పక్క రాష్ట్రం నుంచి వచ్చి విమర్శలా…?

ఆమె తెలంగాణాలో పార్టీ పెట్టారు. ఏపీకి వచ్చి విమర్శిస్తున్నారు. ఒక్క రోజులోనే ఆమెకు ఏపీలో ఏమి జరుగుతోందో అర్ధం అయిపోయిందా అని ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మీద వైసీపీ ఉత్తరాంధ్రా రీజనల్…

ఆమె తెలంగాణాలో పార్టీ పెట్టారు. ఏపీకి వచ్చి విమర్శిస్తున్నారు. ఒక్క రోజులోనే ఆమెకు ఏపీలో ఏమి జరుగుతోందో అర్ధం అయిపోయిందా అని ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మీద వైసీపీ ఉత్తరాంధ్రా రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఆమె రాజకీయం అక్కడ చేసింది. ఇక్కడికి వచ్చి ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది అని ఫైర్ అయ్యారు.

విశాఖలో మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి అభివృద్ధి అంటే ఏంటో మాతో వస్తే ఆమెకు చూపిస్తామని సవాల్ చేశారు. ఆమె రాజకీయ క్షేత్రం తెలంగాణ. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పాలిటిక్స్ చేయడమేంటి అని సుబ్బారెడ్డి మండిపడ్డారు.

వైసీపీ వైఎస్సార్ ఆశయాల కోసం పోరాడుతోంది, అదే వైఎస్సార్ కుటుంబాన్నీ ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ అలాంటి కాంగ్రెస్ లో చేరి విమర్శలు చేయడమేంటి అని పెద్దాయన మండిపడ్డారు. వస్తూనే వైసీపీని టార్గెట్ చేయడం అంత కరెక్ట్ అన్నది ఆమె ఆలోచించుకోవాలని ఆయన కోరారు.

బీజేపీకి వైసీపీ సమ దూరం పాటిస్తోందని, అభివృద్ధి విషయంలో కేంద్రంతో సఖ్యతగా ఉంటూ వస్తున్నామని అన్నారు. ఎవరు ఎవరితో కలసినా ఎంతమంది వచ్చి ఇబ్బంది పెట్టినా వైసీపీకి ఏమీ కాదని ఆయన అన్నారు. ఈ నెల 27 నుంచి విశాఖ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర శంఖారావం పూరిస్తారు అని ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల వర్సెస్ వైసీపీ యుద్ధానికి తెర లేచింది. షర్మిల తెలంగాణ తనకు మెట్టినిల్లు ఏపీ పుట్టినిల్లు అంటున్నారు. తాను ఏపీ ప్రజల కోసమే ఇక్కడికి వచ్చాను అని చెబుతున్నారు ఆమె ఒకనాడు అన్న మాటలే ఇపుడు ఇబ్బంది అవుతున్నాయి. తాను తెలంగాణతోనే ఉంటాను, ఇక్కడే పోరాడుతాను, ఇక్కడే జీవితమంతా రాజకీయం చేస్తాను అని చెప్పిన షర్మిల ఏపీకి రావడంతో వైసీపీకి ఆమె మాటలే ఆయుధంగా మారుతున్నాయి.

అయితే షర్మిల తనకు ఏపీ సొంత ఇల్లు అని అంటున్నారు. అదే షర్మిల గతంలో వైఎస్సార్ టీపీ అధినేత్రిగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో తాను తెలంగాణాలో పెరిగాను చదువుకున్నాను, ఈ గడ్డ తనదని క్లెయిం చేసే ప్రయత్నం చేశారు. షర్మిల నాడు అలా నేడు ఇలా అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.