్లు బాగా నేర్చుకున్నారు. ఢిల్లీ దాకా రోడ్లు వున్నాయి కాబట్టే అక్కడ వ్యవసాయం మూడు పువ్వులు, ఆరు కాయలు.. అన్నట్టుంది. నరేగా (ఉపాధి హామీ) కూలీల చేత పొలాల దాకా రోడ్లు వేయించేస్తే – అమూల్‌ వాళ్లు డెయిరీ ఉత్పాదనలు బొంబాయిదాకా అమ్మి విజయం సాధించినట్లు- మనవాళ్లూ దూరదూర ప్రాంతాలకు పంపించి మార్కెట్‌ చేసుకోవచ్చు.  దేనికైనా మార్కెటింగ్‌ ముఖ్యం.

పంజాబ్‌, హర్యాణాలలో వ్యవసాయం వృద్ధి చెందిందంటే దానికి కారణం యంత్రాలు బాగా వాడతారు. ట్రాక్టర్లు, వరి నాటే యంత్రాలు, కోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు – యివన్నీ చిన్న సైజులో దొరుకుతాయి. అవి యిక్కడా వాడితే కూలీల సమస్య తగ్గి ఖర్చు తగ్గుతుంది. అయితే చిన్న చిన్న కమతాలవాళ్లు యివన్నీ ఎలా కొంటారు? ఎవరికివారు స్వంతంగా కొనలేరు కాబట్టే కస్టమ్‌ హైరింగ్‌ విధానంలో అద్దెకు తెచ్చుకోమన్నాం. వచ్చే మూడు, నాలుగేళ్లలో రాష్ట్రంలో 3000 వ్యవసాయ సేవా కేంద్రాలు పెట్టి వాటిలో యీ యంత్రాలు అందుబాటులో వుంచి అద్దెకు యిమ్మనమన్నాం. ఆ మూడువేలల్లో వంద కేంద్రాలు కోనసీమలో పెట్టమన్నాం. మా నివేదిక చూపించి దాన్ని ఒక ఆయుధంగా మలచుకుని, దానిపై దృష్టి పెట్టమని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాలి కానీ, మా నివేదికని మూల పడేస్తే, విమర్శిస్తే ఏం లాభం? 

వీళ్లు అలా పడేసినా ప్రభుత్వం వారు యంత్రాల కొనుగోలుకు అయిదు కోట్లు శాంక్షన్‌ చేస్తున్నాం అన్నారు. శాంక్షన్‌ వచ్చినా రైతు నాయకులు చేయవలసినది చాలా వుంది. కోనసీమలో నేల మెత్తగా వుంటుంది కాబట్టి ఆ మెషీన్లు కూరుకుపోతాయి. దేశంలో అనేకమైన ఆగ్రో సర్వీస్‌ సెంటర్లు వున్నాయి. ఏ నేలకు ఏ యంత్రం అనుగుణంగా వుంటుందో పరిశోధించి అటువంటి యంత్రాలు అందించడమే వారి పని. వారిచేత పని చేయించడానికి రైతు నాయకులు పూనుకోవాలి. కేవలం మద్దతు ధరలు, బోనస్సులు మీదనే పోరాటం చేస్తూ కూర్చుంటే యిలాటివి వెనకబడిపోతాయి. 

 అసలు మద్దతు ధర గురించి యింత ఆరాటం దేనికి? అది ఆ ఒక్క సీజనుకే వర్తిస్తుంది. మేం చెప్పిన తక్కిన పనులన్నీ జరిగితే, ఆటోమెటిక్‌గా ఖర్చులు తగ్గి, మార్కెటింగ్‌ అవకాశాలు పెరిగి, మద్దతు ధర గురించి పట్టించుకునే అవసరాలు తగ్గిపోతాయి. సరైనధర పలికేదాకా ధాన్యాన్ని రైతు నిలవచేసి వుంచాలి. అంటే గోడౌన్లు వుండాలి. కోనసీమ రెవెన్యూ డివిజన్‌ నుండి 3.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంటే గోడౌన్ల సామర్థ్యం 17500 మాత్రమే ! అంటే 5%! అది వినగానే అంత తక్కువా అనిపిస్తుంది. కానీ రైతులు ఉత్పత్తినంతా దాచుకోరు కదా ! వాళ్లు వాడుకునేది కొంత వుంటుంది కదా. పైగా గోడౌన్లు కట్టగానే సరిపోదు. ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకునే సామర్థ్యం రైతుల కుండేట్లా చూడాలి. లేకపోతే మిల్లర్లు అక్రమంగా నిలవ చేయడానికి అవి వాటంగా వుంటాయి. ధరలు పెరిగి వినియోగదారులు నష్టపోతారు. అది దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తిలో సగం స్టోర్‌ చేయడానికి వీలుగా గోడౌన్లను పిపిపి (ప్రయివేటు- ప్రభుత్వం భాగస్వామ్యం)లో కట్టమని చెప్పాం. అమలాపురం ప్రాంతంలో వరదలు, తుపానులు ఎక్కువ కాబట్టి యివి తప్పనిసరిగా వుండాలని నొక్కి చెప్పాం. 

వీటన్నిటితో బాటు సమస్యకు మూలకారణం అంటూ మీడియా ఒక అంశాన్ని ముందుకు తెచ్చింది. ఋణాల కోసం రైతు బ్యాంకుకి వెళితే 'నువ్వు కౌలుదారువి, భూమి స్వంతదారు వచ్చి సెక్యూరిటీ యిస్తే తప్ప అప్పివ్వం' అన్నారుట బ్యాంకువాళ్లు. నిజానికి బ్యాంకువాళ్లు అలా అనకూడదు. క్రాప్‌ లోన్‌ అంటే క్రాప్‌ మీద యిచ్చే లోను. భూమి తాకట్టు పెడతానంటే స్వంతదారు రంగంలోకి వస్తాడు తప్ప పంటమీద ఋణానికి హామీ పంటే! ప్రకృతివైపరీత్యాల భయం వుంది కాబట్టి దాన్ని బీమా చేసుకోవాలి. కౌలుదారు-స్వంతదారు సమస్య అనేది ప్రభుత్వం బ్యాంకులతో మాట్లాడి చిటికెలో పరిష్కరించే విషయం. వాళ్లు ఆ పని చేశారు.

పంటవిరామం అన్నది ఒక తాత్కాలిక సమస్య. కోనసీమ ప్రజల చురుకుతనం వలన మీడియాలో హైలైట్‌ అయింది. నిజానికి యిలాటిది అనేక చోట్ల జరుగుతోంది. హైలైట్‌ కావడం వలన జరిగిన మేలేమిటంటే – ఓ కమిటీ వేసి అధ్యయనం చేయమన్నారు. అవకాశం దొరికింది కదాని మేం దీన్ని కోనసీమకే పరిమితం చేయకుండా భారతీయ వ్యవసాయరంగంలోని సమస్యలన్నిటినీ స్పృశిస్తూ రిపోర్టు తయారుచేశాం. మౌలిక సదుపాయాలు, పశుక్రాంతి, ఆ ప్రాంతంలో యితర పరిశ్రమలు, అందుబాటులో వున్న ప్రత్యామ్నాయాలు, సకాలంలో ఋణవితరణ, బీమా సొమ్ము విడుదల.. యిలా అన్నీ చర్చించాం. సూచనలు చేశాం. వాటిని అమలు చేయమని రైతులు ప్రభుత్వాన్ని కోరతారనుకుంటే గాలి మా కమిటీ వైపు మళ్లించి దుమారం లేపారు. 

xxxxxx

ఆ విమర్శలు చూసి ఓ పాత్రికేయమిత్రుడు అడిగాడు – 'విశ్రాంత కందాకు విమర్శల దురదా?' అని కాప్షన్‌ పెట్టి ఒక వ్యాసం రాస్తాను. రిటైరయ్యాక హాయిగా కూర్చోక యిది ఎందుకు ఒప్పుకున్నట్టు? విమర్శలతోనైనా గుర్తింపు రావాలన్న తపనా?'' అని.

నేను పెద్దగా నవ్వేసి – ''కందకు లేని దురద కత్తిపీట కెందుకన్నట్టు, నాకు లేని బాధ మీకెందుకు? చీఫ్‌ సెక్రటరీగా రిటైరయ్యాక నేను హాయిగా కూర్చోలేదు. 'డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ'లో సభ్యుడిగా దేశంలో రకరకాల విపత్తులు ఎలా వచ్చిపడతాయి, అవి రాకుండా ఏం చేయాలి, వచ్చాక ఎలా నిర్వహించాలి, తర్వాత తీసుకోవలసిన చర్యలేమిటి? ఏ స్థాయిలో ఎవరు ఏం చేపట్టాలి? అని కూలంకషంగా చర్చించి ఐదేళ్లపాటు శ్రమించి డాక్యుమెంటు తయారుచేశాం. అందువలన యిలాటి ఆపత్తులు, విపత్తులు, వాటితో వేగడం నాకు కొత్తకాదు.'' అని జవాబిచ్చాను.

''సరే, కష్టపడి నివేదిక చేసి తిట్లు తిన్నావ్‌. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఏం చేస్తావ్‌? మా లాటి వాళ్లందరికీ శాస్తి జరగాలని కోరతావా?'' అడిగాడు. 

''దేవుడు ప్రత్యక్షమైతే మొదటగా మన రాష్ట్రంలో అక్షరాస్యత పెరగాలని కోరతాను. చదవడం వచ్చినవారు, చదవాలన్న ఆసక్తి కలవారు, చదివి అర్థం చేసుకునేవారు, అర్థమైనా రాజకీయాలకోసం అపార్థసారథుల్లా నటించకుండా వుండేవారు – పెరగాలని కోరుకుంటాను. అప్పుడే కందా కమిటీ నివేదిక కావచ్చు, ఇంకో కమిటీ నివేదిక కావచ్చు, మరో నివేదిక కావచ్చు – ప్రజలకు చేరవలసిన రీతిలో చేరుతుంది. కాస్తోకూస్తో మేలు కలుగుతుంది.'' అని నిట్టూర్చాను.

xxxxxx

కొసమెరుపు –  కోనసీమ రైతులు ఓ పక్క మా మీద విమర్శలు చేస్తూనే మా రిపోర్టును ఆయుధంగా మలచుకోవడంలో వెనకబడలేదు. మద్దతు ధర గురించి అంచనా వేయడానికి సెంట్రల్‌ అగ్రికల్చరల్‌ కాస్ట్‌స్‌ అండ్‌ ప్రైసెస్‌ కమిషన్‌ చైర్మన్‌ అశోక్‌ గులాటీగారు కోనసీమకు వచ్చినపుడు 'కందా కమిటీ సిఫార్సులు అమలు చేయవచ్చుగా' అని నిలదీశారు.

మేం చేసిన సిఫార్సులే ఆయనా చేశారు! 

కృతజ్ఞతలు 

…జ్ఞాపకాలు రాయాలని పోరిన నా భార్య ఉష, అమ్మాయి-అల్లుడు అపర్ణ-రాజీవ్‌, అబ్బాయి-కోడలు అరవింద్‌-ధరణిలకు..

…ఊహ చెప్పగానే తప్పకుండా రాయమని ప్రోత్సహించిన బంధుమిత్రులందరికీ… ముఖ్యంగా కీ||శే|| ముళ్లపూడి వెంకటరమణ గారికి,

…కాలేజీ రోజుల నాటి మా ''సాజ్‌ ఔర్‌ ఆవాజ్‌'' లోగో వేయడం నుండి యీ పుస్తకంలోని బొమ్మల దాకా చిత్రసహకారం అందిస్తున్న ఆత్మీయమిత్రులు శ్రీ బాపు గారికి,

…రచనలో అక్షరాలా సహాయపడి, ఆడియో వెర్షన్‌కు స్వరసహకారం అందించిన రచయిత, కాలమిస్టు శ్రీ ఎమ్బీయస్‌ ప్రసాద్‌ గారికి,

.. సాంకేతికంగా తోడ్పడిన పర్శనల్‌ సెక్రటరీ కీ.శే. సత్యనారాయణ, పర్శనల్‌ అసిస్టెంటు రామకృష్ణగార్లకు,

…సీరియల్‌గా ప్రచురించిన ''స్వాతి'' వారపత్రిక వారికి,

…తమ వెబ్‌సైట్‌లో డైలీ సీరియల్‌గా ప్రచురించిన ''గ్రేట్‌ ఆంధ్రా డాట్‌ కామ్‌'' వారికి,

…సీరియల్‌ చదివి, పుస్తకరూపంలో రావాలని పట్టుబట్టిన మిత్రుడు కె. సదాశివరావు ఐపియస్‌, కజిన్స్‌ చావలి వెంకట చైనులు, కల్లూరి రామకృష్ణ, యితర పాఠకులందరికీ,

…ముందుమాట రాసి, పుస్తకాన్ని ఆవిష్కరించిన మిత్రుడు పివిఆర్‌కె ప్రసాద్‌ గారికి, 

అందరికీ ధన్యవాదాలు

అంకితం

''వీడి అసాధ్యం కూలా! వీడు టెక్నికల్‌ పుస్తకాలే కాకుండా యిలాటిదీ ఒహటి రాయగలడా!'' అని పైలోకం నుండి ఆశ్చర్యపడుతున్న నాన్నగారికీ…,
''చాల్లెండి.., వాడికేం తక్కువ! ఇలాటి ఘనకార్యాలు బోల్డు చేయగలడని నేన్చెప్తే ఎప్పుడు విన్నారు కనక!'' అంటూ పక్కనే వుండి ఆయన్ని దెప్పుతున్న మా అమ్మకీ…

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com

please click here for audio version