మామూలుగా నా రాతలపై విమర్శలు వస్తూనే వుంటాయి. నాకు వ్యక్తిగతంగా మెయిల్ రాసినవారికి జవాబులు యిస్తూనే వుంటాను. నాకు ఫేస్‌బుక్ ఖాతా లేదు కాబట్టి వ్యాసం కింద రాసే వ్యాఖ్యలకు సమాధానాలు యివ్వలేను. ఇప్పటిదాకా వచ్చిన వ్యాఖ్యల్లో యిద్దరు నా తప్పులు ఎత్తి చూపారు. ఖుశ్వంత్ సింగ్ వారసుడు ఎం.వి.కామత్ కానీ ఎ.ఎస్.రామన్ కాదు. ఇంకో వ్యాసంలో ఒక సంపాదకుడి పేరు తప్పుగా రాశాను. అది కూడా ఒక పాఠకుడు సవరించారు. వారికి నా కృతజ్ఞతలు. నేను ఏ వ్యాసం రాసినా వ్యాఖ్య రాయడానికి సివి రెడ్డిగారు రెడీగా వుంటారు. ఆయనకు వ్యాసం సబ్జక్ట్‌తో పని లేదు. ఖాళీగా గోడ కనబడితే బొగ్గుముక్కతో ఎబిసిడిలు రాసేసే ఐదేళ్ల కుర్రాడిలా, ఆయన కామెంట్స్ బాక్స్ కనబడగానే చంద్రబాబుకి వ్యతిరేకంగా ఏదేదో రాసుకుంటూ పోతాడు. 'అసందర్భప్రలాపి' అంటూ తక్కినవాళ్లు ఆయన్ని తిడుతూ రాస్తారు. అయినా ఆయన పట్టించుకోడు.
కొందరికి నా కులం ఏమిటో వూహించడమే పని. నేనేమైనా తప్పుడు కులధృవీకరణపత్రం వుపయోగించి మెడికల్ కాలేజీ సీటో, ఉద్యోగమో, రిజర్వ్ స్థానంలో టిక్కెట్టో సంపాదించి వుంటే దీని గురించి ఆందోళన చెందవచ్చు. పత్రికల్లో వ్యాసాలు రాయడానికి కులం ఏదైతేనేం? వ్యాసకర్తలు తమ కులంలోని నాయకులను మాత్రమే ప్రశంసిస్తూ, తక్కిన కులాల వారిని తీసిపారేస్తారా? ఒకే కులంలోనే రాజకీయ ప్రత్యర్థులు వుంటున్నారే, దానికేమంటారు? ఇంత తెలివితక్కువగా ఆలోచించేవాళ్లకు కూడా వ్యాఖ్యలు రాయడానికి చోటు దొరకడం విషాదం. ఇక కొందరు వ్యాసకర్తపై తమ అభిప్రాయం రాయడం మానేసి వ్యాఖ్యాతల వ్యాఖ్యలను తిడుతూ రాస్తారు. అసభ్యపదాలు కూడా వుపయోగిస్తారు. వీటిని ఎడిట్ చేయడానికి ఎవరూ వుండరా అనిపిస్తుంది నాకు. ఇలాటి వ్యాఖ్యలు చదవడానికి టైము వెచ్చించేవారిపై నాకు జాలి కలుగుతుంది. నా వ్యాసాలపై కామెంట్లు కనీసం నేనైనా చూడాలి కాబట్టి పైపైన చూస్తూ వుంటాను.
పవన్ సీరీస్‌పై చాలా వ్యాఖ్యలు, విమర్శలు వచ్చాయి. వారిలో చాలామంది విసుక్కున్నదేమిటంటే – 'ఛాన్సుందా..?' అని మొదలుపెట్టి, ఆ ముక్క చెప్పకుండా ఏదేదో రాసుకుంటూపోయి చావగొట్టావ్ అని. వీరు గమనించవలసినదేమిటంటే దేనికైనా డెఫినిట్ ఆన్సర్ యివ్వడానికి యిది గతం కాదు. వర్తమానం, భవిష్యత్తు. గతచరిత్ర రాసేటప్పుడు యిలాటి సందిగ్ధాలకు తావుండదు. వర్తమానాన్ని విశ్లేషించేటప్పుడు అనేక కోణాలను పరిగణనలోకి తీసుకుని ఒక అంచనాకు రావాలి. గమనిస్తే నా వ్యాసాలన్నిటి తీరు యిలాగే వుంటుంది. మీకు తెలియని సమాచారం ఏదీ నా దగ్గర వుండదు. అయితే అన్ని రకాల వార్తలను, వ్యాఖ్యలను ఒక దగ్గర చేర్చి, వాటిని ఒక వరసలో పెట్టి, పలు కోణాల్లో చూపించి, ఇలా కావచ్చా, అలా కావచ్చా అని మనందరం కలిసి ఆలోచిద్దాం అంటాను నేను. ఇది నేను కనిపెట్టిన సూత్రం కాదు. పాశ్చాత్యదేశాల్లో 'లాజిక్', భారతదేశంలో 'తర్కం' పేరుతో జ్ఞానసముపార్జనకు వుపయోగించే పద్ధతి యిదే. ఫిలాసఫీ (జ్ఞానంపై ప్రేమ అని అర్థం)కి ఆధారం తర్కం. సత్యాన్వేషణకు యిది అత్యవసరం.
హెగెల్ 'డయాలెక్టికల్ మెటీరియలిజం' (గతితార్కిక భౌతికవాదం) ఆధారంగానే కమ్యూనిస్టు ఫిలాసఫీ ఏర్పడింది. థీసిస్, యాంటీ థీసిస్, సింథసిస్ అనేవి మూడు స్టెప్స్. ప్రతిపాదన, దానికి వ్యతిరేక ప్రతిపాదన, రెండిటిని కలిపి సమన్వయపరిచే సిద్ధాంతం – యివి. ఉదాహరణకి – పకక్షులు ఎగురుతాయి అనే ప్రాకృతిక వాస్తవాన్ని దగ్గర పెట్టుకుని ఎగిరేవన్నీ పకక్షులు అని తీర్మానిస్తే మరి గాలిపటం మాట ఏమిటి? అనే ప్రశ్న వస్తుంది. అందుచేత పకక్షులు ఎగురుతాయి కానీ ఎగిరేవన్నీ పకక్షులు కావు అని తీర్మానించవలసి వస్తుంది. గతితార్కిక భౌతికవాదం మన వేమన పద్యాలలో కూడా వుందంటాడు శ్రీశ్రీ. ఉప్పు, కర్పూరం ఒకేలా వుంటాయి అనేది ప్రతిపాదన, కానీ రుచి చూస్తే రుచులు వేరు అనేది దాన్ని ఖండించే వాక్యం. ఈ రెండిటిని సమన్వయపరిచే సత్యం ఏమిటంటే – పురుషులందు పుణ్యపురుషులు వేరు అని. చూడడానికి ఒకేలా వున్నా, రుచుల్లో తేడా వున్నట్టే మనుషులందరూ ఒకేలాగ కనబడినా, గుణాల్లో తేడాలున్నాయి అన్న సత్యాన్ని గ్రహించడానికి యీ స్టెప్స్ అవసరం.
ఉపనిషత్తుల్లో కూడా యిలాటి టెక్నిక్ కనబడుతుంది. అవన్నీ సత్యాన్వేషణకు ప్రయత్నించినవే. ప్రశ్న వేస్తారు, దానికి జవాబు చెప్తారు, ఆ జవాబులోంచి మళ్లీ యింకో ప్రశ్న వుదయిస్తుంది. ఇలాటి తర్కం మన మేధస్సుకు పదును పెడుతుంది. విశ్వనాథ వారి నవలలో యిలాటి తర్కం విరివిగా కనబరుస్తారు. 'అక్కడ ఆ వ్యక్తి వున్నాడు. కానీ లేడు. ఇది ఒక చమత్కారము. స్థూలదృష్టితో చూస్తే వున్నాడు. కానీ అతని మనసు అక్కడ లేదు. పరిసరాలు గమనించలేదు. అటువంటి పరిస్థితిలో అతను వున్నట్టు లెక్కించగలమా?.' యీ తరహాలో ఆయన తర్కిస్తూ పోతాడు. ఇవన్నీ కొందరికి విసుగ్గా అనిపిస్తాయి.
ఎందుకంటే బాల్యంలో మనకు అన్నీ ఇన్‌స్టంట్ సమాధానాలు కావాలి. పేజీ తిప్పితే బొమ్మ వస్తుందా రాదా? అని అడగడం, పేజీ తిప్పేసి చూడడం, వస్తే బలపం యిచ్చేయడం, లేకపోతే పుచ్చేసుకోవడం. పాఠం చివర ప్రశ్నోత్తరాల పేజీ కదా, బొమ్మ వుండకపోవచ్చేమో అని ఆలోచించే ఓపిక కూడా చూపం. సినిమాలో ఎవడైనా తెరమీదకు రాగానే నాన్నను గోకుతాం – 'వీడు మంచాడా? చెడ్డాడా?' అని. మనిషిలో రెండూ కలబోసి వుంటాయన్న ఊహే రాదు ఆ థలో. ఆ బాల్యపు థ దాటిన తర్వాత మనకు సందేహాలు, సంశయాలు మొదలవుతాయి. 'దేవుడు వున్నాడా? లేడా?' అన్న ప్రశ్నకు ఉన్నాడని చెప్పినవాణ్నీ సందేహిస్తాం, లేడని చెప్పినవాణ్నీ అనుమానిస్తాం. నిదర్శనాలు చూపితే అవి కాకతాళీయాలేమో అంటాం. లేవు పొమ్మన్నవాడికి అవే చూపించి వాటి మాటేమిటని అడుగుతాం. ఇది మేధోక్రీడ. ఎవరికి వారే ఆడి, ఆనందించాలి. నా బోటివాడు ఎలా ఆడాలో ఐడియాలు చెపుతాడంతే. పది కోణాల్లో ఆలోచించాలని సూచించిన తర్వాత మీరే స్వయంగా ఆలోచిస్తారు. చివరకు నేను అనుకున్నదానికి భిన్నంగా మీ సింథసిస్ తేలవచ్చు. ఒక్కోప్పుడు అదే కరక్టు కావచ్చు కూడా. ఇలాటి పరిస్థితుల్లో నేను పవన్‌కు ఛాన్సుంది అనో లేదు అనో ఒక్క పేజీలో రాసి పడేస్తే మీరు దాన్ని ఎలా ఆమోదించగలరు? ఎలా రాసినా 'ఏడిశావులే' అంటారు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2014)