అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్ కందా
పై వాడినీ 'చూసుకోవాలి'…
ఎన్టీ రామారావుగారికి ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ప్రభుత్వపరమైన ఖర్చు తగ్గించాలని చాలా పట్టుదలగా వుండేది.
''49 కార్పోరేషన్లు వున్నాయి కదా వాటిలో కొన్నిటిని రద్దు చేసేసి, మరికొన్ని కలిపేసి 9 చేసేయవచ్చు' అని ఎవరో యిచ్చిన సలహా ఆయనకు నచ్చింది.
ఈ 49 కేంద్రప్రభుత్వ చట్టాలకు లోబడి ఏర్పడినవి. వాటిలో కొన్నిటికి ప్రపంచబ్యాంకుతో ఒప్పందాలు కూడా వున్నాయి.
అయినా ఓ ఉన్నతాధికారి రామారావుగారి మెప్పుకోసం 'ఒక్క కలంపోటుతో యిది చేసేయవచ్చు, చేసేస్తున్నాం అని ఢిల్లీలో ప్రెస్ మీట్‌లో ప్రకటించండి, సెన్సేషనల్‌గా వుంటుంది' అని సలహా యిచ్చి ఓ కాగితం ముక్కమీద ఏ చట్టాలూ ఉదహరించకుండా పొడిపొడిగా రాసి యిచ్చేశారు.
రామారావుగారు ఢిల్లీ వెళుతూ నా చేతికి యిచ్చి ''మోహన్, మనం ఢిల్లీ వెళ్లగానే మొదట రాష్ట్రపతి వద్దకు, తర్వాత ఉపరాష్ట్రపతి, ఆ తర్వాత ప్రధానమంత్రి దగ్గరకు వెళతాం. వెంటనే ప్రెస్ మీట్. ఆ టైములో యీ ప్రకటన చేస్తాం. కాగితం మీ జేబులో వుంచండి'' అన్నారు.
నేను అప్పుడు ఆయన కార్యాలయంలో సెక్రటరీని. ఈ కార్పోరేషన్ల రద్దు అంత సులభంగా జరిగేది కాదని తెలుసు. ఆ విషయం ఎవరైనా విలేకరి గ్రహించి ఎదురుప్రశ్నలడిగితే ముప్పు. కానీ చెపితే వినే మూడ్‌లో లేరాయన.
సరే అని తలవూపి, ప్రెస్ సమావేశం సమయంలో జేబులోంచి కాగితం తీసి యివ్వలేదు.
సమావేశం ముగిసి, కారులో వెళుతూ వుంటే ఆయనకు గుర్తు వచ్చింది. అడిగారు. ''మీ స్థాయి నాయకుడు జాతీయ స్థాయి పత్రికా విలేకరులముందు తొందరపడి చెప్పడం సబబు అనిపించలేదు.'' అన్నాను.
ఆయనకు కోపం వచ్చింది. ఐదు నిమిషాలపాటు మాట్లాడలేదు. తర్వాత ''మోహన్, నాకు కొన్ని విషయాలు నచ్చవ్'' అన్నారు.
ఆయన కోపాన్ని భరించాను – ఆయన మంచి కోసమే. ఎందుకంటే ఆ రద్దులు, విలీనాలు ఎంత క్లిష్టమైనవంటే పాతికేళ్ల తర్వాత కూడా ఆ పని పూర్తిగా జరగలేదు.
xxxxxx
ఉద్యోగస్తులు చాలా స్వార్థపరులనీ, ఏదైనా సరే తమకు నష్టం కలగకుండా జాగ్రత్త పడతారనీ అంటారు. ఏదైనా పని చేస్తే 'దీని వలన ప్రభుత్వానికి లేదా ప్రజలకు నష్టం వస్తుందేమో అనే ఆలోచన' కంటే 'దీని మీద సంతకం పెడితే నా ప్రమోషన్‌కు దెబ్బ కొడుతుందా, నేనేమైనా కేసులో యిరుక్కుంటానా, దాని వలన నేను సజావుగా రిటైర్ కాకుండా పెన్షన్‌కు గండి కొడుతుందా' అన్న ఆలోచనలతోనే సతమత మవుతుంటారని ఎద్దేవా చేస్తారు.
స్వీయచర్మరక్షణ (సేవింగ్ వన్స్ ఓన్ స్కిన్) అన్నది తప్పేమీ కాదు. కానీ అక్కడే ఆగిపోకూడదు. పైవాడు నోటిమాటగా ఆదేశాలు యిచ్చినపుడు వాటిని కాగితంమీద పెట్టమని అడగడం ఉచితం. మన రాష్ట్రపు ఎడ్మినిస్ట్రేషన్ అంతా 'టోటన్‌హామ్' విధానంపై నడుస్తుంది. లార్డ్ టోటన్‌హామ్ ఇంగ్లీషువాడు. ఫైలు ఎలా మొదలవుతుంది, దానిపై సంతకాలు ఎవరు పెట్టి పైకి పంపించాలి, దానిపై నిర్ణయం తీసుకునేటప్పుడు ఎలా రాయాలి.. యివన్నీ చాలా చక్కగా, దూరదృష్టితో ఆయన రూపొందించారు. ఆ పద్ధతులను సరిగ్గా అమలు చేస్తే చాలు, పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. ఏదైనా పొరపాటు జరిగితే ఎవర్ని బాధ్యులను చేయాలో ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ విధానానికి గండి కొట్టినపుడే యిబ్బందులు వచ్చి పడతాయి.
మనకంటె ఉన్నతాధికారికి, లేదా మంత్రికి కొన్ని రకాల ఒత్తిళ్లు వుండవచ్చు. అందువలన ఫలానా నిర్ణయం తీసుకోమని మనపై ఒత్తిడి తేవచ్చు. నిర్ణయం తీసుకునే థలో మనం ఎంతైనా వారితో వాదించవచ్చు, విభేదించవచ్చు. కానీ నిర్ణయం తీసేసుకున్నాక – అది మనకు సజావుగా తోచకపోయినా – ప్రభుత్వపరమైన నిర్ణయం అవుతుంది కాబట్టి మనం దాన్ని సమర్థించక తప్పదు. దాని గురించి బహిరంగ చర్చ జరిగినపుడు, లేదా శాసనసభలో, పార్లమెంటులో ప్రశ్నలడిగినపుడు, కోర్టువారు నిలదీసినపుడు – అన్ని రకాల పరిస్థితుల్లోనూ అదే సబబైన, సమంజసమైన నిర్ణయమనీ, ఆ ప్రత్యేక పరిస్థితుల్లో దానిని మించిన భేషైన నిర్ణయం మరొకటి లేదని గట్టిగా వాదించాలి. అది మన ఉద్యోగధర్మం. అలా వాదించగలగాలంటే ఆ నిర్ణయం న్యాయసమ్మతంగా తోచాలి. అలా తోచే జాగ్రత్తలు మనం పడాలి.
రాబోయే పరిణామాలను మేం వూహించినట్లుగా రాజకీయ నాయకులు ఊహించలేని సందర్భాలు కూడా వుంటాయి. రిస్కు తీసుకోవడమనేది రాజకీయ నాయకులకు సహజాత లక్షణం. 'ఏం ఫర్వాలేదు, ఎవడడుగుతాడో చూదాం, అడిగితే అప్పుడే చూదాం, అయినా యిది బయటకు వచ్చేసరికే రాజెవడో? రంగడెవరో? మనం ఎక్కడుంటామో' అన్న మొండిధైర్యం వాళ్లకు వుంటుంది. వాళ్ల పదవీకాలం మహా అయితే కొన్ని ఏళ్లు. మరి మా ఉద్యోగకాలం కనీసం మూడు థాబ్దాలు. ఆరోపణలున్నా ప్రజలు మళ్లీ ఓట్లేసి గెలిపించారు ఆ ఆరోపణలలో సత్తా లేదని రాజకీయనాయకులు అనుకుంటారు, అంటారు. కానీ ఉద్యోగి అలా అనుకోడు. ఆడిటర్లు, కాగ్‌వారు, శాసనసభా కమిటీలు, డిసిప్లినరీ అథారిటీలు, కోర్టువారు అలా అనుకోనివ్వవు.
మనకు చెడ్డపేరు రాకుండా చూసుకోవడం ఒకటే కాదు, మన పైన వున్న మంత్రిగారికి కూడా చెడ్డపేరు రాకుండా చూడవలసిన బాధ్యత మనపై వుంటుంది. చిన్నప్పట్నించి మాకు నేర్పించిన సూత్రాలలో అదొకటి. ఇది చెప్పినంత సులభం కాదు. ఈ క్రమంలో మేము పై అధికారులతో, మంత్రులతో తలపడి వుండవలసి వుంటుంది. అది వాళ్లకు రుచించదు. వాళ్ల మేలు గురించి చెప్పినా ఆ క్షణానికి యిది 'ధిక్కారం' (ఇన్‌సబార్డినేషన్) అనిపిస్తుంది. అనవసరంగా అడ్డుపడుతున్నాడనిపిస్తుంది. కానీ తప్పదు.
xxxxxx
1995 లో నేను ఢిల్లీలో వ్యవసాయమంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. వెళ్లీ వెళ్లగానే ఆగ్రి ఎక్స్‌పో అని భారీ ఎగ్జిబిషన్ నిర్వహించే పని పెట్టారు. దానికి సినిమా తీయించాలని ప్రతిపాదన. ఆ సినిమా కాంట్రాక్టును తనకు తెలిసినవాళ్లకు యిప్పించాలని ఒక అధికారిణి పట్టుదల. ఆవిడ మరెవరో కాదు, మా మంత్రిగారి స్పెషల్ అసిస్టెంట్. పద్ధతి ప్రకారం వెళదామని నా పట్టుదల. దాంతో యిద్దరి మధ్య ఘర్షణ తప్పలేదు.
నిజానికి ఢిల్లీలో కాంట్రాక్టు యివ్వడం ఓ పట్టాన అయ్యే పని కాదు. ఢిల్లీ విఐపిల నగరం. అందరూ ప్రముఖులే. లేదా ప్రముఖుల తాలూకువాళ్లే. దేశమంతా యిక్కణ్నుంచే నడపాలని అందరికీ ఉబలాటం. అందరూ పాలకులే. తమకు యివ్వాల్సిన ప్రాధాన్యత ఎంత, దేశానికి యివ్వాల్సిన ప్రాధాన్యత ఎంత అన్న విషయంలోనే కాస్త గందరగోళం. అందుకే ఎవరో చమత్కరించారు – 'ఢిల్లీ యీజ్ ఏ క్యాపిటల్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ కంట్రీ' అని. (ఏలవలసిన దేశం కోసం అన్వేషించే రాజధాని – ఢిల్లీ) ప్రభుత్వం తరఫున చేయాల్సిన ఏ పని వున్నా కాంట్రాక్టర్లు సిద్ధమవుతారు. ఒకరు, యిద్దరు కాదు బోల్డుమంది. ప్రతివాడికీ ఎవరో ఒకరు తెలుస్తారు – మంత్రో, ఎంపీయో, వ్యాపారవేత్తో, ఉన్నతాధికారో… ! నగరం విఐపిలతో కిటకిటలాడిపోతున్నపుడు యింతమందిలో ఎవరో ఒక ప్రాణి తెలియడం అబ్బురం కాదు. మనం కాంట్రాక్టు యివ్వడానికి వీలుపడదనో, లేదా సరిగ్గా చేయలేదు కాబట్టి సహించమనో అనగానే ఆ కాంటాక్ట్‌ను యాక్టివేట్ చేస్తాడు. అధికారికి ఫోన్ వచ్చేస్తుంది. అందుకనే కమిటీలు వేసేసి నిర్ణయం పదిమంది మీదా సర్దేసి, తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు ఎవర్నీ బాధ్యుణ్ని చేయకుండా జాగ్రత్తపడడం రివాజుగా మారింది.
ఈ ఎగ్జిబిషన్ సమయంలో కూడా కాంట్రాక్టర్‌ను అపాయింట్ చేసే విషయంలో ఎవరికో యిప్పించాలని ఎవరికో ఉద్దేశం. అలా జరగడానికి వీల్లేదని మా పట్టుదల. మొత్తానికి ఏదో కమిటీ పెట్టి ఎలాగోలా చూడండి అన్నారు. కమిటీ వేశాం. దీనితో నిభాయించుకుంటూ వస్తూండగానే ఒక అధికారిణి గారు సినిమా అంటూ తల దూర్చారు. ఆవిడ మా మంత్రి బలరాం జాఖడ్ గారికి స్పెషల్ అసిస్టెంట్‌గా పని చేసేది. అసలు యీవిడ జాయింటు సెక్రటరీ. జాయింటు సెక్రటరీ ర్యాంకు వాళ్లు స్పెషల్ అసిస్టెంట్ పని చేయకూడదు. అందువలన పాలసీ అండ్ ప్లానింగ్ ఉద్యోగంలో ఈవిణ్ని వేశారు. ఆ శాఖలో ఏం జరిగినా ఆవిడకు తెలియాల్సిందే. నా నియామకం ఆవిడకు తెలియకుండా జరగడంతో మా మధ్య సత్సంబంధాలకు ఆదిలోనే హంసపాదు పడింది.
నేను ఢిల్లీ పోస్టింగు కోరుకున్నపుడు రాష్ట్ర పరిధిలో లేనివి, కేంద్రంలో మాత్రమే వుండేవి అయిన మంత్రిత్వశాఖలు కావాలని కోరుకున్నాను. సరే చూదాం అంటూనే రప్పించి వ్యవసాయశాఖలో వేశారు. రాష్ట్రంలోనూ దీన్నే రాపాడించాం, యిక్కడా అదేనా అనుకుంటూ ఢిల్లీ వెళ్లాను. వెళ్లిన మొదటిరోజే 'ఇంటర్‌నేషనల్ కో-ఆపరేషన్' అనే చాలా ప్రతిష్ఠాత్మకమైన డెస్కు యిచ్చారు. అంటే ప్రతీ మంత్రిత్వశాఖలోనూ ఈ డెస్కు విడిగా వుంటుంది. ఈ విభాగానికి సంబంధించి అంతర్జాతీయంగా పనిచేసే అన్ని సంస్థలతోనూ మనం వ్యవహరిస్తూ సమన్వయం చేయాలి. అంటే దేశవిదేశాలలో ఈ రంగంలో ఎటువంటి వ్యవహారాలు తాజాగా జరుగుతున్నాయో నిత్యం గమనిస్తూ, ఏ రకమైన కార్యక్రమాలు, సమావేశాలు ఎవరు నిర్వహిస్తున్నారో తెలుసుకోవడం, విదేశీ నిపుణులను మన దేశానికి ఆహ్వానించి వారితో లెక్చర్లు యిప్పించి మనవాళ్ల అవగాహనను పెంచడం, వచ్చినవారికి అతిథ్యాలు, ఏర్పాట్లు, మన దేశం నుండి ఎవరినైనా పంపాలా? ఎక్కడికి పంపాలి? – యిత్యాది అనేక విషయాలు డీల్ చేయడానికి ప్రతీ శాఖలో – హెల్త్ కానీయండి, ఎడ్యుకేషన్ కానీయండి, అగ్రికల్చర్ కానీయండి – ఓ డెస్కు వుంటుంది. దానిలో వేశారన్నమాట.
చేరిన మొదటిరోజునే ఎవరో విదేశీ ప్రముఖుడు వస్తే అశోకా హోటల్‌లో భోజనం అదీ ఏర్పాటు చేశారు. మంత్రిగారు వచ్చి ఉపన్యసించారు. ఓహో పర్వాలేదు యిదేదో చాలా బాగుందనుకున్నాను. నాకు అంతకుముందు దీని గురించి పెద్దగా తెలియకపోయినా ఇదేదో కొత్తగా, నేర్చుకోవడానికి సబ్జెక్టు బాగానే వుందనుకున్నాను. కానీ ఆ భోగం, ఆ భాగ్యం ఒక్కరోజే! ఏక్ దిన్ కా సుల్తాన్ అన్నట్టు ఒక్కరోజు అక్కడ కూర్చోనిచ్చి మర్నాడే నన్ను వేరే చోటకి మార్చి ఆ పోస్టు ఇంకోళ్లకి ఇచ్చారు. నాకు ఒకటే ఆశ్చర్యం. ఈ డెస్కు కావాలని నేను అడగలేదు, అందువలన వెళ్లిపోయిందన్న బాధ లేదు. కానీ బొత్తిగా ఒక్కరోజులోనే పోస్టింగ్ మార్చేయడం ఏమిటి? ఆ ఒక్కరోజులో నేను చేసిన ఘనకార్యం కానీ, మరోరకమైన కార్యం కానీ ఏమీ లేదే! ఏమిటీ వింత? అని అడగబోతే అప్పుడు బయటకు వచ్చింది ఈ అధికారిణి గారి పేరు.
'ఆవిడ మంత్రిగారికి ప్రైవేట్ సెక్రటరీ. నీ ఫైల్ మంత్రిగారు, ప్రధానమంత్రి క్లియర్ చేసినప్పుడు ఆవిడకు తెలియదు. ఆ సమయంలో ఆవిడ ఆపరేషన్ చేయించుకోవడానికి ఆసుపత్రిలో వుంది. ఆవిడకి తెలియకుండా నువ్వు వచ్చేశావ్. ఇలాటిది యీ శాఖలో ఎప్పుడూ జరగలేదు, దాంతో ఆవిడ నివ్వెరపోయింది. ఇక్కడ యీ డెస్కులో పోస్టింగు వేసినప్పుడు కూడా ఆవిడ లేనప్పుడు సెక్రటరీగారు చెప్పడం, మంత్రిగారు వెంటనే ఒప్పుకోవడం, నీ కిచ్చేయడం జరిగిపోయింది. దాంతో ఆవిడ శివాలెత్తిపోయింది. ఇక్కడే దీనికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో మరెన్ని 'ఘోరాలు' జరుగుతాయోనని బెంబేలుపడి వెనక్కి రాగానే పట్టుబట్టి నీ సీటు మార్పించి, వేరే అతనికి యిప్పించి తన అధికారాన్ని సుస్థిరపరుచుకుంది.' అని చెప్పారు. ఏది ఎలా వచ్చినా స్వీకరించడం అలవాటు పడినవాడిని కాబట్టి పంతాలకు పోయి మళ్లీ ఆ సీటు దక్కించుకునే ప్రయత్నాలు ఏమీ చేయలేదు.
అదీ మా ఫ్లాష్ బ్యాక్. ప్రస్తుతానికి వస్తే నేను ఒకరోజు నా రూంలో పనిచేసుకుంటూండగా అధికారిణి గారి నుండి కబురు వచ్చింది. ఆవిడ రూముకి వెళితే ఎవరో ఒకావిడ కూర్చుని వుంది అక్కడ.
ఆవిడని పరిచయం చేసి, ''మన అగ్రి ఎక్స్‌పో ఎగ్జిబిషన్ వస్తోంది కదా, ఈవిడకు దాన్ని సినిమాగా తీయాలని వుంది ఆ కాంట్రాక్టు ఈవిడకే యివ్వాలి.'' అంది.
''అలాగా, నా దగ్గరకి రమ్మనండి, చూస్తాను'' అని చెప్పి వచ్చేశాను.
ఇలాటివాటిల్లో ప్రొసీజర్ చూడబోతే కొల్లేటి చాంతాడంత వుంది. మొదట ఈ ఎగ్జిబిషన్‌ను మనం సినిమా తీయిస్తే మంచిది అని అంటూ ఓ కమిటీ నిర్ణయం తీసుకుని 'మా మనసులో వున్నది యిది. ఇది ఎవరు ఎలా చేయదలచుకున్నారో చెప్పండి' అని అంటూ 'రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్' మనం యివ్వాలి. దానిపై కొంతమంది యీ పని చేయడంలో మాకు ఇంట్రస్టు వుంది అంటే – 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' అని అప్లయి చేస్తారు. వాళ్లు చెప్పినవన్నీ చూసి వారిలో ఎవరి ప్రతిపాదన బాగుందో దాన్ని ఎంపిక చేయాలి. దానిలో సాంకేతికపరంగా, సృజనాత్మకంగా ఎవరు బాగా తీస్తారు, ఎంత తక్కువలో తీస్తారు అనే వివిధ కోణాలలోనుండి పరిశీలించి కమిటీకి నివేదిస్తాం. ఆ కమిటీవాళ్లు ఏం నిర్ణయిస్తే అదే ఫైనల్.
ఇంత వ్యవహారం వుండగా యీవిడ చెప్పింది కదాని ఎవరో ఒకరికి గభాలున కాంట్రాక్టు ఎలా కట్టబెట్టేస్తాం? అందుకే శ్రద్ధగా యివన్నీ శాస్త్రప్రకారం చేసుకుంటే పోతూ చివరకి యిద్దరు క్వాలిఫై అయ్యారు. అధికారిణిగారి కాండిడేటు ఒకరు, ఇంకోరు. ఈవిడ కాండిడేటు చెప్పిన ధర ఎక్కువ. రూలు ప్రకారం అవతలివాళ్లకి కాంట్రాక్టు యివ్వాలి.
ఫైలు యీ థకు వచ్చేసరికి అధికారిణిగారు ఫోన్ చేసి ''నాకు ఆ ఫైలు చూడాలని వుంది. పంపించండి.'' అంది.
నాకు పంపాలని లేదు. పంపకుండా వుండలేను. ఏం చేయాలని అడిషనల్ సెక్రటరీని సలహా అడిగాను. ఆయనా నేను, ఒకేసారి సర్వీసులో చేరాం. ఎకాడమీ ట్రైనింగ్ యిద్దరం కలిసి తీసుకున్నాం. ఆయన మిలటరీలో పనిచేసి వచ్చారు. అలా చేసి వచ్చినవాళ్లకు సీనియారిటీ యిచ్చేవారు. ఆ ప్రకారం ఆయన నాకు నాలుగేళ్లు సీనియరై అప్పుడు అడిషనల్ సెక్రటరీగా వున్నారు. మంచి మిత్రుడు కాబట్టి ఏం చేద్దాం అని అడిగాను. ''ఏముంది? మంత్రి గారి స్పెషల్ అసిస్టెంట్, ఫలానా అధికారిణిగారు ఫైలు చూస్తానన్నారు కాబట్టి ఫైలు ఆవిడకు పంపించడమైనది అని ఫైలు మీదే రాసి పంపించు. ఆవిడ మాట విన్నట్టూ వుంటుంది. నీ శంకా తీరుతుంది.'' అన్నారు.
అలాగే పంపాను. ఆవిడ చర్రుమని లేచింది. ''ఊరికే చూద్దామని అడిగితే యిలా నా పేరు రాసి పంపుతావా?'' అంటూ.
''లేకపోతే ఎలా పంపించగలను?'' అని నేను ఎదురు తిరిగాను.
ఇలా రాయడంతో ఆవిడ గత్యంతరం లేక వ్యవహారాన్ని మంత్రిగారి వద్దకు తీసుకుపోయింది. బలరాం జాఖడ్ గారు ఆవిడ మొహమాటాన్ని అర్థం చేసుకున్నారు. నా నియమబద్ధతనూ అర్థం చేసుకున్నారు.
''ఆ సినిమా తీసే ఆవిణ్ని తన రేటులో 10 వేలు తగ్గించమను. అప్పుడు ఆవిడదే లోయర్ ఆఫర్ అవుతుంది. అప్పుడు రూలు అధిగమించినట్టు అవదు.'' అని తునితగవు చేశారు.
అధికారిణిగారు ఆవిడకు ఏం నచ్చచెప్పారో తెలియదు. ''దీనిలో లాభం తగ్గించుకో, కావాలంటే మరో దాంట్లో సంపాదించుకో. నువ్వు రేటు మార్చకపోతే నా మాట పోతుంది. నా శ్రమంతా వృథా..' యిలా ఏమైనా చెప్పి వుండవచ్చు. ఏది ఏమైతేనేం ఆవిడ రేటు మార్చి యిచ్చింది. కాంట్రాక్టు దక్కించుకుంది. సినిమా తీసింది. ఏ గొడవలూ లేకుండా చివరిలో శుభం కార్డు పడింది.
ప్రభుత్వపరంగా మాకూ ఏ యిబ్బందీ లేకుండా జరిగిపోయింది. నాకే కాదు, అధికారిణి గారికీ, మంత్రిగారికీ ఎవరికీ దీని విషయమై సంజాయిషీ చెప్పుకోవలసిన అవసరమే పడలేదు. ఆ రోజు నా పట్టుదల – అప్పటికి వాళ్లకు చికాకు కలిగించినా – అంతిమంగా మేలే చేసింది. అందుకే నేనంటాను – మనసు నొప్పించైనా సరే, ఒక్కోప్పుడు పై వాళ్లను కూడా – వాళ్లనుంచి వాళ్లనే – రక్షించాల్సింది మనమే! అని.
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version