ఎమ్బీయస్‌ : పవన్‌ సీరీస్‌ పై విమర్శలు – 2

డిటెక్టివ్‌ నవలల్లో కూడా హంతకుడు ఫలానా అని రచయిత వెంటనే చెప్పడు. పాత్రలను పరిచయం చేసి, వాడై వుండవచ్చు, వీడై వుండవచ్చు అని పాఠకుడిచేత అనిపించి, ఒక్కో అనుమానితుడికి వున్న అవసరం, అవకాశం బేరీజు…

డిటెక్టివ్‌ నవలల్లో కూడా హంతకుడు ఫలానా అని రచయిత వెంటనే చెప్పడు. పాత్రలను పరిచయం చేసి, వాడై వుండవచ్చు, వీడై వుండవచ్చు అని పాఠకుడిచేత అనిపించి, ఒక్కో అనుమానితుడికి వున్న అవసరం, అవకాశం బేరీజు వేయించి, పాఠకుణ్ని కూడా తనతో పాటు తీసుకెళుతూ ఫైనల్‌గా ఫలానావాడు అని చెప్తాడు. పాఠకుడు ఎంజాయ్‌ చేసేది ఆ ట్రావెల్‌నే! ఈనాటి యువతరం చాలామంది ఆబ్జెక్టివ్‌ టైపులో పరీక్షలు పాసయి వస్తున్నారు కాబట్టి వాళ్లకు యిదంతా చదివే ఓపిక వుండటం లేదు కాబోలు. సీరీసే బోరనుకుంటే వివరణ పేరు చెప్పి మరీ బోరు కొడుతున్నాడు అని వాళ్లనుకుంటారని తెలిసినా యిదంతా ఎందుకు రాస్తున్నానంటే – రేపు ''గెలుపెవరిది?'' అన్న సీరీస్‌ రాసి చివర్లో 'ఫలితం వూహించడం కష్టం' అని ముగిస్తే వాళ్లు నన్ను తన్నడానికి రావచ్చు. కష్టం అంటూనే మీ అంతట మీరు అంచనాకు రావడానికి ఆ వ్యాసపరంపర దోహదపడుతుంది. ఆ కసరత్తు చేయడం యిష్టం లేనివారు నా సీరీస్‌ చదవడం మానేస్తే మంచిది. 

కొందరు నాకు అప్పుడే మెయిల్స్‌ రాస్తున్నారు. '2009 ఎన్నికల ఫలితాలు మీరు కరక్టుగా వూహించారు. 2014 ఫలితాలు కూడా వూహించి పంపండి.'' అని. అప్పుడే ఎలా చెప్పగలం? పార్టీ ఫిరాయింపులే పూర్తి కాలేదు, పొత్తులు ఖరారు కాలేదు. ఆచరణలో ఆ పొత్తులు ఎలా అఘోరిస్తాయో చూడనే లేదు. మధ్యలో ఎవరు ఏ కూతలు కూసి ఓటర్లను రెచ్చగొడతారో తెలియదు. కొందరు మీడియా పెద్దలు యివేమీ లెక్కలోకి తీసుకోకుండా మూడేళ్లగా సీమాంధ్రలో వైకాపా, తెలంగాణలో తెరాస విజయకేతనాన్ని ఎగరేస్తాయని వ్యాసాలు రాసేస్తూనే వచ్చారు. నేను అప్పణ్నుంచీ చెపుతూనే వచ్చాను – అప్పుడే యిలా తీర్మానించడం పొరబాటు అని. ఇప్పుడు చెప్పండి – వైకాపా, తెరాస తప్ప వేరేవాటికి ఛాన్సు లేదా? విభజన తర్వాత టిడిపికి ఆదరణ కలుగుతుందని ఎవరైనా వూహించారా? తొందరపడి ఒక నిర్ణయానికి రాలేం అన్న గ్రహింపు నాకుంది. 2009 ఎన్నికల జోస్యం చెప్పినపుడు కూడా ఎన్నో రైడర్స్‌ పెట్టాను. అయినా అది మిడతంభొట్లు జోస్యం అయి వుండవచ్చు. 2004లో టిడిపి గెలుస్తుందని అనుకుని బోల్తా పడ్డాను కదా. అప్పట్లో వ్యాసాలు రాయలేదు కాబట్టి లోతుగా విశ్లేషించి వుండకపోవచ్చు. పార్టీపై అభిమానంతో మీడియా ఏం చెపితే అది గుడ్డిగా నమ్మేసి వుండవచ్చు. ప్రస్తుతానికి వస్తే పవన్‌కు ఛాన్సు వుంది, లేదు అన్నది చర్చించగలం కానీ యితమిత్థంగా చెప్పలేం. 

సరే, అలాగే అనుకున్నా ఈ పాయింటు ఒక్కటీ చెప్పకుండా తక్కినవాటి గురించి రాయడం దేనికి? అని కొందరి సందేహం.  ప్రపంచంలో ఏదీ విడిగా, ఐసోలేటెడ్‌గా వుండదు. ఒకదానికి మరోదానికి లింకు వుంటుంది. ప్రకృతి సూత్రాలు మానవజీవితాల్లో ప్రతిఫలిస్తాయి. చరిత్ర పునరావృతం అవుతూ వుంటుంది. గతాన్ని (పురాణం, యితిహాసం, చరిత్ర, అనుభవాలు) నేపథ్యంగా పెట్టుకుని, సంచిత సమాచారంతో వర్తమానాన్ని విశ్లేషిస్తే మనకు దారి కనబడుతుంది, చిక్కుముళ్లు విడిపోతాయి. అందుకే అప్రస్తుతం అనిపించే విషయాలను కూడా నేను ఉటంకిస్తూ వుంటాను. ఇదే సందర్భంలో తరచుగా వచ్చే మరో వ్యాఖ్య గురించి చెప్పాలి. మోదీ గురించి  చిన్న వ్యాసం రాస్తే, 'మరి రాహుల్‌ సంగతేమిటి?' అంటూ ఎవరో కామెంట్‌ చేస్తారు. రాహుల్‌ విషయం వచ్చినపుడు అదీ రాస్తాం. ప్రస్తుతాంశం మోదీ అయితే మోదీ గురించే ప్రధానంగా రాస్తాం. అలా చేసిన యితర్ల గురించి కూడా రాస్తూ పోతే అది సీరీస్‌గా తయారవుతుంది. సంబంధం లేని విషయాలు రాస్తున్నావని మళ్లీ గగ్గోలు పెడతారు.  

ఇక నాపై మాటిమాటికీ వచ్చే విమర్శే మళ్లీ ప్రస్తావించారు. నాకు నిలకడ లేదని, నా భావాల్లో కన్సిస్టెన్సీ లేదని, ఒక్కోసారి ఒక్కో నాయకుణ్ని మెచ్చుకుంటాననీ, తర్వాత తప్పుపడతాననీ అంటారు. అది నిజమే. ఆలోచించే వ్యక్తి అలాగే వుండాలని అనుకుంటాను నేను. చదువురాని వ్యక్తి సైతం హీరో వేసిన అన్ని సినిమాలనూ ఆదరిస్తున్నాడా? లేదే! భావాల రీత్యా నేను ఏ పార్టీకి దాసుణ్ని కాను, కట్టుబానిసను కాను. మా కుటుంబం ఏ పార్టీకి తరతరాలుగా కట్టుబడి లేదు. మా తాత (మాతామహులు) కుటుంబం కాంగ్రెసు కుటుంబం. స్వాతంత్య్రోదమంలో పార్టీ తరఫున జైళ్లకు వెళ్లినవారు. మా నాన్న ప్రకాశంగారి అభిమాని. ఆయన కాంగ్రెసులో వున్నంతకాలం కాంగ్రెసుకి ఓటేసి, బయటకు వచ్చేసి ప్రజా పార్టీ పెడితే దానిలో కార్యకర్తగా వున్నారు. ఇక నేను అనేక పార్టీలకు ఓటేశాను. జనతా పార్టీ, సిపిఎం, బిజెపి, డిఎంకె, టిడిపి.. చివరకు 2009లో కాంగ్రెసుకు కూడా ఓటేశాను. సమైక్యవాదిగా జగన్‌ ఢిల్లీ పెత్తనాన్ని వ్యతిరేకించి మానుకోటకు వెళితే హర్షించాను. సొంతంగా పార్టీ పెట్టాక సమైక్యవాదాన్ని పక్కన పడేసి 'సమన్యాయంతో విభజన చేయాల'న్న స్లోగన్‌ ఎత్తుకుంటే విమర్శించాను. నాకు సమైక్యవాదం యిష్టం కాబట్టి, ఢిల్లీ పెత్తనం అసహ్యం కాబట్టి ఆ దారిలో వెళ్లినవారిని అభిమానించాను. నేను మారలేదు, మారినది జగన్‌. ఢిల్లీతో రాజీ పడుతున్నది జగన్‌. 

అప్పుడు మెచ్చుకున్నాను కాబట్టి యిప్పుడూ మెచ్చుకోవాలంటే నా తరం కాదు. ఏం చేసినా, ఎప్పుడూ మెచ్చుకోకూడదని వాదించేవారికి నమస్కారం. 2 జి స్కాము తర్వాత యీ రోజు నేను డిఎంకెకు ఓటేయను. అప్పుడు వేశాను – కరుణానిధి మంచి ఎడ్మినిస్ట్రేటర్‌ కాబట్టి! నాలాగే చాలామంది ఓటర్లు ఆలోచిస్తారు. అందుకే ఫలితాలు ప్రతి ఎన్నికకు మారతాయి. వీటిని కులసమీకరణాల్లో బిగించాలని చూసేవారు అంచనాలు తప్పి బోల్తా పడతారు. ఇంకోటి కూడా గుర్తించాల్సి ఏమిటంటే – నాకు ఫలానావారు చేసిన ఫలానా పని నచ్చింది అని రాస్తే వెంటనే 'అతడు గెలుస్తా డనుకుంటున్నావా?' అని అడుగుతారు. ఇక్కడ గెలుపోటములు అంశమే కాదు. నాకు నచ్చిన పని చేశాడు కాబట్టి నెగ్గితీరతాడని, వ్యతిరేకంగా రాశాను కాబట్టి ఓడిపోతాడని వాదించే మూర్ఖత్వం నాకు లేదు. మరి కొందరికి నేను ఎవరినైనా విమర్శలు చేయడం నచ్చదు. 'ఇలా ప్రతీవాడికీ వంకలు పెడితే యిక ఎవరికి ఓటెయ్యాలి?' అని విసుక్కుంటారు. మీకు ఓటేయడానికి ఎవరూ కనబడలేదు కదాని ఆ నాయకుడిలో నాకు నచ్చని అంశాన్ని నచ్చిందని రాయలేను కదా. సినిమా సమీక్షకుడు సినిమా ఎలా వుందో రాస్తాడు. 'పాపం  బాగా లేదని రాస్తే ప్రేక్షకుడికి కాలక్షేపం కాకుండా పోతుంది కదా, నిర్మాతకు నష్టం వస్తుంది కదా' అని ఆలోచించడం అతని పని కాదు. 

పవన్‌ సీరీస్‌లో మధ్యలో గ్యాప్‌ వచ్చింది. వైజాగ్‌ ఉపన్యాసం యిచ్చే ముందు రోజు ఒక భాగం, యిచ్చే రోజునే రెండు భాగాలు అప్‌లోడ్‌ చేయడం చూసి ఒకాయనకు అనుమానం వచ్చింది. వెబ్‌సైట్‌ కుట్ర వుందేమోనని. అలాటిది ఏమీ లేదు. నా వ్యాసాల్లో అంతరాయం కలుగుతూండడం సహజమే. రెండు రాష్ట్రాల భవిష్యత్తు.. సీరీస్‌ మధ్యలో ఆగింది. సీరియళ్ల సంగతి చెప్పనే అక్కరలేదు. దీని వెనక ఏవేవో కుట్రలు వుంటాయనుకోవడం హాస్యాస్పదం. అయినా పవన్‌ కళ్యాణ్‌ మీటింగుకి వెళ్లబోతూ 'గ్రేట్‌ ఆంధ్రాలో ఎమ్బీయస్‌ ఏం రాశాడో చూదాం, అవసరమైతే ఉపన్యాసంలో మార్పులు చేద్దాం పట్టు' అనుకోడు కదా. పవన్‌ను చూడ్డానికి వెళ్లేవాళ్లు కూడా 'ఎమ్బీయస్‌ పవన్‌కు ఛాన్సు లేదని రాశాడు కదా, యింకెందుకు వెళ్లి చూడడం' అని మానేయరు కదా! చూడాలని అనుకోనివారు నేను ఛాన్సుందని రాస్తే వెళ్లి చూడరు. 

పవన్‌ గురించి యింత సీరియస్‌గా తీసుకోవడం వేస్టు అని కొందరు ఘాటుగా రాశారు. అది అప్పటికి నాకు తెలియదు కదా. పవన్‌ ఏదో చేస్తాడని అందరూ అనుకున్నారు. పత్రికల్లో, టీవీల్లో చాలా చర్చలు జరిగాయి. వాటితో పోలిస్తే నా సీరీస్‌ చాలా చిన్నదే. ఒక విషయం నిజాయితీగా ఒప్పుకోవాలంటే – వైజాగ్‌ ఉపన్యాసం ముందే విని వుంటే నేను యీ సీరీస్‌లో సగం కూడా రాసి వుండేవాణ్ని కాను. మోదీకి జై అనడానికి పవన్‌ పార్టీ పెట్టడం దేనికి? ఇంత హంగామా దేనికి? అవినీతి గురించి ఆవేశకావేష ప్రదర్శన దేనికి? నాగార్జున లాగానే వెళ్లి కలిసేసి వస్తే పోయేది కదా. నిజాయితీపరులైన యువకులు దొరికేవరకు ఆయన ఎన్నికలలో పోటీ చేయడట! అంటే ప్రస్తుతం వున్న యువతలో నిజాయితీపరులు ఎవరూ ఆయన కంటికి ఆనలేదు. ఐదేళ్ల తర్వాత ఎవరో పుట్టుకుని వస్తారన్నమాట. ఎలా పుట్టుకువస్తారు? ఈయన మద్దతుతో కేంద్రంలో మోదీ పాలన సాగుతుంది కాబట్టి నిజాయితీపరులు తయారవుతారన్నమాట.(సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2014)

[email protected]

Click Here For Part-1