యువతరం మనోభావాల్ని తెరపై ఆవిష్కరిస్తూ 2007లో శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకొంది. తమిళంలోనూ రీమేక్ అయ్యింది. అక్కడ కూడా ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పట్టారు. దీంతో అప్పటిదాకా గుర్తింపులేని తమన్నాకి ఈ సినిమాలతో నిజంగానే హ్యాపీడేస్ మొదలయ్యాయి.
ఆ తర్వాత హిందీలోనూ ఈ సినిమా రీమేక్ అవుతుందని ప్రచారం సాగింది. కానీ అది నిజం కాలేదు. శేఖర్ కమ్ముల ఇతర ప్రాజెక్టులతో బిజీ కావడంతో… ఆ చిత్రం హిందీకి వెళ్లలేదు. అయితే ఇటీవల ఆ ప్రయత్నాలు మొదలైనట్టు సమాచారం. ప్రముఖ కథానాయకుడు సల్మాన్‌ఖాన్ నిర్మాణంలో హిందీలో హ్యాపీడేస్ తెరకెక్కబోతోందని ప్రచారం సాగుతోంది. అక్కడ శేఖర్ కమ్ములనే ఈ సినిమాని తెరకెక్కిస్తాడట. మరొక ప్రముఖ నిర్మాతతో కలిసి సల్మాన్ నిర్మిస్తారట.
స్వతహాగా చిన్న సినిమాలని ఎంతగానో ఇష్టపడే కండలవీరుడు సల్మాన్‌కి హ్యాపీడేస్ బాగా నచ్చిందట. హిందీలో టీవీల్లో కనిపిస్తున్న నవతరం టాలెంట్‌ని గుర్తించి `హ్యాపీడేస్` కోసం నటీనటుల్ని ఎంపిక చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.