పురాణాల్లో ఉన్న రావణుడి పాత్ర ఎలా ఉందో, దాన్ని సినిమాల్లో ఎలా మార్చారో చాలాకాలంగా చర్చిస్తున్నారు. మన పౌరాణిక సినిమాల రచయితలు, దర్శకులు మూలకథను వాల్మీకి రామాయణం నుంచే కాకుండా, యితర సంస్కృత పురాణాల నుంచి, తెలుగు పురాణాల నుంచే కాకుండా, యితర భాషల్లో రాసిన పురాణాల నుంచి కూడా తీసుకుని మార్పులు చేర్పులు చేసుకున్నారు. మనవాళ్లకు సినిమాలే ప్రామాణికం అయిపోయాయి కాబట్టి తెలుగు సినిమాల్లో రావణుడి పాత్రను రూపొందించిన విధానం పురాణాలకు ఏ మేరకు అనుగుణంగా ఉందో నాకు తెలిసున్నది చెప్తాను. ముందుగా రావణ పాత్రను తెలుగువారికి ఆత్మీయంగా చేసిన ఎన్టీయార్ ''సీతారామ కల్యాణం'' సినిమాతో ప్రారంభిస్తాను. ‘‘సంపూర్ణ రామాయణం’’, ‘‘శ్రీకృష్ణ సత్య’’ సినిమాలను కూడా ప్రస్తావిస్తాను.
‘‘సీతారామకళ్యాణం’’ సినిమా మొదటి సీనులో అతనికి ‘రావణుడు’ (గట్టిగా అరిచినవాడు) అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్తూ కైలాసోద్ధరణ ఘట్టం పెట్టారు. ఇది వాల్మీకి రామాయణంలో లేదు. దీనికి ఆధారం తిక్కన రాసిన నిర్వచన ఉత్తర రామాయణం. దానికి మూలం వాల్మీకి రాశాడని కొందరు క్లెయిమ్ చేసే ఉత్తర కాండ. వాల్మీకి రాసినది ఆరు కాండలే. కానీ దానికి ఉత్తరకాండ చేర్చి దానిలో లవకుశ కథను, రావణుడి పూర్వవృత్తాంతాన్ని పెట్టారు. ఉషశ్రీ అనువదించేటప్పుడు ఉత్తరకాండను పరిగణించలేదు. వాల్మీకి రామాయణాన్ని ఆథెంటిక్‌గా అనువదించిన శ్రీనివాస శిరోమణిగారు కూడా ఉత్తరకాండను తీసుకోలేదు.
ఉత్తర కాండ ప్రకారం బ్రహ్మ వరాలతో బలవంతుడైన రావణుడు కుబేరుణ్ని ఓడించి అతని పుష్పకవిమానాన్ని స్వాధీనం చేసుకుని కైలాసం మీదుగా పోతుండగా ఆ విమానం ఆగిపోయింది. అప్పుడు నంది వచ్చి ‘ఇది కైలాసం, ఈశ్వరుడు భార్యతో విహరించే చోటు. ఇక్కణ్నుంచి వెళ్లిపో’ అన్నాడు. రావణుడు ‘ఆ శివుడెవడు? అయినా నీ ముఖమేమిటి, కోతిలా ఉంది’ అని పరిహసించాడు. అంటే అప్పటికి రావణుడికి శివుడెవరో తెలియదు. కానీ ‘‘సీతారామకళ్యాణం’’ సినిమాలో రావణుడు అప్పటికే శివభక్తుడైనట్లు, విబూది నామాలతో సహా చూపించారు. కానీ ఉత్తరకాండలో గానీ, తిక్కనగారి ఉత్తర రామాయణంలో గానీ అలా లేదు. 'ఆ శంకరుడు ఎవడు? నా విమానం ఆపడానికి అతనికున్న ప్రభావం ఎటువంటిది? కైలాసాన్ని పెళ్లగించి పారేస్తాను' అంటూ అహంకరిస్తాడు.
రావణుడి మాటలతో కోపం వచ్చిన నంది ‘వానరులే నీ వినాశనానికి కారణమవుతార’ని శపించాడు. శివుడి ప్రతాపం తెలియని రావణుడు గర్వంతో కైలాసాన్ని ఎత్తిపారేయడానికి పైకి ఎత్తాడు. దానిపై జీవాలన్నీ అల్లాడాయి. శివుడు అది గ్రహించి తన కాలి బొటనవేలితో నొక్కడంతో కైలాసం కింద కూలి రావణుడి భుజాలు దాని కింద యిరుక్కుపోయాయి. అతను బాధతో లోకాలన్నీ దద్దరిల్లేట్లు అరిచాడు. అప్పుడు శివుణ్ని వేడుకున్నాడు. శివుడు ప్రత్యక్షమై అతన్ని కరుణించి, తన భక్తుడిగా స్వీకరించాడు. నొప్పితో అతను అరిచిన కేక వలన రావణుడు అనే బిరుదును శివుడు ప్రసాదించాడు. ఈ రెండింటిలోనూ ఎక్కడా రావణుడు పేగులు బయటకు లాగి రుద్రవీణ వాయించి శివుణ్ని తృప్తి పరచాడని లేదు. అందువలన ఇంటర్నెట్‌లో వెతికాను.
ఈ లింకులో రావణుడు తన తలను, చేతిని కోసుకుని శివుణ్ని శాంతింపచేశాడని ఉంది. రుద్రవీణ గురించి హింద్‌రాజ్ దివేకర్, రాబిన్ త్రిభువన్‌లు రాసిన పుస్తకంలో సంగీత ప్రియుడైన శివుడు తన పేగులను వీణ తంతులుగా మార్చి వాయించాడని, దాన్నే రుద్రవీణ అన్నారని రాశారు. రావణుడు శివుడికి ప్రీతి కలిగించడానికి రుద్రవీణ వాయించేవాడని, ఒకసారి దాని తీగ తెగిపోతే తన నరాన్ని దానికి బదులుగా వేసి వాయించాడని ఉంది. అంతే తప్ప కైలాసాన్ని ఎత్తే సమయంలో.. అని స్పష్టంగా లేదు. ఈ లింకులో రావణుడి తల్లి కైలాసాన్ని లంకకు తీసుకు రమ్మనమని కోరిందని, దాని కోసమే కైలాసాన్ని ఎత్తబోయి భంగపడ్డాడని, తర్వాత శివుణ్ని మెప్పించడానికి తన చేతులు కోసుకుని వాటితో వీణ చేసుకుని, పేగులను తీగలుగా అమర్చి రుద్రవీణ వాయించి మెప్పించాడని ఉంది.
నైనా పాలే అనే విదేశీ కార్టూనిస్టు ‘సీతా సింగ్స్ ద బ్లూస్’ అనే డాక్యుమెంటరీని 2009లో చేసింది. ఆర్గనైజర్ పత్రిక దాన్ని విమర్శిస్తూ ‘రావణుడు పేగులతో వీణ వాయించినట్లు చూపార’ని అంది. ఇంటర్నెట్‌లో రావణుడు పేగులతో వీణ వాయించాడని క్లెయిమ్ చేసినవారు తెలుగు సినిమా లింకే యిస్తున్నారు. కానీ నార్త్‌లో కూడా యీ రకమైన నమ్మకం ఉన్నట్లుంది. మనకు పోగైన అదనపు సమాచారం ఏమిటంటే చేతులు నరుక్కుని వీణ బేస్‌గా చేసుకుని, పేగులను తీగలుగా అమర్చాడని. ఎన్టీయార్ వేళ్లకే పేగులను తొడుక్కున్నాడు. దాని కంటె రెండు చేతులు ఖండించుకుని వాటికి పేగులను తీగలుగా అమర్చడం ప్రాక్టికల్.
''సీతారామకల్యాణం'' సినిమాలో సీత గత జన్మల గాథగా ''ఆనంద రామాయణం'' లోని మాతులుంగి కథను తీసుకుని పెట్టారు. వరగర్వంతో రావణుడు అందర్నీ హింసించడంతో దేవతలు మొరపెట్టడంతో విష్ణువు పద్మాక్షుడనే రాజు యింట మాతులుంగి పేరుతో పుట్టమని లక్ష్మీ దేవిని ఆదేశించాడు. మహాలక్ష్మి తన పుత్రికగా పుట్టాలని తపస్సు చేసిన ఆ రాజుకి విష్ణువు మాతులుంగ ఫలాన్ని ప్రసాదించాడు. అందులోంచి పుట్టిన సౌందర్యరాశికి రాజు పద్మ అని పేరు పెట్టి పెంచి పెద్ద చేసి నారదుడి ప్రేరణతో స్వయంవరం ప్రకటించాడు. విష్ణువే వచ్చి వరిస్తాడని అనుకున్నాడు కానీ నారదుడు వెళ్లి రావణుణ్ని రెచ్చగొట్టాడు. అతను ఆమెను చేపట్టబోతూ వుండగా పద్మ అదృశ్యమైంది. ఆనందరామాయణం ప్రకారం రాక్షసులు వచ్చి ఆ మంటపాన్ని నాశనం చేశారు. పద్మ అగ్నిలో దూకింది. రావణుడు వచ్చాడని, ఆమె మాయమైనదని కల్పించినది సినిమావారు.
ఆనంద రామాయణం ప్రకారం ఓ సారి రావణుడు విమానంలో విహరిస్తూ వుంటే పద్మ అగ్నిలోంచి బయటకు వచ్చి విహరిస్తోంది. అతను చెరపట్టబోయాడు. ఆమె మళ్లీ అగ్నిలోకి దూకింది. అతను అగ్నికుండం వెతికితే ఆమె దేహం ఐదు రత్నాల రూపంలో దొరికింది. దాన్ని ఒక పేటికలో పెట్టి తనతో లంకకు తీసుకెళ్లాడు. ‘‘సీతారామకళ్యాణం’’ సినిమాలో యీ మధ్యలో వేదవతి కథ పెట్టి అప్పుడు పెట్టె కథ పెట్టారు. వేదవతి ప్రస్తావన దేవీ భాగవతంలో వుంది. దాని ప్రకారం లక్ష్మీదేవి ధర్మధ్వజుడనే రాజుకి తులసిగా, అతని సోదరుడైన కుశధ్వజునికి వేదవతిగా పుట్టింది. వేదవతిని శంభుడనే రాక్షసుడు కామించాడు. కానీ యీమె తీవ్రదృక్కులకు భస్మమై పోయాడు.
''సీతారామకళ్యాణం'' సినిమాలో స్వయంవరంలో మాయమైన పద్మాక్షుడి కూతురు కుశధన్వుడనే ముని వాకిట ప్రత్యక్షమౌతుంది. అతను వేదవతి అని పేరు పెట్టి తపస్సు చేసుకోమంటాడు. అక్కడకు రావణుడు వచ్చి ఆమెను చూసి వాంఛించాడు. ఈ సారి వేదవతి భస్మమై పోయింది. అతను ఆ భస్మాన్ని లంకకు తీసుకెళ్లాడు. దీని తర్వాత తీసిన ''సంపూర్ణ రామాయణం'' సినిమాలో పద్మాక్షుడి కథ తీసేసి, వేదవతి కథ మాత్రం చూపించారు. ఈ లోపున రంభతో రావణుడికి భేటీ జరిగినట్లు ‘‘సీతారామ..’’లో పెట్టారు. రంభను రావణుడు వాంఛిస్తే ఆమె వరస కాదంటుంది. దేవవేశ్యలకు వావివరసలేమిటి అంటూ యితను వాదిస్తాడు. ఇక్కడి పద్యాలన్నీ తిక్కన గారి ఉత్తర రామాయణంలోనివి. రంభ వారించినా వినక రావణుడు ఆమెను పాడుచేస్తాడు. దానితో ఆమె భర్త వచ్చి ఇష్టం లేని స్త్రీతో కూడితే తల పగులుతుందని శాపం యిస్తాడు. ఈ కారణంగానే రావణుడు సీతను ఎత్తుకు వస్తాడు కానీ బలాత్కరించడని కారణం కల్పించారు.
వేదవతి భస్మం లంకకు వచ్చాక అనర్థాలు జరిగాయని, అందువలన మండోదరి వేరే చోట పాతి పెట్టించిందని, ఆమెయే సీతగా మారి లంకకు వచ్చి నాశనం చేసిందని ఆనంద రామాయణంలోనూ, దేవీ భాగవతంలోనూ వుంది. ఈ కథలేవీ వాల్మీకి రామాయణంలో లేవు. కానీ ‘‘సీతారామ..’’, ‘‘సంపూర్ణ..’’ సినిమాల్లో రావణుడు పూజ చేస్తూ వుంటే హఠాత్తుగా చేతిలో పువ్వు ఆవిర్భవించి, దానిలో పసిపాప పుట్టుకొచ్చిందని చూపించారు. రాక్షసులు పసిపాపను పెట్టిన ఆ పెట్టెను తీసుకుని వెళ్లి జనకుడి రాజ్యంలో ఓ పొలంలో పాతి పెట్టినట్లు చూపించారు. జనకుడు పొలం దున్నుతూ వుంటే పెట్టె, దానిలో పాప దొరికాయి. బ్రహ్మవైవర్త రామాయణంలోనూ, ఆనంద రామాయణంలోనూ యిలా పెట్టెలో దొరికినట్టుగానే వుంది.
వాల్మీకి రామాయణంలో సీత పుట్టుక గురించి జనకుడు విశ్వామిత్రుడికి రామలక్ష్మణుల ముందు చెప్పినదే, సీత అహల్యకు చెప్పుకుంటుంది. దాని ప్రకారం జనకుడు భూమిని దున్నుతూ వుండగా భూమిని చీల్చుకుంటూ సీత ఉద్భవించింది. పెట్టె ప్రస్తావన లేదు. సీత అంటే నాగేటిచాలు అని అర్థం. నాగేటిచాలు వలన బయటపడింది కాబట్టి ఆమె సీత అయింది. ఇక విశ్వామిత్రుడి యాగం జరుగుతూండగానే మారీచసుబాహులు భగ్నం చేయబోయారు. రాముడి బాణాలకు సుబాహుడు చచ్చిపోయాడు. మారీచుడు సముద్రతీరంలో పడ్డాడు. అయితే ‘‘సీతారామ..’’ లో వేరేలా చూపించారు. దెబ్బ తగిలిన మారీచుడు సరాసరి రావణుడి వద్దకు వెళ్లి రాముడి గురించి చెప్తాడు.
నిజానికి వాల్మీకి ప్రకారం రావణుడికి యీ ఘట్టంలో రాముడి గురించి గాని, సీత గురించి గాని తెలియదు. కానీ ‘‘సీతారామ..’’లోను, ‘‘సంపూర్ణ…’’లోను నారదుడు వచ్చి ఆదిలక్ష్మియే సీతాదేవిగా ఉద్భవించింది కాబట్టి సీతాస్వయంవరంలో పాల్గొనమని పురికొల్పినట్టు చూపించారు. చిన్నపిల్లగా వున్న సీత శివధనస్సు ఎత్తేసిందని, అరుంధతి సీతకు శాపం యిచ్చిందని, ఆమె సలహా మేరకు స్వయంవరం ప్రకటించాడని జనకుడు ప్రకటించాడని, ''సీతారామ..'', ''సంపూర్ణ.. '' సినిమాలలో చూపించినట్టుగా వాల్మీకి రామాయణంలో లేదు.
సీతాస్వయంవరం గురించి కాస్త చెప్పాలి. రామలక్ష్మణులను యాగరక్షణకు తీసుకెళ్లిన విశ్వామిత్రుడు వారిని మిథిలా నగరంలో జనకుడు ఓ యజ్ఞం చేస్తున్నాడు చూద్దాం రండి అంటూ తీసుకెళ్లాడు. పెళ్లికి ముందు సీతారాములు ఒకరినొకరు చూసుకొనలేదు. స్వయంవరం ఘట్టం తులసీదాసు రామచరిత మానస్‌లో పెట్టాడు. రావణుడు వచ్చాడని ఆయన రాయలేదు కానీ యీ సినిమాల్లో పెట్టారు. స్వయంవరం గురించి తెలిపి ఆహ్వానించినట్టుగా ''సీతారామ కల్యాణం''లో, నారదుడు వచ్చి చెప్పినట్టుగా ''సంపూర్ణ రామాయణం''లో పెట్టారు.
వాల్మీకి రామాయణం ప్రకారం యాగం కోసం విశ్వామిత్రుడితో వచ్చిన రామలక్ష్మణులకు జనకుడు సీత పుట్టుక గురించి చెప్పి, ఆమె పెళ్లి గురించి తను పడ్డ అవస్థ చెప్పాడు. సీతను వరించి చాలామంది వచ్చారు. శివధనుస్సు ఎక్కుపెట్టిన వారికే కన్యనిస్తానన్నా డీయన. వారికి చేతకాలేదు. ఇలా ఫెయిలైన వాళ్లందరూ ఏకమై మిథిలానగరాన్ని ముట్టడించారు. ఒక సంవత్సరం పాటు ముట్టడి సాగింది. అప్పుడు జనకుడు తపస్సు చేసి దేవతల సాయంతో వాళ్లను తరిమి వేశాడు. ఇవన్నీ చెప్పి రాముడికి చూపించడానికి అది తెప్పించాడు. రాముడు అల్లెత్రాడు ఎక్కించి బాణం వదలబోతూ వుంటే ధనస్సు ఫెళ్లున విరిగిపోయింది. అప్పుడు జనకుడు 'యితను వీరుడు, యితనికి సీతను యిస్తాను' అన్నాడు. ఇదీ వాల్మీకి రాసినది. ''సీతారామ..'’, ''సంపూర్ణ.. ''లలో రావణుడు స్వయంవరానికి వచ్చి విఫలమైనట్లు చూపించారు.
''సీతారామ..''లో యింకో సీను కూడా పెట్టారు. లక్ష్మీదేవిని చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న రావణుడు స్వయంవరంలో భంగపడి, మాయోపాయంతోనైనా ఆమెను వశపరుచుకోవాలని రాముడి వేషంలో వస్తాడు. అయితే రాముణ్ని వలచిన శూర్పణఖ సీత వేషంలో అతని దగ్గరకు వస్తుంది. ఇద్దరూ కలిసి విహరించిన తర్వాత చివర్లో యిద్దరి మారువేషాలూ బయటపడతాయి. ఇది ఏ పురాణంలోనూ వున్నట్టు లేదు. శూర్పణఖ రాముణ్ని యీ దశలో చూడనే చూడదు. రాముని పెళ్లిలో పరశురాముడు రావడం ఘట్టం వాల్మీకి రామాయణంలో వుంది. కానీ పరశురాముణ్ని ప్రేరేపించినది రావణుడు అని యీ సినిమాలోనే కల్పించారు. ఏ పురాణంలోనూ వున్నట్టు లేదు.
ఇక సీతను ఎత్తుకుపోయే ఘట్టానికి వద్దాం. వాల్మీకి రామాయణంలో రావణుడి ప్రస్తావన మొదటిసారి అరణ్యకాండలో వస్తుంది. శూర్పణఖ పరాభవం అయ్యాక ఆమె కజిన్ అయిన ఖరుడు రాముడిపై దాడి చేసి అతని చేతిలో చచ్చిపోయారు. అప్పుడు అకంపనుడు అనే ఓ రాక్షసుడు వెళ్లి రావణుడికి చెప్తాడు. సీతకు ఎత్తుకుని రా, అప్పుడు సీతావిరహంతో రాముడు ఛస్తాడు అని సలహా చెప్పాడు. ఆ ఆలోచన నచ్చి రావణుడు మారీచుడి వద్దకు వచ్చి సాయం కోరాడు. కానీ మారీచుడు వద్దని చెప్తే విని రావణుడు వెనక్కి వెళ్లిపోయాడు. శూర్పణఖ వచ్చి రెచ్చగొడితే మళ్లీ కదలి వచ్చాడు. మారీచుడి వద్దకు వచ్చి 'నా చెల్లెల్ని కురూపి చేశాడు. వాడి భార్యను ఎత్తుకుపోతాను. నువ్వు సాయం చేయవలసినదే' అని ఒత్తిడి చేశాడు. దానివలన బంగారుజింకగా మారాడు మారీచుడు.
వాల్మీకి రామాయణంలో లక్ష్మణరేఖ విషయం లేదు. రామచరిత మానస్‌లోనూ లేదు. మరి లక్ష్మణరేఖ పలుకుబడిలోకి ఎలా వచ్చిందో ఏమో అన్ని సినిమాలలో పెట్టారు. రావణుడు వచ్చాక మొదట అతను సీతను నయంగా అడిగి చూశాడు, తనతో వచ్చేయమని. ఆమె వినకపోవడంతో మహాకాయుడిలా మారి ఆమె జుట్టును ఎడమచేతితో, తొడలను కుడిచేతితో పట్టుకుని లేవనెత్తి రథం ఎక్కి, ఆమెను ఒడిలో కూచోబెట్టుకుని తీసుకెళ్లాడు. ‘‘సంపూర్ణ రామాయణం’’ సినిమా వచ్చేసరికి యిది మార్చారు. సీతను రావణుడు ముట్టుకున్నట్టు చూపించలేదు. రావణుడు సీతను భూమితో ఎత్తుకుపోయినట్లు చూపించారు.
ఇక యుద్ధకాండలో చేసిన మార్పులు చూద్దాం. రావణుడు ఒకసారి యుద్ధరంగానికి వెళ్లి దెబ్బ తిన్నతర్వాతనే కుంభకర్ణుడిని లేపించాడు. అతను ఆర్నెల్లు నిద్ర, ఆర్నెల్లు మేలుకుని వుండడం అనేది వాల్మీకి రామాయణంలో లేదు. ఎప్పుడూ నిద్రపోతూ ఆర్నెల్లకోసారి లేచి అన్నీ తినేసి మళ్లీ పడుక్కుంటాడు అని వాల్మీకి రాశాడు. ఇప్పుడు నిద్ర లేచి వెళ్లి రావణుడికి హితవు చెప్పబోతాడు. అతను వినడు. అన్నగారి ఆజ్ఞమేరకు యుద్ధానికి వెళ్లి హతుడవుతాడు. ఈ హితవు పోర్షన్ ‘‘సంపూర్ణ రామాయణం’’ సినిమాలో తీసేశారు. యుద్ధంలో గెలిచి ఆ తర్వాత తనకు కనబడమన్నట్టు పెట్టారు.
యుద్ధకాండంలోనే కొన్ని సినిమాల్లో మహిరావణ (మైరావణ) పాత్రను కూడా ప్రవేశపెట్టారు. 1940లో ఘంటసాల బలరామయ్య గారు వేమూరి గగ్గయ్య మైరావణుడిగా పెట్టి తీసిన ‘‘మైరావణ’’, 1964లో బిఏ సుబ్బారావు దర్శకనిర్మాతగా ధూళిపాళను పెట్టి తీసిన ‘‘మైరావణ’’, 1971లో కెవి రెడ్డి దర్శకత్వంలో ఎన్టీయార్ ఎస్ వి రంగారావును మైరావణుడిగా పెట్టి తీసిన ‘‘శ్రీ కృష్ణ సత్య’’ సినిమాల్లో యీ పాత్ర కనబడుతుంది. ‘‘శ్రీకృష్ణ సత్య’’ సినిమాలో చూపించిన ప్రకారం మహిరావణుడు పాతాళాధిపతి, రావణుడికి సోదరుడి వరుస (సోదర సమానుడైన మిత్రుడే కానీ, సోదరుడు కాడని కొందరు రాశారు). మాయాతంత్ర విద్యల్లో ప్రవీణుడు. నాగజాతికి చెందిన రాజుని ఖైదీగా చేసి, అతని కూతురు చంద్రసేనను తన అంతఃపురంలో బంధించి, పెళ్లి చేసుకోమని వేధిస్తూ ఉంటాడు.
యుద్ధంలో వరుస పరాజయాలతో కృంగిపోయిన రావణుడికి హఠాత్తుగా అతను గుర్తుకు వస్తాడు. సహాయం అర్థిస్తాడు. మైరావణుడు మారు వేషంలో వచ్చి హనుమంతుడి రక్షణలో ఉన్న రామలక్ష్మణులను అపహరించుకుని పాతాళానికి తీసుకుపోయి మహామాయా దేవికి బలి యివ్వబోతాడు. వారిని వెతుకుతూ పాతాళానికి వెళ్లిన హనుమంతుణ్ని అక్కడ కాపలాగా ఉన్న మత్స్యవల్లభుడు ఎదుర్కుంటాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటేటప్పుడు అతని చెమట సముద్రంలో పడితే దాన్ని గ్రహించిన చేప కడుపున పుట్టినవాడతను. నారదుడు చెప్పడం చేత వారి బంధుత్వం తెలిసి, మత్స్యవల్లభుడు హనుమంతుణ్ని లోపలకి వెళ్లనిస్తాడు.
మైరావణుడి మృత్యురహస్యం తెలుసుకోవడానికి హనుమంతుడు చంద్రసేన సహాయం అర్థిస్తాడు. ఆమె వలపు నటించి, అది తెలుసుకుని హనుమంతుడికి చెప్తుంది. అతని ఐదు ప్రాణదీపాలు ఒకేసారి ఊది ఆర్పడానికి హనుమంతుడు పంచముఖ ఆంజనేయ అవతారం దాలుస్తాడనే కథ ఉంది. సినిమాలో మాత్రం వాయుదేవుడి సహాయంతో ఆర్పినట్లు చూపించారు. తన సహాయానికి బదులుగా చంద్రసేన రాముడికి భార్య కావాలని కోరితే, కృష్ణుడిగా పుట్టినపుడు సాధ్యపడుతుందని రాముడు అంటాడు. అమె సత్యభామగా పుడుతుంది.
ఈ కథ వాల్మీకి రామాయణంలో లేదు. బెంగాలీలో రాసిన 15 వ శతాబ్దపు కృత్తివాస రామాయణంలో నుంచి యీ కథ వ్యాప్తిలోకి వచ్చిందని చదివాను. మహిరావణుడికి అహిరావణుడనే అన్నగారు కూడా ఉన్నాడని కూడా సినిమాలో పెట్టారు. కాదు, మహిరావణుడికే అహిరావణుడనే పేరుంది అని కొన్ని చోట్ల రాశారు. కొన్నిటిలో చంద్రసేన మైరావణుడి భార్య అని, భర్త వధానంతరం తనను పెళ్లి చేసుకోమని రాముణ్ని అడిగిందని రాశారు. హనుమంతుడు ఆమెను పక్కకు తోసేస్తే ఆమె గర్భంలో ఉన్న అహిరావణుడు బయటకు వచ్చి హనుమంతుడితో పోరాడి అతని చేతిలో హతుడయ్యాడనీ రాశారు.
‘‘హనుమాన్ పాతాళ్ విజయ్’’ (1950) అనే సినిమా హిందీలో వచ్చి తెలుగులో డబ్ అయింది. దానిలో హనుమంతుడి కొడుకు పేరు మకరధ్వజుడిగా చెప్పారు. నాగకన్య చంద్రసేనను అహిరావణుడి భార్యగా చూపించారు. రాముడి మీద ప్రేమతో మరణరహస్యం చెప్పడం, వచ్చే జన్మలో సత్యభామగా పుట్టడం అంతా ఉంది. ఈ పాత్రను మీనాకుమారి ధరించారు. మైరావణుడి కథ థాయ్‌లాండ్‌లో కూడా ప్రసిద్ధమే. అక్కడ మైయారప్ పేరుతో ఒక విగ్రహం కూడా ఉందని వికీ చెప్తోంది.
ఇక రామరావణ యుద్ధం చివర్లో రావణుడి కడుపులో అమృతభాండం ఉందని విభీషణుడు చెప్పాడని, దాన్ని గురి చూసి కొట్టమని సలహా యిచ్చాడనే కథ వాల్మీకి రామాయణంలో లేదు. రామచరిత మానస్‌లో వుంది. రాముడు దానికి ఒప్పుకోకుండా గుండెలకు గురి పెట్టి బాణం వేస్తే హనుమంతుడు తన తండ్రి వాయుదేవుణ్ని ప్రార్థించి బాణం దిశ మార్పించడం సీను వాల్మీకి రామాయణంలోనూ లేదు, రామచరితమానస్‌లోనూ లేదు. ఈ సినిమాలో కల్పించారు. ఇదీ రావణుడి గురించిన కొన్ని విశేషాలు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2023)