దొందూ దొందే: ఎర్ర పొత్తు పొడిచింది!

భారతీయ జనతా పార్టీ కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల ద్వయం నిరీక్షణ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కమల నాయకులు వీరితో పొత్తు బంధం కలుపుకుంటారో లేదో ఎప్పటికీ తేలుస్తారో తెలియదు…

భారతీయ జనతా పార్టీ కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల ద్వయం నిరీక్షణ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కమల నాయకులు వీరితో పొత్తు బంధం కలుపుకుంటారో లేదో ఎప్పటికీ తేలుస్తారో తెలియదు కానీ.. ఈలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త పొత్తు పొడిచింది. అది ఎర్రని పొత్తు బంధం. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలు అయిన కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈ మేరకు వీరి పొత్తు బంధాన్ని ఏపీసీసీ చీఫ్ షర్మిల అధికారికంగా ప్రకటించారు కూడా.

వామపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఊగిసలాట ధోరణిని అనుసరించాయో, ఏపీలో కూడా అచ్చంగా అదే విధంగా చేశారు. ఇన్నాళ్లపాటు చంద్రబాబు నాయుడు భజన చేయడంలో తమను తాము తరింప చేసుకున్న ఉభయ వామపక్షాలు కూడా తెలుగుదేశంతో పొత్తు కోసం తహతహలాడాయి.

చంద్రబాబు నాయుడు ఒకవైపు భారతీయ జనతా పార్టీ తో బంధం కుదుర్చుకోవడానికి.. మోడీ దయ కోసం అర్హులు చాస్తుండగా, ఏపీలో వామపక్షాలు మాత్రం బిజెపితో తిరిగి కలిస్తే చంద్రబాబు తప్పు చేసినట్లు అవుతుందని ఆయన తమతో కలిసి పోటీ చేయడం గురించి ఆలోచించాలని సుద్దులు చెబుతూ వచ్చారు.

చంద్రబాబు వారిని ఏమాత్రం పట్టించుకోలేదు గానీ.. ఆయన స్నేహ హస్తం కోసం ఆ రెండు పార్టీలు ఎదురుచూసిన మాట నిజం. ఇక అంతా అయిపోయిన తర్వాత నేడో రేపో భారతీయ జనతా పార్టీతో బంధం గురించి అధికారిక ప్రకటన కూడా వస్తుందని అనుకుంటున్న తరుణంలో వామపక్షాలు చంద్రబాబు మీద ఆశలు వదులుకొని ప్రత్యామ్నాయం చూసుకున్నట్లుగా ఉంది.

షర్మిల సారథ్యం స్వీకరించిన తర్వాత ఎంత చెడ్డా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపు వచ్చిన మాట నిజం. ఇండియాలో చాలాకాలంగా భాగస్వాములు గానే ఉన్నప్పటికీ.. జాతీయ స్థాయిలో తమ పెద్దలు రాహుల్ భజన చేస్తూనే ఉన్నప్పటికీ.. ఇన్నాళ్లుగా కాంగ్రెస్ మొహం కూడా చూడని ఏపీ వామ పక్షాలు హఠాత్తుగా రూటు మార్చాయి. కాంగ్రెస్ తో పొత్తు బంధం కలుపుకున్నాయి. 

చంద్రబాబు భజన చేయడంలో మాత్రం ఇటు ఏపీ కాంగ్రెస్, అటు ఏపీ వామపక్షాలు దొందు దొందే అని చెప్పాలి. ఇప్పటికే ఆ పనిని విడివిడిగా సమర్థంగా నిర్వహిస్తున్న ఆ పార్టీల నాయకులు.. ఇకమీదట కలసికట్టుగా ఒక జట్టుగా బాబు భజన చేస్తారన్నమాట.