ఎన్నికల పోలింగ్ తేదీ ఇక ఎంతో దూరంలో లేదు. ఇదే అభ్యర్ధులు అందరికీ పెద్ద టెన్షన్ గా మారుతోంది. ప్రస్తుతానికి కేవలం ప్రచారం మాత్రమే నిర్వహిస్తున్నారు కనుక, వివిధ రూపాల్లో పేమెంట్లు జరుపుతూ వస్తున్నారు అభ్యర్ధులు అందరూ.
పెట్రోలు, హోటల్ బిల్లులు, వాహనాల అద్దెలు వివిధ మార్గాల ద్వారా చెల్లిస్తూ కోట్లు ఖర్చు చేస్తున్నారు ఎన్నికల ప్రచారానికి. ఇదంతా ఒక ఎత్తు. పోలింగ్ ఒకటి రెండు రోజులు నేరుగా ప్రజలకు అందించే డబ్బులు ఒక ఎత్తు. ఏ ఎన్నికకు అయినా ఇదే కీలకం. కొంత మంది వరకు ముందు జాగ్రత్తగా ఎక్కడి నగదు అక్కడికి చేర్చుకున్నారు. కానీ ఇలా చేసింది కొద్ది మందే అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
మెజారిటీ అభ్యర్ధులు అంతా గ్రామాలకు నగదు ఎలా పంపిణీ చేయాలా అని మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి నగదు సోదాలు గట్టిగా జరుగుతున్నాయి. ఇప్పటికే వందల కోట్ల నగదు పట్టుపడింది. ఓటు కనీసంలో కనీసం వెయ్యి రూపాయలు ఇవ్వకుండా ఎన్నికలు జరగని రోజులు ఇవి. ప్రతి అభ్యర్థి ఇందుకోసం కోట్లకు కోట్లు బయటకు తీయాల్సి వుంటుంది. వాటిని గమ్యస్థానాలకు చేర్చడానికి నమ్మకమైన అనుచరులే శరణ్యం.
కానీ సమస్య ఏమిటంటే ప్రత్యర్ధులంతా ఒకరిపై ఒకరు కన్నేసి వున్నారు. ఏ మాత్రం లీక్ అందినా నగదు గమ్యం చేరదు. దాని వల్ల ఫలితం మీద దెబ్బ పడతుంది. రాజకీయ నాయకులు తమ విజయానికి తమ నగదు గమ్యం చేరడం ఎంత కీలకమో, అవతలి అభ్యర్థి నగదు చేరకుండా చూడడం అంతే అవసరం అనే ఆలోచనలు ఎప్పుడూ సాగిస్తారు. అదే అధికారులకు లీకులు అందించే పద్దతిగా మారిపోతోంది.
తెలంగాణ ఎన్నికల్లో చివరి మూడు రోజుల్లో గమ్యానికి అంటే ఓటరు చేతుల్లోకి చేరాల్సిన మొత్తం ఓ అంచనా వేసుకుంటే వందల కోట్లలో వుంటుంది. వేల కోట్లలో వున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రెండు పార్టీలు బలంగా కొట్లాడుతున్నాయి. మరో పార్టీ తనూ వున్నానని ప్రయత్నిస్తోంది. కానీ బలమైన రెండు పార్టీలు కలిపి ఒక్కో నియోజక వర్గానికి యాభై కోట్ల వంతున పంపిణీ చేయాల్సి వుంటుంది.
ఇప్పుడు నగదు బయటకు తీయడం, గ్రామాలకు పంపడం, డిజిటల్ యుగంలో ఎవరి కంటా పడకుండా పంపిణీ చేయడం, అన్నింటికి మించి అధికారులకు పట్టుబడకుండా చూసుకోవడం అదే అతి పెద్ద సమస్య.. టెన్షన్.