అయ్యన్నకు అంత వీజీ కాదా?

ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్శీపట్నం అత్యంత కీలకమైన సీటు. ఈ సీటు 1983 వరకూ కాంగ్రెస్ కి కంచుకోట. ఆ పార్టీ 1952లో తొలిసారి నర్శీపట్నం నుంచి గెలిచింది. ఆ తరువాత మరో మూడు…

ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్శీపట్నం అత్యంత కీలకమైన సీటు. ఈ సీటు 1983 వరకూ కాంగ్రెస్ కి కంచుకోట. ఆ పార్టీ 1952లో తొలిసారి నర్శీపట్నం నుంచి గెలిచింది. ఆ తరువాత మరో మూడు సార్లు గెలిచింది. మధ్యలో ఒకసారి స్వతంత్ర పార్టీ కూడా విజయం సాధించింది. 1983 తరువాత రాజకీయం మొత్తం మారింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 9 సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు టీడీపీ గెలిచి తన పట్టుని నిరూపించుకుంది.

ఆ ఆరుసార్లూ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గెలిచి అనేక సార్లు మంత్రి పదవిని కూడా చేపట్టారు. అయ్యన్నను రెండు సార్లు కాంగ్రెస్ ఓడిస్తే 2019లో తొలిసారిగా వైసీపీ ఓడించింది. 2009 దాకా నర్శీపట్నం రాజకీయం రాజులు వెలమ సామాజిక వర్గాల మధ్య రాజకీయ పోరుగా సాగేది. 2009లో కాంగ్రెస్ వ్యూహం మార్చి వెలమలకే టికెట్ ఇచ్చి విజయం సొంతం చేసుకుంది.

వైసీపీ అయితే అదే వ్యూహంలో ఉంది. పైగా అయ్యన్న శిష్యుడు అయిన పెట్ల ఉమాశంకర్ గణేష్ కే టికెట్ ఇచ్చింది. ఆయన 2014లో స్వల్ప తేడాతో ఓడినా 2019లో మాత్రం 23 వేల పై చిలుకు భారీ తేడాతో అయ్యన్నపాత్రుడిని ఓడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హవా సాగింది.

ముచ్చటగా మూడవసారి అయ్యన్నపాత్రుడు ఉమాశంకర్ నర్శీపట్నం రాజకీయ క్షేత్రంగా సమరానికి సిద్ధపడుతున్నారు. ఈసారి ఎవరు విజేత అవుతారు అన్నది ఆసక్తిని గొలుపుతోంది. ఇద్దరూ ఇద్దరే. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. ఇద్దరూ అధికారాన్ని అనుభవించిన వారు. ఇద్దరికీ ప్రత్యర్ధుల బలలాలు బలహీనతలు మస్తు గా తెలుసు.

దాంతో రసవత్తరమైన పోరుకు నర్శీపట్నం నాందిగా నిలుస్తోంది. ఈసారి అయ్యన్నను ఓడిస్తే ఆయన మాదిరిగానే అరడజన్ సార్లు అయినా తాను ఎమ్మెల్యేగా ఎదురులేకుండా గెలుస్తాను అని ఉమాశంకర్ భావిస్తున్నారు. ఏడు పదుల వయసులో ఉన్న అయ్యన్నకు ఇవే చివరి ఎన్నికలు. ఈసారి ఆయన గెలుపు రాజకీయ వారసత్వానికి ఊపిరి పోస్తుంది. ఈసారి అయ్యన్న గెలిచి టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే కుమారుడు విజయ్ ని పూర్తిగా ఫోకస్ చేస్తారు అని అంటున్నారు.

నర్శీపట్నంలో వైసీపీ టీడీపీ రాజకీయ బలాబలాలు సమ ఉజ్జీగానే ఉన్నాయి. వైసీపీ సభలకు జనాలు పోటెత్తారు. నర్శీపట్నంలో లోకేష్ పెట్టిన మీటింగుకూ జనాలు తరలివచ్చారు. హోరా హోరీ పోరు తప్పదని ఇవి సూచిస్తున్నాయి. సంక్షేమ పధకాలు తమకు కొండంత అండ అని వైసీపీ అంటోంది. ప్రభుత్వ వైఫల్యాలే తమకు శ్రీరామ రక్ష అని టీడీపీ భావిస్తోంది. నర్శీపట్నంలో ఈసారి అయ్యన్నకు ఈజీ కాదనే అంటున్నారు. అయిదేళ్ళ అధికారంలో ఉమాశంకర్ ఆరితేరారు అని అంటున్నారు. దీంతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఈ కీలక నియోజకవర్గం  ఉంది.