కెవి: జ్ఞాన సముపార్జనా మార్గం మాతృభాష

తెలుగువారికి భాషాభిమానం లేదని అనేయడం సులభం. ఆ అభిమానం లేకుండా చేసినదెవరు? వారికి భాష అంటే భయం, బెదురు కలిగించినవారెవరు?

‘ఎవరైనా జ్ఞానం సంపాదించాలంటే మాతృభాషలో సంపాదిస్తారు. ఎందుకంటే మన తొలి గురువు అమ్మ. అమ్మ చేతి గోరుముద్దతో పాటు అమ్మ నేర్పిన తొలిపలుకులను, ప్రాథమిక పాఠాలను మాతృభాషలోనే నేర్చుకుంటాం. అమ్మ ఒడిలోనే ఎదుగుతాం. భావాలను వ్యక్తీకరించడానికి తల్లి వాడిన మాటలనే, ఆ పదబంధాలనే, ఆ సామెతలనే వాడతాం. ఎవరైనా ఆ భాషలో చెప్తేనే సులభంగా అర్థం చేసుకుంటాం. అలవోకగా సమాధానం చెప్తాం. ఆ భాషాసౌందర్యాన్ని ఆస్వాదిస్తాం. మాతృభాషపై అధికారం సంపాదించినవారు, యితర భాషలను అవలీలగా అవగతం చేసుకుంటారు. ఇతర భాషలను ఉదరపోషణార్థమే అభ్యసిస్తాం కాబట్టి వాటిని వాడినప్పుడు మానసిక తృప్తి వుండదు.

సమస్త లోకాన్ని మనం మాతృభాష ద్వారానే అవలోకిస్తాం. మన సంస్కృతిని అర్థం చేసుకోవాలన్నా, ఆత్మీయులతో సంభాషించాలన్నా మాతృభాషే గతి. భాషా సంస్కృతులలో నైపుణ్యాలే సుస్థిర అభివృద్ధికి రహదారులు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రపంచ మేధావులందరూ మాతృభాషలోనే, మాతృభాషా మాధ్యమంలోనే విద్య గరపాలని హితవు చెప్తున్నారు. ప్రభుత్వానికి, సామాన్య ప్రజలకు మధ్య మాతృభాషలోనే ఉత్తరప్రత్యుత్తరాలు జరపడమే కాక, ప్రభుత్వ అధికార యంత్రాంగం మొత్తం మాతృభాషలో వ్యవహారాలు నడిపినప్పుడే, ప్రజలు కష్టాలు, మనోభావాలు పాలకులకు అర్థమవుతాయని సలహా యిచ్చారు. జర్మనీ, జపాన్‌, రష్యా, చైనా… యిలా పలు దేశాల పౌరులు తమ మాతృభాషలోనే చదువుకుని, ఎన్నో అద్భుత విజయాలు సాధించారు. సృజనాత్మకత అనేది మాతృభాష ద్వారానే సాధ్యం. వారే నూతనంగా ఆలోచించగలరు.

అందువలన మన బోధన తెలుగులో సాగాలి, మన పాలన తెలుగులో సాగాలి, మనం తెలుగులో మాట్లాడడానికి సిగ్గుపడకూడదు, మన పిల్లలను తెలుగు మాధ్యమంలోనే చదివించాలి, తెలుగు వారిగా పుట్టినందుకు గర్వించాలి. ప్రపంచంలోని భాషలన్నిటిలో తెలుగు ఉత్తమోత్తమమైన భాష. అందమైన భాష. వేల సంవత్సరాలుగా చక్కటి సాహితీసంపదతో తులతూగుతున్న భాష. మనం పట్టించుకోకపోతే ఆ భాష లుప్తమై పోతుంది. తెలుగు మాధ్యమంలోనే విద్యాబోధన సాగాలని ఉద్యమిద్దాం. తల్లిని గౌరవిద్దాం, తల్లినుడిని గౌరవిద్దాం. ఇంగ్లీషు మాధ్యమంలో చదివితేనే తెలివితేటలు వచ్చేస్తాయని, యిబ్బడిముబ్బడిగా ఉద్యోగావకాశాలు కురుస్తాయనే భ్రమల్లోంచి బయటపడదాం. భవిష్యత్తు బాగుండాలంటే తెలుగే శరణ్యం.’

-అచ్చం యివే మాటలు కాకపోయినా, కాస్త అటుయిటూగా యిలాటి వ్యాసాలనే, ఉపన్యాసాలనే 40 ఏళ్లగా ప్రతీ ఏటా వింటున్నాను. కొన్ని సందర్భాల్లో వేదికలెక్కి ఉద్ఘాటించాను కూడా. ఒక ఏడాది పాటు తెలుగులోనే సంతకాలు పెడతానని పంతం పట్టి నెరవేర్చాను. తెలుగులో పక్ష పత్రిక పెట్టి, దాదాపు 70 తెలుగు పుస్తకాలు అచ్చువేసి చేతులు కాల్చుకున్నాను. అనేక తెలుగు పుస్తకాల ప్రచురణకు, అనేక తెలుగు సంస్థలకు, తెలుగు యూనివర్శిటీకి నా శక్తిమేరకు తోడ్పడ్డాను.

ఎదిగామా? దిగామా? – 40 ఏళ్ల తర్వాత వెనుదిరిగి చూస్తే ఏం కనబడుతోంది? అప్పటికంటె తెలుగు వాడకం మరింత తక్కువైంది. తెలుగు రాష్ట్రాలలో పరిపాలన తెలుగులో సాగటం లేదు. దశాబ్దాలుగా అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఎవరున్నా సరే, నిట్టూర్పులు విడుస్తూ, నిస్సహాయత వ్యక్తం చేస్తూ, తమ సిఫార్సులు అమలు కావటం లేదని అధికారులపై ఫిర్యాదులు చేస్తూనే వున్నారు. తెలుగు పుస్తకాల ప్రచురణ నానాటికి తగ్గిపోతోంది. తెలుగువారి జనాభా కోట్లలో వున్నా తెలుగు పుస్తకాల ప్రచురణ వందల్లో వుంటోంది. తెలుగు పత్రికల సంఖ్యా తగ్గిపోతోంది. సర్క్యులేషన్‌ పడిపోతోంది. పిల్లలు కూడా చదవాలంటే యింట్లో ఇంగ్లీషు దినపత్రికే తెప్పించాలంటున్నారు. తెలుగంటే చిన్నచూపు మరింత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలంటే తెలుగు మాధ్యమమే వుంటుందనే బెరుకుతో, అట్టడుగు వర్గాల వారు కూడా తమ తాహతుకు మించిన ఫీజులు కట్టి పిల్లలను ఇంగ్లీషు మీడియం స్కూళ్లకు పంపడం పెరిగింది.

ఏ విద్యావంతుడూ వేదికపై, టీవీ చర్చల్లో పట్టుమని పది నిమిషాలపాటు ధారాళమైన తెలుగు మాట్లాడలేక పోతున్నాడు. యువత తెలుగుకి మరింత దూరమై పోయారు. వేదికపై తెలుగు ప్రాశస్త్యం గురించి మాట్లాడే పెద్దలందరూ (నాతో సహా) పిల్లలను, మనుమలను తెలుగు మీడియం స్కూళ్లకు పంపటం లేదు. ‘మా పిల్లలు తెలుగు చదవలేరు కానీ మాట్లాడగలరండి. మా స్నేహితుల కుటుంబాల్లో అదీ లేదు.’ అని గొప్పగా చెప్పుకుని మురిసిపోతున్నాం. టీవీ వార్తల్లో తెలియని తెలుగు పదం తారసిల్లి పిల్లలు అర్థం అడిగితే, వాళ్ల జిజ్ఞాసకు మురిసి, ఇంగ్లీషులో విశదీకరిస్తున్నాం తప్ప 35 ఏళ్లు వచ్చినా మాతృభాష సరిగ్గా నేర్చుకోకపోతే ఎలా? అని మందలించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని ఖండించడానికి టీవీ చర్చలకు వచ్చినవారందరినీ యాంకర్‌ ‘మీ పిల్లలు, మనుమలు ఏ మీడియంలో చదువుతున్నారు? ఎదుటివారికి చెప్పడానికేనా మీ నీతులు?’ అని అడిగితే అందరూ నీళ్లు నమిలినవారే!

ఏరీ, ఎక్కడున్నారు విజనరీలు? ` ఎందుకిలా జరిగింది? విజనరీలం, దీర్ఘదర్శులం, ద్రష్టలం, స్రష్టలం అని చెప్పుకున్న నాయకులెవరూ తెలుగు స్థితిగతులను మెరుగుపరిచే ప్రయత్నం చేయలేదు. తెలుగు భాషోద్యమకారులు తమ తమ పిడివాదాలతో ముందుకు సాగలేదు, రచ్చ గెలవడం మాట అటుంచి, యింట ఐనా గెలవలేదు. తెలుగు భాషాకోవిదులు, భాషాశాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు తెలుగును ప్రజలకు ఆత్మీయంగా చేయకుండా అదంటే బెదిరేలా చేశారు. నిష్ఠూరంగా మాట్లాడుతున్నానని మీకు తోచవచ్చు కానీ దయచేసి నా వాదన విని, నా ఆవేదన సహేతుకమైనదో కాదో అప్పుడు నిర్ణయించండి.

పొసగని పోలిక – మొదటగా మనం గుర్తించవలసినది, మాతృభాషా బోధన అనగానే చెప్పే జపాన్‌, జర్మనీ ఉదాహరణలు మనకు వర్తించవు. ఎందుకంటే ఆ యా దేశాల్లో ఆ భాష ఒక్కటీ నేర్చుకుంటే చాలు, ప్రపంచంలోని సమస్త విజ్ఞానం అరచేతిలో వుంటుంది. ప్రపంచభాషల్లో ఏ నూతన సమాచారం వచ్చినా వారాల వ్యవధిలో వారి భాషలో తర్జుమా చేసేసుకుంటారు. ప్రపంచ భాషల్లో దొరికే ఉపయుక్తమైన ప్రతీ విషయాన్ని వాళ్ల భాషలోకి మార్చుకుని, వాళ్ల ప్రజల జ్ఞానాన్ని వృద్ధి చేస్తారు. మరి మనం? తెలుగులో ఎన్ని విజ్ఞానసర్వస్వాలు లభిస్తున్నాయి చెప్పండి.

ప్రభుత్వం ప్రచురించి వుంటే, దశాబ్దానికి ఒకసారైనా అప్‌టుడేట్‌ చేస్తున్నారా? మన పాలకులు రూపాయికి కిలో బియ్యం యిస్తాం, పండక్కి ఉచితంగా చీరలిస్తాం అంటారు తప్ప చౌకగా పుస్తకాలందించి జ్ఞానాన్ని పెంచుతాం అనరు. తెలుగు సంస్థలు, విశ్వవిద్యాలయాలు యీ దిశగా ఏం చేస్తున్నామని తమను తాము ప్రశ్నించుకోవాలి. తెలుగు మాధ్యమం గురించి ఉద్ఘాటించే తెలుగు పత్రికలు, టీవీలు తెలుగువారి విషయపరిజ్ఞానం పెంచడానికి తమ వంతు కృషి ఏం చేస్తున్నాయో చెప్పాలి.

పోనీ ప్రయివేటు వ్యక్తులెవరైనా పూనుకుని, విజ్ఞానసర్వస్వాలను ముద్రిద్దామంటే అవి అమ్ముడు పోవు. తొలి రోజు సినిమా చూడడానికి 300 రూ.లు ఖర్చు పెట్టే తెలుగు వాడికి శాశ్వతంగా ఉండే పుస్తకాన్ని 200 రూ.లు పెట్టి కొనడానికి చేతులు రావు. తెలుగు నిఘంటువు ఉన్న తెలుగిళ్లు 1 శాతం కూడా ఉండవని నా అంచనా. తెలుగువారు తెలుగు పత్రికలు చదవరు కాబట్టి సర్క్యులేషన్‌ పెద్దగా వుండదు. అందుచేత ఆ పత్రికలకు వ్యాపార ప్రకటనలు రావు. తత్కారణంగా ఆదాయం లేక తెలుగు పత్రికా రంగం కుదేలైంది.

అంతెందుకు కంప్యూటర్లలో, సెల్‌ఫోన్లలో ఇంగ్లీషు వాడకంలో వున్న సౌలభ్యం తెలుగు వాడకంలో వుందా? మన తెలుగు వాళ్లు యీ రంగంలో ఎంతోమంది ఉన్నా అలాటి సాంకేతికత ఎందుకు అందుబాటులో రాలేదు? ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు మాత్రమే తెలిసి వుంటే మన జ్ఞానపు పరిధి చాలా కుంచించుకుపోతుంది. విజ్ఞానం పెరగాలంటే ఇంగ్లీషు తెలిసి వుండాలి. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇంగ్లీషు లేదు తెలుసా అనకండి. ఇంగ్లీషు కాకపోతే జర్మనీ వంటి మరో అంతర్జాతీయ భాష నేర్చుకుంటే జ్ఞానం పెరుగుతుంది తప్ప మాతృభాషనే అంటిపెట్టుకుని వుంటే చాలా విషయాలు తెలియకుండా పోతాయి. ఇక్కడ యింకో మాట, జర్మనీ నేర్చుకోవాలన్నా ఇంగ్లీషు ద్వారానే నేర్చుకోగలం, తెలుగు ద్వారా కాదు!

ఇంగ్లీషు మీడియం తప్పనిసరి కాదు – ఇక్కడ ఇంగ్లీషు నేర్చుకోవాలి అంటున్నాను తప్ప ఇంగ్లీషు మీడియంలో చదివి తీరాలి అని అనటం లేదు. తెలుగు మీడియంలో చదివి, ఇంగ్లీషు ద్వారా జ్ఞానాన్ని నిక్షేపంలా పెంచుకోవచ్చు. తెలుగు, ఇంగ్లీషు రెండూ నేర్చుకుని, తెలుగు ద్వారా లలితకళలను ఆస్వాదించవచ్చు, ఇంగ్లీషు ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. ఇంగ్లీషు మీడియమైనా, తెలుగు మీడియమైనా ఇంగ్లీషు ఎలాగూ నేర్పుతారు కాబట్టి, సబ్జక్టంటూ అర్థమైతే ఇంగ్లీషులో మాట్లాడి ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు కదా అని వాదించవచ్చు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పరీక్ష తెలుగులో ఉంటే తెలుగు మీడియం వాడికి, ఇంగ్లీషులో ఉంటే ఇంగ్లీషు మీడియం వాడికి ఎక్కువ అవకాశముంది. మరి అవి ఇంగ్లీషులోనే ఉంటున్నాయి. అందుకే మన పిల్లల్ని ఇంగ్లీషు మాధ్యమంలో చేర్పిస్తున్నాం. ఇంకొకటి కూడా గుర్తించాలి. తెలుగులో ఆలోచించి, ఇంగ్లీషులో మాట్లాడబోతే అభాసుపాలవుతాం. ఏ భాష ‘ఇడియం’ (నుడికారం) దానిదే!

తెలుగు మీడియంలో ఎంత దూరం పోగలం? – దీనితో బాటు యింకో ముఖ్యమైన అంశం ఉంది. మన చదువులో ఎక్కడో ఒక దశలో ఇంగ్లీషు మీడియంలోకి మారాల్సిన పరిస్థితి ఉంది. జర్మనీ వాడు జర్మన్‌ భాషలోనే ఇంజనీరింగు చేయగలడు. మనకా సౌకర్యం లేదే! ఇంటర్‌ దాకా తెలుగు మీడియంలో చదివి, ఇంజనీరింగు లేదా మెడిసిన్‌ వచ్చేసరికి ఇంగ్లీషు మీడియంలోకి మారాల్సి వస్తోంది. డిగ్రీ తెలుగు మీడియంలో ఉన్నా, పోస్ట్‌ గ్రాడ్యువేషన్‌ వచ్చేసరికి ఇంగ్లీషు మీడియంలోకి మారాల్సి వస్తోంది. ఇది పట్టణాలు, పల్లెల నుంచి వచ్చిన పిల్లలకు యిబ్బందికరంగా మారుతోంది. తెలుగు మీడియం ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకుని ఎంసెట్‌ ర్యాంకు తెచ్చుకున్నా బిటెక్‌, ఐఐటీ ఇంగ్లీషు మీడియానికి అలవాటు పడక, చదువులో వెనకబడినవారు, చదువు మానేసేవారు, ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు కనబడుతున్నారు.

అందువలన యీ మారడమనేది ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని ప్రజలు అనుకుని సాధ్యమైనంత త్వరగా ఆంగ్లమాధ్యమంలోకి మారుతున్నారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో నేర్పితే నేర్చుకోవడం సులభమని తెలిసి కూడా అప్పణ్నుంచే ఆంగ్లానికి మారడం యీ కారణం చేతనే జరుగుతోంది. ఏ స్థాయి ఉన్నత విద్యయినా సరే, తెలుగులో లభ్యమయ్యేవరకు యీ స్థితి మారదు. మార్చవలసిన బాధ్యత పాలకులది, ఉద్యమకారులది.

పదో తరగతితో చదువు ఆపేవారికి తెలుగు మీడియం చాలు – అయితే యిక్కడ ఒక విషయం మనం గుర్తించాలి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి చూస్తే అక్షరాస్యత 70 శాతం వుంటుంది. అంటే ఎలా చూసినా పదో తరగతి దాకా చదివేవారి సంఖ్య జనాభాలో 50 శాతానికి మించదు. పదో తరగతి వరకు మాత్రమే చదివేవాడికి తెలుగు మాధ్యమం సరిపోతుంది. కొద్దిపాటి ఇంగ్లీషు, కొద్దిపాటి హిందీ ఎలాగూ నేర్పుతారు. ఉపాధి కోసం ఏ రాష్ట్రానికి వెళితే అక్కడి స్థానిక భాష నేర్చుకుంటాడు.

పదో తరగతికి పైన చదువుదామనుకునేవాడే తొలినుంచీ ఆంగ్లమాధ్యమానికి వెళ్లాలి. ఆ విషయమేదో ముందే అంచనా వేసుకుని, మాధ్యమాన్ని ఎంచుకోవాలి. ఇంగ్లీషు మీడియంలో చదివినంత మాత్రాన తెలివితేటలు పెరిగి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయా అని కొందరు ప్రశ్నిస్తారు. ఆ గ్యారంటీయే కాదు, సరిగ్గా ఇంగ్లీషు వస్తుందన్న నమ్మకం కూడా లేదంటాను. విద్యాప్రమాణాలు, బోధనాపద్ధతులు, బోధకుల స్థాయి పెంచవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పాలి. ఇది తెలుగుకు కూడా వర్తిస్తుంది. తెలుగు బోధనా స్థాయి కూడా దిగజారిందని, ఐదో తరగతి కుర్రాడు కూడా అక్షరమాల పూర్తిగా రాయలేకపోయాడనీ వార్తలు వస్తున్నాయి.

టీవీల్లో, సినిమాల్లో ఉచ్చారణాదోషాల గురించి ఏం చేద్దాం? – బోధనామాధ్యమం మార్చడం వలన తెలుగు భ్రష్టు పట్టి పోతుందంటూ టీవీల్లో శివాలు తొక్కడం అర్థరహితం. టీవీ యాంకర్లను తెలుగు సరిగ్గా మాట్లాడడం నేర్చుకోమనండి. చాలామందికి ‘చ’, ‘జ’లలో రెండు రకాలున్నాయని తెలియదు. ‘శ’, ‘ష’ పలకడంలో ఉన్న తేడా తెలియదు. ‘ళ’ కు బదులు ‘ల’ పలుకుతారు. వత్తులు పలకలేరు. పదాలను ఎలా విడగొట్టాలో తెలియదు.

సినిమాల్లో పాటలు పాడేవారూ అంతే. భాషాభిమానులు వీరిపై ఎందుకు దండెత్తరో తెలియదు. ఏం చెప్పినా ఆచరణయోగ్యంగా ఉండాలి. తమిళులు ఏం చేశారు, కన్నడిగులు ఏం చేశారు అన్నది అనవసరం. తమిళుల్లో, బెంగాలీల్లో ఎంతటి విద్యాధికులైనా సరే ఇంటర్వ్యూ యిచ్చినపుడు ఇంగ్లీషు పదం దొర్లకుండా పావుగంటైనా మాట్లాడగలరు. మన తెలుగువాళ్లు ఐదు నిమిషాలు మాట్లాడితే, మూడు పదాలకు ఓ సారి ‘..సో’ అంటారు. పెళ్లి భోజనాల్లో అన్నం వడ్డించమంటే వంటవాడు ఎగాదిగా చూస్తాడు. వైట్‌ రైస్‌ మాత్రమే ఉందండి అంటాడు. ఈ తెగులు వదుల్చుకుంటే తప్ప తెలుగు మాధ్యమం గురించి మాట్లాడే హక్కు మనకు రాదు.

తెలుగంటే మమకారం కలగకుండా చూస్తున్నారు – తమ మాతృభాషపై తెలుగువారికి మమకారం తగ్గడానికి కారణాలేమిటి అని ఆలోచిస్తే అనేక సంగతులు బయటపడతాయి. హైస్కూలు స్థాయి నుంచి తెలుగంటే హడలగొట్టడం మొదలెడుతున్నారని నా అభిప్రాయం. గేయాల వంటి సులభమైన కవితా ప్రక్రియలతో సరిపెట్టకుండా ప్రబంధాల నుంచి, కావ్యాల నుంచి ప్రతిపదార్థ తాత్పర్యాలు టీచరు చెప్తే తప్ప అర్థం కాని పద్యాలు సిలబస్‌లో పెట్టి, సంధులని, వ్యాకరణాలనీ, సమాసాలనీ ఊదరగొట్టి, తెలుగంటే బాబోయ్‌ అనిపిస్తున్నారు. అందుకే చదువు పూర్తయ్యాక పద్యాలు చదివేవారు అరుదుగా కనబడతారు.

ఇంటర్‌కి వచ్చేసరికి తెలుగైతే మార్కులు పడవని, ఫ్రెంచ్‌ వంటి అతి అరుదుగా ఉపయోగపడే పరదేశ భాషలు ఐచ్ఛికభాషగా తీసుకుంటున్నారు. వారికి ఫ్రెంచ్‌ అంటే అభిమానం కాదు, తెలుగంటే భయం. తెలుగు మాధ్యమమంటే భయం దేనికంటే సాంకేతిక పదాలకు ఎకడమీషియన్స్‌ చేసే అనువాదాలు. అవి ఒక పట్టాన కొరుకుడు పడవు. మష్‌రూమ్‌కు తెలుగులో పుట్టగొడుగు అనే పదం వుంది. కానీ వీళ్లు ‘శిలీంధ్రం’ అంటారు. పన్ను అంటే అందరికీ అర్థమై పోతుందని ‘రాజస్వము’ అంటారు. అవసరమా?

కొంతమంది తెలుగును ఉద్ధరించేస్తున్నాం అనుకుంటూ ఫోన్‌ను ‘దూరవాణి’ అని, సెల్‌ను ‘చరవాణి’ అని, ఫేస్‌బుక్‌ను ‘ముఖపుస్తకం’ అని రాస్తూంటారు. రాయడమే తప్ప అలా పలికేవారిని యిప్పటిదాకా చూడలేదు. సంభాషణకు అనువుగా లేని యీ అనువాదాలెందుకు? వీళ్లంతా తెలుగు పేర సంస్కృతపదాలను చలామణీలోకి తెస్తున్నారని అచ్చతెలుగువాదులు ఆక్షేపిస్తారు. వారు ‘ప్రశ్న’ అనకూడదు, ‘అడక’ అనాలి, ‘అంతర్జాలం’ అనకూడదు ‘వలగూడు’ అనాలి అంటారు. డెస్క్‌టాప్‌కు, లాప్‌టాప్‌కు ఏమంటారో తెలియదు. బల్లపైది, ఒళ్లోది అనాలా? టేబ్‌లెట్‌ను, మదర్‌ బోర్డును ‘చేతి మాత్ర’, ‘తల్లి బల్ల’ అనాలా? ఏమిటో యీ వేలంవెర్రి! పలకడానికి సులభంగా వున్నది, పరభాష నుంచి వచ్చినా వాడుకలో వున్నదానిని ప్రామాణికంగా తీసుకోవాలని యీ మేధావులకు తోచదు.

ప్రామాణికమంటే గుర్తుకు వచ్చింది. కొన్ని దశాబ్దాలుగా ఒక విధమైన శిష్టవ్యావహారికం వాడకంలోకి వచ్చింది. దాన్నే పత్రికలలో, పాఠ్యపుస్తకాలలో, టీవీలో, సినిమాల్లో వాడుతూ వచ్చారు. ఇటీవల ‘ఇంటి భాష’ అనే కాన్సెప్ట్‌ తీసుకుని వచ్చారు. ఎవరి జిల్లా యాసలో వాళ్లు పత్రికలలో వ్యాసాలు రాస్తున్నారు, టీవీలో వార్తలు చదువుతున్నారు. పరీక్షలలో విద్యార్థులు ఆ భాషలో రాసినా ఆమోదించా లంటున్నారు. ఇతర భాషల్లో యిలాటి వివాదం వచ్చినట్లు లేదు. ఈ వాదాన్ని ఆమోదిస్తే యిక ప్రామాణికమైన తెలుగనేది ఎలా మిగులుతుంది? తోచిన తీరులో రాసి ‘అది మా యింటి భాష’ అని విద్యార్థి దబాయిస్తే దిక్కేమిటి?

తెలుగు భాష అవసరాన్ని గుర్తించండి! – గతంలో తెలుగుభాష నేర్చుకోవడమంటే తెలుగు భాషాసాహిత్యాలపై పట్టు సాధించడమే చదువుకు పరమార్థంగా వుండేది. అలా సాధించిన ప్రావీణ్యంతో సాహిత్యసృష్టి చేయాలన్న లక్ష్యం వుండేది. అందుకే వ్యాకరణసూత్రాలను సమగ్రంగా బోధించేవారు. కానీ నేటి అవసరం అది కాదు. ప్రపంచాన్ని తెలుగు పుస్తకాల ద్వారా అర్థం చేసుకునే, తెలుగులో వున్న విజ్ఞాన, శాస్త్ర పత్రికలను, గ్రంథాలను అర్థం చేసుకునే స్థాయి తెలుగు నేర్చుకుంటే చాలు. దానికి ఛందస్సులతో, అలంకారాలతో పని లేదు. తేలికపాటి గద్యం నేర్పితే సరిపోతుంది. పద్యరచనపై మమకారం వున్నవారికి విడిగా తర్ఫీదు యివ్వవచ్చు.

అవసరాలలో యీ తేడాలు గుర్తించకుండా, తెలుగులో చదవడానికి వచ్చాననగానే యివన్నీ నెత్తిన గుమ్మరిస్తున్నాం. మాతృభాష కదా ఎవరి సాయం లేకుండా సొంతంగా చదువుకుని ఆనందించగలం అనుకునేవాడికి ఆ అవకాశం లేకుండా చేసి, ‘తెలుగంటే టీచరు చెప్పినా అర్థం కానిది, కష్టపడి రాసినా మార్కులు రానిది’ అనే భావన కలిగించి విద్యార్థిని తెలుగుకి దూరం చేస్తున్నాం. తద్వారా భావి జీవితంలో కూడా ఎన్నడూ తెలుగుని ఆస్వాదించలేని స్థితికి అతన్ని నెడుతున్నాం.

తరగతి గదిలో మన పిల్లలు సులభంగా, సునాయాసంగా, ఆనందంగా, ఆహ్లాదంగా తెలుగు నేర్చుకుని ఆ భాష సొగసులు ఆస్వాదించి వుంటే, ఉపాధ్యాయులు తేలిక మాటలతో, అమ్మ ఉగ్గు పట్టించినంత సులువుగా తెలుగు భాషను నేర్పి, దానిపై అభిరుచిని కలిగించి వుంటే, బట్టీ పట్టకుండా, సొంతమాటల్లో తన భావాల్ని వ్యక్తపరిచే అవకాశం కల్పించి వుంటే – యీ తరమంతా భాషా ప్రేమికులు మాత్రమే కాదు, భాషోద్యమకారులు కూడా అయి వుండేవారు. వారు ఇంటా, బయటా తెలుగును ఆదరించేవారు. తెలుగు ధారాళంగా మాట్లాడేవారు, తెలుగు పుస్తకాలు, పత్రికలు చదివేవారు. పిల్లలను తెలుగు మాధ్యమంలో చేర్చినా, చేర్చకపోయినా, కనీసం స్కూళ్లల్లో తెలుగును ఒక సబ్జక్టుగా వుంచాలని పట్టుబట్టేవారు. ప్రభుత్వం తమ యిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ వుంటే ప్రతిఘటించేవారు, ఇప్పటిలా నిర్లిప్త ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యేవారు కారు.

తెలుగువారికి భాషాభిమానం లేదని అనేయడం సులభం. ఆ అభిమానం లేకుండా చేసినదెవరు? వారికి భాష అంటే భయం, బెదురు కలిగించినవారెవరు? వారిని గుర్తించి, సంస్కరించినప్పుడే తెలుగు స్థితిగతుల్లో మార్పు వస్తుంది. లేకపోతే మరో 40 ఏళ్ల తర్వాత కూడా యీ వ్యాసం తాజాగా తోస్తుంది.

– కె.ఐ. వరప్రసాద్‌ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్‌)

(నవంబరు 2024)

12 Replies to “కెవి: జ్ఞాన సముపార్జనా మార్గం మాతృభాష”

  1. అయ్యో! తెలుగు భాష పదాలను ఖూ–నీ చేసి ప్రత్యేక గీర్వాణ భాషలో రెచ్చిపోతున్న “ఆద్యు”లకు కీర్తి తోరణాలతో స్వాగతమ్ పలుకుతున్న చానెల్స్ అండ్ సాంఘిక మాధ్యమాల్ని చూడలేదా మీరు ?

  2. అయ్యో! తెలుగు భాష పదాలను ఖూనీ చేసి ప్రత్యేక గీర్వాణ భాషలో రెచ్చిపోతున్న “ఆద్యు”లకు కీర్తి తోరణాలతో స్వాగతమ్ పలుకుతున్న చానెల్స్ అండ్ సాంఘిక మాధ్యమాల్ని చూడలేదా మీరు ?

  3. Mana Telugu vallaki teluglo matladam siggu. In hyderabad group of college kids are talking in English only when i asked a question in telugu they acted as if they dont know and try to understand but they answered in only in english. btw those kids are brown not from different state can speak telugu.

  4. నేను పదవతరగతి వరకు తెలుగు మీడియం నే ఆ తరువాత తెలుగు చదివే సందర్భం రాలేదు. ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ ని దశల వారీగా తెలుగు కి తర్జుమా చేయించాలి. అలానే తెలుగు ఆపరేటింగ్ సిస్టం కనిపెట్టాలి. ఈ దిశగా ఎటువంటి ప్రయత్నాలు లేవు. కనీసం అయిదవ తరగతి వారికన్నా నిర్బంధ తెలుగు ఉంచాలి. మంచి ఆర్టికల్.

  5. మంచి సూచనలతో కూడిన వివరణాత్మక విశ్లేషణ. కానీ “దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమనే” అధికారగణ సలహాలతో నడిచే డుడు బసవన్న ప్రభుత్వాలు ఇటువంటి చిన్ని మార్పులతో భాషాభిమానం పెంచగలవా అని సందేహం!!

  6. టీవీ లో ఒక add లో చూశా సార్..స్వచ్ఛమైన నెయ్యి అనడానికి సచ్చ మైన నెయ్యి అంటున్నారు. మళ్ళీ ఎవరు పుట్టలో తెలుగు ఉద్ధరించడానికి ..మీలాంటి వారు ఇలాంటి మంచి మాటలు చెప్పండి 🙏🙏🙏

Comments are closed.