టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. నాలుగు ఎంపీ, 9 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు అందులో చోటు దక్కింది. ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి గుమ్మనూరు జయరామ్ పోటీ చేయనున్నారు. గుంతకల్లు సీటును జయరాంకు ఇస్తారనే ప్రచారం జరగడంతో స్థానిక టీడీపీ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపించింది. జయరామ్ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా గుంతకల్లులో టీడీపీ నేతలు భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
అయినప్పటికీ చంద్రబాబు మాత్రం జయరామ్ వైపే మొగ్గు చూపడం గమనార్హం. జగన్ కేబినెట్లో జయరామ్ నిన్నమొన్నటి వరకూ మంత్రిగా పని చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు నుంచి ప్రాతినిథ్యం వహించిన జయరామ్‌కు తిరిగి అదే స్థానాన్ని జగన్ ఇవ్వలేదు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా జయరామ్ పేరును వైసీపీ ప్రకటించింది. అయితే ఎంపీగా పోటీ చేయడానికి జయరామ్ ససేమిరా అన్నారు.
చంద్రబాబుకు కర్నాటక కాంగ్రెస్ నేతల నుంచి సిఫార్సు చేయించుకుని టీడీపీలో చేరారు. గుంతకల్లు సీటు ఆయన కోరుకున్నారు. జయరామ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారనే సమాచారంతో గుంతకల్లు టీడీపీ నేతల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. జయరామ్‌కు సీటు ఇస్తే, ఓడించి తీరుతామని వారు బహిరంగంగా హెచ్చరించారు.
అరాచక నేత, పేకాట, లిక్కర్ డాన్ గుమ్మనూరు జయరామ్ గో బ్యాక్ అంటూ మరీ ముఖ్యంగా టీడీపీ మహిళా కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జయరామ్‌కు అధికారికంగా టికెట్ ప్రకటించడంతో గుంతకల్లు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎలా స్పందిస్తారో?