బన్నీ-దేవిశ్రీ…. పైకి అంతా బాగానే ఉంది!

తన ప్రాధాన్యం తగ్గిస్తూ, తమన్ లాంటి సంగీత దర్శకుడ్ని ప్రాజెక్టులోకి తీసుకురావడంపై దేవిశ్రీ పెద్దగా ఫీల్ అయినట్టు కనిపించడం లేదు.

పుష్ప-2 సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం దేవిశ్రీని కాదని మరికొందరు మ్యూజిక్ డైరక్టర్లను ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు. దీంతో దేవిశ్రీ హర్ట్ అయినట్టు చాలా వార్తలొచ్చాయి. ఇది ఎవరి పని అని ఆరా తీసే క్రమంలో సుకుమార్, అల్లు అర్జున్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి.

ఒక దశలో అల్లు అర్జున్ తో బాగా క్లోజ్ గా ఉండే ఓ స్టార్ డైరక్టర్ ఈ పని చేయించాడనే ప్రచారం కూడా నడిచింది. మొత్తానికి అంతా కలిసి ఈ నెపాన్ని నిర్మాతలపై నెట్టి చేతులు దులుపుకున్నారు. ఈ సంగతులన్నీ పక్కనపెడితే.. తన ప్రాధాన్యం తగ్గిస్తూ, తమన్ లాంటి సంగీత దర్శకుడ్ని ప్రాజెక్టులోకి తీసుకురావడంపై దేవిశ్రీ పెద్దగా ఫీల్ అయినట్టు కనిపించడం లేదు.

అతడి మాటల్లో, చేతల్లో ఆ బాధ లేదు. మరీ ముఖ్యంగా బన్నీ-దేవిశ్రీ మధ్య బంధం ఎప్పట్లానే ఫెవికాల్ లా గట్టిగా ఉన్నట్టు కనిపిస్తోంది. అది మంచి విషయమే కదా.

చెన్నైలో జరిగిన పుష్ప-2 ఈవెంట్ లో బన్నీని ఆకాశానికెత్తేశాడు దేవిశ్రీ. బన్నీ బాయ్.. మై డార్లింగ్ అంటూ తెగ ప్రేమ కురిపించాడు. ఇలాంటి విషయాల్లో అల్లు అర్జున్ కూడా అస్సలు తగ్గేదేలే. మైక్ అందుకున్న వెంటనే దేవిశ్రీ ప్రసాద్ పై అపారమైన ప్రేమ కురిపించాడు.

హీరోలందరికీ దేవిశ్రీ ట్యూన్స్ ఇస్తాడని, తన సినిమాలకు మాత్రం అతడు ట్యూన్స్ తో పాటు తన ప్రేమను కూడా ఇస్తాడంటూ బన్నీ అనడంతో చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికేసినట్టయింది. ఇక మిగిలింది దేవిశ్రీపై సుకుమార్ ప్రేమను కురిపించడమే.

పుష్ప-2లో జరిగిన కీలక మార్పు, బన్నీ-దేవి మధ్య బంధాన్ని పెద్దగా దెబ్బతీయలేదనే ఫీలింగ్ ను కలిగించింది చెన్నై ఈవెంట్. మరీ ముఖ్యంగా పుష్ప-2 ప్రచారానికి దేవిశ్రీ ముందుకు రాకపోవచ్చనే ఊహాగానాలకు కూడా ఈ ఈవెంట్ చెక్ పెట్టింది.

ఎటొచ్చి ఈ బంధంపై మరింత స్పష్టత రావాలంటే తన తదుపరి చిత్రాలకు కూడా దేవిశ్రీనే రిపీట్ చేయాలి అల్లు అర్జున్. అయితే అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేది కాదు. త్రివిక్రమ్ తో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు బన్నీ. అక్కడ త్రివిక్రమ్ ఉన్నాడు కాబట్టి, దేవిశ్రీ ఉండడనేది ఓపెన్ సీక్రెట్.

3 Replies to “బన్నీ-దేవిశ్రీ…. పైకి అంతా బాగానే ఉంది!”

  1. ఒకప్పుడుMega hero అయినా కూడా paytm బ్యాచ్ కి సపోర్ట్ చేశాడని గుంట నక్కని బాగా ఓన్ చేసుకొని లేపుతున్నారు

Comments are closed.