ఎమ్మెల్సీ పోరు షురూ!

ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల వేడి రాజుకుంది. విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఇవాళ్టి నుంచి 13వ తేదీ వ‌ర‌కూ నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. 14న స్క్రూటినీ వుంటుంది. 16వ తేదీ వ‌రకూ…

ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల వేడి రాజుకుంది. విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఇవాళ్టి నుంచి 13వ తేదీ వ‌ర‌కూ నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. 14న స్క్రూటినీ వుంటుంది. 16వ తేదీ వ‌రకూ ఉప‌సంహ‌ర‌ణ‌కు గడువు వుంటుంది.

ఈ నెల 30న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. మొత్తం 838 మంది ఓట‌ర్లున్నారు. ఈ ఉప ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నుంది. ఇప్ప‌టికే వైసీపీ త‌న అభ్య‌ర్థిగా మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేరును ఖ‌రారు చేసింది. ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ సీనియర్ నాయ‌కుడైన బొత్స బ‌రిలో దిగ‌డం, ఆయ‌న్ను ఎలాగైనా గెలిపించుకుని ప‌ట్టు నిలుపుకోవాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీ ప‌ట్టుద‌ల‌తో వుంది.

మ‌రోవైపు స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల్ని త‌మ వైపు తిప్పుకుని వైసీపీని ఓడించాల‌ని కూట‌మి నేత‌లు వ్యూహ ర‌చ‌న చేస్తున్నారు. అధికారం చేతిలో వుండ‌డంతో స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల్ని లాక్కోవ‌డం పెద్ద ప‌నేం కాద‌ని కూట‌మి నేత‌లో ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

ఇప్ప‌టికే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను కూట‌మి నేత‌లు స్టార్ట్ చేశారు. ముఖ్యంగా విశాఖ‌లో కార్పొరేట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డానికి కూట‌మి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. త‌మ ప్ర‌జాప్ర‌తినిధుల్ని కాపాడుకునే ప‌నిలో వైసీపీ నిమ‌గ్న‌మైంది. అధికారం వైపు మ‌ళ్ల‌కుండా నిరోధించేదాన్ని బ‌ట్టి వైసీపీ విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి వుంటాయి.

3 Replies to “ఎమ్మెల్సీ పోరు షురూ!”

Comments are closed.