సొంతలాభం మానలేక.. కేసుల గుదిబండ

ఇది మరీ ‘సొంతలాభం మటుకు చూసుకుంటూ’ తీసుకున్న నిర్ణయం అన్నమాట. ఇవన్నీ కలిపి ఇప్పుడు ఆయనను ఏసీబీ కేసులో నిందితుడిగా నిలబెట్టాయి.

‘సొంత లాభం కొంత మానుకు.. పొరుగువాడికి తోడుపడవోయ్’ అన్నాడు మహాకవి గురజాడ అప్పారావు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతరులకు సాయంపడడం కంటె అమితంగా సొంత లాభానికే ప్రాధాన్యం ఇచ్చాడా? తనకు అత్యున్నత పదవి దక్కిన తర్వాత కూడా.. సొంతలాభం కొంత మానుకుని.. ఆశ్రితుల గురించి కూడా పట్టించుకోకుండా వ్యవహరించారా? అందుకు తగిటనట్టుగానే అధికారుల్ని నియమించుకున్నారా? వారితో పనిచేయించారా? అలాంటి వ్యవహారాలే ఇప్పుడు ఆయా అధికారుల మెడలకు కేసుల గుదిబండలాగా చుట్టుకుంటున్నాయి.

జగన్ పరిపాలన కాలంలో పత్రికలకు ఇచ్చిన మొత్తం ప్రకటనల రూపంలో 43 శాతం కేవలం ఒక్క సాక్షి పత్రికకు మాత్రమే దక్కాయని, అనుచిత పద్ధతుల్లో దోచిపెట్టారనే ఆరోపణలతో అప్పటి ఐఅండ్ పీఆర్ కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డిపై ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు అయింది.

జగన్ హయాంలో పత్రికలకు మొత్తం 859.29 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారు. అందులో కేవలం సాక్షికే 371.12 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. అప్పటి కమిషనర్ విజయకుమార్ రెడ్డి తీరు చర్చనీయాంశం అవుతోంది.

కేవలం ప్రకటనలు బిల్లులు మాత్రమే కాదు.. సాక్షిలో పనిచేసిన అనేక మంది జర్నలిస్టులకు అడ్డదారుల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇచ్చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

అధికారంలో ఉన్నప్పుడు.. మన సొంత పనులు చక్కబెట్టుకోవడం, సొంత వ్యాపారాలు రచ్చకెక్కకుండా చూసుకోవడం మీద మరింత అప్రమత్తంగా, జాగరూకతతో ఉండాలనే ప్రాథమిక సూత్రాన్ని జగన్ సర్కారు విస్మరించిన ఫలితం ఇది. అధికారం వారి చేతిలోనే ఉన్నది గనుక.. వారి సొంత సంస్థకు మేలు చేసుకోవడంలో సంయమనం ఉండాలి. కానీ అలా జరగలేదు. పత్రికలకు ప్రకటనల టారిఫ్ లను పెంచడానికి ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ విజయకుమార్ రెడ్డి అధ్యక్షతనే సమావేశమై టారిఫ్ ను బాగా పెంచేసింది. ఆయన ఎక్స్ అఫీషియో కార్యదర్శి గనుక.. ఆ నిర్ణయాలను తానే ఆమోదించేశారు.

ఇక్కడ మరో ట్విస్టు ఏంటంటే.. సాక్షి కోరిన దానికంటె మించి టారిఫ్ ను ఆమోదించడం. సాక్షి పత్రిక ఒక చదరపు సెంటీమీటర్ కు రూ.2626 వంతున కోరగా.. విజయకుమార్ రెడ్డి రూ.2917 వంతున టారిఫ్ నిర్ణయించారు. ఇది మరీ ‘సొంతలాభం మటుకు చూసుకుంటూ’ తీసుకున్న నిర్ణయం అన్నమాట. ఇవన్నీ కలిపి ఇప్పుడు ఆయనను ఏసీబీ కేసులో నిందితుడిగా నిలబెట్టాయి.

8 Replies to “సొంతలాభం మానలేక.. కేసుల గుదిబండ”

Comments are closed.