మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై టీడీపీ సోషల్ మీడియా విరుచుకుపడుతోంది. వరుస మీమ్స్, సెటైర్లతో రచ్చ రచ్చ చేస్తోంది. పోలవరంపై గతంలో మంత్రి హోదాలో అనిల్ చేసిన వ్యాఖ్యలన్నింటినీ తీసి, తాజా కామెంట్స్ తో ముడిపెడుతోంది. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ను పూర్తిచేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు అనిల్.
తాజాగా ఇదే ప్రశ్న ఆయన్ను అడిగితే, ప్రస్తుతం తను ఇరిగేషన్ మినిస్టర్ ను కాదని, ఆ శాఖకు సంబంధించిన ప్రశ్నలు తనను అడగొద్దని అన్నారు. ఈ రెండు వీడియోల్ని పక్కపక్కన పెట్టి ట్రోలింగ్ మొదలుపెట్టింది టీడీపీ.. అనిల్ కుమార్ కాదు, అ'నిల్' కుమార్ అంటూ సెటైర్లు అందుకుంది. మంత్రి పదవులు పోగొట్టున్న పేర్ని నాని, కొడాలి లాంటి వాళ్లను పెద్దగా పట్టించుకోని టీడీపీ సోషల్ మీడియా.. ఎందుకో అనిల్ ను బాగా టార్గెట్ చేసింది.
అనిల్ అంతగా ఇబ్బంది పెట్టారా..?
పోలవరం విషయంలో చంద్రబాబు అప్పట్లో బాగా డబ్బా కొట్టుకున్నారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పిన బాబు.. అసలు ప్రాజెక్టే పూర్తయిపోయిందనే రీతిలో బిల్డప్ ఇచ్చారు. సోమవారం-పోలవారం టూర్లు పెట్టి మరీ గ్రాఫిక్స్ మాయాజాలం నడిపించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అసలు విషయం బయటపడింది. పోలవరం విషయంలో బాబు చేసింది శూన్యం అని తెలిసింది.
అంతే కాదు, పోలవరంపై చంద్రబాబు ఏమేం చేశారు, టీడీపీ హయాంలో ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమా చేసిన తప్పులేంటి, బాబుకి కమీషన్ ఇవ్వడం కోసం పడిన తిప్పలేంటి.. ఇలా అన్నిట్నీ బజారున పెట్టారు అనీల్. దీంతో అప్పట్నించీ అనిల్ పై టీడీపీకి బాగా కోపం ఉంది. అందులోనూ కొడాలి నాని, పేర్ని నాని తరహాలోనే అనిల్ కూడా అవకాశం వస్తే చంద్రబాబు, లోకేష్ పై విరుచుకుపడేవారు. ట్విట్టర్ పక్షి బయటకొచ్చి మాట్లాడాలని సవాళ్లు విసిరేవారు. దీంతో ఆ ఫ్రస్టేషన్ అంతా ఇప్పుడిలా తీర్చుకుంటున్నారు.
అనిల్ అవకాశమిచ్చారా..?
పోలవరంపై జగన్ కూడా ఎప్పుడూ డెడ్ లైన్లు పెట్టి మాట్లాడింది లేదు. కానీ మంత్రి హోదాలో అనిల్ మాత్రం గతంలో కాస్త ఆవేశంలో స్టేట్ మెంట్లిచ్చారు. సోషల్ మీడియా పుణ్యమా అని వైరి వర్గాలకు బుక్కయ్యారు. అందులోనూ మంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత మరీ అంత సూటిగా నన్నేమీ అడగొద్దు అని జవాబివ్వడం కూడా కరెక్ట్ కాదు. కానీ అనిల్ ఇప్పుడు నేను మంత్రిని కాదు, నన్నేమీ అడగొద్దు అంటూ తన అసంతృప్తిని ఆ రూపంలో బయటపెట్టారు.
ఇంకేముంది కాచుకు కూర్చున్న టీడీపీ సోషల్ మీడియా వింగ్ అనిల్ ని టార్గెట్ చేసింది. అందులోనూ కొత్త మంత్రి వర్గం కొలువుదీరిన మరుసటి రోజే అనిల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రత్యర్థుల్ని ఆ ఆటాడేసుకున్నారు. టీడీపీ అనుంగు మిత్రుడు పవన్ కల్యాణ్ ని బిచ్చం నాయక్ అని తీసిపారేశారు. దీంతో అనిల్ ని టార్గెట్ చేశారు. పోలవరం విషయంలో, ఇతర ప్రాజెక్ట్ ల విషయంలో అనిల్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని పదే పదే హైలెట్ చేస్తూ ఇప్పుడు ఆటాడేసుకుంటున్నారు.
ఆ మాటకొస్తే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన ప్రతి అబద్ధాన్ని ఇప్పుడిలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే జనం తట్టుకోలేరు. ప్రత్యేక హోదాపై బాబు నాలిక మడతపెట్టిన విధానాన్ని జనం ఇంకా మరచిపోలేదు. కేంద్రం సహాయం చేయక, కరోనా కాలంలో నిధులు లేక, బాబు చేసిన తప్పులకి పోలవరం ఆలస్యమవుతోంది.
అప్పుడే కేంద్రానికి బాధ్యత అప్పగిస్తే సరిపోయేది, కానీ బాబు కమీషన్ల కోసం మేం కడతాం, మీరు డబ్బువలివ్వండి చాలన్నారు. అదే ఇప్పుడు శాపమైంది. మరి ఈ పాపంలో తన ప్రమేయం ఏమీ లేకపోయినా అనిల్ మాత్రం ఇప్పుడు పసుపు బ్యాచ్ కి టార్గెట్ అయ్యారు.