గులాబీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు కాలం కలిసి రావడంలేదు. ఆయన గ్రహ స్థితి బాగాలేదు. పదేళ్లు ఒక వెలుగు వెలిగిన ఉద్యమ నేత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి, పార్లమెంటు ఎన్నికల్లో జీరో అయినప్పటి నుంచి కష్టాల్లో కూరుకుపోతున్నాడు. ఆయన కష్టాలేమిటో అందరికీ తెలుసు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడేవిధంగా ఉంటుంది.
ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల నిర్మాణం విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ విషయంలోనూ కేసీఆర్ అనుకున్నది జరగలేదు. విచారణ కమిషన్ ఎదుట హాజరు కాకూడదని ముందే డిసైడ్ చేసుకున్న కేసీఆర్ హాజరు కావాలని పిలిచినా వెళ్ళలేదు.
పైగా నరసింహా రెడ్డికి విచారించే అర్హత లేదని, అసలు కమిషన్ ఏర్పాటే చట్ట విరుద్ధమని పన్నెండు పేజీల లేఖ రాశాడు. రెండోసారి మళ్ళీ నోటీసులు ఇచ్చేసరికి హై కోర్టుకు వెళ్ళాడు. అక్కడ ఫలితం లేకపోయేసరికి సుప్రీం కోర్టుకు వెళ్ళాడు. ఆయన వాదన ఏమిటి?
తాను చేసింది సరైందేనని, అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని, ఎక్కడా ఏమీ అక్రమాలు, అవకతవకలు జరగలేదని, కాబట్టి విచారణ కమిషన్ అనవసరమని అంటున్నాడు. సుప్రీం కోర్టులో తనకు ఉపశమనం కలుగుతుందని అనుకున్నాడు. కానీ.. ఆయన అనుకున్నది ఒకటి. సుప్రీం కోర్టు చేసిన పని మరొకటి.
విచారణ కమిషన్ కు నరసింహా రెడ్డిని తొలగించి మరొకరిని నియమించాలని చెప్పింది. అంతేగానీ విచారణ కమిషన్ ను వద్దనలేదు. అంటే కేసీఆర్ కోరికలో సగమే నెరవేరింది. నరసింహా రెడ్డి ఉండకూడదని అనుకున్నాడు. ఆ పని జరిగింది. కమిషన్ కూడా ఉండకూడదని అనుకున్నాడు. ఆ పని జరగలేదు. మరి ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లి ఏం సాధించాడు? ఏమీ లేదు. ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరింత గట్టి వాడిని నియమిస్తుందేమో!