జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో పర్యటించబోతున్నారు. హార్బర్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఫిషింగ్ బోట్లను కోల్పోయిన మత్స్యకార కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఆ కుటుంబాలకు జనసేన పార్టీ తరఫన ఆర్థిక సాయం కూడా అందించనున్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంటున్న కీలక సమయంలో ఆయన ఒక రోజు వెచ్చించి విశాఖపట్నం బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించడానికి సమయం వెచ్చించడం అభినందించదగ్గ సంగతి. అదే సమయంలో పార్టీ తరఫున ఆర్థిక సహాయం చేయడానికి పూనుకోవడాన్ని కూడా అభినందించాలి. గతంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకుటుంబాలకు కూడా రూ.లక్ష వంతున ఆర్థిక సాయం అందించిన ట్రాక్ రికార్డు జనసేన పార్టీకి ఉంది.
అయితే ఇదే విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. మత్స్యకారులకు ధైర్యం చెప్పి, భరోసా ఇవ్వడానికి పవన్ కల్యాణ్ స్వయంగా వెళ్లాల్సిన అవసరం ఉన్నదా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే.. విశాఖలో 40 బోట్లు తగలబడిపోయాయి. జనసేన పార్టీ తరఫున ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల వంతున ఇవ్వదలచుకున్నారు. అంటే సుమారుగా 20 లక్షల రూపాయలు మత్స్యకారులకోసం జనసేన పార్టీ ఖర్చు పెట్టబోతోంది.
ఇప్పటిదాకా ప్రజల ఆశీర్వాదం ఎరగని, అధికారం రుచి చూడని చిన్న పార్టీ విషయంలో అదేమీ చిన్న సాయం కాదు. కానీ ఆ సాయం అందించడానికి పవన్ కల్యాణ్ పనిగట్టుకుని ఒక ప్రత్యేక విమానంలో విశాఖ వెళుతున్నారు. అది అవసరమా అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది.
గతంలో కౌలురైతుల ఆత్మహత్యలకు రూ. లక్ష వంతున ఇచ్చిన అనేక సందర్భాల్లో పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ ఊరూరా తిరిగి పంచేశారు. అయితే రాజకీయ మైలేజీ కూడా కావాలని అనుకున్న కొన్ని సందర్భాల్లో మాత్రం.. అలాంటి వారినందరినీ ఒకేచోటకు పోగేసి వారికి పవన్ కల్యాణ్ చెక్కులు అందించారు. అయితే ఇప్పుడు సుమారు 40 మత్స్యకార కుటుంబాలకు 20 లక్షల రూపాయల మేర సాయం అందించడానికి అంతకు మించిన లక్షల రూపాయల ఖర్చుతో చార్టర్డ్ ఫ్లైటులో వెళ్లడం అవసరమా అనే చర్చ నడుస్తోంది.
బాధితులకు పంచే సొమ్ముకంటే.. పవన్ కల్యాణ్ విమానం ఖర్చు ఎక్కువగా ఉంటుందని.. ఆయన తాను సొంతంగా వెళ్లి డబ్బు పంచి రాజకీయ మైలేజీ తెచ్చుకోవాలనే ఆరాటాన్ని తగ్గించుకున్నట్లయితే.. ప్రతి మత్స్యకారుడికి కూడా లక్షన్నర వరకు పార్టీ తరఫున ఇవ్వవచ్చునని.. దానితో వారు పూర్తిగా కొత్త బోటు కూడా కొనుక్కోగలరని ప్రజలు అంటున్నారు. ఆ రకంగా పవన్ కు మరింతగా రుణపడి ఉండగలరని కూడా అంటున్నారు. తర్వాత పవన్ తీరిగ్గా ఎప్పుడైనా విశాఖ వెళ్లినప్పుడు సాయం పొందిన కుటుంబాలను పరామర్శించి.. తాను కోరుకునే మైలేజీ పొందవచ్చు కదా.. అనేది పలువురి అభిప్రాయం.