జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రాలకు ప్రకటించే స్వర్ణకమలం అవార్డుల వివరాలు వెల్లడయ్యాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నా బంగారు తల్లి చిత్రం అవార్డు గెలుచుకున్నదని తెలిసి… అందరూ ఎక్కడిది ఆ చిత్రం అంటూ వెతుక్కున్నారు. నిజానికి ఆ చిత్రం చాలా ఉదాత్తమైన, ఉన్నతమైన విలువలతో రూపొందినదని తెలుసుకుని సంతోషించారు. అయితే ఇక్కడే మరొక ట్విస్టు కూడా చోటు చేసుకున్నది. ఆ విషయం ఇప్పుడిప్పుడే ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నది.
ఇంతకూ విషయం ఏంటంటే.. పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అత్తారింటికి దారేది చిత్రం ఇక్కడ బాక్సాఫీసు వద్ద సూపర్‌డూపర్ హిట్ అయినసంగతి అందరికీ తెలిసిందే. అదే సమయంలో.. ఆ సినిమా కుటుంబవిలువలకు పెద్దపీట వేసిందని కూడా అంతా అనుకున్నారు.
అయితే ఆ కారణం చూపించి.. ఆ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం అవార్డు సంపాదించాలని త్రివిక్రం అండ్ కో నానా ప్రయత్నాలు చేశారట. జ్యూరీ వద్ద భారీగానే లాబీయింగ్ చేశారుట. అయితే బెంగాలీ, మళయాళ పరిశ్రమలకు చెందిన జ్యూరీ సభ్యులు ఈ చిత్రం చూసి ఒక్క నవ్వు నవ్వారుట. ఏదో 1980లలో వచ్చిన చిత్రం లాగా ఉన్నది.. దీనికి అవార్డు ఏమిటి అంటూ పెదవివిరిచారట.
ఆ విధంగా అత్తారింటికి దారేది చిత్రానికి నేషనల్ అవార్డు తృటిలో తప్పిపోయింది గానీ… అది కూడా వచ్చిఉంటే.. అసలే పొలిటికల్ జోష్‌లో ఉన్న పవన్‌కల్యాణ్‌ను పట్టడానికి పగ్గాలే ఉండేవి కాదేమో.