ఇటు అల్లు అర్జున్ కేసు, అటు మోహన్ బాబు కేసులు రోజురోజుకో మలుపు తీసుకుంటున్నాయి. నిన్న అర్థరాత్రి వరకు అల్లు అర్జున్ కేసు ఎన్ని మలుపులు తిరిగిందో మనం చూశాం. ఇప్పుడు మోహన్ బాబు కేసు తెరపైకొచ్చింది. కోర్టు ఇచ్చిన గడువు తీరింది. కానీ మోహన్ బాబు ఎక్కడున్నారో తెలియడం లేదు.
మంచు మనోజ్ తో ఆస్తి తగాదాల నేపథ్యంలో మీడియా జర్నలిస్ట్ పై చేయి చేసుకున్నారు మోహన్ బాబు. దీనికి సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులిచ్చారు. అయితే ఆరోజు జరిగిన ఘటనతో తను అస్వస్థతకు గురయ్యానని, అందుకే 24వ తేదీ వరకు విచారణకు హాజరుకాలేదనంటూ మోహన్ బాబు స్పెషల్ పర్మిషన్ తెచ్చుకున్నారు.
ఆ గడువు నిన్నతో తీరింది. పైగా ఈ గ్యాప్ లో మధ్యంతర బెయిల్ కోసం మోహన్ బాబు పెట్టుకున్న పిటిషన్ ను కూడా హైకోర్టు తిరస్కరించింది. ముందు విచారణకు హాజరవ్వాలని, ఆ తర్వాత కింది కోర్టులో బెయిల్ పిటిషన్ పెట్టుకోవాలని సూచించింది. దీంతో మోహన్ బాబుకు లీగల్ గా మరే మార్గం కనిపించలేదు.
ఈ నేపథ్యంలో, ఈరోజు మోహన్ బాబు పోలీసుల విచారణకు హాజరవుతారా అవ్వరా అనే అసక్తి అందర్లో నెలకొంది. అటు మోహన్ బాబు కనిపించడం లేదని, ఆయన దుబాయ్ కు వెళ్లిపోయి ఉంటారనే ప్రచారం కూడా నడుస్తోంది.
గతంలో ఇలాంటి పుకార్లే వచ్చినప్పుడు మోహన్ బాబు స్పందించారు. ప్రస్తుతం తను ఇంట్లోనే ఉన్నానని, చికిత్స తీసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. ఈసారి మాత్రం మోహన్ బాబు నుంచి ఎలాంటి సమాచారం లేదంటున్నారు పోలీసులు.
ప్రస్తుతం పోలీసులు ఇదే పనిమీద ఉన్నారు. మోహన్ బాబు ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత నోటీసులిచ్చారు. మోహన్ బాబు విచారణకు హాజరుకాకపోతే, ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. తాజా పరిణామాలతో జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసానికి మీడియా తాకిడి మరోసారి పెరిగింది.