బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కోసం జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జ్ భూపేష్‌రెడ్డిని చంద్రబాబునాయుడు రాజకీయంగా బలి పెట్టారు. టీడీపీ పెండింగ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో భాగంగా కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. గెలవని స్థానానికి భూపేష్ పేరు ప్రకటించడంపై ఆయన అనుచరులు నిరాశ చెందుతున్నారు.
కడప పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరపున మరోసారి వైఎస్ అవినాష్‌రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అవినాష్‌రెడ్డిపై దీటైన అభ్యర్థిని నిలబెట్టేందుకు టీడీపీ తీవ్ర కసరత్తు చేసింది. కడప టీడీపీ నేతలు ఆర్.శ్రీనివాస్‌రెడ్డి, వీరశివారెడ్డి, భూపేష్‌రెడ్డి, జీ ప్రవీణ్‌రెడ్డి తదితరుల పేర్లపై వేర్వేరుగా ఐవీఆర్ఎస్ సర్వేని టీడీపీ చేపట్టింది. చివరిగా భూపేష్ పేరునే ఖరారు చేయడం గమనార్హం.
జమ్మలమడుగులో టీడీపీకి నాయకులే లేని సమయంలో భూపేష్‌రెడ్డి ఆ పార్టీలో చేరారు. ఊరూరా తిరుగుతూ టీడీపీ బలోపేతానికి ఆయన కృషి చేస్తూ వచ్చారు. జమ్మలమడుగులో టీడీపీకి సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చారు. అయితే జమ్మలమడుగు సీటును బీజేపీకి కేటాయించడం ద్వారా టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా నిరాశక లోనయ్యాయి.
ఇప్పుడు కడప ఎంపీ సీటును భూపేష్‌కు కేటాయించడం కేవలం కంటితుడుపు చర్య అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి రాజకీయంగా మంచి చేయడానికే భూపేష్‌కు ఎంపీ సీటు ఇచ్చారే తప్ప, యువ నాయకుడి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కాదనే చర్చకు తెరలేచింది. భూపేష్ మొదటి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఓడిపోయే సీటు ఇచ్చారని ఆయన అభిమానులు వాపోతున్నారు.