భారతీయ జనతా పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో అనేక జనాకర్షక పథకాలు ఉన్నాయి. మామూలుగా అయితే.. ఉచితాలు ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్రమోడీ చాక్లెట్ రాజకీయాలు అంటూ ఎద్దేవా చేస్తుంటారు గానీ.. ఆ విషయంలో తాము కూడా తగ్గేదేం లేదని బిజెపి నిరూపించుకుంది. పీఎం సూర్య ఘర్ బిజిలీయోజన ద్వారా ఉచిత విద్యుత్తు లాంటి పథకాలను కూడా ప్రకటించింది. మొత్తానికి దేశంలో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం, ఇంటింటికీ పైపులైన్ ద్వారా వంటగ్యాస్, ఇంకో అయిదేళ్ల పాటు ఉచిత రేషన్ వంటివి ప్రకటించింది.
ఇవన్నీ పక్కన పెడితే.. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడానికి బిజెపి ఈసారి చాలా ఫోకస్డ్ గా పనిచేస్తున్నదని అర్థమవుతోంది. ఇప్పటికే వారు తమిళనాడు ఎన్నికల మీద ఎక్కువగానే కాన్సంట్రేట్ చేస్తున్నారు. తెలంగాణ గవర్నరుగా ఉన్న తమిళిసై రాజీనామా చేసి మరీ.. తమిళనాడులో ఎంపీగా పోటీచేస్తున్నదంటే.. అక్కడి ఎన్నికల్లో వారు ఎంత ఆశపెట్టుకుని ఉన్నారో అర్థమవుతోంది.
డీఎంకే ప్రభుత్వానికి ఇప్పటికి కాస్త ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడి ఉంది. ఈ సమయంలో అన్నాడీఎంకే బలంగా కూడా లేదు. ఈ ఎడ్వాంటేజీని వాడుకుని తమిళనాడులో పాగా వేయాలని, తద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటిదాకా తమ అస్తిత్వానికి సవాలు విసురుతున్న తమిళప్రాంతాన్ని చేజిక్కించుకోవాలనే కోరిక చాలా బలంగానే ఉన్నట్టుంది.
అందుకేనేమో, తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేస్తాం అంటూ ప్రత్యేకంగా మేనిఫెస్టో ద్వారానే భాజపా ప్రకటించింది. నిజం చెప్పాలంటే.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే తమిళమభాషకు ఉన్న గుర్తింపు చాలా ఎక్కువ. ఏషియన్ దేశాల్లో దక్షిణ భారతదేశానికి సంబంధించి తమిళులకే ఆదరణ ఎక్కువ.
సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో సగం మంది తమిళులే ఉంటారు. ఇలా ఇప్పటికే చాలా చాలా తమిళం పాతుకుపోయే ఉంది. ఇంకా తమిళానికి ఆదరణ పెంచుతామని ఎందుకు బిజెపి బిస్కట్ వేస్తున్నదో అర్థం చేసుకోలేనంత అమాయకులు వాళ్లు కాదు.
అలాగే.. ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేస్తాం అని కూడా బిజెపి తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. తమిళులు తిరువళ్లువర్ ను ఒక దేవుడిలాగా ఆరాధిస్తారు. ఆ హామీ వారిని ఊరిస్తుంది. అయితే తమిళనాడు తమ ఎంపీలు గెలిస్తే మాత్రమే ఈ పనులు చేస్తారా? లేదా, ఆ రాష్ట్రంలో గెలుపోటములతో నిమిత్తం లేకుండా.. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆ పనులు చేస్తారా? అనేది వేచిచూడాలి.