విభజన చట్టంలోని అన్ని అంశాలనూ అమలు చేశామని బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి అంటున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలకూ కేంద్ర ప్రభుత్వం సహకారం అందించిందని ఆమె చెప్పేశారు.
ఉత్తరాంధ్రా పర్యటనలో భాగంగా ఆమె విజయనగరంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీకి కేంద్రం ఎంతో చేసింది అని అంటున్నారు. అయినా సరే ఏపీ అప్పుల ఊబిలో కూరుకు పోయిందని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు, పీఎఫ్ కూడా చెల్లించలేని స్థితిలో ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ సుపరిపాలన అందిస్తుంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు.
విభజన చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ కి పదేళ్ళు గడచినా అతీ గతీ లేదు, నిధులు కాలానికి తగినట్లుగా పెంచమంటే కూడా ఇంకా నిర్ణయం అయితే లేదు అని విమర్శలు ఉన్నాయి. ప్రత్యేక హోదాని విభజన చట్టంలో పెట్టకపోయినా ఒక దేశ ప్రధాని నిండు పార్లమెంట్ లో ఇచ్చిన హామీని తరువాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది అన్నది మరో ఆవేదన.
ప్రత్యేక హోదా ఉంటే ఏపీ అప్పుల కుప్ప అయ్యేదా లేదా అన్నది పురంధేశ్వరి చెప్పాలని అంటున్నారు. ఏపీకి అమరావతి రాజధాని అని బీజేపీ నిర్ణయించినప్పుడు దానిని పూర్తి చేయడానికైనా పూర్తి స్థాయిలో నిధులు ఇచ్చారా అన్న ప్రశ్నలకు బీజేపీ నుంచి జవాబు అయితే లేదు అంటున్నారు.
రాజధానికి మేము నిధులు ఇస్తామని ఈ బడ్జెట్ లో నిర్మించుకోవాలని కేంద్రం సూచించి ఉంటే అమరావతి భారీ బడ్జెట్ గా మారి ఉండేది కాదు అని మేధావులు అంటారు. అలా కీలకమైన విషయాలలో బీజేపీ సాచివేత ధోరణితో వ్యవహరించింది. అన్నది ఏపీ ప్రజల విమర్శ మాత్రమే కాదు అన్ని రాజకీయ పక్షాలలో ఉన్న మూగ వేదన అని అంటున్నారు
కేంద్రం ఏపీకి నిధులు ఇస్తూంటే తమ పధకాలుగా చెప్పుకుని స్టిక్కర్లు అంటిస్తున్నారు అని పురందేశ్వరితో సహా బీజేపీ నేతలు అంతా విమర్శలు చేస్తూ వస్తున్నారు. కేంద్రానికి ఏపీ నుంచి పన్నుల రూపంలో వెళ్తున్న నిధులు ఎన్ని, తిరిగి ఏపీకి కేంద్రం ఇస్తున్న నిధులు ఎన్ని అన్నది జన సామాన్యం నుంచి వస్తున్న ప్రశ్న.
కేంద్రం ఇచ్చే నిధులు ప్రజల పన్నులే కదా అన్న దానికీ కాషాయం పార్టీ పెద్దలు మాట్లాడరు. అయినా మేము ఇస్తున్నామని ఎత్తిపొడిచేలా మాట్లాడుతారని అంటున్నారు. విభజన వల్ల పూర్తిగా కునారిల్లిన ఏపీని ప్రత్యేకంగా చూసి ఆదుకోవాల్సిన కేంద్రం అన్ని రాష్ట్రాలతో పాటుగానే నిధులు ఇస్తూంటే అడగాల్సిన ఏపీ బీజేపీ పెద్దలు అంతా కేంద్రం చేసేసింది అని వకాల్తా పుచ్చుకోవడం పైనా జనాలు మండిపడున్నారు.