తన చెల్లెలు షర్మిల విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పు చేశారా? అంటే… వైసీపీ సీనియర్ నాయకులు ఔనని అంటున్నారు. షర్మిల వల్ల రాజకీయంగా నష్టపోయామనే భావన వైసీపీ నేతల్లో వుంది. ఎన్నికల సమయంలో షర్మిల ఆకాశమే హద్దుగా జగన్‌ను, ఆయన ప్రభుత్వ విధానాల్ని తూర్పారపట్టారు. మరీ ముఖ్యంగా వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడైన వైఎస్ అవినాష్‌రెడ్డికి కడప టికెట్ ఇవ్వడం వల్లే తాను బరిలో నిలిచినట్టు షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే.
షర్మిలకు వివేకా కుమార్తె డాక్టర్ సునీత జత కలిశారు. అంతేకాదు, షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ వీడియో విడుదల చేయడం జగన్‌ను నైతికంగా భారీ దెబ్బతీసింది. ఇదే విషయాన్ని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బహిరంగంగా అన్నారు. వెంకట్రామిరెడ్డి మాదిరిగానే మాజీ మంత్రి పేర్ని నాని కూడా తల్లీకుమార్తె వైఖరిని పరోక్షంగా తప్పు పట్టారు. ఇవన్నీ పైకి కనిపించే విషయాలు.
షర్మిల విషయంలో జగన్ వ్యవహారశైలిని వైసీపీ నాయకులు తప్పు పడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే కాటసాని, మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి , మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితర కుటుంబాలకు రెండు, అంతకంటే ఎక్కువ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన విషయాన్ని సొంత పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. చెల్లెలకు ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు, అలాగే భారీ మొత్తంలో సంపాదించిన సొమ్ములో ఒకట్రెండు శాతం ఇస్తే ఏమవుతుందని వైసీపీ నాయకులు అంటున్నారు.
జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసీపీని భుజాన మోసిన షర్మిలను ఆదరించి వుంటే, ఇప్పుడీ స్థాయిలో రాజకీయ నష్టం జరిగేది కాదని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అంటున్నారు. షర్మిలను అవసర సమయంలో తిప్పుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం బాగోలేదని కొందరు నేతలు అంటున్నారు. ఈ మాత్రం విజ్ఞత జగన్ ఎందుకు ప్రదర్శించలేకపోయారో అర్థం కావడం లేదని అంటున్నారు.
షర్మిల వల్ల కాంగ్రెస్‌కు రాజకీయ ప్రయోజనం లేకపోయినా, నైతికంగా వైసీపీని దెబ్బతీయడంలో సక్సెస్ అయ్యారని కొంత మంది వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి తల్లి, చెల్లే జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నారని, అందరితో గొడవలు పడే నాయకుడిగా జనం చూశారని అంటున్నారు. ఇప్పటికైనా జగన్ ముందుగా సొంతింటిని చక్కదిద్దుకుని, జనంలోకి వస్తే బాగుంటుందని వైసీపీ నాయకులు చెబుతున్నారు.
స్త్రీకి స్వేచ్ఛ హద్దు మీరితే ఏ కుటుంభమైన ఇంతే..