మంత్రి పదవి చిచ్చు.. రెండుగా చీలిన నెల్లూరు

వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు లేవని చెప్పలేం. అలాగని ఎక్కడా, ఎప్పుడూ ఎవరూ రచ్చకెక్కలేదు. సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అవకాశం వచ్చినప్పుడు ఎదుటి వారికి చెక్ పెట్టేందుకు గ్రౌండ్ ప్రిపేర్…

వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు లేవని చెప్పలేం. అలాగని ఎక్కడా, ఎప్పుడూ ఎవరూ రచ్చకెక్కలేదు. సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అవకాశం వచ్చినప్పుడు ఎదుటి వారికి చెక్ పెట్టేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. 

అయితే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వైసీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. దీనికి కారణం మంత్రి పదవి. అవును, నెల్లూరులో మంత్రి పదవి చేతులు మారడంతో నాయకుల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి.

కాకాణికి వ్యతిరేకంగా గ్రూపు కడుతున్నారా..?

నెల్లూరు జిల్లాకు గతంలో రెండు మంత్రి పదవులున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు, ఆయన్ను ఇప్పుడు తప్పించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి పదవిలో ఉండగానే మరణించారు. రెండో దఫా నెల్లూరు జిల్లాకు కేవలం ఒకటే పదవి ఇచ్చారు. గౌతమ్ రెడ్డి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన కాకాణి గోవర్దన్ రెడ్డికి అవకాశమిచ్చారు. బీసీ కోటాలో మంత్రి అనిల్ పోస్ట్.. మరో జిల్లాకు వెళ్లిపోయింది.

ఫస్ట్ ఫేజ్ లో యువతరానికి అవకాశమిచ్చిన జగన్, సెకండ్ ఫేజ్ లో సీనియర్ అయిన కాకాణికి ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ సమన్యాయం జరిగిందనే అంతా అనుకున్నారు. కానీ అంతలోనే అలకలు మొదలయ్యాయి. తనకు మంత్రి పదవి రాలేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకంగా మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యారు. మొదటినుంచీ జగన్ తోనే ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా అలిగారు కానీ బయటపడలేదు.

ఇక మంత్రి పదవి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ తనదైన రీతిలో కాకాణి పదవిపై స్పందించారు. ప్రెస్ మీట్ లో జిల్లాకు చెందిన ప్రతి ఎమ్మెల్యేకు పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పిన అనిల్.. కాకాణి, ఆనం లను ఉద్దేశ పూర్వకంగానే పక్కనపెట్టారు. కాకాణి ప్రమాణ స్వీకారోత్సవానికి తనకు ఆహ్వానం లేదని కుండబద్దలు కొట్టారు. అక్కడితో ఆగలేదు. 

గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి చూపించిన ప్రేమ, వాత్సల్యం.. అన్నీ రెట్టింపు స్థాయిలో ఆయనకి తిరిగిచ్చేస్తానని, ఎవరి రుణం తాను ఉంచుకోబోనని సెటైర్ వేశారు.

కాకాణి స్టాండ్ ఏంటి..?

నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న కాకాణి గోవర్దన్ రెడ్డి.. అందరినీ కలుపుకొని పోవాలనుకున్నారు కానీ అది సాధ్యపడలేదు. గతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేతో ఆయనకు విభేదాలున్నాయి. 

ఓ దఫా మంత్రి అనిల్ ని తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానించలేదనే ఆరోపణ కూడా ఉంది. దీంతో సహజంగానే వారి మధ్య ఉన్న విభేదాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో రచ్చకెక్కాయి. కానీ కాకాణి అంత తేలిగ్గా బయటపడరని అంటున్నారు.

ఆనం అనూహ్య నిర్ణయం..

కాకాణి గోవర్దన్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉన్నా కూడా.. ఆయన్ను జడ్పీటీసీగా ఎంపిక చేసే సమయంలో ఆనం కుటుంబం సాయపడింది. ఆ తర్వాత ఎవరి రాజకీయాలు వారివి, ఎవరి పార్టీ వారిదిగా మారింది. మళ్లీ ఇప్పుడు ఆనం, కాకాణి జతకలిశారు. 

కాకాణికి మంత్రి పదవి రాగానే.. జిల్లాలో అందరికంటే ముందు వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి. వైఎస్ఆర్ హయాంలోనే కీలక శాఖలు చేపట్టిన ఆనంకు జగన్ హయాంలో మంత్రి పదవిరాకపోవడం ఆశ్చర్యమే. కానీ ఆనం ఎక్కడా తన అసంతృప్తిని బయటపడనీయలేదు. కాకాణికి అభినందనలు తెలిపి హుందాగా వ్యవహరించారు.

రెండు వర్గాలు..

ప్రస్తుతం నెల్లూరు వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. కాకాణి, ఆయనకు సపోర్ట్ చేస్తున్న ఆనం ఓవైపు.. మంత్రి పదవుల విషయంలో చిన్నబుచ్చుకున్న మిగతావారంతా మరోవైపు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. తటస్థులున్నా కూడా అసమ్మతి వర్గందే అక్కడ హవా ఎక్కువ. 

మొత్తమ్మీద మంత్రి పదవి మార్పుతో నెల్లూరు జిల్లా వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. నిన్న మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ వ్యవహారం మాజీ మంత్రి అనిల్ సెటైర్లతో బహిరంగం అయింది.