కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నిధులు రాబట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులెత్తేశారు. ఈ విషయాన్ని బాబు అనుకూల మీడియాలో రాయడం విశేషం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పిలుపు మేరకు చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు బాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
చంద్రబాబు, నితీశ్‌కుమార్ మద్దతుతో మోదీ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ, బీహార్ రాష్ట్రాలకు సాయం అందించడంలో కేంద్రం ఉదారంగా వుంటుందని అంతా భావించారు. మరీ ముఖ్యంగా ఏపీకి కేంద్ర బడ్జెట్లో భారీ మొత్తంలో నిధుల ప్రకటన వుంటుందనే చర్చకు తెరలేచింది. అయితే టీడీపీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు చావు కబురు చల్లగా చెప్పారు.
ఎంపీల సమావేశంలో చంద్రబాబు ఏమన్నారంటే.. ‘బడ్జెట్లో కేంద్రం మన రాష్ట్రానికి భారీగా నిధులు ఇస్తుందని ఆశలు పెట్టుకోవద్దు. అలా చేయలేరు. ఒక రాష్ట్రానికి ఇస్తే అన్ని రాష్ట్రాలు వాళ్ల మీద పడతాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం పరిస్థితి ఎంత దిగజారిపోయి ఉందో చెప్పాను. వాళ్లకూ అర్థం అయింది. కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి.
బడ్జెట్లో పోలవరం, అమరావతికి కొంత మేర కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ఏ పథకం కింద నిధులు అడిగినా వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన నిధుల ఖర్చు వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారులు అడుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం నిధుల్ని దారి మళ్లించింది. దీనివల్ల అనేక పథకాలకు కొత్తగా నిధులు వచ్చే అవకాశం లేకుండా పోయింది. రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నంత మేరా నాడు వైసీపీ ప్రభుత్వం చేసింది’ అని ఎంపీలతో చంద్రబాబు చెప్పారని ఆయన అనుకూల పత్రికే రాసింది.
ఇక రాష్ట్ర అవసరాలేంటో అమిత్‌షా తెలుసుకోవడం ఏంటో అర్థం కావడం లేదు. దేని కోసం చంద్రబాబును అమిత్‌షా పిలిపించారు? రాష్ట్రానికి మాత్రం కేంద్రం నిధులు ఇచ్చే ప్రశ్నే లేదని చంద్రబాబు ముందే తేల్చేశారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే విమర్శలు వెల్లువెత్తుతాయని చంద్రబాబుకు ముందే తెలుసు. అందుకే తానే ముందుగా రాష్ట్రానికి నిధులు రావని చెబితే ఒక పనై పోతుందని ఆయన నిర్ణయించుకున్నట్టుంది. ఈ మాత్రం దానికి మోదీ సర్కార్‌కు బాబు మద్దతు ఇవ్వడం దేనికోసమనే ప్రశ్న తప్పక ఉత్పన్నమవుతుంది.