శ్రీజయనామ సంవత్సర రాశిఫలాలు…

మేషం Advertisement ఆదాయం-14, వ్యయం-2, రాజపూజ్యం-4, అవమానం-5.  ఈ రాశి వారికి గురుడు జూన్ 18వ తేదీ వరకు తృతీయంలోనూ, తదుపరి చతుర్ధస్థానంలో ఉచ్చస్థితిలో ఉంటాడు.   శని నవంబర్ 1వ తేదీ వరకూ సప్తమం,…

మేషం

ఆదాయం-14, వ్యయం-2, రాజపూజ్యం-4, అవమానం-5.

 ఈ రాశి వారికి గురుడు జూన్ 18వ తేదీ వరకు తృతీయంలోనూ, తదుపరి చతుర్ధస్థానంలో ఉచ్చస్థితిలో ఉంటాడు. 
 శని నవంబర్ 1వ తేదీ వరకూ సప్తమం, తదుపరి అష్టమ రాశిలో సంచారం.
 రాహు, కేతువులు జూలై 12వరకు సప్తమం, జన్మరాశిలోనూ, తదుపరి షష్ఠమం, వ్యయస్థితిలో సంచారం.
 వీరికి ఈ ఏడాది గురుబలం కారణంగా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రథమార్థంలో కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి.
జూలై వరకు రాహువు, నవంబర్ వరకు శని సప్తమంలో సంచారం వల్ల మానసిక ఆందోళన, భార్యాభర్తల మధ్య వివాదాలు నెలకొనే అవకాశం. అలాగే కార్యక్రమాలలో జాప్యం తప్పకపోవచ్చు. మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అప్రమత్తత అవసరం. లేనిపోని చిక్కులు ఎదురయ్యే అవకాశం.
కష్టానికి తగ్గ ఫలితం అందక డీలాపడతారు.
జూలై నుంచి పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు కూడా కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. 
ఆర్థికం…ఆర్థిక విషయాలు మధ్యలో కొంత చికాకు పరిచినా మొత్తం మీద సంతృప్తినిస్తాయి.
వ్యాపారాలు..అనుకున్న మేరకు లాభాలు అందుతాయి. మొదట్లో కొంత నిరాశ కలిగించినా క్రమేపీ పుంజుకుంటాయి.
ఉద్యోగులు ప్రథమార్థంలో  విధుల్లో అప్రమత్తంగా మెలగాలి, ద్వితీయార్ధంలో ప్రమోషన్లు తద్వారా బదిలీ సూచనలు.
పారిశ్రామికవేత్తలకు కొంత గందరగోళంగా ఉన్నా అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు.
కళాకారులు.. కొన్ని అవకాశాలు శ్రమానంతరం  దక్కుతాయి. గతం కంటే కొంత మెరుగుదల కనిపిస్తుంది.
రాజకీయరంగం… తమ సత్తాను చాటుకునేందుకు యత్నిస్తారు, అయితే ప్రజాదరణ పొందడంలో కొంత విఫలమయ్యే పరిస్థితి.
వ్యవసాయరంగం….రైతులు కొత్త పెట్టుబడుల కోసం చేసే యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. రెండవ పంట అనుకూలం.
విద్యార్థులు… మరింత శ్రద్ధ చూపాల్సి ఉంటుంది.
సాంకేతికపరమైన విద్యలు, ఉద్యోగలు చేసే వారికి ఒడిదుడుకులు ఎదురైనా సర్దుబాటు కాగలవు.
మహిళలు…ఈ ఏడాదికొన్ని అద్భుత ఫలితాలుచూస్తారు. అనుకున్న రంగాలలో రాణిస్తారు.
నవంబర్ నుంచి అష్టమశని ప్రభావం వల్ల అనారోగ్య సూచనలు, ఔషధసేవనం. స్థానచలనాలు, మానసిక అశాంతి తప్పదు.
జ్యేష్టం, శ్రావణం, మార్గశిరం, మాఘమాసాలు విజయవంతంగా సాగుతాయి. మిగతా నెలలు సామాన్యం.
పరిహారాలు… శనికి తైలాభిషేకం, దుర్గామాతకు కుంకుమార్చనలు, హనుమాన్ చాలీసా పఠనం మంచిది. అదృష్టసంఖ్య-9. 

వృషభం

ఆదాయం-8, వ్యయం-11, రాజపూజ్యం-7, అవమానం-5

వీరికి గురుడు జూన్ 18వరకు ద్వితీయం, తదుపరి తృతీయ స్థానంలో సంచారం. శని నవంబర్ 1వ తేదీ వరకూ షష్ఠమం, తదుపరి సప్తమమైన వృశ్చికంలో సంచారం. ఇక రాహుకేతువులు జూలై 12వ తేదీ వరకూ షష్ఠమ,వ్యయస్థానాలు, తదుపరి పంచమ, లాభస్థానాలలో సంచరిస్తారు.
వీరికి జూన్ వరకు గురుబలం విశేషం. అలాగే, శని, రాహువులు కూడా కొంతవరకూ ఉపకరిస్తారు. వ్యయంలో కేతువు వల్ల మానసిక ఆందోళన. చికాకులు. తీర్థయాత్రలు విశేషంగా చేస్తారు.
ద్వితీయార్థంలో గురుడు తృతీయ రాశిలో సంచారమైనా ఉచ్ఛస్థితి వల్ల కొంత అనుకూలత ఉంటుంది. 
జూలై నుంచి రాహుకేతువులు మరింతగా అనుకూలిస్తారు. మొత్తం మీద వీరికి గతేడాది కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
చేపట్టిన కార్యాలలో విజయం. బంధువులతో వివాదాలుతీరి సఖ్యత నెలకొంటుంది.
ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. తండ్రి తరఫు నుంచి లాభం కలుగుతుంది.
తొందరపాటు మాటల కారణంగా ద్వితీయార్థంలో ఆప్తులు దూరమయ్యే అవకాశం ఉంది. నిదానం పాటించడం మంచిది.
ఇంటిలో శుభకార్యాల నిర్వహణ తద్వారా ఖర్చులు ఉంటాయి.
నిరుద్యోగులకు అనుకూల సమయం. ఉద్యోగయోగం.
ఆదాయం… రావలసిన సొమ్ములు అంది అవసరాలు తీరతాయి.చెల్లించాల్సిన రుణాలు సైతం తీరుస్తారు.
వ్యాపారాలు…చేపట్టిన కొత్త వ్యాపారాలు పుంజుకుని లాభాలు దక్కుతాయి. నూతన పెట్టుబడులు సైతం అందుతాయి.
ఉద్యోగులు….విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. కోరుకున్న బదిలీలు జరిగే అవకాశం.
పారిశ్రామిక, వైద్యరంగాలు…  మరింత గుర్తింపు, ప్రోత్సాహంలభిస్తాయి. 
వ్యవసాయదారులు… రెండుపంటలూ అనుకూలించి ఉత్సాహంగా సాగుతారు.
కళారంగం.. ద్వితీయార్థంలో విజయవంతంగా  ఉంటుంది.  సన్మానాలు, అవార్డులు దక్కే ఛాన్స్.
రాజకీయవర్గాలు….ద్వితీయార్థంలో అనుకూలత ఎక్కువ. ప్రజాదరణ పొందుతారు.
విద్యార్థులు….అనుకూల ఫలితాలతో మరింత ఉత్సాహంగా సాగుతారు.
ఐటీరంగం…ఈ రంగంలోని వారికి చెప్పుకోతగ్గ అభివృద్ధి ఉంటుంది.
మహిళలు….కుటుంబపరంగా విశేషగౌరవంతో పాటు, ఉద్యోగలాభం పొందుతారు.
అక్టోబర్, నవంబర్ నెలల్లో అష్టమ కుజుడు, నవంబర్ నుంచి సప్తమంలో శని సంచారం వల్ల ఈతిబాధలు, జీవిత భాగస్వామితో కలహాలు, అప్పుల కోసం యత్నాలు. ఆరోగ్యపరంగా చికాకులు పెరుగుతాయి.
పరిహారాలు…శనికి తైలాభిషేకం, కుజునికి జపాదులు నిర్వహించాలి. 
ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, పుష్యం, మాఘం, ఫాల్గుణమాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. 
అదృష్టసంఖ్య-6
 
మిథునం

ఆదాయం-11, వ్యయం -8, రాజపూజ్యం-3, అవమానం-1.

ఈరాశి వారికి గురుడు జూన్ 18వ తేదీ వరకూ జన్మరాశి, తదుపరి ద్వితీయమైన కర్కాటకరాశిలో ఉచ్చస్థితిలో సంచారం. శని నవంబర్ 1వ తేదీ వరకూ పంచ మ స్థానం, తదుపరి షష్ఠమ రాశిలో సంచారం.
ఇక రాహు, కేతువులు జూలై 12వరకూ పంచమం, లాభస్థానాల్లోనూ, తదుపరి చతుర్ధం, దశమరాశుల్లో సంచారం.
వీరికి ప్రథమార్థంకంటే ద్వితీయార్థం బాగా కలసివస్తుంది. గురుడు ద్వితీయరాశిలో ఉచ్ఛస్థితిలో సంచారం అన్ని విధాలా లాభదాయకమే. జూలై నుంచి అర్ధాష్టమంలో రాహు సంచారం కలిగినా గురుబలం వల్ల కష్టనష్టాలు, ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు.
సొంత ఆలోచనలు, భావాలతో ముందుకు సాగి అనూహ్యమైన విజయాలు సాధిస్తారు. పట్టుదల మరింతగా పెరుగుతుంది.
ఎటువంటి కార్యాన్నైనా నేర్పుతో పూర్తి చేస్తారు.
జీవిత భాగస్వామి, బంధువర్గంతో ఎంతోకాలంగా ఉన్న  విభేదాలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. 
గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. జ్ఞాతుల నుంచి ఆస్తిలాభ సూచనలు.
తీర్థయాత్రలు విశేషంగా చేస్తారు
ఆర్థికం….పెండింగ్ బాకీలు అందుతాయి. గత ఏడాది కంటే మెరుగ్గా ఉంటుంది.
వ్యాపారాలు….అనుకున్న ప్రగతి ఉంటుంది. మరింతగా పుంజుకుంటాయి. కొత్త వ్యాపారాలకు సైతం శ్రీకారం చుడతారు.
ఉద్యోగులు… ఆశించిన  విధంగా ప్రమోషన్లు అందుకుంటారు, ఏడాది చివరిలో స్థానచలనం ఉండవచ్చు.
పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతికరంగాలు…ఈ రంగాల వారికి యోగదాయకమనే చెప్పాలి. తరచూ విదేశీ పర్యటనలు జరుపుతారు.
కళాకారులు…ద్వితీయార్థంలో  కొత్త అవకాశాలతో బిజీగా గడుపుతారు.
విద్యార్థులు… మంచి ర్యాంకులు సాధిస్తారు, కోరుకున్న కోర్సులను సైతం పొందుతారు.
వ్యవసాయరంగం.. పెట్టుబడులకు ఢోకా ఉండదు. మొదటి పంట కంటే రెండవ పంట మరింతగా అనుకూలిస్తుంది.
రాజకీయరంగం…ప్రజాదరణ విషయంలో కొంత అనుకూలత. ద్వితీయార్థంలో పదవీయోగాలు.
మహిళలు….కొన్ని సమస్యలు తీరతాయి. మీ కృషి ఫలించే సమయం.
నవంబర్, జనవరి మధ్యకాలంలో అష్టమ కుజుని కారణంగా చర్మ, గొంతు సంబంధిత వ్యాధులు, తద్వారా ఔషధసేవనం, ఈతిబాధలు, మానసిక ఆందోళన.
పరిహారాలు… దుర్గాదేవికి కుంకుమార్చనలు, సుబ్రహ్మణ్యేశ్వరునికి పూజలు మంచిది.
చైత్రం, వైశాఖం, శ్రావణం, ఆశ్వయుజం, మార్గశిరం, మాఘమాసాలు అనుకూలం.అదృష్ట సంఖ్య-5.

కర్కాటకం

ఆదాయం-5, వ్యయం-8, రాజపూజ్యం-6, అవమానం-1.

వీరికి గురుడు జూన్ 18వ రకూ వ్యయస్థానం, తదుపరి జన్మరాశిలో సంచారం. శని నవంబర్ 1వ తేదీ వరకూ అర్థాష్టమం, తదుపరి పంచమస్థానాలలో సంచారం. 
ఇక రాహుకేతువులు జూలై 12వరకు అర్ధాష్టమ, రాజ్యస్థానాల్లోనూ, తదుపరి తృతీయ, భాగ్యస్థానాల్లో సంచరిస్తారు.
వీరికి జూలై వరకు రాహువు, నవంబర్ వరకూ శని అర్థాష్టమంలో సంచారం వల్ల ఈతిబాధలు, పనుల్లో ఆటంకాలు. బంధువిరోధాలు. తరచూ ప్రయాణాలు. చర్మ, ఉదర సంబంధిత అనారోగ్యాలు. ఒత్తిళ్లు పెరుగుతాయి. 
అయితే జూన్ నుంచి గురుడు స్వక్షేత్రంలో ఉచ్ఛస్థితి  సంచారం కొంత ఉపకరిస్తుంది. 
శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు నవంబర్ నుంచి అనుకూలిస్తాయి.
పట్టుదల, ధైర్యంతో ముందుకు సాగి అనుకున్న విజయాలు సాధిస్తారు. 
వివాదాల పరిష్కారంపై చొరవ చూపుతారు.
ఆర్థికం….చేతినిండా సొమ్ము ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో మరింత  ఉత్సాహంగా ఉంటుంది. రావలసిన సొమ్ము సైతం అందుతుంది.
వ్యాపారాలు..మొదట్లో  కొద్దిపాటి లాభాలు అందినా క్రమేపీ పుంజుకుంటాయి. విస్తరణలో మాత్రం కొన్ని ఆటంకాలు తప్పకపోవచ్చు.
ఉద్యోగాలు..అదనపు పనిభారం, పైస్థాయి నుంచి ఒత్తిళ్లతో సతమతమవుతారు. ఇంక్రిమెంట్లు స్వల్పంగా అందుతాయి. అయితే ద్వితీయార్థంలో ఉత్సాహంగా గడుపుతారు.
పారిశ్రామికరంగం.. అనుకున్న ప్రగతి కోసం మరింత శ్రమించాల్సిన సమయం. తరచూ విదేశీ పర్యటనలు చేస్తారు.
కళారంగం…అవకాశాలతో ఉక్కిబిక్కిరి అవుతారు. గత ఏడాదికంటే కొంత మెరుగు కనిపిస్తుంది.
విద్యార్థులు.. మొదట్లో కొంత నిరాశ కలిగినా ద్వితీయార్థం నుంచి మంచి ఫలితాలు కనిపిస్తాయి.
వ్యవసాయరంగం..రైతులు అనుకున్న పంటలు పండించేందుకు సానుకూలం.  రెండవ పంట మరింతగా లాభిస్తుంది.
రాజకీయరంగం.. ప్రథమార్థంలో కొంత నిరుత్సాహం తప్పదు, అయితే జనాదరణలో లోటు ఉండదు.
శాస్త్ర, సాంకేతికరంగాలు… గుర్తింపు కోసం శ్రమపడతారు. నవంబర్ నుంచి అనుకూల ఫలితాలు సాధిస్తారు.
మహిళలు….మీపై అజమాయిషీ తగ్గి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు నెలకొంటాయి.
జూలై, సెప్టెంబర్ మధ్య కుజునికి అర్థాష్టమస్థితి వల్ల మానసిక ఆందోళన. భూవివాదాలు. ఆరోగ్యసమస్యలు ఎదురుకావచ్చు.
పరిహారాలు… శని, కుజ, రాహువులకు పరిహారాలు చేయించుకోవాలి. 
వైశాఖం, ఆషాఢం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణమాసాలు అనుకూలం.అదృష్టసంఖ్య-2.
 
సింహం

ఆదాయం-8, వ్యయం-2, రాజపూజ్యం-2, అవమానం-4.

ఈ రాశి వారికి గురుడు జూన్ 18 వరకూ లాభస్థానం, తదుపరి వ్యయస్థానమైన కర్కాటకంలో సంచారం. శని నవ ంబర్ 1వ తేదీ వరకూ తృతీయ స్థానంలోనూ, తదుపరి అర్ధాష్టమస్థానమైన వృశ్చికరాశిలో సంచారం.
ఇక రాహుకేతువులు జూలై 12వరకూ తృతీయ, భాగ్యస్థానాల్లోనూ, తదుపరి ద్వితీయ, అష్టమస్థానాలలో సంచారం.
వీరికి జూన్ వరకు గురుడు విశేష యోగప్రదుడు, అలాగే, శని, రాహువులు అనుకూలురు. మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
ముఖ్యమైన వ్యవహారాలు అనూహ్యమైన రీతిలో చక్కబెడతారు.
ఆస్తి వివాదాలు తీరడంతో ఊపిరిపీల్చుకుంటారు.
జూలైలోగా ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వాహనయోగం కలుగుతుంది. 
కోర్టు కేసుల నుంచి విముక్తి పొందుతారు.
తండ్రితరఫు వారి నుంచి సహాయసహకారాలు పరిపూర్ణంగా అందుతాయి.
సమాజంలో గౌరవప్రతిష్ఠలకు ఇనుమడిస్తాయి.
ద్వితీయార్థంలో గురుబలం తగ్గడం వల్ల అన్నింటా నిదానంగా వ్యవహరించాలి.
వివాదాలకు దూరంగా ఉండండి. వృథా ఖర్చులు పెరుగుతాయి.
ఆర్థికం….రావలసిన బకాయిలు ప్రథమార్థంలో అందుతాయి. ద్వితీయార్ధంలో రుణాలు చేయాల్సిన పరిస్థితి.
వ్యాపారాలు.. కొత్త పెట్టుబడులు అందుతాయి. అయితే నవంబర్ నుంచి ఆచితూచి వ్యవహరించాలి.
ఉద్యోగాలు.. ప్రథమార్థంలో ప్రమోషన్లు దక్కే అవకాశం. తదుపరి శ్రమాధిక్యం.
పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. 
కళాకారులు…కృషి ఫలించి ముందడుగు వేస్తారు. అనూహ్యమైన అవకాశాలు దగ్గరకు వస్తాయి.
విద్యార్థులు….సాంకేతిక, వైద్యకోర్సులు అభ్యసించే వారికి కలసివచ్చే కాలం. ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి.
రాజకీయవర్గాలు… కొత్త పదవులు అందుకుంటారు. అయితే విపరీతమైన ఒత్తిడులకు లోనవుతారు.
పరిశోధకులు, శాస్త్రవేత్తలకు అనూహ్యమైన విజయాలు దక్కుతాయి.
వ్యవసాయదారులకు రెండుపంటలూ అనుకూలిస్తాయి.
క్రీడాకారులు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి దక్కుతాయి.
నవంబర్ నుంచి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల స్థానచలనం, ఆరోగ్యసమస్యలు. మానసిక ఆందోళన తప్పదు. 
సెప్టెంబర్, అక్టోబర్ మధ్య అర్థాష్టమ కుజుని ప్రభావం వల్ల కుటుంబంలో కలహాలు, శత్రువుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. 
పరిహారాలు… ఈకాలాల్లో శని, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. 
చెత్రం, వైశాఖం, ఆషాఢం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-1. 
 
కన్య

 ఆదాయం-11, వ్యయం..-8, రాజపూజ్యం-5, అవమానం-4.
 
ఈ రాశి వారికి గురుడు జూన్18 వరకూ రాజ్యస్థానమైన మిథునం, తదుపరి లాభస్థానమైన కర్కాటకంలో సంచారం. శని నవ ంబర్ 1వ తేదీ వరకూ ద్వితీయమైన తుల, తదుపరి తృతీయమైన వృశ్చికరాశిలో సంచారం.
ఇక రాహు, కేతువులు జూలై 12వరకూ ద్వితీయం, అష్టమంలోనూ,తదుపరి జన్మ, సప్తమస్థానాల్లో సంచారం.
వీరికి నవంబర్ నుంచి ఏల్నాటిశని పూర్తికాగలదు.. అప్పటి వరకూ శని దోషకారి అయినా జూన్ నుంచి గురుబలం విశేషంగా పెరుగుతున్నందున అంతగా ఇబ్బంది కలిగించదు.  మొత్తం మీద వీరికి గతేడాది కంటే మెరుగ్గానే ఉంటుంది. 
అయితే జూలై వరకు కుజుడు జన్మరాశిలో స్తంభన వల్ల మానసిక అశాంతి. కోపతాపాలు, బంధువిరోధాలు. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. తదనంతరం అన్నీ విజయాలే.
ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తారు.
సంగీతం, సాహిత్యరంగాలలో ప్రవేశం లభిస్తుంది.
చిరకాలంగా వేధిస్తున్న ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. ఒక కోర్టు వ్యవహారం అనుకూలంగా పరిష్కారమవడం విశేషం.
ఆర్థికం…ఖర్చులు అదుపులోకి వస్తాయి. రావలసిన పెండింగ్ సొమ్ములు సైతం అందుతాయి. రుణబాధల నుంచి విముక్తి.
వ్యాపారాలు.. మొదట్లో కొంత నిరాశ కలిగినా క్రమేపీ లాభాలబాటలో పయనిస్తారు.
ఉద్యోగాలు.. శుభవార్తలు, పనిభారం తగ్గుతుంది. 
పారిశ్రామికవర్గాలు.. ఆశించిన లక్ష్యాలకు చేరుకుంటారు.
కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.దూరమైన అవకాశాలు కూడా తిరిగి దక్కుతాయి. 
విద్యార్థులు.. మంచి ర్యంకులు దక్కుతాయి, వైద్యకోర్సుల వారికి మరింతగా అనుకూలం.
వ్యవసాయదారులు.. రెండవ పంట అనుకూలం, పెట్టుబడులకు ఢోకా ఉండదు.
శాస్త్ర,సాంకేతికరంగాల వారికి విదేశీ ఆహ్వానాలు.
రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం.
పరిహారాలు… శని, రాహు, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి.
వైశాఖం, ఆషాఢం, శ్రావణం, కార్తీకం, పుష్యం, ఫాల్గుణమాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-5. 

 తుల

 ఆదాయం-8, వ్యయం-11, రాజపూజ్యం-1, అవమానం-7.
 
వీరికి గురుడు జూన్ 18వరకూ భాగ్యస్థానంలోనూ, తదుపరి రాజ్యస్థానంలోనూ సంచరిస్తాడు.
శని నవంబర్ 1వ తేదీ వరకూ జన్మరాశిలోనూ, తదుపరి ద్వితీయస్థానమైన వృశ్చికంలోనూ సంచారం.
ఇక రాహు,కేతువులు జూలై 12వ తేదీ వరకూ జన్మరాశి, సప్తమస్థానాలు. తదుపరి వ్యయం, షష్ఠమ రాశుల్లో సంచారం.
ఈ రాశి వారికి జన్మరాశిలో శని, రాహువులు, జూలై వరకూ వ్యయంలోనూ, తదుపరి జన్మరాశిలో కుజ సంచారం అంత అనుకూలం కాదు. అయితే గురుని స్థితి కొంత అనుకూలం కావడం కొంత ఊరటనిస్తుంది.
పనుల్లో బద్ధకం, జాప్యం. ఆలోచనలు స్థరంగా ఉండవు. 
బంధువులతో తగాదాలు.  
ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు వద్దు.
సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.
మంచికి వెళ్లినా చెడుగా మారే అవకాశం. ఇంటి నిర్మాణయత్నాలు కొంత నెమ్మదిస్తాయి.
వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. 
అయితే ద్వితీయార్థంలో గురుబలం కొంత అనుకూలిస్తుంది.
సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. ఇతరులకు సహాయపడతారు.
విలాసజీవనం సాగిస్తారు. 
ఆర్థికం…మొదట్లోకొంత ఇబ్బంది కలిగించినా క్రమేపీ సర్దుబాటు కాగలదు. రుణఒత్తిడులు తప్పవు.
వ్యాపారాలు..స్వల్పంగా లాభాలు ఆర్జిస్తారు.
ఉద్యోగాలు.. విధి నిర్వహణలో ఆటుపోట్లు ఎదురైనా అధిగమిస్తారు. స్థానచలనసూచనలున్నాయి.
కళాకారులకు ద్వితీయార్థంలో కొంత అనుకూలం. 
రాజకీయనేతలు ఆశనిరాశల మధ్య గడుపుతారు.
వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది.
విద్యార్థులు… సామాన్య ఫలితాలుపొందుతారు. మరింత శ్రమించాల్సిన సమయం.
పారిశ్రామిక, వైద్యరంగాల వారు ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం. 
మొత్తంమీద ఈ ఏడాదంతా సామాన్యంగానే ఉంటుంది. 
పరిహారాలు…శని, రాహు, కేతువులు, కుజునికి పరిహారాలు చేయించుకోవాలి.
జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, పుష్యం, మాఘమాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-6. 

వృశ్చికం

ఆదాయం-14, వ్యయం-2, రాజపూజ్యం-4, అవమానం-7.
 
ఈ రాశివారికి గురుడు జూన్ 18వరకూ అష్టమరాశిలోనూ, తదుపరి భాగ్యరాశిలో సంచారం. శని నవంబర్ 1వ తేదీ వరకూ వ్యయస్థానం, తదుపరి జన్మరాశిలో సంచారం.
ఇక రాహుకేతువులు జూలై 12వ తేదీ వరకూ వ్యయం, షష్ఠమం, తదుపరి లాభం, పంచమస్థానాలలో సంచరిస్తారు.
జూన్ వరకు అష్టమ గురుడు, వ్యయంలో శని, రాహువుల స్థితి అంతగా అనుకూలించదు. జూన్ నుంచి గురుడు భాగ్యస్థానంలో ఉచ్ఛస్థితి సంచారం వల్ల ఏల్నాటి శని ఉన్నా కొంత ఉపశమనం కలుగుతుంది. మొత్తం మీద జూన్ నుంచి అన్నింటా అనుకూలమనే చెప్పాలి. 
తలచిన పనులు ద్వితీయార్థంలో దిగ్విజయంగా సాగుతాయి. 
ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. విభేదాలు తొలగుతాయి.
దూరమైన మిత్రులు దగ్గరై ఆశ్చర్యపరుస్తారు.
ఆస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. శుభకార్యాల నిర్వహణ. 
ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. 
విమర్శించినవారే అభినందించడం విశేషం.
జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. 
ఆర్థికం… మొదట్లో కొంత నిరాశపరిచినా నెమ్మదిగా పుంజుకుంటుంది 
వ్యాపారాలు…సామాన్య లాభాలు పొందుతారు. పెట్టుబడులలో తొందరపాటు వద్దు.
ఉద్యోగాలు.. విధి నిర్వహణలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు.
పారిశ్రామికవేత్తలకు తరచూ విదేశీ పర్యటనలు ఉంటాయి. 
కళాకారులు…కళాకారులకు ద్వితీయార్థంలో సన్మానాలు, అవార్డులు, విద్యార్థుల కృషి కొంత ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. 
రాజకీయవర్గాలకు మిశ్రవ ుఫలితాలు ఉంటాయి,, కోరుకున్న పదవులు దూరమయ్యే అవకాశం.
శాస్త్ర,సాంకేతికవర్గాలకు కొంత  ప్రోత్సాహం లభిస్తుంది.  
జూలై నుంచి అక్టోబర్, తిరిగి జనవరి నుంచి ఫిబ్రవరి నెలల్లో కుజప్రభావం వల్ల ఒత్తిడులు. మానసిక అశాంతి. చికాకులు.
పరిహారాలు… శని, రాహువు, కుజులకు పరిహారాలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేయించుకోవాలి.
వైశాఖం, ఆషాఢం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణమాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-9.

ధనుస్సు

ఆదాయం-2, వ్యయం-11, రాజపూజ్యం-7, అవమానం-7.

వీరికి గురుడు జూన్ 18వరకూ సప్తమం, తదుపరి అష్టమరాశిలో సంచారం. శని నవంబర్ 1వ తేదీ వరకూ లాభస్థానం, తదుపరి వ్యయస్థానంలో సంచారం. 
ఇక రాహుకేతువులు జూలై 12వరకూ లాభ,పంచమ స్థానాలు, తదుపరి రాజ్యస్థానం, అర్ధాష్టమ స్థానాలలో సంచారం.
వీరికి జూన్ వరకూ గురుడు, నవంబర్ వరకూ శని అనుకూలురు. నవంబర్ నుంచి ఏల్నాటి శని ప్రారంభం. జూన్ నుంచి గురునికి అష్టమస్థితి కలిగినా ఉచ్ఛస్థితి వల్ల కొంత ఉపశమనం క లుగుతుంది. మొత్తం మీద శ్రమానంతరం అనుకూల ఫలితాలు ఉంటాయి.
సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు.
బంధుమిత్రులు మీవిజయాలకు వెన్నంటి ఉంటారు.
ప్రథమార్థంలో వాహనాలు, భూములు కొంటారు. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. జ్ఞాతుల నుంచి ఆస్తిలాభం.
శత్రువు విజయం.
చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు.
ఆర్థికం..కొంత ఇబ్బందికలిగినా ఏదోవిధంగా సర్దుబాటు కాగలదు.
వ్యాపారాలు… విస్తరణ యత్నాలు సానుకూలం.. లాభాలు కొంత మందగించినా ఫర్వాలేదనిపిస్తుంది. ఉద్యోగాలు… పదోన్నతులతో పాటు, బదిలీలు కూడా జరిగే వీలుంది.
పారిశ్రామికవేత్తలకు అనూహ్యమైన అవకాశాలు దగ్గరకు వస్తాయి.
కళారంగం….కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. ప్రతిభ, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి.
రాజకీయరంగం…నాయకులకు ఏడాది ప్రారంభంలో పదవీలాభం. సన్మానాలు.
శాస్త్ర, సాంకేతికరంగాలు.. ఈరంగాలలోనివారికి తరచూ విదేశీ పర్యటనలు సాగిస్తారు.
వ్యవసాయరంగం… రెండవ పంట అనుకూలిస్తుంది. కొత్త పంటల వైపు మొగ్గు చూపుతారు.
విద్యార్థులు… అనుకూల ఫలితాలు సాధిస్తారు.
నవంబర్ నుంచి ఏల్నాటి శని వల్ల ఈతిబాధలు, వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. 
పరిహారాలు…శనికి తైలాభిషేకాలు, హనుమాన్చాలీసా పఠనం మంచిది.
చైత్రం, ఆషాఢం, శ్రావణం, ఆశ్వయుజం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-3. 

మకరం

ఆదాయం-5, వ్యయం-5, రాజపూజ్యం-3, అవమానం-3 
 
వీరికి గురుడు జూన్ 18వరకూ షష్టమం, తదుపరి సప్తమ రాశుల్లో సంచారం. శని నవంబర్ 1వ తేదీ వరకూ రాజ్యస్థానం, తదుపరి లాభస్థానంలో సంచరిస్తాడు. 
ఇక రాహుకేతువులు జూలై 12వ తేదీ వరకూ రాజ్యస్థానం, చతుర్ధస్థానంలోనూ, తదుపరి భాగ్యస్థానం, తృతీయంలోనూ సంచారం.
వీరికి జూన్ నుంచి గురుడు, నవంబర్ నుంచి శని విశేషయోగకారుకులై విజయాలు అందిస్తారు. గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
తలచిన పనుల్లో విజయం.
ఆప్తులు, బంధువుల నుంచి  సహాయసహకారాలు అందుతాయి.
పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
వాహనాలు, ఆభరణాలు కొంటారు. 
తరచూ తీర్థయాత్రలు చేస్తారు. 
కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి..
భార్యాభర్తల మధ్య వివాదాలు పరస్పర అవగాహనతో  సర్దుబాటు అవుతాయి. 
నిరుద్యోగులకు ద్వితీయార్థంలో ఉద్యోగలాభం.
ద్వితీయార్థంలో ఇంటి నిర్మాణాలు సాగిస్తారు.
ఆర్థికం….ఎంతోకాలంగా వేధిస్తున్న రుణబాధలు తొలగుతాయి. ధనలాభాలు ఉంటాయి.
వ్యాపారాలు…కొత్తపెట్టుబడులు అందుతాయి, విస్తరణయత్నాలలో ముందడుగు వేస్తారు.
ఉద్యోగాలు..ఊహించనిరీతిలో ఉన్నతస్థితి దక్కుతుంది, కోరుకున్న బదిలీలు.
వ్యవసాయరంగం… వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభసాటిగా ఉంటాయి.
రాజకీయవర్గాలు.. కొత్తపదవులు దక్కుతాయి.
విద్య్యార్థులు…శ్రమకు తగ్గఫలితం దక్కుతుంది, అనూహ్యమైన విజయాలు సాధిస్తారు.
పారిశ్రామికవేత్తలు… అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు.
రాజకీయవర్గాలు… ఉత్సాహవంతంగా ఉంటుంది. విశేష ప్రజాదరణ పొందుతారు. 
క్రీడా, సాంకేతికరంగాల వారికి ఊహించని అవకాశాలు తథ్యం.
ప్రథమార్థంలో షష్టమంలో గురుడు, అర్థాష్టమంలో కేతు సంచారం వల్ల మనోవ్యథ. అనారోగ్యం. కుటంబంలో చికాకులు.
పరిహారాలు… ఈగ్రహాలకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. 
వైశాఖం, భాద్రపదం, కార్తీకం, మార్గశిరం, ఫాల్గుణమాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-8. 
 
కుంభం

ఆదాయం-5,వ్యయం-5, రాజపూజ్యం-6, అవమానం-3.
 
ఈ రాశి వారికి గురుడు జూన్ 18వరకూ పంచమం, తదుపరి షష్ఠమంలో సంచారం. శని నవంబర్ 1వ తేదీ వరకూ భాగ్యస్థానం, తదుపరి రాజ్యస్థానంలో సంచారం.
ఇక రాహుకేతువులు జూలై 12వరకూ భాగ్య, తృతీయ రాశుల్లోనూ, తదుపరి అష్టమ, ద్వితీయ స్థానాల్లో సంచారం. 
వీరికి జూన్ వరకూ గురుడు విశేష యోగాన్ని అందిస్తాడు. భాగ్యస్థానంలో శని,రాహువులు సామాన్య ఫలితాలు ఇస్తారు. మొత్తం మీద వీరికి ప్రథమార్థంలో అనుకూలంగానే ఉంటుంది.
కార్యజయం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ.
బంధువులు, స్నేహితులతో నెలకొన్న విభేదాలు పరిష్కారం.
తండ్రి తరఫు నుంచి ఆస్తి లేదా ధనలాభం.
తీర్థయాత్రలు, వినోదయాత్రలు ఎక్కువగా చేస్తారు.
ఆర్థికం….రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. రుణబాధలు తొలగుతాయి.
వ్యాపారాలు.. విస్తరణలో ముందుకు సాగుతారు. కొత్త పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగాలు.. బాధ్యతలు పెరిగినా సమర్థతను నిరూపించుకుంటారు. ఇంక్రిమెంట్లు లభిస్తాయి.
కళాకారులు..గతం కంటేమెరుగ్గా ఉంటుంది. కొత్త అవకాశాలు సాధిస్తారు.
రాజకీయవర్గాలు…నూతనోత్సాహం, పదవీయోగాలు. 
వ్యవసాయదారులు.. రెండు పంటలూ అనుకూలిస్తాయి.
పారిశ్రామికవేత్తలు… ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు రాగలవు.
శాస్త్ర,సాంకేతికవర్గాలు.. చేపట్టే పరిశోధనల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.  సత్తాను చాటుకుంటారు.
విద్యార్థులు… ఊహించిన విధంగానే ర్యాంకులు, ఫలితాలు ఉంటాయి.
క్రీడాకారులకు పతకాలు, సన్మానాలు అందుతాయి.
జూలై వరకు కుజుడు, జూలై నుంచి రాహువు అష్టమరాశిలో సంచారం అంతగా అనుకూలం కాదు. ఉదర, నేత్ర, చర్మసంబంధిత రుగ్మతలు. ఔషధసేవనం. ఇతరుల నుంచి మాటపడడం వంటి ఫలితాలు ఉంటాయి. 
పరిహారాలు…ఈ రెండు గ్రహాలకు పరిహారాలు చేయించుకోవాలి. అలాగే, దుర్గామాతకు కుంకుమార్చన, సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. 
చైత్రం, జ్యేష్టం, శ్రావణం, ఆశ్వయుజం, మార్గశిర, ఫాల్గుణమాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-8. 
 
మీనం

ఆదాయం-2, వ్యయం-11, రాజపూజ్యం-2, అవమానం-6.

ఈరాశి వారికి గురుడు జూన్ 18వరకూ చతుర్ధంలోనూ, తదుపరి పంచమ స్థానమైన కర్కాటకంలో సంచారం. శని నవంబర్ 1వ తేదీ వరకూ అష్టమం, తదుపరి భాగ్యస్థానంలో సంచారం.
ఇక రాహుకేతువులు జూలై 12వరకూ అష్టమం, ద్వితీయంలోనూ, తదుపరి సప్తమం, జన్మరాశిలో సంచారం.
ఈరాశి వారికి గురుడు జూన్ నుంచి విశేషయోగప్రదుడై అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఉచ్ఛస్థితిలోని గురుడు స్వక్షేత్రాన్ని వీక్షించడం మరింత శుభం. అష్టమ శని, రాహుదోషాలు ఉన్నా గురుబలంతో కష్టనష్టాల నుంచి బయటపడతారు.
పనుల్లో  ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. 
సంఘంలో విశేషగౌరవమర్యాదలు దక్కుతాయి.
ఆశయాలు, లక్ష్యాలు నెరవేరతాయి. ఆత్మీయుల నుంచి  మాటసహకారం అందుతుంది. 
స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.
ఇంటి నిర్మాణాలు ద్వితీయార్థంలో అనుకూలిస్తాయి. 
కొత్త వాహనాలు సమకూరతాయి. 
తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ఆర్థికం….అనుకున్న రీతిలో డబ్బు అందుతుంది. మొదట్లో కొంత నిరాశ కలిగించినా క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి.
వ్యాపారాలు..ద్వితీయార్థం నుంచి లాభాలు అందుతాయి.
ఉద్యోగులు.. రావలసిన బకాయిలు అందుతాయి. అనుకూల మార్పులు సంభవం. అయితే కొందరికి స్థానచలనం.
విద్యార్థులు… కొంత అసంతృప్తి కలిగినా ఫలితాలు సంతృప్తినిస్తాయి.
వ్యవసాయదాలు…రెండవ పంట అనుకూలిస్తుంది,బ్యాంకు రుణాలు అందుతాయి.
పారిశ్రామికవర్గాలు…విదేశీ పర్యటనలు ఉంటాయి. కొత్త సంస్థల ఏర్పాటుపై సమాలోచనలు జరుపుతారు.
కళాకారులు… కొత్త అవకాశాలను అందుకుంటారు, ఊహించని రీతిలో అవార్డులు సైతం రాగలవు.
రాజకీయవర్గాలు…మొదట్లో కొంత నిరాశ కలిగినా పట్టుదలతో విజయాల వెంట నడుస్తారు.
శాస్త్ర, సాంకేతిక, వైద్యరంగాల వారికి  గతం కంటే మెరుగైన కాలమనే చెప్పాలి.
జూలై ,సెప్టెంబర్ నెలల మధ్య అష్టమంలో శని, కుజుల కలయిక అంతగా అనుకూలం కాదు. మానసిక ఆందోళన. చేసే పనుల్లో అవాంతరాలు. బంధువిరోధాలు. చర్మ, ఉదర సంబంధిత రుగ్మతలు.
పరిహారాలు…  శని, రాహు, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
వైశాఖం, జ్యేష్టం, శ్రావణం, కార్తీకం, పుష్యం, ఫాల్గుణమాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-3.
శుభమస్తు…సర్వేజనా..సుఖిఃనోభవంతు…

వక్కంతం చంద్రమౌళి

www.janmakundali.com