రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భార్య హరితారెడ్డి ఓవరాక్షన్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారంటూ టీడీపీ అనుకూల మీడియా హడావుడి చేసింది. అప్పటికే ఎస్ఐ రమేశ్‌బాబుపై హరిత మందలింపు ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నూతన ప్రభుత్వానికి డ్యామేజీ జరిగిపోయింది. అధికారం చేతిలో వుంటే చేయకూడని తప్పులు చేయిస్తుంటుంది. ఇదేమీ కొత్తగా ఇప్పుడే జరగలేదు.
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీకి వెళ్తూ తనను వెయిట్ చేయించిన ఎస్ఐపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భార్య ఫైర్ కావడం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయ్యింది. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా ఏ స్థాయి నాయకులు వ్యవహరించినా ఊరుకునేది లేదంటూ చంద్రబాబు హెచ్చరించినట్టు టీడీపీ అనుకూల మీడియా హోరెత్తించింది.
ఎస్ఐపై మంత్రి భార్య అనుచిత ప్రవర్తనపై చంద్రబాబునాయుడు వెంటనే స్పందించి, రాంప్రసాద్‌రెడ్డికి ఫోన్ చేసి మందలించడం అభినందనీయం. అయితే ఇక్కడో ప్రశ్న ఉత్పన్నమైంది. కొన్ని రోజుల క్రితం నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మున్సిపల్ అధికారులను నడిరోడ్డుపై పచ్చిబూతులు తిట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. అప్పటికి అయ్యన్నపాత్రుడు స్పీకర్‌గా బాధ్యతలు తీసుకోలేదు.
అయ్యన్నపాత్రుడి వ్యవహారశైలి కూడా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చింది. కూటమికి సంబరంగా ఓట్లు వేసిన ఉద్యోగులకు తగిన శాస్తి జరిగిందనే కామెంట్స్ వెల్లువెత్తాయి. తాజాగా మంత్రి భార్య అధికార దర్పంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు, మరి అయ్యన్న విషయంలో మాత్రం ఎందుకు నోరు మెదపలేదనే ప్రశ్న ఉదయించింది. నాడు బాబు చర్యలు తీసుకుని వుంటే…నేడు పునరావృతం అయ్యేది కాదు!
అయ్యన్నపాత్రుడంటే భయపడే ఆయన ఏం మాట్లాడినా చంద్రబాబు ప్రేక్షక పాత్ర పోషించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు, ఉద్యోగుల విషయంలో గౌరవంగా వుండాలని, ఇలాంటి వైఖరిని సహించేది లేదని అయ్యన్నను కూడా హెచ్చరించి వుంటే, ఇప్పుడు పునరావృతం అయ్యేది కాదని పలువురు అంటున్నారు.