తెలంగాణలో సిపిఎం పార్టీ వారికి ఎట్టకేలకు తమ సొంత బలాబలాలపై ఒక అంచనా ఏర్పడినట్లు కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వారు మద్దతు తెలిపేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు.
భువనగిరి ఎంపీ స్థానాన్ని తమకు కేటాయించాలని సిపిఎం నాయకులు అడుగుతున్నారు గాని, ఆ కోరిక నెరవేరకపోయినా కూడా సిపిఎం కాంగ్రెసుకు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. మహా అయితే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తామని, పార్లమెంటు ఎన్నికల తర్వాత కొన్ని కార్పొరేషన్ పదవుల్లో కూడా ప్రాధాన్యం ఇస్తామని మాత్రం కాంగ్రెస్ తమ బేరం ప్రకటించింది. మొత్తానికి ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరినట్టే.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఎం.. చివరి వరకు కాంగ్రెస్ తో పొత్తులకోసం శతవిధాలా చర్చలు జరిపి, తాము అడిగినన్ని సీట్లు ఇవ్వలేదని అలిగి.. సొంతంగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెసు పార్టీ అగ్రనాయకులు.. ఎంతో కీలకంగా భావిస్తూ హోరాహోరీ తలపడిన ముఖ్యమైన నియోజకవర్గాల్లో కూడా సీపీఎం బరిలోకి దిగింది.
తమ పోటీ మిత్రపక్షం కాంగ్రెసుకే నష్టం అని తెలిసినప్పటికీ.. వారు అలిగిన మూడ్ లో ఉన్నారు గనుక పోటీచేశారు. కానీ ఎన్నికల్లో వారు సాధించినది మాత్రం శూన్యం. ఒక్కచోట కూడా కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. తీరా ఇప్పుడు ఎంపీ ఎన్నికల సీజను వచ్చాక.. ఈ ఎన్నికల్లో కూడా తాము ఒంటరిగనే పోటీచేస్తామని సీపీఎం నాయకులు ఆల్రెడీ ప్రకటించారు.
అయితే కాంగ్రెసు పార్టీ మాత్రం వారితో సానుకూల ధోరణితోనే చర్చలు జరుపుతూ వచ్చింది. తాజాగా పార్టీ ఆదేశాల మేరకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సీపీఎం ఆఫీసుకు వెళ్లి తమ్మినేని వీరభద్రం తదితర నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భువనగిరి స్థానాన్ని తమకు కేటాయించాలని.. రాష్ట్రవ్యాప్తంగా మద్దతు ఇస్తామని సీపీఎం ప్రతిపాదించింది. అయితే కాంగ్రెసు పార్టీకి హాట్ కేకు లాంటి భువనగిరి స్థానాన్ని ఇతరులకు కేటాయించడం అనేది అనూహ్యమైన సంగతి.
అయితే.. మల్లు భట్టివిక్రమార్క ఏ రీతిగా వారికి నచ్చజెప్పారో తెలియదుగానీ ఆ సీటుకోసం పట్టు పట్టకుండా ఆపారు. వారికి ఒక ఎమ్మెల్సీ సీటు కేటాయించగలం అని ఒప్పించారు. ఇండియా కూటమి.. అదే ఐక్యతతో తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో తలపడబోతున్నట్టుగా మనకు అర్థమవుతోంది.