“గాయం” సినిమాలో పబ్లిసిటీ ఎంత ఇంపార్టెంటో కోట శ్రీనివాసరావుకి తనికెళ్ల భరణి చెప్పే సన్నివేశమొకటుంటుంది.
“ఎవరు..ప్రెస్సోల్లా? లెలెలె…మనకా దుకాణం వద్దు…” అంటాడు కోట.
“భలేవోరే!! ప్రెస్సొద్దా?! మీరు గొప్ప అని నేను ..నేను గొప్పని మీరు చెప్పుకుంటే సరిపోదు. ప్రపంచానికి తెలియాలి. పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్…” అంటాడు భరణి.
ప్రస్తుతం అంధ్రాలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలి నుంచీ ప్రెస్సుని ఎలా వాడుకోవాలో అలా వాడుకోలేదు. ఈ విషయంలో తెదేపా నుంచి కనీస పాఠం కూడా నేర్చుకోలేదు.
హైటెక్ సిటీ నుంచి, ఓ.ఆర్.ఆర్, మెట్రో, ట్రిపుల్ ఐటీ, ఫార్మా కంపెనీలు, అంతర్జాతీయ విమానాశ్రయం వరకు..ఇవేవీ తన ఘనతలు కాకపోయినా ప్రెస్సుని నమ్ముకోవడం వల్ల అవన్నీ తన అకౌంట్లో వేయించుకోగలిగాడు చంద్రబాబు. ఇప్పటికీ హైటెక్ సిటీ బాబు ఘనత కాదంటే నిజం తెలిసినా నమ్మలేని పరిస్థితి జనానిది. అదే గోబెల్స్ ప్రచారమంటే. ప్రెస్సుకి అంత శక్తుంటుంది.
చేయని పనులే చేసిన పనులుగా చెప్పుకోగలిగినప్పుడు…నిజంగా చేసిన పనుల్ని ప్రెస్సు ద్వారా ఇంకెంత గొప్పగా ప్రపంచానికి చెప్పొచ్చు?
దేశంలో మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయనన్ని గొప్ప పనులు జగన్ మోహన్ రెడ్డి చేసిన మాట వాస్తవం.
– ప్రభుత్వ బడుల్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే మెరుగ్గా బాగు చేసి నడపడం
– జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టడం
– రైతుభరోసా కేంద్రాలు పెట్టి ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవడం
– “ఆరోగ్య సురక్ష” పేరుతో మారుమూల గ్రామల్లోని ఇళ్ళకు వెళ్లి మరీ వైద్య పరీక్షలు చేయడం
– 35 లక్షల పైచిలుకు ఇళ్లు పంచడం
– లక్షల కోట్ల పెట్టుబడులు తెప్పిస్తూ ఎం.ఓ.యూ లు చేయడం
– పులివెందులని మోడల్ టౌన్ గా రూపుదిద్దడం
– 40 ఏళ్లుగా అతీ-గతీ లేని కుప్పం పంచాయితీని మునిసిపాలిటీగా మార్చడం
– నిత్యావసర సరుకులు ఇంటికే నేరుగా పంపడం
– పెన్షన్లు ఇంటికొచ్చి అందివ్వడం
– అన్ని రకాల స్కీముల తాలూకు డబ్బుని మధ్యలో దళారీలు లేకుండా నేరుగా ప్రజల బ్యాంక్ అకౌంట్స్ లో వేయడం
– దేశంలో ఎక్కడా లేని వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేయడం
– ప్రభుత్వ బడుల్లోని ఎంపిక చేయబడ్డ ప్రజ్ఞావంతులైన నిరుపేద విద్యార్థులని దేశ చరిత్రలో చూడని విధంగా అమెరికాకి పంపి ఐరాస వేదికలపై మాట్లాడించడం.
– విదేశీ విద్యా దీవెన పేరుతో పేద విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసించే ఏర్పాటు చేయడం.
– భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం
– బందరు సీ పోర్ట్ పనులు జరుగుతుండడం..
ఇలా చెప్పుకుంటూ పోతే ఒక గ్రంథమే రాయొచ్చు. కానీ ఎక్కడ? ఇన్నేసి పనుల్ని ఎంతమంది పాజిటివ్ గా చూస్తున్నారు?
ఏమన్నా అంటే బటన్ నొక్కుతున్నాడు..అన్నీ ఉచితంగా పంచుతున్నాడు…అభివృద్ధి లేదు..పెట్టుబడులు లేవు.. అంటూ ప్రతిపక్ష మీడియా కూసే కూతలే చెవుల్లో మారుమోగుతూ అదే నిజమనిపించే భావన కలిగిస్తున్నాయి.
ఒక్క లబ్ధిదారులకి తప్ప తక్కిన జనానికి జగన్ మోహన్ రెడ్డిలోని చిత్తశుద్ధి, చేసిన పని అర్ధం కావడంలేదు.
పైగా చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో లోపలికెళ్తే జాతిపిత మహాత్మాగాంధిని జైల్లో పెట్టిన ఏ బ్రిటీష్ దొరనో తిట్టినట్టు జగన్ మోహన్ రెడ్డిని డెమొనైజ్ చేసి బాకా ఊదాయి ప్రతిపక్షపార్టీ తరపున ఉన్న మీడియా గుంపులు.
పచ్చ మీడియా చూపించే అసత్యాలు తప్ప క్షేత్రస్థాయిలో విషయం తెలియని ఎన్నారైలు సైతం జగన్ మోహన్ రెడ్డి చాలా తప్పులు చేసేస్తున్నాడన్న తప్పుడు అవగాహనలో ఉంటున్నారు.
ఇది ఇప్పటి విషయం కాదు. తెదేపా హయాం మొదలైనప్పటినుంచీ యెల్లో మీడియాలో బాబుని గొప్పగా పొగుడుతూ, కాంగ్రెస్ పరిపాలనని తూర్పారబెడుతూ అర్బన్ ఓటర్లని మాయ చేసే పనులే చేసారు. ఎందుకంటే సంక్షేమపథకాల లబ్ధిదారులు అధికశాతం మంది రూరల్ ప్రాంతాల్లోనే ఉంటారు. అర్బన్ ఓటర్లు ప్రధానంగా మీడియా కథనాలమీదే అభిప్రాయాలు ఏర్పరుచుకుంటారు.
కొంతవరకూ వై.ఎస్.ఆర్ ఆ ధాటిని తట్టుకోగలిగారు. ఆయా పత్రికలు ఎలా విషం చిమ్ముతున్నాయో అసెంబ్లీ సాక్షిగా చెప్పడం మొదలుపెట్టింది ఆయనే.
అయితే ఇప్పటికీ అదే పచ్చ విషయం చిమ్మడం కొనసాగుతూనే ఉంది. వీళ్లని తట్టుకోవడానికి నేషనల్ మీడియాని సీన్లోకి దింపొచ్చు కదా అని అడగొచ్చు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక షాకింగ్ విషయం ఉంది. నేషనల్ మీడియాకి కోటాను కోట్ల రూపాయలు ఖజానానుంచి బయటికి పోతున్నాయి. కానీ ఏ జాతీయ మీడియాలోనైనా పైన చెప్పుకున్న అభివృద్ధి పనుల్లో ఒక్కటైనా కవరయ్యిందా? అంటే ఏవిటి? డబ్బివ్వడం తెలుస్తోంది కానీ, ఆ మీడియాల చేత పని చేయించుకోవడం చేతకావడంలేదన్నమాట మన వైకాపా టీం కి.
ఎంత జాతీయ మీడియా అయినా వార్తను అందిస్తేనే వేస్తాయి. ఆ అందివ్వాల్సిన వాళ్లే నిద్రపోతుంటే ఏం చెయ్యాలి? చేయని పనికి అప్పళంగా డబ్బు పుచ్చుకుంటూ జాతీయ మీడియాలు కాలక్షేపం చేస్తున్నాయనుకోవాలా?
ఈ తప్పు ఎవరిది? సగం జగన్ మోహన్ రెడ్డిది, సగం ఆయన చుట్టూ ఉన్న సో-కాల్డ్ సలహాదారులది.
పైనున్న దేవుడికి, ఎదురుగా ఉన్న జనానికి అసలు సత్యం తెలుసు..కనుక వాళ్లు తనకు ఓట్లేసి కచ్చితంగా గెలిపించేస్తారు అని గట్టిగా నమ్ముతున్నారు ముఖ్యమంత్రి. అది తప్పు అని పక్కనున్న ఒక్క అడ్వైజరు కూడా చెప్పి ఒప్పించలేకపోవడం వైకాపా దౌర్భాగ్యం.
సోషల్ మీడియా విభాగం, డిజిటల్ కార్పొరేషన్లు పేరుకి ఉన్నా… లోపలున్న అంతర్గత విభేధాలు కావొచ్చు, సామార్ధ్యలోపాలు కావొచ్చు…జగన్ మోహన్ రెడ్డి “నభూతో నభవిష్యతి” లెవెల్లో చేసిన అనేక సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాల్ని న్యూట్రల్ ఓటర్స్ కి, ఎన్నారైలకి, పక్క రాష్ట్రాల వారికి చేరకుండా చేసారు. ఎంతసేపూ పరనింద తప్ప ఆత్మస్తుతి లేకుండా పోయింది వైకాపా సోషల్ మీడియాలో. వ్యక్తులకి ఏమో గానీ…పొలిటికల్ పార్టీలకి ఆత్మస్తుతి చాలా అవసరం.
ఈ ఐదేళ్ల జగన్ పాలనలోని పనులు ఏ చంద్రబాబు హయాములోనో జరిగుంటే దాదాపు బాబుకి భారతరత్న ఇవ్వాలి అనేంత ఉద్వేగంతో దేశమంతా ప్రచారం జరిగేది. లోకల్ మీడియాలో ఊకదంపుడు దంచుతూనే, జాతీయ మీడియా “ద రియల్ స్టేట్స్‌మన్”, “స్వతంత్ర భారత్ మే ఆదర్శ్ ముఖ్యమంత్రి” టైటిల్స్ తో పెద్ద పెద్ద ఆర్టికల్స్ వచ్చేవి. జాతీయ మీడియా ఆంధ్రాలో టూర్లు నిర్వహించి పైన చెప్పుకున్న ఒక్కో పనికి ఒక్కో వీడియో చేసి ప్రపంచం ముందు పెట్టేవి. కానీ ఈ వైకాపా శ్రేణులకి ఆ కనీస తెలివితేటలు, సమర్ధత పూర్తిగా కొరవడ్డాయని వేరే చెప్పక్కర్లేదు. ఈ విషయంలో ఎవరి సంజాయిషీలు వినడం కూడా అనవసరం. తప్పు జరిగింది, జరుగుతోంది..అంతే!
ఇదిలా ఉంటే జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్లుగా ఒక్క ఎమ్మెల్యేని ప్రశాంతంగా ఊపిరి తీసుకోనీయలేదు. “గడప గడపకు” పేరుతో కొన్నాళ్లు, “సాధికారిక యాత్ర” పేరుతో ఇప్పుడు…ఊపిరి సలపకుండా ఫీల్డులో తిప్పుతూనే ఉన్నారు. కానీ ఏ ప్రయోజనం? ముఖ్యమంత్రి తపన, ఎమ్మెల్యేల కష్టం..ఎక్కడ రిజిష్టర్ అవుతోంది? చరిత్ర అంటే రికార్డ్ కావాలి కదా! చేసిన ఘనతని రికార్డు చేసుకోకపోతే భావితరాలకి ఏం తెలుస్తుంది? భావి తరాల మాట అటుంచి, అసలిప్పుడు తటస్థ ఓటర్స్ కి ఎలా తెలుస్తుంది?
వైకాపాకి సొంత పేపర్, టీవీ ఉన్నా వాటి రీచ్ ఎంత? వాటిల్లో ఎంత చెప్పిన జనం దృష్టిలో మీడియా చెప్పినట్టు అవదు కదా! వైకాపా అధినేతలకి సంబంధం లేని మీడియాల్లో పాలన గురించి గొప్పగా చెప్పినప్పుడే కదా విలువ.
“వై నాట్ 175” అని నినదించే ముఖ్యమంత్రి సిలబస్ మొత్తాన్ని కవర్ చేయాలి కానీ తటస్థ ఓటర్స్ ని, పక్క రాష్ట్రంలో ఉన్న ఆ.ప్ర ఓటర్లని, పరోక్షంగా ఎన్నికలని ప్రభావితం చేయగల ఎన్నారైలని వదిలేస్తే ఎలా? ఈ విషయం సలహాదార్లు పట్టించుకోపోతే ఎలా?
వైకాపాకి ఉన్న ప్రధానమైన లోపం సరైన స్పోక్స్ పర్సన్ లేకపోవడం. ప్రభుత్వం తలపెట్టిన ఏ కార్యక్రమాన్నైనా ఆసక్తికరంగా జనం ముందు ఉంచగలిగే వ్యక్తి లేకపోవడం నాయకత్వ లోపమే.
ఉదాహరణకి టాపిక్ ఏదైనా.. ఉండవల్లి అరుణ్ కుమార్ గానీ, జేడీ లక్ష్మీనారాయణ గానీ, జయప్రకాష్ నారాయణ గానీ సామాన్యులకి అర్ధమయ్యే భాషలో ఆసక్తిగా చెప్పగలరు. ఆ స్థాయి స్పోక్స్ పర్సన్ వైకాపాలో ఒక్కడూ లేకపోవడం విడ్డూరం. తెదేపా నాయకుల్ని ఆసక్తికరంగా తిట్టడానికి కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు ఉన్నట్టుగా ప్రభుత్వ కార్యక్రమాల గురించి అంతే ఆసక్తిగా చెప్పే వ్యక్తే లేడెందుకు?
అలాంటి ఒక వ్యక్తి ఉండి, ప్రతి విషయాన్ని విపులంగా ప్రెస్సుని పిలిచి చెప్పి, ఆ మేటర్ని ఇంగ్లీషులోకి మార్చి జాతీయ మీడియాకి పంపి.. అక్కడ వార్త వివరంగా కవరవుతోందో లేదో ఫాలో అప్ చేసుకుని, ఎంత సేపు కవరయితే అంత పేమెంట్ అన్నట్టుగా విడుదల చేస్తే కదా ఫలితముండేది. ఆ బాధ్యత తీసుకున్న నాయకుడు కానీ, సలహాదారుడు కానీ లేడు వైకాపాలో.
ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. రానున్న రెండు మూడు నెలల్లోనైనా పై తప్పులు సరిదిద్దుకుని, చేసిన మంచి పనుల్ని ప్రపంచం ముందు పెట్టకపోతే వైకాపా ప్రస్తుతమున్న సీట్లలో చాలా వరకు ప్రతిపక్షానికి వదిలేసుకోవాల్సి వస్తుంది.
ముక్తాయింపుగా ఒక్కటే మాట- “కాసేపు పరనింద కట్టిపెట్టి.. చేసిన మంచి పనులు చెప్పుకోండయ్యా వైకాపా నేతలు!”
– హరగోపాల్ సూరపనేని