బుడగలో టాలీవుడ్!

తెలుగు సినిమా పరిశ్రమ బుడగలోకి వెళ్లిపోతుంది. బుడగ పెద్దదిగానే కనిపిస్తుంది. కానీ ఏదో నాటికి పగలడం గ్యారంటీ.

విందు భోజనానికి కూర్చుంటాం. మాంఛి దమ్ బిర్యానీ, మటన్, చికెన్, ప్రాన్స్ అన్నీ కలిపి వడ్డించిన విందుభోజనం. మహా రుచికరంగా ఉంది.. ఆస్వాదిస్తాం. మరి మరురోజు కూడా అదే తరహా విందుభోజనం వడిస్తే! అలా రోజుల తరబడి దమ్ బిర్యానీ అనేది కామన్ ఎలిమెంట్ అయిపోయి.. దానితోపాటు వడ్డించే ఆధరవులు మాత్రమే మారుతూ ఉంటే.. ఎవరికైనా సరే మొహం మొత్తుతుంది. చక్కగా పప్పు, సాంబారు నెయ్యి, ఆవకాయ, ఒకవేపుడు, గడ్డపెరుగు లతో ఒక పూటైనా కమ్మటి వరి అన్నం తినాలని కోరిక పుడుతుంది. అలాంటి సంక్లిష్ట స్థితిలో ఉంది ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ.

వంద కోట్ల సినిమా అని చెప్పుకోవడానికి కూడా అగ్రహీరోలు సిగ్గుపడుతున్నారు. ఇక దర్శకులుగా తొలి అడుగు వేయడానికి చేతిలో స్క్రిప్టు పట్టుకుని నిర్మాతల, హీరోల చుట్టూ తిరుగున్న ఔత్సాహికులు, బొడ్డూడని అప్రెంటీస్ లు కూడా యాభైకోట్లకు తక్కువ బడ్జెట్ కథలు తయారు చేసుకోవడం లేదు. ఈ పోకడ ఎటు దారితీస్తుంది.

తెలుగు సినిమా పరిశ్రమ బుడగలోకి వెళ్లిపోతుంది. బుడగ పెద్దదిగానే కనిపిస్తుంది. కానీ ఏదో నాటికి పగలడం గ్యారంటీ. సినిమా ఇండస్ట్రీ దారితప్పుతున్న పోకడలమీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘బుడగలో టాలీవుడ్’!

ఇరవై నాలుగేళ్ల కుర్రాడు ప్రసాదుకు దర్శకుడు కావాలని కోరిక. ఊరి నుంచి వచ్చేశాడు.. రెండు మూడేళ్లయింది. బిటెక్ చదివిన కొడుకు ఇలా వెళ్లాడని ఇంట్లో మగ్గం పనిలో ఉండే పేద తల్లికి చింత. అప్పుడప్పుడూ ఫోనుచేస్తే ఉద్యోగమూ పెళ్లీ ప్రస్తావన తెస్తుంది. ‘డైరక్టరుగా సినిమా రిలీజ్ అయిన తర్వాతనే పెళ్లి’ అని ప్రసాద్ ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఎంతైనా ప్రసాద్ లో కాస్త క్రియేటివ్ స్పార్క్ ఉంది. అందులో సందేహం లేదు. కానీ ఎవ్వరి దగ్గరా పనిచేసిన అనుభవం లేదు.

సినిమా క్రాఫ్ట్ గురించి ఆలోచన, అవగాహన ఉన్నాయేమో గానీ.. ఫీల్డ్ మీద స్వయంగా పనిచేయలేదు. కథలు మాత్రం రకరకాల జోనర్లలో పుంఖానుపుంఖాలుగా ఉన్నాయి. వాటిలో కొన్ని ఎన్నదగిన కథలే. మొత్తానికి రెండేళ్లుగా ఎలాంటి పాట్లు పడ్డాడనేది తర్వాత.. అప్పర్ మిడిల్ క్లాస్ బడ్జెట్ లో సినిమాలు తీసే ఒక నిర్మాతను కూడా ఎలాగోలా దొరకబుచ్చుకున్నాడు. ఒకటిరెండు సంభాషణల్లో కుర్రాడి దగ్గర విషయం ఉందని నిర్మాతకు కూడా అనిపించింది. మొత్తానికి కథ వినడానికి ఒక ముహూర్తం కుదిరింది. ‘బడ్జెట్ ఎంతవుతుంది?’ అడిగాడు నిర్మాత కథ కంటె ముందుగా. ‘40–50 కోట్లు అవుతుంది సార్’ అన్నాడు ప్రసాద్.. తడుముకోకుండా. యథాలాపంగా నీళ్లు తాగుతూ ఆ ప్రశ్న అడిగిన నిర్మాతకు దెబ్బకు పొలమారింది.

ఈ కథ వింటే.. ఆ తర్వాత ఏమైంది? ప్రసాద్ ఏం కథ చెప్పాడు. నిర్మాత ఆ సినిమా చేశాడా లేదా? అనే అనుబంధ ప్రశ్నలు పుట్టవు.

తమాషా ఏంటంటే.. బొడ్డూడని దర్శక ఔత్సాహికులు కూడా తాము తయారు చేసుకునే సినిమా కథలను చిన్న బడ్జెట్ లలో ఊహించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరి ఊహల్లోనూ ఒక ఆర్ఆర్ఆర్ లాంటి సినిమానో, కల్కి, పుష్ప లాంటి సినిమానో చేయాలని మాత్రమే ఆలోచనలు మెదలుతుంటాయి. ‘Think big’ అనే అబ్దుల్ కలాం సూత్రాన్ని తెలుగు సినిమా ఔత్సాహికులు మాత్రం తూచా తప్పకుండా పాటిస్తున్నారు.

హీరోలు తగ్గడం లేదు..

తెలుగు సినిమా పరిశ్రమలో ఒక పెద్ద దరిద్రం ఏంటంటే.. తమ సినిమా బడ్జెట్ గురించిన నెంబర్స్ చెప్పుకోవడాన్ని హీరోయిజంగా భావించే ధోరణి వచ్చేసింది. ఒక హీరో చిత్రానికి 300 కోట్లు అయ్యాయంటే.. మరో హీరో తన చిత్రానికి 400 కోట్లు బడ్జెట్ తో తీసినట్టు చెప్పుకోవడమే లక్ష్యంలాగా బతుకుతున్నారు. అదొక్కటే కాదు. ప్రతి సారీ ప్రతి హీరో కు ‘నాకు నేనే పోటీ’ లాంటి పనికిమాలిన లాజిక్ కూడా ఉంటుంది. తన గత చిత్రంతో పోలిస్తే బడ్జెట్ పెరగాలని అనుకుంటూ ఉండడం.

పాత చిత్రం కంటె ఎక్కువ విజయవంతం కావాలని ఎవ్వరైనా కోరుకుంటారు. నిన్నటికంటె ఇవాళ ఒక మెట్టు పైకి ఎదగాలని కోరుకోవడం తప్పుకాదు. మనిషికి ఉండే ఆశావహ దృక్పథం అది. ఆ పెరగడం అనేది బాక్సాఫీసు వసూళ్లలోగానీ, ప్రజల మెప్పుపొందడంలో గానీ ఉండాలని కోరుకోవాలి. కానీ ఖర్మం ఏంటంటే.. ఈ రెండూ వేర్వేరు అని కూడా మన పరిశ్రమలో చాలా మందికి తెలియదు. వారికి తెలిసిందల్లా ఒక్కటే. ఒక మెట్టు ఎదగడం అంటే.. ఓ వంద కోట్ల బడ్జెట్ పెంచేసుకున పోవడమే.

హీరోలు అవాంఛనీయమైన పోటీతో బడ్జెట్ లు పెంచుకుంటూ పోతున్నారు. ఫలితంగా.. ఒక్కో సినిమా సగటున మూడేళ్లు తయారవుతోంది. మూడేళ్లలో నాలుగైదు సినిమాలు చేస్తే ఎంత రెమ్యునరేషన్ దక్కుతుందో సదరు హీరో అంత సొమ్మూ ఆ ఒక్క సినిమాలోనే పిండుకుంటాడు. డబ్బులొచ్చేశాయి కదా.. తనకు పోయిందేముంది అని అనుకుంటున్నారు. కేవలం సినిమాల సంఖ్య తగ్గడం మాత్రమే కాదు.. కెరియర్ పరంగా వైవిధ్యం లేని మూస హీరోగా ముద్ర పడిపోవడం కూడా తనకు ఒక ప్రమాదం అని వారు గుర్తించడం లేదు.

దర్శకులు కూడా ఇదే ఇమేజి జోరులో, మోజులో పడిపోయారు. అగ్ర దర్శకులకు తమ మీద తమకు అదుపు తప్పిపోయింది. ఒకసారి 200 కోట్ల సినిమా చేస్తే ఆ తర్వాత 400 కోట్ల సినిమా అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్లు, అంతర్జాతీయంగా రికార్డులు సృష్టించే, కలెక్షన్ల సునామీ సృష్టించే సినిమాలు తీయకూడదని మన ఉద్దేశం కాదు. ఒక సినిమాకు 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ రూపంలోనే అందుతున్నప్పుడు ఇక రెండు ఐదు కోట్ల సినిమాలు చేయడానికి ఏ దర్శకుడు మాత్రం మొగ్గు చూపుతాడు.

రాజమౌళి వంటి ప్రతిభావంతుడైన దర్శకుడికి తన మీద తనకు అదుపు గతంలో ఉండేది. అందుకే ఆయన ఒక బ్లాక్ బస్టర్ తీసిన తర్వాత దాని తాలూకు ఎక్స్పెక్టేషన్స్ ప్రభావం తర్వాతే సినిమాల మీద పడకుండా మధ్యలో ఒకటో ఆరో మామూలు సినిమా తీసేవారు. వాటితో కూడా చక్కటి ప్రశంసార్హమైన సక్సెస్ ను అందుకున్న ట్రాక్ రికార్డు ఆయనకుంది. మర్యాద రామన్న, ఈగ సినిమాలు అలా రూపొందినవే. అలాంటి పోకడ వలన, ఆ తరువాత మరో భారీ బ్రహ్మాండమైన చిత్రం చేయడం అనేది దర్శకుడికి కూడా ఒక రకమైన మజా ఇస్తుంది.

విరామంలో చేసే చిన్న సినిమా ఒక రకమైన మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. అయితే అలాంటి ప్రశాంతతను దర్శకులకు దక్కనివ్వకుండా వారిని గల్లా పట్టుకుని బరబర ముందుకు ఈడ్చుకెళుతూ ఉంటుంది ఇండస్ట్రీ. ఇండస్ట్రీలోని వ్యాపార పోకడలు వారిని కుదురుగా ఉండనివ్వవు. వారి నిర్ణయాలను అవే ప్రభావితం చేస్తాయి. వారికి స్వేచ్ఛ ఉండదు.

ఒక భారీ బ్రహ్మాండ చిత్రం తరువాత అంతకంటే బ్రహ్మాండమైన చిత్రం వారి నుంచి రావాలనే విధంగా మార్కెట్ వారి ప్రస్థానాన్ని శాసిస్తూ భ్రష్టు పట్టిస్తుంటుంది. ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఒకదాని తర్వాత మరొకటి భారీ చిత్రాలను మాత్రమే వారు ప్లాన్ చేసుకుంటూ సాగుతుంటారు.

చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. అది తప్ప మిగిలిన చిత్రాలన్నీ పద్ధతిగా తయారవుతున్నవని అనడానికి కాదు గానీ.. కేవలం ఉదాహరణ మాత్రమే. శివభక్తుడైన కన్నప్ప కథ ఉంది. దానిని సెల్యులాయిడ్ మీద ఇప్పటికే చిత్రించారు. నవతరం హీరోల్లో మంచు విష్ణు.. తానే కన్నప్పగా మరోసారి ఆ కథను చెప్పాలని అనుకున్నారు. అయితే బడ్జెట్ సమస్య వచ్చింది. అందరూ భారీ బడ్జెట్ సినిమాలు తీస్తుండగా.. తాను మాత్రం చిన్న బడ్జెట్ లో చేస్తే ఎలాగ? అందుకే ఆ సినిమాకు ఒక దశలో 600 కోట్ల బడ్జెట్ ప్రకటించారు.

కన్నప్ప అనే ఆటవికుడు కడప జిల్లా నుంచి శ్రీకాళహస్తి ప్రాంతాల వరకు విస్తరించి ఉండే అటవీ ప్రాంతాలలో సంచరించే జాతులకు చెందిన వాడు. కొండల మయమైన ఆ అడవులు మరీ అంత చిక్కగా బీభత్స కీకారణ్యాలను తలపించేవి కూడా కాదు. అలాంటి అడవుల్లో తిరిగే కన్నప్పకు అక్కడి ఓ శివలింగంపై భక్తి కుదరడం, ఆ తర్వాత ముక్తి పొందడం కథ! ఆ కన్నప్పకు లవ్ స్టోరీ అనేది సినిమాటిక్ జోడింపు. అది కాల్పనిక కథ కాదు.. మనకు ఇష్టం వచ్చిన నేపథ్యాలను, సెటింగులను, ఆయుధ సంపత్తిని ‘డిజైన్’ చేసుకోవడానికి. ప్రజలందరకూ తెలిసిన కథ.

ఒక పురాతన కాలంనాటి ఆటవిక గూడేలను సృష్టిస్తే చాలు. ఈ నేపథ్యం కోసం న్యూజీలాండ్ లోని అడవులకు వెళ్లాల్సిన అవసరం ఉందా? హీరో మంచు విష్ణు కుటుంబానికి చెందిన విద్యాసంస్థలకు అత్యంత సమీపంలో ఉండే తలకోన అడవులకు మించిన లొకేషన్ ఈ చిత్రానికి అవసరం ఉంటుందా? ఒక ఆటవికుడికి నగిషీలు చెక్కిన ఆయుధాలను పెడితే నప్పుతుందా? బడ్జెట్ పెరగడం తప్ప.. వందల కోట్ల ముచ్చట్లు చెప్పుకోవడానికి తప్ప.. దాని అవసరం మరొకటి మనకు కనిపించదు. ఆ ఒక్క చిత్రాన్ని ఆడిపోసుకోవడం అనవసరం. దాదాపుగా ప్రతి ఒక్కరూ చేస్తున్న పని అదే.

ఊహలను బడ్జెట్ మూసల్లో పోస్తూ..

దర్శకులు తాము ఒక కథను ప్లాన్ చేసుకుని ఆ కథకు న్యాయం చేయడం గురించి ఆలోచించడం లేదు. ముందు కథకు ఫైనల్ ట్రీట్ మెంట్ అనేది బడ్జెట్ మూసలో పోస్తూ సాగిస్తున్నారు. ముందు కథను ఊహించుకుని, కథకు న్యాయం చేసేలా క్యాస్టింగ్, లొకేషన్లు, ప్రొడక్షన్ ప్లాన్ ఇలా ముందుకెళ్లడం జరగడం లేదు. పోనీ ఒక హీరో మీద ఒక జోనర్ కు చెందిన సినిమా ప్లాన్ చేస్తున్నప్పడు.. అలాంటి చిత్రానికి మార్కెట్ ఎంత ఉన్నదో ముందుగా అంచనా వేసుకుని.. ఆ వసూళ్ల అంచనాలలో లాభాలను మినహాయించి మిగిలిన బడ్జెట్ లోకి ప్రొడక్షన్ మొత్తం కుదించుకునేలా రివర్స్ ప్లానింగ్ కూడా జరగడం లేదు. కథ మామూలుదే అయినా.. ముందు భారీ బడ్జెట్ ఊహించుకుని ఆ బడ్జెట్ చేరుకోవడానికి ఆ మామూలు కథకు ఎలాంటి హంగులు జోడిస్తూ వెళ్లాలో ఆలోచించుకోవడం జరుగుతోంది.

ఈ వ్యవహారం ఎంతగా శృతిమించుతున్నదంటే.. ఒక మామూలు లవ్ స్టోరీ కథ దర్శకుడి బుర్రలో తయారవుతుంది. దాన్ని యథాతథంగా తీస్తే– ఫర్ సప్పోజ్ నటుల టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు లేకుండా– రెండు నుంచి అయిదు కోట్లు అవుతుందని అనుకుందాం. ఆ బడ్జెట్ లో సినిమా చేయడం దర్శకుడికి చాలా చిన్నతనంగా అనిపిస్తుంది. అందుకని ఆ ప్రేమకథను 1960ల్లోకి, 1970ల్లోకి తీసుకువెళతాడు. అప్పటి కాలాన్ని ప్రతిబింబించే వ్యవహారం అంతా కథకు అనవసరంగా జోడిస్తాడు.

కథ ఆ రకంగా ఓ యాభయ్యేళ్ల కిందట జరగాల్సిన అవసరం ప్రత్యేకంగా కథలో ఉండదు. కానీ.. తాను కూడా అలాంటి పీరియాడిక్ మూడ్ తో సినిమా తీశాను అని చెప్పుకోవాలనే కుటిల ఆనందం దర్శకుడికి ఉంటుంది. ఇలాంటి చిల్ల కారణాలతో బడ్జెట్ పెంచుకుంటూ పోతుంటారు.

అందరూ అంటారు.. కానీ ఎవరూ చేయరు!

అతడు సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ మంచి డైలాగు రాశాడు. అక్కకు పెళ్లి చూపుల గురించి ప్రస్తావిస్తూ హీరోయిన్ త్రిష తనను తాను పొగుడుకుంటుంది– మహేష్ బాబు వద్ద! ‘‘నువ్వు షాపుకు వెళ్లావ్.. అక్కడ పోర్టబుల్ టీవీ– ప్లాజ్మా టీవీ ఉందనుకో ఏది కొంటావ్? అంబాసిడర్, బెంజి కార్లు ఉన్నాయనుకో ఏది కొంటావ్?.. అక్క అంబాసిడర్.. నేను బెంజి! అది పోర్టబుల్ టీవీ అయితే నేను ప్లాజ్మా’ అని డైలాగు చెబుతుంది. అందుకు జవాబుగా మహేష్ బాబు.. ‘అందరూ బెంజి బాగుందంటారు పూరీ కానీ అంబాసిడరే కొంటారు’ అని పంచ్ డైలాగు వేస్తాడు.

మన తెలుగు ఇండస్ట్రీలో అచ్చంగా రివర్స్ జరుగుతోంది. మళయాళం సినిమా బాగున్నాయని అందరూ అంటారు. కానీ ఏ ఒక్కరూ అలాంటి సింపుల్ మేకింగ్ టెక్నిక్స్ తో ఒక సెల్యులాయిడ్ అద్భుతాన్ని సృష్టించే ప్రయత్నం చేయరు? అలాగని చిన్న సినిమాలు రావడం లేదని కాదు. ఉబుసుపోక తీసే సినిమాలు, మభ్యపెట్టి తీసే సినిమాలు చిన్న బడ్జెట్ లోనే వచ్చి మునిగిపోతుంటాయి.

ఇక్కడ ప్రస్తావన వాటి గురించి కాదు. ప్రజల మన్నన పొందగలిగేలా రూపొందుతున్న చిన్న సినిమా గురించి. మళయాళం సినిమాలు చాలా బాగున్నాయనే మాట అందరి దర్శకులనోళ్లలో కూడా వినిపిస్తుంది. కానీ ఏ ఒక్క దర్శకుడు కూడా అలాంటి సినిమా చేయడానికి మాత్రం ప్రయత్నించడు. రెమ్యునరేషన్లు క్యాస్టింగ్ ను బట్టి మారిపోతాయి కాబట్టి.. ఆ సంగతి పక్కన పెడితే.. రెండుకోట్ల కంటె తక్కువ బడ్జెట్ లో రూపొందిన మంచి సినిమాలు ఇటీవలి కాలంలో మనకేం ఉన్నాయి. కాస్త పేరున్న హీరోల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ మాట అడగడమే అవమానంగా వాళ్లు ఫీలయ్యే పరిస్థితి.

కేరాఫ్ కంచెరపాళెం, బలగం, క లాంటి సినిమాలు ఇటీవలి కాలంలో ఎన్ని తయారవుతున్నాయి. ఈ చిత్రాలు ఎలాంటి హంగులు బడ్జెట్ కు సంబంధించిన మాయలు గారడీలు లేకుండా ప్రజలను అలరించాయి. మంచి పేరు తెచ్చుకున్నాయి. వీటిని అనుకరిస్తూ బోలెడు చెత్త సినిమాలు తయారయ్యాయి. కానీ.. అనుకరణ జోలికి వెళ్లకుండా ఈ ఫార్మాట్ లో వినూత్నమైన ఆలోచనతో మన ఇండస్ట్రీలో ఎన్ని తయారవుతున్నాయి.

ఏడాదికి వంద సినిమాలకు పైగా తయారయ్యే తెలుగు చిత్ర పరిశ్రమలో ఏడాదికి ఒక్కటైనా చెప్పుకోడానికి ఇలాంటిది మనకు ఉంటోందా? ఏడాదికి కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలో.. కనిష్టమైన బడ్జెట్ తో తయారవుతున్న చిత్రాలు మనం ఎన్నింటిని ఏరగలం? అనేది ఎప్పటికీ ఒక మిలియన్ డాలర్ ప్రశ్న.

ఈ పోకడలు పరిశ్రమను దుర్మార్గమైన బడ్జెట్ శిఖరాల మీదికి తీసుకెళ్లి ప్రమాదకరమైన స్థానంలో కూర్చోబెడతాయి. శిఖరం చివరి అంచుకు చేరిన తర్వాత ఇక అధిరోహించడానికి కూడా ఏమీ ఉండదు. అక్కడినుంచి జారిపోవడం తప్ప.. ప్రస్థానం వేరే ఉండదు. బడ్జెట్ పరంగా కూడా హెచ్చుతగ్గుల మేళవింపుగా సినిమాలు రూపొందుతూ ఉంటే మాత్రమే మెచ్చుకోదగ్గట్టుగా పరిశ్రమ సాగుతుంది. లేకపోతే.. ఒకే తీరుగా అందరూ భ్రమల్లో బతుకుతూ, బడ్జెట్ ఊహల్లో తేలియాడుతూ ఉంటే.. టాలీవుడ్ నీటిబుడగ ఏదో ఒక నాటికి ఢామ్మని పేలుతుంది. ఆ పరిస్థితి రాకముందే పరిశ్రమ మేలుకుంటుందని కోరుకుందాం.

..ఎల్ విజయలక్ష్మి

11 Replies to “బుడగలో టాలీవుడ్!”

  1. మిగతా హీరో లకి మార్కెట్ ఉంది, విష్ణు కి మార్కెట్ లేదు, ఆ కథ లో కూడా అంత ఆకట్టుకునే అంశాలు ఉండవు, కృష్ణంరాజు సినిమా ఆడిందంటే దానికి ముఖ్య కారణం మ్యూజికల్ హిట్ కావడం, వాణిశ్రీ హీరోయిన్ కావడం. అందువల్ల అంత బడ్జెట్ పెట్టడం శుద్ధ అనవసరం. కాంతారా కన్నడ సినిమా లాగా తీసి ఉంటే సరిపోయేది.

  2. కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం.

    1. ఇకపై ఏ స్టార్ హీరో సినిమా కూడా వారానికి మించి ఆడదు. థియేటర్ లో చూడాలి అనిపించే కల్కి లాంటి సినిమాలు తప్ప.

    2. ఒకవేళ ఆడింది అంటే.. జబ్బలు చరుచుకోవడం తప్ప… నిజం కాదు

    3. పుష్చ 1 రిలీజ్ అయ్యే నాటి పరిస్థితులు వేరు.. అప్పుడప్పుడే జనాలు కొవిడ్ నుండి తేరుకుంటున్నారు. సినిమాలకు మొహం వాచి ఉన్నారు. ఇంకా OTT కి పూర్తిగా అలవాటు పడలేదు. అలాంటి టైమ్ లో వచ్చిన పుష్ప కంటెంట్ కూడా ఉండడం వల్ల బాగా ఆడేసింది.

    4. ఇప్పుడు జనాలకి అంతకి మించిన కంటెంట్ అరచేతిలో అందుబాటులో ఉంది. వాడి ఇష్టం వచ్చిన టైమ్ లో చూసుకోవడానికి. ఇప్పుడు ట్రాఫిక్ సాగరాన్ని ఈదుకుని మరీ థియేటర్ కి వెళ్లి.. డబ్బులు.. సమయం బొక్కెట్టుకుని చూసే ఓపిక… దూల ఎవడికీ ఉండడం లేదు.. ఫ్యాన్స్ కి తప్ప.

    5. నెలన్నర ఆగితే ఇంట్లో కూర్చుని… పేద్ద టీవీ లో… హోమిథియేటర్ సిస్టమ్ లో కుటుంబంతో కలిసి తక్కువ ఖర్చులో.. వారికి ఇష్టమైన టైమ్ లో… ఇంట్లోనే స్నాక్స్ కూల్డ్రింక్స్ రెడీ చేసుకుని… హ్యాపీ గా చూసేస్తున్నారు.

  3. కేవలం ఐదు కోట్ల బడ్జెట్ లో తయారైన మలయాళ సినిమా ” అయ్యప్పనుం కోషియుం ” తెలుగుకు వచ్చేటప్పటికి హీరో రెమ్యునరేషనే ఐదు కోట్లయ్యింది. హీరో గారు ఏమైనా తగ్గుతాడా? అబ్బే.. దానికి పైన ఎలివేషన్లు వగైరా… వగైరా… ఆఖరుకు ఏవరేజ్ లేదా తుస్

  4. Except a few Directors like Rajamouli, all others are following a trend and unnecessarily wasting money. The best example is KANNAPPA by Manchu Vishnu. Do we really need such a high budget expenditure for this movie? I agree with the author that this movie could have been managed with shooting in Talakona in a simple manner.

    Bhakta Kannappa is a simple hunter living in tribal places and do we really need the kind of build up given by Manchu Vishnu to the range of Bahubali?

    Puli ni chooi nakka vaatha pettukovadam ante idhe.

    Disgusting…

    Having watched BHAKTA KANNAPPA produced by the Great Legend Krishnamraju, I felt like laughing the visuals of Manchu Vishnu KANNAPPA.

Comments are closed.